Tolstoy
-
Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు
‘ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ’ అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. ‘చెడు అనవద్దు వినవద్దు కనవద్దు’ అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే. గాంధీ జయంతి వస్తే తెలిసిన విషయాలు మళ్లీ తెలుస్తూ ఉంటాయి. కాని అంతగా తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది. ► గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్బర్గ్లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు. ► గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన. ► గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి. ► గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది. ► అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది. ► 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు. ► ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో. ► కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు. ► గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన. -
యుద్ధము – అశాంతి
ప్రపంచం తన గురించి తాను రాసుకోగలిగితే, అది టాల్‌స్టాయ్‌లాగా రాస్తుంది; అంటాడు ఐజాక్ బేబెల్. అదే ప్రపంచం తన గురించి ఒకే ఒక్క నవల రాసుకుంటే, అది కచ్చితంగా ‘వార్ అండ్ పీస్’ అవుతుంది. పన్నెండు వందల పేజీలు, ఐదు వందల పాత్రలు, ఇందులో కనీసం 160 మంది చరిత్రలో వాస్తవమైన మనుషులు, ప్రతి పాత్రకూ తనదైన వ్యక్తిత్వం, ఆహార్యం, దృక్కోణం లాంటి భయపెట్టే వివరాలకు తోడు, తన కాలానికి అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లి టాల్‌స్టాయ్ ఈ మహానవలను రాశాడు. ఇది రెండు రకాల ఫీట్. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకోవడంతో పాటు వాటన్నింటినీ గతంలో భాగం చేయడం! పైగా ఈ బృహత్ నవలను టాల్‌స్టాయ్ తొమ్మిది సార్లు తిరగరాశాడంటారు. ఆ అన్నిసార్లూ కూడా టాల్‌స్టాయ్ చేతిరాతను అర్థం చేసుకుంటూ ఆయన భార్య సోఫియా దాన్ని ఫెయిర్ చేసింది. అలా ఈ మహా నిర్మాణానికి ఆమె కూడా రాళ్లెత్తిన కూలీ. తొలుత టాల్‌స్టాయ్ దీనికి పెట్టిన పేరు: 1805. జారిస్టు రష్యాను నెపోలియన్ నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆక్రమించిన 1805–1812 నాటి కాలాన్ని చిత్రించిన ఈ నవల తొలిభాగం 1863లో ప్రచురితమైంది. చరిత్ర పుస్తకాలు, తత్వశాస్త్ర పాఠాలు, డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ శోధించి, క్రిమియన్ యుద్ధంలో సైనికుడిగా తన అనుభవాలను జోడించి, చరిత్రనూ కల్పననూ కలగలుపుతూ, తన యౌవనశక్తిని అంతా రంగరించి టాల్‌స్టాయ్ సృజించిన ఈ నవల వంద కెమెరాలు మోహరించినట్టుగా యుద్ధ బీభత్సాన్ని ప్రతి కోణం నుంచి చూపుతుంది. వేలాది మంది చచ్చిపోతారు; మాస్కో తగలబడుతుంది; జనాలు బళ్లు కట్టుకుని దొరికిన సామాన్లు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోతారు; ఇవ్వాళ్టి యుద్ధంలో గెలిచిన సైనికుడు రేపు ఓడిపోతాడు; గుడారాల్లో కాగితం మీద గీసుకునే గీతలు, కార్యక్షేత్రంలో పూర్తి భిన్నమైన తలరాతను రాస్తాయి. జీవితానికో అర్థవంతమైన లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విఫలయత్నాలు చేసే పియరీ, రష్యన్ విలాస సమాజం పట్ల విసిగిపోయిన ఆంద్రేయ్, చురుకైన బాలిక నుంచి పొందికైన ప్రౌఢగా పరిణామం చెందే నటాషా ప్రధాన పాత్రలుగా, బెష్కోవులు, బోల్‌కోన్‌స్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, డ్రౌబెట్‌స్కాయ్‌లు అనే ఐదు కులీన కుటుంబాల మధ్య గల సంబంధాల భూమికగా రాసిన ఈ నవలలో టాల్‌స్టాయ్– ఆర్టిస్టు, సైకాలజిస్టు, తాత్వికుడు, చరిత్రకారుడిగా భిన్న పాత్రలు పోషిస్తాడు. పూర్తి నవలా లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ– యుద్ధ సన్నివేశాలను మాంటేజ్ షాట్స్‌లా చూపడం, ప్రతి సన్నివేశాన్ని ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమనే శిల్పపరమైన పనితనం టాల్‌స్టాయ్‌ను గొప్ప దృశ్యమాన రచయితగా నిలబెడుతాయి. అది సూడాన్, ఇరాక్, కశ్మీర్, అఫ్గానిస్తాన్ ఏదైనా కావచ్చు; రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అన్నట్టుగా– ఈ ప్రపంచం నిత్య సంక్షోభం, కల్లోలం. అయితే, నెపోలియన్ చక్రవర్తి అంతటివాడే అయినాసరే, అతడు కోరుకున్నంత మాత్రాన యుద్ధం రాదు; ఒకవేళ అతడు ఆపాలనుకున్నా ఆపలేడు. మనం ఇచ్ఛా స్వాతంత్య్రాలు అనుకునేవి భ్రాంతి జన్యం. ఇంద్రియ గోచరం కాని పరాధీనత అనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఎన్నో శక్తులు ఎన్నో రీతుల్లో ప్రవర్తిస్తున్న తుది పర్యవసానం ఈ వర్తమానపు వాస్తవం. నవల చివరన టాల్‌స్టాయ్ చేసే ప్రతిపాదనలు ఈ ప్రపంచ నడతకు మనల్ని ఏకకాలంలో బాధ్యులుగానూ, బాధితులుగానూ నిలబెడతాయి. అయితే ఈ యుద్ధం ‘అనివార్యం’ అవుతున్నప్పుడు కూడా, సామాన్య మానవుడు తన రోజువారీ జీవన సంరంభంలో భాగం అవుతున్నాడు. అదే అతడి ధిక్కార ప్రకటన. ఆ యుద్ధ శాంతులను సమాంతరంగా చిత్రించడమే జీవితానికి టాల్‌స్టాయ్ ఇచ్చిన భరోసా! టాల్‌స్టాయ్ రుషుల పరంపరలోని రచయిత. అందుకే గాంధీజీ లాంటి మరో రుషితుల్యుడిని దక్షిణాఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫార్మ్’ నెలకొల్పేలా ప్రభావితం చేయగలిగాడు. మరింత సమకాలీనం కావడమే గొప్ప రచనల లక్షణం. ఈ కాలానికి కూడా అవశ్యమైన రచన ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం కావడంతోపాటు సినిమాలుగా, సీరియళ్లుగా, సంగీత రూపకాలుగా, నాటకాలుగా, రేడియో నాటకాలుగా ఎన్నో రూపాల్లో ఇది ప్రపంచంలోని శూన్యాన్ని భర్తీ చేస్తూనే వుంది. దీన్ని ఒక్కసారైనా చదవడం ఏ సీరియస్ పాఠకుడికైనా జీవితలక్ష్యం లాంటిది కావడంలో తప్పేమీలేదు. దాన్నే మరోసారి పురిగొల్పుతోంది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో ఈ అనిశ్చిత జీవితంతో విసుగెత్తి, అందివచ్చిన ఆన్లైన్ ఆయుధాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంది లీ. మనుషులను కలిసే వీల్లేని సంక్షోభ కాలంలో, అంతరంగాలకు చేరువయ్యేలా సామూహిక పఠనానికి పిలుపునిచ్చింది. దానికి ఆమె ఎంచుకున్న నవల: వార్ అండ్ పీస్. ‘పబ్లిక్‌స్పేస్’ ఆధ్వర్యంలో 2020 మార్చ్ 18 నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త టాల్‌స్టాయ్ అభిమానులు భాగమయ్యారు. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం చేశారు. 85 రోజుల్లో నవల పూర్తయ్యింది. ఆ పఠనానుభవాలతో ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఈ సెప్టెంబర్ 14న అది విడుదల కానుంది. అంతేనా, ఈ ఉత్సాహంతో మరో విడత పఠనానికి సెప్టెంబర్ 15 నుంచి సిద్ధమవుతున్నారు. పాల్గొనడానికి అర్హత పుస్తకం ఉండటమే! తెలుగులోనూ రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు అనువాదం మన ముందుంది. ఆ మధ్య ‘సాహితి’ వారి రీప్రింటూ వచ్చింది. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి పనికి పూనుకోవచ్చు. -
ప్రతిధ్వనించే పుస్తకం : అన్నా కెరనినా
చరిత్రని ప్రతిఫలింప చేసే ‘యుద్ధము–శాంతి’ నవలని టాల్‌స్టాయ్ అయిదేళ్లు రాశాడు. ఆనాటి జీవితానికి అద్దం పట్టిన ‘అన్నా కెరనినా’ నవలకీ ఇంచుమించు అయిదేళ్లే పట్టింది. జీవితం అప్పటికే లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి 1870లలో రష్యన్ సాహిత్యంలో జరిగిన సాహసోపేతమైన ప్రయత్నం ఈ నవల. టాల్‌స్టాయ్ ఆధ్యాత్మిక శోధననీ, కుటుంబ పరిస్థితుల ద్వారా నాటి సమకాలీన జీవిత సాధారణ క్రమాల్ని అర్థం చేసుకునేందుకు ఆయన చేసే ప్రయత్నాలన్నీ ఈ నవల ప్రతిబింబించింది. ‘‘అన్నా కెరనినా’’ రాయడానికి సమాయత్తం అయ్యే సంవత్సరాలలో టాల్‌స్టాయ్ ‘తనతో, తన కుటుంబంతో సామరస్యంగా జీవించాలని ఆశించాడు. కాని అది జరగలేదు. నూతన తాత్విక, ఆచరణ ఉద్దేశాలు ఆయనకి కలిగాయి. అవి పాతుకుపోయిన ప్రభువంశీకుల జమీ జీవితంతో సంఘర్షించాయి. దాంతో కుటుంబ జీవిత రాగంలో జీరస్వరం వచ్చింది. ఈ జీవితంలో ఉన్న చారిత్రక అన్యాయం ఆయనకు క్రమేపీ వెల్లడైంది. ‘‘కోరికలూ వ్యామోహాలూ తృప్తిపరచుకోవాలనుకునే’’ ఆ జీవితాన్ని త్యజించాలన్న కోరిక ఆయనకి కలిగింది. కాని ఈ నవల్లోని నాయకత్వ ప్రాముఖ్య పాత్రలు అయిన అన్నా, ఆమె తమ్ముడు అబ్లాన్స్కీ, వ్రాన్స్కీ, యాశ్విన్ తదితరులు, సరిగ్గా అదే పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. భౌతిక వాంఛా పరిపూర్తి ప్రేరణలు, ‘కులాసా వేదాంత’ ధోరణి ప్రేరణలు బాగా తెలిసిన లేవిన్ ఒక్కడికి మాత్రం ఆ జీవిత సమంజసత్వం గురించి సందేహాలు కలుగుతాయి. టాల్‌స్టాయ్ మాదిరీ లేవిన్ ఆర్థిక, రాజకీయ విప్లవం గురించి ఆలోచించలేదు. మానసిక పరివర్తన గురించి ఆలోచిస్తాడు. ఇది ప్రజలలో ‘‘శత్రుత్వం వైషమ్యం’’ బదులుగా ‘‘సమరస భావం, సత్సంబంధాలు’’ స్థాపిస్తుందని ఆయన అభిప్రాయం. ‘‘ఈ నవల ఇతివృత్తం వివాహబంధాన్ని భార్య అతిక్రమించడం, దానివల్ల రేగిన మొత్తం ఘటనలు’’ అని టాల్‌స్టాయ్ నవల రాయడం మొదలుపెట్టినప్పుడే అన్నాడు. పుస్తకంలో పైకి గోచరమయ్యే పార్శ్వం ఇది. కాని అంతర్గతంగా ఉన్న అర్థం ‘‘కుటుంబ గాథ’’ని అధిగమించి ఉంటుంది. టాల్‌స్టాయ్ అన్నా కెరనినా మీద అభియోగం మోపేవాడు కాదు, సమర్థన చేసేవాడూ కాదు. జీవితం కోసం అహంకారపూరితంగా ఆమె చేసే పోరాటంలో సంభవించిన మహా విషాదంలో దేన్నీ వదిలిపెట్టని చరిత్రకారుడు ఆయన. మనిషి చేసే చర్యలకీ, అనే మాటలకీ నైతిక బాధ్యత మనిషిదే అని టాల్‌స్టాయ్ విశ్వసించాడు. గాఢంగా రష్యన్ స్వభావాన్ని ప్రతిబింబించడమూ, అదే సమయంలో సార్వజనీనమూ అయినందుకే నవల మనకు ఆదరణీయం అవుతోంది. ‘‘అన్నా కెరనినా’’ కాలం ఎప్పుడో పాతబడి పోయింది. కాని టాల్‌స్టాయ్ కళకి వార్ధక్యం లేదు. ‘‘తడుముకోకుండా చెప్తాను, ప్రపంచ సాహిత్యం మొత్తంలో ‘అన్నా కెరనినా’ మహత్తర నవల’’అని థామస్ మాన్ రాశాడు. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి రచనలని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. (టాల్‌స్టాయ్ పుస్తకాలు కొన్ని తాజాగా ‘సాహితి ప్రచురణలు’ ద్వారా తెలుగులో పునర్ముద్రణ పొందాయి. ‘అన్నా కెరనినా’కు ఆర్వీయార్ చేసిన అనువాదం వాటిల్లో ఒకటి. పై భాగం, ఎడ్వర్డ్ బబాయేన్ రాసిన ముందుమాటలోంచి సంక్షిప్తం.) -
మహావృక్షం కూలినప్పుడు...
నా చేత్తో పట్టుకొన్న అన్నం నాది అనేది తప్పయితే ఎవరయినా సరే భోజనం చేయడం ఎలా? తక్కిన వాళ్ల మాట అలా ఉండనీ, మహర్షి ఇంట్లోనే ఈ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లు పనిచేయలేదు. శ్రీమంతుడి కొడుకుగా పుట్టి, శ్రీమంత యువకుడిలా విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించి, యోధుడిగా కీర్తి పొంది, అత్యుత్తమ గ్రంథాలను రచించి సాహిత్య కేసరి అన్న బిరుదం గడించి, సంసారిగా జీవన సౌఖ్యాన్ని రుచి చూసిన ప్రభు లియో టాల్‌స్టాయ్ తన నడి వయస్సులో జీవితం మీద విరక్తి చెందాడు. ప్రాణత్యాగం ఒక్కటే మార్గం అన్నంత తీవ్రమైన వైరాగ్యానికి లోనయ్యాడు. ఆస్తి అనేది మానవజాతి క్షేమానికి ఎదురవుతున్న మొట్ట మొదటి సమస్య. అందువల్ల, ఇకముందు తన పిత్రార్జితమైన ఆస్తిని వాడుకోరాదు; తాను సంపాదించుకొన్న ఆస్తి అయినా సరే తనదిగా ఉంచుకోరాదు; తాను రచించిన పుస్తకాలను తనవే అని ఉంచుకొన్నా ఇతరులు ముద్రింపదలిస్తే అభ్యంతరం ఉండకూడదు; ముఖ్యంగా ఇకముందు ఇది నాది అని దేన్నీ భావించకూడదు. ఈ నిర్ణయానికి వచ్చిన టాల్‌స్టాయ్ ప్రభువు అన్ని రూపాల్లో ఉన్న ఆస్తిని త్యజించినట్టు లోకానికి ప్రకటించాడు. తాను పాశ్చాత్యలోకపు ఆధునిక యుగపు సన్యాసి అయ్యాడు. లోకంలోని జిజ్ఞాసువులు ఇతని భావాలు ఉదాత్తమైనవని అంగీకరించారు. అయితే అనేకులు ఇతని మార్గాన్ని అనుసరించలేదు. జీవితంలో ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తికి సాధ్యం కాని ఒక జనసముదాయం అనుసరించే నిర్ణయం కాదు. నా చేత్తో పట్టుకొన్న అన్నం నాది అనేది తప్పయితే ఎవరయినా సరే భోజనం చేయడం ఎలా? తక్కిన వాళ్ల మాట అలా ఉండనీ, మహర్షి ఇంట్లోనే ఈ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లు పనిచేయలేదు. పిత్రార్జితమైన ఆస్తి అవసరం లేదు, తనదంటూ ఎలాంటి ఆదాయమూ లేదు. ఇలా అయితే ఇంట్లో ప్రతిరోజూ జీవనమెలా గడుస్తుంది? ఒక్కడుంటే ఆకలితో ఉంటాననవచ్చు. టాల్‌స్టాయ్ ఇంట్లో అంతవరకూ సుఖంగా బ్రతుకుతూ వచ్చిన అతని భార్య సోఫియా కూడా ఉండేది. వీళ్లకు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. సాధారణంగా శ్రీమంతుల్ని ఆశ్రయించుకొని బ్రతికే బంధువులు ఉన్నారు. టాల్‌స్టాయ్ గొప్ప రచయిత కాబట్టి ఆయనకు పరిచయం ఉన్న రచయితలు ఇంటికి వచ్చి పోయేవాళ్లు. వీళ్లలో చాలామంది బీదరికంతో బాధపడుతున్నవాళ్లు. వీళ్లందరూ రోజూ వాడుక ప్రకారంగా భోజనం చేయాలి. దీన్ని నడిపించడానికి మార్గం ఏది? ప్రభుపత్ని సోఫియా దేవి, తన భర్త ఏమైనా చెప్పనీ, ఈ ఆస్తి ఈ ఆదాయం లేకపోతే వీళ్లెవ్వరూ బ్రతకలేరనీ, కనీసం తన భర్త కూడా జీవించడం కష్టమనీ నిశ్చయించుకొంది. ఇతను ఆస్తి వద్దనవచ్చు, నేను అలా అంటే వీలవుతుందా? పిల్లలు కూడా వద్దనాలా? ఇలా ఆలోచించి తన భర్త వదిలివేసిన వ్యవహారాలన్నింటిని తన చేతికి తీసుకుంది. టాల్‌స్టాయ్ మిత్రుల్లో ముగ్గురు ముఖ్యులు. చెర్ట్ కాఫ్, గోర్కి, సూలర్ జెట్స్కీ. ఆస్తి సమాజాన్ని నాశనం చేసిన వ్యవస్థ అని చెర్ట్ కాఫ్ దృఢ నమ్మకం. టాల్‌స్టాయ్ ప్రతిపాదించిన స్వామ్య విరుద్ధ వాదాన్ని ప్రశంసించిన వాళ్లలో ఇతను ప్రముఖుడు. గోర్కి కూడా ఆస్తికి విరోధే. ఆస్తి కావాలనే వారు ఆస్తి వ్యవస్థను దురుపయోగపరచినట్లే ఆస్తి వద్దనేవాళ్లు తమ నీతిని దురుపయోగం చేస్తారనేది ఇతని వాదం. సూలర్ కొద్దిగా అటువైపూ, కొద్దిగా ఇటువైపూ ఉంటూ ఈ రెండు తర్కాల మధ్య నిలబడ్డవాడు. టాల్‌స్టాయ్ ఇంటి దగ్గర ఒక భూర్జవనం ఉండేది. టాల్‌స్టాయ్ యువకుడిగా ఉన్న రోజుల్లో కొన్ని చెట్లు మాత్రమే ఇక్కడ ఉండేవి. ఆ స్థలాన్ని, చెట్లను ఆయన ఎక్కువగా ఇష్టపడటం వల్ల అక్కడే ఆ రోజుల్లోనే ఒక వంద చెట్లను నాటించాడు. అవి పెరిగిన తర్వాత ఆనందించాడు. ఆస్తికి యజమాని అయ్యాక మరో వంద చెట్లను నాటించి ఆ ప్రదేశాన్ని వనంగా తీర్చిదిద్దాడు. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో అతిథులు ఎవరు వచ్చినా వాళ్లను ఈ వనానికి పిలుచుకుని వచ్చి చూపించేవాడు. ప్రేమను త్యజించిన రుషికి ఒక జింకమీద కలిగిన కనికరం ప్రేమగా మారిందని భారతీయ పురాణం చెప్పినట్టు, స్వామ్యం, దుష్టం అని ప్రతిపాదించిన రుషికల్పుడైన అగ్రరచయితకు ఈ భూర్జవనం విషయంలో తనకే తెలియని స్వామ్యభావం, అభిమానం ఏర్పడ్డాయి. ఇంటి ఖర్చుకు డబ్బు అవసరమై సోఫియా దేవి ఒకసారి ఈ వనంలోని పాత చెట్లలో పదింటిని అమ్మాలని ఆలోచించింది. బాగా పెరిగి దృఢంగా ఉన్న చెట్లు. మంచి ధర కూడా పలికేది. ఎవరో వచ్చి అడగనూ అడిగారు. ఈలోగా విషయం టాల్‌స్టాయ్ చెవిన పడి ఛ! ఎలాంటి వనం అది, చెట్లను అమ్మి దాన్ని పాడు చేయడమా? అనుకున్నాడు. భర్త అభిప్రాయం తెలిసిన సోఫియా ఆ ఆలోచనని విరమించుకుంది. యజమాని చెట్లను నాటించాడు; ఇప్పుడు అనారోగ్యం పాలయ్యాడు; చూడటంలో సంతోషపడుతున్నాడు; ఇంకెన్ని రోజులు ఈ సంతోషాన్ని పొందుతాడో; ఇప్పుడెందుకీ చెట్లను నరికించి ఆయన మనస్సును బాధించడం? ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు వీళ్లుంటున్న గ్రామంలో కూలినాలి చేసుకుని బ్రతికే నూరుమంది, చెర్ట్ కాఫ్ దగ్గరికి వెళ్లి, మాకెవరికీ ఇళ్లు లేవు; చిన్న చిన్న ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాము; యజమానికి చెప్పి ఈ భూర్జవనంలోని చెట్లను ఇప్పించండి; ఆయన పెద్ద మనస్సు చేశారు; ఆస్తి వద్దంటున్నారు; ఎవరైనా వచ్చి ఈ చెట్లను నరికి తీసుకుని పోగలరు; వీటిని మాకు అప్పగించండి అని అడిగారు. టాల్‌స్టాయ్ వెంటనే ఏమీ చెప్పలేదు. చెర్ట్ కాఫ్ మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించగానే, స్వామ్యం అక్కర లేదన్న తర్వాత నేను అనుమతి ఇవ్వడమేమిటి? కూలీలు ఉన్నారు, చెట్లున్నాయి అన్నాడు. ఇది అతను ఆనందంతో చెప్పిన మాటలు కావు. చెర్ట్ కాఫ్ ఇది గమనించాడు. అయితే టాల్‌స్టాయ్ మాటల్ని ఉపయోగించుకుని కూలీలు చెట్లు నరకడానికి అడ్డులేదని ఈ కార్యం కొనసాగించ దలచుకున్నాడు. ఈ విషయం సోఫియాదేవికి తెలిసింది. దాన్ని నరికించకూడదని నేనే మౌనంగా ఉండిపోయాను, దీన్ని ఎవరో వచ్చి నరికేలా చేస్తున్నావా? అని అడ్డు చెప్పింది. చెర్ట్ కాఫ్, రుషితుల్యుడైన మీ భర్త ఔదార్యం మీ వల్ల నిష్ఫలమవుతుంది, మీకిది భావ్యం కాదు అని అన్నాడు. ఆమె, యజమాని ఔదార్యం ఫలించడమనేది నాకంటే నీకు బాగా తెలుసా? ఈ అధిక ప్రసంగం అనవసరం. మీరందరూ ఇక్కడికి వచ్చి భోంచేస్తున్నారు కదా, ఆస్తి లేకుండా ఇవన్నీ ఎలా వస్తాయి? మా ఇంటి విషయం మాకు వదిలెయ్యండి అంది. మాటకు మాట పెరిగింది. చెర్ట్ కాఫ్, సోఫియాకు మతి సరిగ్గా లేదని తీర్మానించుకుని, ఈమె ఇష్టం వచ్చింది చెప్పనీ, నేను యజమాని అభిప్రాయాన్ని జరిపిస్తాను, అన్నాడు. కూలీలతో మీరు వచ్చి చెట్లను నరుక్కుని పొండి అన్నాడు. కూలీలు వచ్చి చెట్లను నరకడం ప్రారంభించారు. సోఫియా డబ్బిచ్చి వేరేవాళ్లను పిలిపించింది. వాళ్లను చెట్లను నరకకుండా ఏర్పాటు చేసింది. కూలీలకు దెబ్బలు తగిలాయి. వాళ్లు ఈమెను చాలా క్రూరురాలని నిందించారు. అప్పటికి ఊరుకున్నారు. డబ్బిచ్చి పిలిపించిన జీతగాళ్లు వెళ్లిపోగానే మళ్లీ వచ్చారు, చెట్లను నరికారు. కూలీలు పదిసార్లు ఇలా వనాన్ని నరికారు. సోఫియాదేవి పదిసార్లూ అడ్డుకుంది. ఆరు నెలల్లో భూర్జవనం నేలమట్టమయ్యింది. అక్కడ వనం ఉండేదనడానికి నిదర్శనంగా రంపంతో కోయబడ్డ చెట్ల మొదళ్లు మాత్రం మిగిలాయి. ఇంత జరుగుతున్నా టాల్‌స్టాయ్ ఏమీ మాట్లాడలేదు. చెట్లు అలాగే ఉండటం అతనికిష్టమని సోఫియాకు తెలుసు. అయితే ఆమె ప్రయత్నమంతా వ్యర్థమయింది. ఆమె పిచ్చిదానిలాగా తయారయింది. టాల్‌స్టాయ్ చెప్పరానంత కృశించి పోయాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఒకరోజు ఎవ్వరికీ చెప్పకనే ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇంట్లో పిల్లలకీ విషయం తెలిసింది. వెతకటానికి మనుష్యుల్ని పంపారు. వాళ్లు ఈయనను ఒక రైల్వే స్టేషన్లో చూశారు. టాల్‌స్టాయ్ ఆపాటికే బాగా నీరసించి పోయాడు. స్టేషన్లోనే ఉండిపోయాడు. ఆయన అక్కడ ఉండటాన్ని తెలుసుకుని కావలసినవాళ్లు వచ్చారు. అక్కడినుంచి ఆయన్ని మరోచోటికి మార్చే ఏర్పాటు చేశారు. ఈలోగానే ఆయన రైల్వేస్టేషన్లోనే కన్నుమూశాడు. చెట్లు పోయాయని దుఃఖమా? భార్య తన ఔదార్యానికి అడ్డు వచ్చిందన్న బాధా? ఆస్తి కూడదని బుద్ధి చెప్తున్న సమయంలో చెట్లు తనవన్న అభిమానం వెంటాడిందన్న ఉద్వేగమా? అతని జీవం వీటిలో ఏ విషయంగా చింతిస్తూ ముగిసింది? లేదా పై మూడు భావాలు మనస్సులో ఆయన కన్ను మూసే సమయంలో పీడించాయా? ఈ విషయం గురించి ఇప్పుడెవ్వరూ చెప్పలేరు. మాస్తి వెంకటేశ అయ్యంగార్ మాస్తి వెంకటేశ అయ్యంగార్(1891–1986) కథ ‘టాల్‌స్టాయ్ మహర్షి భూర్జవృక్షాలు’కు ఇది సంక్షిప్త రూపం. టాల్‌స్టాయ్ చింతన ఆధారంగా టాల్స్టాయ్నే పాత్రని చేసి కథ రాయడం ఇందులోని ప్రత్యేకత. రచనాకాలం 1968. ‘మాస్తి కన్నడ ఆస్తి’ అని కన్నడిగులు సగర్వంగా పిలుచుకునే గొప్ప కథకుడు, ‘కన్నడ కథానికా జనకుడు’, నవలాకారుడు అయిన మాస్తి వెంకటేశ అయ్యంగార్ యావద్భారత దేశానికి కూడా తరగని ఆస్తే. ఈ కథా సౌజన్యం: 1999 నాటి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘మాస్తి చిన్న కథలు’. తెలుగు అనువాదం: జి.ఎస్.మోహన్. -
హృదయ సౌందర్యం
ఒకరు సాదామనిషిలాగా కనిపించవచ్చు. కానీ కష్టసమయం వచ్చినప్పుడు ఆ మనిషిలోకి ఎనలేని శక్తి ప్రవహిస్తుంది. శక్తి అంటే దేహదారుఢ్యమే కాదు; కరుణ, ప్రేమ ఏ రూపంలోనైనా ఆ శక్తి వెల్లడి కావచ్చు. యెగర్ ద్రోమొవ్, అందగాడు. దృఢకాయుడు. సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నాడు. యుద్ధంలో ఎంత మంది శత్రువులనైనా చీల్చిచెండాడే వీరాధివీరుడు. అతడిది వోల్గా నదీ తీరంలోని ఒక గ్రామం. వాళ్లమ్మ ఫొలికార్పొన్నా. తండ్రి, యెగర్ యెగరోవిచ్. ఆ వూళ్లోనే కాత్యాను ద్రోమొవ్ ప్రేమించాడు. చలికాలంలో అందరూ భోంచేసి కందకంలో చలిమంట చుట్టూ కూర్చుని వున్నప్పుడు సైనికులు తమ ప్రియురాళ్లను గురించీ, భార్యలను గురించీ బోలెడు మాట్లాడుకునేవారు. కాత్యా తన గురించి వేచిచూస్తుందనీ, వేచిచూస్తుందంటే తను ఒంటరి కాలితో వెళ్లినా స్వీకరిస్తుందనీ చెప్పేవాడు ద్రోమొవ్. ఆరోజు ద్రోమొవ్ వాళ్లు మలుపు తిరగగానే గుట్టమీద నాజీల ట్యాంకు కనబడింది. అక్కడున్న కొద్దిపాటి చెట్లను మాటు చేసుకుంటూ వీరి ట్యాంకు ముందుకు సాగింది. శత్రుట్యాంకు శతఘ్నిని గురిపెట్టింది. ఈలోగా ద్రోమొవ్ పేల్చిన గుండు వారి ట్యాంకు డొక్కలో తగిలింది. రెండో గుండు డర్రెట్కు తగిలింది. అది మోర పైకెత్తి ఒరిగిపోయింది. మంటలు సుమారు మూడువందల అడుగుల పైకి లేచాయి. అట్లా పోరాటం జరుగుతున్న కుర్క్స్ యుద్ధపు చివరి దశలో హఠాత్తుగా ద్రోమొవ్ ట్యాంకుకు షెల్ తగిలింది. సిబ్బందిలో ఇద్దరు వెంటనే చచ్చిపోయారు. రెండవ షెల్‌తో ట్యాంకు అంటుకుంది. డ్రైవర్ చువిల్యోవ్ ట్యాంకుమీదకు ఎక్కి ద్రోమొవ్ను బయటికి లాగాడు. అప్పటికే అతడికి స్పృహ తప్పింది. బట్టలు అంటుకున్నాయి. తలమీదా, బట్టలమీదా మట్టి చల్లి మంటలు ఆర్పేశాడు. ద్రోమొవ్ బతికాడు. కళ్లు పోలేదుగానీ ముఖం ఎంత కాలిపోయిందంటే అక్కడక్కడా యెముకలు బయటపడ్డాయి. ఆసుపత్రిలో ఎనిమిది నెలలు ఉన్నాడు. ప్లాస్టిక్ సర్జరీతో ముక్కూ, చెవులూ, పెదవులూ, కనురెప్పలూ పెట్టారు. ఎనిమిది నెలల తర్వాత కట్లు విప్పినప్పుడు ద్రోమొవ్ అద్దంలో చూసుకున్నాడు. తనదేనా ఆ ముఖం? చేతులతో తడుముకుంటూ ఈ కొత్త ముఖానికి అలవాటు పడటానికి ప్రయత్నించాడు. వైద్యబృందం అతణ్ని యుద్ధేతర కొలువుకు యోగ్యుడిగా ప్రకటించింది. కానీ ద్రోమొవ్ జనరల్ దగ్గరకు వెళ్లి, తనను మళ్లీ రెజిమెంటుకు పంపమని కోరాడు. జనరల్ తనతో మాట్లాడుతున్నప్పుడు తన ముఖం వైపు చూడకుండా చూపును పక్కకు తిప్పుకోవడం అతడు గమనించాడు. ముందైతే పూర్తిగా కోలుకోవడానికి ఇరవై రోజుల సెలవిచ్చారు. దాంతో స్వగ్రామానికి బయల్దేరాడు ద్రోమొవ్. రైల్వే స్టేషన్ నుండి ఊరికి గుర్రపుబండి లేదు. పదిమైళ్లూ మంచులో నడిచే వెళ్లాడు. ఊరికి చేరుకునేసరికి చీకటి పడుతోంది. వీధి వెంబడి పోతే ఆరవ యిల్లు వాళ్లది. హఠాత్తుగా అతడు ఆగి, జేబులలో చేతులు పెట్టుకొని, తల పంకించాడు. వాకిలి వద్దకు పోకుండా, వెనక్కి వెళ్లి కిటికీలోంచి చూశాడు. తల్లి కనబడింది. కిరసనాయిల్ దీపపు మసక వెలుతురులో ఆమె టేబుల్ మీద రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తోంది. మునుపటిలాగే తలకు నల్లని శాలువా కట్టుకుంది. భుజాలు మాత్రం పలుచబడ్డాయి. వయసు పెరిగింది. గిన్నెలో పాలూ, కాస్త బ్రెడ్డూ, రెండు గరిటెలూ, ఉప్పుడబ్బీ టేబుల్ మీదకు చేర్చింది. ఆ అమాయకమైన చిన్న ముఖాన్ని నిస్పృహతో మాడ్చివేయకూడదని ద్రోమొవ్ నిశ్చయించుకున్నాడు. ముందు వైపు వెళ్లి, గేటు తెరుచుకుని లోగిట్లోకి వచ్చి, తలుపు తట్టాడు. ‘‘యెవరు?’’ అని తల్లి గొంతు వినిపించింది. ‘‘లెఫ్టెనెంట్ గ్రోమొవ్’’ అని జవాబిచ్చాడు. గుండె దడదడలాడటంతో అతడు ద్వారబంధానికి ఆనుకోవలసి వచ్చింది. లేదులే, తల్లి తన గొంతు గుర్తుపట్టలేదు. తనకే అది మొదటిసారి వింటున్నట్లు అనిపించింది. ‘‘యేం కావాలి బాబూ?’’ అడిగింది. ‘‘మీ అబ్బాయి సీనియర్ లెఫ్టెనెంట్ ద్రోమొవ్ వద్ద నుండి వర్తమానం తెచ్చాను’’ ‘‘మా యెగర్ బతికేవున్నాడా? లోపలికి రా, బాబూ, లోపలికి రా’’ ద్రోమొవ్ టేబుల్ దగ్గర బెంచీ మీద కూర్చున్నాడు. తాను పసివాడుగా ఉన్నప్పుడు తన ఉంగరాల జుట్టు నిమురుతూ తల్లి ‘తిను బంగారూ’ అని బుజ్జగించేది. అతడు ఆమె కుమారుని గురించి, అంటే తనను గురించే చెప్పసాగాడు. ఆమె అతని ముఖం వైపు చూసినట్లే వుందిగానీ, చూపులు యెక్కడనో వున్నాయి. ఈలోపు తండ్రి యెగర్ యెగరోవిచ్ వచ్చాడు. ఆయనకు గడ్డం సగం నెరిసింది. అతిథిని చూసి, ఫెల్టుబూట్లకు అంటుకున్న మంచుగడ్డను గడప దగ్గర వదిలించుకుని, మెడచుట్టూ వున్న మఫ్లర్ నిదానంగా తొలగించి, చలికోటు విప్పి టేబుల్ దగ్గరకు వచ్చి కరచాలనం చేశాడు. ద్రోమొవ్ తాను మరొకరైనట్లు నటిస్తూ తనను గురించే మాట్లాడటం కొనసాగేకొద్దీ ఆ నటనను వదిలేయలేకపోయాడు. ‘అమ్మా, నాన్నా, నేను యెంత విరూపినైనా నన్ను గుర్తుపట్టలేదా?’ అని అడగటం అసాధ్యమైంది.‘సరే భోంచేద్దాం. అతిథికి వడ్డించు’ అంటూ తండ్రి లేచి, చిన్న అలమార తెరిచాడు. చేపల కొక్కేలు గల అగ్గిపెట్టె అక్కడ వుంది. ముక్క బోయిన టీపాట్ కూడా వుంది. అవన్నీ ద్రోమొవ్కు తెలుసు. తండ్రి వోద్కాసీసా బయటకు తీశాడు. అందులో కొద్దిగానే వుంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. తాను గరిటె పట్టుకున్న కుడిచేతి యొక్క ప్రతి కదలికనూ తల్లి గమనిస్తున్నదని ద్రోమొవ్ కొద్దిసేపు తర్వాత గుర్తించాడు. ‘‘యెగర్ యింటికి ఎప్పుడు వస్తాడో మీరు చెప్పనేలేదు. అబ్బాయిని చూసి మూడేళ్లయింది. బాగా పెద్దవాడయివుంటాడు’’ అంది. ‘‘అవును, అతను తిరిగివస్తే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు’’ అతనికి పడక ఏర్పాటు చేశారు. సొంత యింటి సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు. కొయ్య దడికి ఆవల తండ్రి మెత్తగా గుర్రు పెడుతున్నాడు. తల్లి మంచం మీద నిట్టూరుస్తూ పొర్లుతున్నది. ఉదయం పొయ్యిలో కట్టెల చిటపటలతో నిద్రలేచాడు. అప్పటికే తల్లి అతడి మేజోళ్లు వుతికి ఆరవేసింది. ‘‘ఈ వూళ్లో కాత్యా మల్యిషేవా అనే అమ్మాయి వుందా? ఆమెకు మీ అబ్బాయి శుభాకాంక్షలు అందజేయమన్నాడు’’ అన్నాడు ద్రోమొవ్. కాత్యా బడిలో పంతులమ్మగా పనిచేస్తోంది. ఆమెకోసం పొరుగింటి పిల్లను పంపింది తల్లి. వెంటనే కాత్యా ప్రత్యక్షమైంది. ఆమె నేత్రాలు మిలమిలలాడుతున్నాయి. ఆ వెచ్చని మెత్తని వెంట్రుకలు ముద్దుపెట్టుకోగలిగితే! ‘యెగర్ నాకు శుభాకాంక్షలు పంపాడా?’ అని ఆమె అడిగినప్పుడు ఆమె వైపు చూడటం ద్రోమొవ్కు కష్టమైంది. తన విరూపితనపు ప్రతిబింబం వాళ్ల ముఖంలో కనిపించకూడదనే ఉద్దేశంతో ఇక ఒక్క క్షణం కూడా నిలువదలుచుకోలేదు. తండ్రి గుర్రాన్ని తెస్తానన్నా వినలేదు. నడుస్తూ స్టేషన్‌కు వెళ్లిపోయాడు. ‘ఇప్పుడేం చేయాలి నేను?’ అని బాధతో మూలిగాడు. తిరిగి రెజిమెంటులో కలిశాడు ద్రోమొవ్. రెండు వారాల తర్వాత అతడికి ఒక ఉత్తరం వచ్చింది తల్లి నుంచి. ‘‘బాబూ, నీకు జాబు రాయాలంటే భయమౌతోంది. ఒక మనిషి మన ఇంటికి వచ్చాడు. నీ వద్దనుండి వచ్చానని చెప్పాడు. మంచివాడు. కానీ ముఖం విరూపం చెందింది. కొన్నాళ్లు వుండటానికి వచ్చి హఠాత్తుగా మనసు మార్చుకుని వెళ్లిపోయాడు. కానీ ఆ మనిషి నీవే అని నాకు అనిపిస్తున్నది. మీ నాన్నేమో అలా ఎందుకు నటిస్తాడు? అలాంటి ముఖం ఉన్నందుకు ఎవరైనా గర్వించాలి అంటున్నాడు. అతను నీవే కదూ! అతని చలికోటు దులపడానికి పెరట్లోకి తీసుకుపోయి గుండెలకత్తుకుని ఏడ్చాను. బాబూ, యెగర్, భగవంతుని మీద ఆన, జాబు రాయి’’. ద్రోమొవ్ తల్లికి జాబు రాశాడు, క్షమించమని. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఆడవాళ్లు ఆ రెజిమెంటుకు వచ్చారు. ఒకరు, తల్లి, రెండో మనిషి, కాత్యా. తల్లిని గాఢంగా కౌగిలించుకున్నాక, కాత్యా వైపు తిరిగి అన్నాడు ద్రోమొవ్: ‘‘కాత్యా, నువ్వు కాచుకుంటానన్నది ఈ మనిషి కోసం కాదు’’. ‘‘యెగర్, నా జీవితమంతా నీతోనే కలిసివుంటాను. నా సమస్త హృదయంతోనూ నిన్ను ప్రేమిస్తున్నాను’’. అదీ అంతఃశక్తి. మానవ హృదయపు మహాసౌందర్యం! ద్రోమొవ్ బతికాడు. కళ్లు పోలేదుగానీ ముఖం ఎంత కాలిపోయిందంటే అక్కడక్కడా యెముకలు బయటపడ్డాయి. ఎనిమిది నెలల తర్వాత కట్లు విప్పినప్పుడు ద్రోమొవ్ అద్దంలో చూసుకున్నాడు. తనదేనా ఆ ముఖం? అలెక్జీయ్ తోల్‌స్తోయ్ (1883–1945) ‘రష్యన్ క్యారెక్టర్’కు సంక్షిప్తరూపం. దీన్ని రా.రా. అనువదించారు. ఈ కథ రాసిన కాలం 1944. ‘ఒక సంస్కృతి వృద్ధి కావడానికి కావాల్సిన ప్రాథమిక నియమం, శాంతి’ అని నమ్మారు అలెక్జీయ్. పీటర్ 1, నికితాస్ చైల్డ్‌హూడ్, సిస్టర్స్, ఇవాన్ ద టెరిబుల్ ఆయన ఇతర రచనలు. -
టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర: యుద్ధము–శాంతి
పఠనానుభవం మొత్తానికి టాల్‌స్టాయ్ ‘యుద్ధము – శాంతి’ పూర్తి చేయగలిగా. ఇప్పుడుగనక చదవకపోతే ఇక జీవితంలో సాధ్యపడదని చదవటం మొదలెట్టా. అయితే ఈ నవలలోకి ప్రవేశించటానికి చాలా యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక రాజకుటుంబాలు, గుర్తు పెట్టుకోలేనన్ని పాత్రలు, రష్యన్, యూరోపియన్ జియోగ్రఫి, చరిత్ర... ఇదంతా ఫాలో అయి అర్థంచేసుకోవటం... ఎలాగైతేనేం ఒక యాభై పేజీలు ఆపకుండా చదివేసరికి మిగతా నవలంతా దానంతట అదే గుర్రబ్బండిలా పరుగెత్తసాగింది. ఒకపక్క నవల పొడుగూతా వందలకొద్దీ పాత్రలు, ఊళ్లు, నదులు, రష్యన్ నగరాలు, బాల్రూమ్ నృత్యాలు, విందులు, వినోదాలు, ప్రేమలు, పెళ్లిళ్లు. మరోపక్క ఫ్రాన్స్‌లో మొదలైన కల్లోలం నెపోలియన్ రూపంలో దేశదేశాల నుంచి రష్యాకు విస్తరిస్తున్న సమరం. వెరసి విస్తృతమైన టైమ్ అండ్ స్పేస్‌లో నడిచిన బృహత్తర చారిత్రక నవల! మొదట టాల్‌స్టాయ్ దీనికి 1805 అని పేరుపెట్టాడు. చివరికి ‘వార్ అండ్ పీస్’గా మార్చాడు. దీన్ని నవలగా చెప్పడానికి టాల్‌స్టాయ్‌కే చాలా అభ్యంతరాలున్నాయి. ఇందులోని చరిత్ర, చరిత్రకు సంబంధించి టాల్‌స్టాయ్ వ్యాఖ్యానాలు పక్కకుతీసి చూస్తే ఈ నవలలో నడిచిన పాత్రల కథనం, గమనం ఆయన ఇతర రచనల మాదిరిగానే ఉంటుంది. ఇందులో నెపోలియన్ బోనాపార్టి రక్తమాంసాలతో ఉన్న ఒక పాత్ర. తన సైనికులతో, రష్యన్ రాయబారులతో ఆయన సంభాషణలు తారీఖులతో సహా ఉన్నాయి. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్, అప్పటి యుద్ధంలో పాల్గొన్న రష్యన్ ఆర్మీ చీఫ్ కొటోజొవ్ కూడా ఉన్నారు. నాకనిపించింది ఏమంటే ఈ నవలలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు, వాళ్ల ద్వారా నడిచిన కథనాన్ని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోవడంకంటే ఇందులో వర్ణించిన ఆ కాలంనాటి యుద్ధవాతావరణాన్నీ, ఆనాడు నడిచిన యూరోపియన్ రాజకీయాలనూ, ఇరుపక్షాల యుద్ధ తంత్రాలనూ, ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ యుద్ధ నైపుణ్యాన్నీ, జార్ అలెగ్జాండర్ వైఖరినీ, రష్యన్ సేనాని కొటోజొవ్ యుద్ధవ్యూహాన్నీ అవగతం చేసుకోవడం మరింత కష్టమైన పని. అంతకుమించి చరిత్ర రచన గురించి టాల్‌స్టాయ్ తాత్విక దృక్పథాన్ని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన విషయం. ఈ నవల ఆనాటి ఫ్రెంచి, రష్యన్ పాఠకులకు ఎలా అనిపించింది? నెపోలియన్ గురించీ, ఫ్రెంచి సైన్యాన్ని గురించీ టాల్‌స్టాయ్ చేసిన వాఖ్యలను వాళ్లు ఏవిధంగా అర్థం చేసుకుని ఉంటారు? రెండు వందల సంవత్సరాల తరువాత ఇప్పటి ఈ కాలరేఖమీద నిలబడి దీన్ని ఎలా చూడాలి? టాల్‌స్టాయ్ చెప్పిన విషయాలు అందరికీ ఆమోదయోగ్యమేనా? అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగించే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. నవల ప్రారంభమైనప్పుడు ఇందులోని పాత్రలన్నీ దాదాపు తరుణ వయస్కులైన యువతీ యువకులు. వీళ్లంతా ఉన్నత తరగతికి చెందిన రాజకుటుంబాలకు చెందినవారు. వాళ్లకు తెలిసిందల్లా ప్రేమించడం, కలలుగనడం. యుద్ధం ముగిసేనాటికి వాళ్లలో కొందరు చనిపోతారు. కొందరు భగ్నప్రేమికులవుతారు. జీవితం అనేక మలుపులు తిరిగి తాము ప్రేమించినవారిని కాక మరొకరిని పెళ్లాడతారు. కొందరు పెళ్లికాకుండా అలాగే మిగిలిపోతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించినట్లు వాళ్ల ఆలోచనా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. నవల మొదట్లో నెపోలియన్ పట్ల ఆరాధనాభావంతో ఉండే పీటర్ ఫ్రెంచి సైన్య మాస్కో ముట్టడి తరవాత అవకాశం వస్తే నెపోలియన్‌ను హత్య చేయాలనుకుంటాడు. కౌమార దశలో ఉన్న నటాషా మొదట బోరిస్‌ని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఆండ్రూతో నిశ్చితార్థమవుతుంది. మరొకసారి అనెటోవ్తో లేచి పోదామనుకుంటుంది. నవలాంతానికి ఆండ్రూ యుద్ధంలో గాయపడి నటాషా దగ్గరే మరణిస్తాడు. నటాషా చివరికి పీటర్‌ను పెళ్లాడి నలుగురు పిల్లలతో పరిపూర్ణ స్త్రీ అవుతుంది. ఆమె వక్షోజాలు పసరు మొగ్గల్లాగా ఉన్నప్పుడు మొదలైన నవల ముగ్గురు పిల్లల్ని కని వాళ్లకు పాలిస్తున్న తల్లిగా మారడం వరకు నడుస్తుంది. ఈ కథనాన్నంతా అవతల యుద్ధానికి సమాంతరంగా నడిపిస్తాడు టాల్‌స్టాయ్. చరిత్ర అవ్యక్తమైందనీ, విధాత అధీనంలో ఉందనీ భావించిన టాల్‌స్టాయ్ తను సృష్టించిన పాత్రల గమనాన్ని కూడా అదే దృష్టితో రూపొందించాడా అనేది మరొక ఆసక్తికరమైన పరిశీలన. 1812లో నెపోలియన్ మాస్కో నగరాన్ని ముట్టడించాడు. ఫ్రెంచి సైనికులు మాస్కోకు నిప్పుపెట్టారు. నగరం చాలా వరకు ధ్వంసమైంది. నెపోలియన్ 1821లో మరణించాడు. 1828లో పుట్టిన టాల్‌స్టాయ్ తన ముప్పయ్యారవ యేట ఈ నవల ప్రారంభించాడు. అంటే సుమారు యాభై ఏళ్ల వెనక్కు వెళ్లి తారీఖులతో సహా ఇందులోని సంఘటనలనూ యుద్ధక్రమాన్నీ ఊహించి విశదీకరించాడు. అందుకోసం రష్యాపై ఫ్రెంచివారి దండయాత్రని అధ్యయనం చేశాడు. అనేక ఊళ్లు తిరిగాడు. యుద్ధంలో పాల్గొన్నవారితో మాట్లాడాడు. నెపోలియన్ మీద పుస్తకాలు, ఆయన రాసిన ఉత్తరాలు చదివాడు. వాటినే ఇందులో పొందుపరిచాడు. టాల్‌స్టాయ్ యాభై ఏళ్లు వెనక్కువెళ్లి యుద్ధాన్ని ఎలా చూసాడు? అప్పటి యూరప్ రాజకీయాలు అలానే ఉన్నాయా? సమరం ఈ తీరుగానే నడిచిందా? వాళ్లు అలానే ఆ పర్వతాలు దాటి వెళ్లారా? వాళ్లు అలానే నిమెన్ నదిని దాటారా? ఇదంతా ఎవరు చూశారు? రష్యన్ చీఫ్ కమాండర్ కొటోజవేనా? అతడు టాల్‌స్టాయ్ చెప్పినట్టే ఉండేవాడా? ఇందులో వర్ణించిన చక్రవర్తులు, సేనాధిపతులు, గవర్నర్లు, జనరల్స్ వివిధ సందర్భాల్లో వాళ్ల ప్రవర్తన, నడవడిక, హావభావాలు ఇవన్నీ అప్పుడు ఆయా సందర్భాల్లో జీవించిన ఆ తరానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ నవలని çసృష్టించిన టాల్‌స్టాయ్‌కి కూడా! ఇదంతా కల్పన. ఇందులో ఇమిడివున్న అనేక దేశాల సార్వభౌమత్వం, యుద్ధతంత్రం గురించి రాయగల సాధికారత ఒక్క టాల్‌స్టాయ్‌కే సాధ్యం. ఇంతకీ ఈ యుద్ధంలో టాల్‌స్టాయ్ ఏ పక్షం తీసుకున్నాడు? నెపోలియన్‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? టాల్‌స్టాయ్ రష్యన్ కాబట్టి ఫ్రెంచివారిని విమర్శించాడా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే నవల చివర టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాలని అర్థం చేసుకోవాలి. అసలు చరిత్ర ధర్మం ఏమిటి? చరిత్రని సంస్కర్తలు, రాజులు, చక్రవర్తులు నడిపించారంటే నమ్మడం కేవలం ఊహాజనితంగా ఉంటుందంటాడు టాల్‌స్టాయ్. ఆర్థిక, రాజకీయ భౌగోళిక శాస్త్రాల ధర్మాలతో అన్వయించడం చరిత్ర ధర్మాలకు విరుద్ధం అంటాడు. మానవజాతి ప్రగతిని వ్యాఖ్యానించడమే చరిత్ర యొక్క ప్రధాన ప్రయోజనమైతే మానవజాతి ప్రగతిని నిర్దేశిస్తున్న శక్తి ఏది అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవలసి ఉంది. కాని ఈ పశ్నకు ఆధునిక చరిత్రకారుల వ్యాఖ్యానాలలో జవాబు దొరకదు. ఎవరు చరిత్రలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి వహించారో వారంతా కేవలం నామమాత్రులే. సంఘటనలకు ఊరకే వారి పేర్లు తగిలిస్తారు కానీ, వాస్తవానికి వారికీ ఆ సంఘటనలకూ– ఒక పేరుకూ ఆ పేరు పెట్టిన వస్తువుకూ ఉన్న సంబంధం కూడా ఉండదు. వారు తమంతట తామే చేశామనుకునే పనులలో ఏ పని కూడా నిజంగా వారలా చేసింది కాదు. దానికీ చరిత్రగతికీ మానవజీవిత గతికీ ఒక సంబంధం ఉన్నది. కాలం మొదలుపెట్టినప్పటినుంచీ దాని స్థానం ముందే నిర్ణీతమై ఉన్నది అంటాడు టాల్‌స్టాయ్. యుద్ధం రావలసివుంది కాబట్టి వచ్చింది. అందుకనే కొన్ని కోట్ల మంది ఇంగితజ్ఞానాన్నీ మానవత్వాన్నీ మర్చిపోయి పశ్చిమాన్నుంచి ప్రాచ్యముఖంగా వారి తోటివారిని వధించటం కోసం తరలివచ్చారు. జాతుల యొక్క రక్తం ప్రవహింపచేయాలా వద్దా అనే విషయం తన నిర్ణయం మీద ఆధారపడి వుందని నెపోలియన్ అనుకున్నప్పటికీ అతనికి తెలీకుండానే అతణ్ని చరిత్ర ముందుకు లాక్కొనిపోతూవుంది. రాజులు చరిత్రకు బానిసలు అంటాడు టాల్‌స్టాయ్. పరిసరాల్నీ మనుషుల్నీ సంఘటనల్నీ వాటి తీరుతెన్నుల పరిణామాన్నీ నిశితంగా పరిశీలించే మనుçషులు ఎప్పుడూ ఉంటారు. ఊహకందని కొన్ని సూత్రాల ప్రకారం ఈ ప్రపంచం, ఈ చరాచర జగత్తు నడుస్తూ నడిపించబడుతూ ఉందంటే హేతువాదులు, ప్రగతిశీలురు ఒప్పుకోవడం కష్టమే. ఆ సిద్ధాంతం పాతది కూడాను. ఎప్పటికో గతానికి వెళ్లి చూడటం కాదు. ఇప్పుడు మన కళ్లముందు జరిగే సంఘటనల పూర్వాపరాలను వ్యాఖ్యానించడంలోనే మనకు అనేక అభిప్రాయ భేదాలున్నాయి. అలాంటి సందర్భంలో టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాన్ని మనం ఎందుకు కాదనాలి? నవలలో కొన్నిసార్లు బాల్ రూమ్ దృశ్యాల వర్ణన. మరొకసారి కెమెరా కంటికి దొరకని మనుషుల అతి సున్నితమైన హావభావాలు. సంభాషణలతో కాక పాత్రల అంతరంగాన్ని విడమర్చి చెప్పే ముఖకవళికలు. కొన్నిచోట్ల (సైనికుల తరలింపు) చదువుతుంటే ఇంగ్లీషు సినిమా డైరెక్టర్లు టాల్‌స్టాయ్ వర్ణనలను కాపీకొట్టారనిసిస్తుంది. యుద్ధం గురించి వచ్చినప్పుడు, చరిత్ర గురించి వచ్చినప్పుడు పేజీలు తిప్పేసే అలవాటు కొంతమందికి ఉంది. ఇది రుచికలిగించే దినుసుల్ని ఊసేసి రుచిలేని పాయసాన్ని తాగటంలాంటిది. సైనికుల ప్రయాణాలూ, వాళ్లని తరలించడమూ, యుద్ధ తంత్రాలూ, చరిత్రా ఇవన్నీ నవలలో భాగంగా చూసి చదవటం మంచిది. కేవలం పాత్రలతో కూడిన నవల పూర్తిచేద్దామనుకుంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లే. భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భూమి కదులుతూ ఉన్నట్లు మనం గ్రహించాలి. అలానే భ్రాంతిజన్యమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అధిగమించి గోచరం కాని ఒక పరాధీనతను మనం అంగీకరించాలి అంటాడు టాల్‌స్టాయ్. ఇదే ఇంతపెద్ద నవలలోని ఆఖరు వాక్యం. చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా నెపోలియన్ ఎప్పుడూ కీర్తించబడుతూనే ఉంటాడు. చరిత్రకారులు ఆయన గొప్పతనాన్నీ ఔదార్యాన్నీ ఖడ్గాన్నీ ప్రస్తుతిస్తూనే ఉంటారు. అయితే చరిత్రలో నెపోలియన్‌తో పాటు టాల్‌స్టాయ్ కూడా ఉన్నాడు. చరిత్ర ధర్మంలో మానవుల పాత్ర ఎంత నామమాత్రమైందో, ఎంత పరిమితమైందో యుద్ధము–శాంతి ద్వారా మనకెప్పుడూ చెబుతూనే ఉంటాడు. - బి.అజయ్‌ప్రసాద్ 9247733602 -
మూడు ఓల్గా ప్రవాహాలు
కథలెందుకు రాస్తారు? ‘సమస్యా పరిష్కారం సంగతి నీకెందుకయ్యా. సమస్త తలతిక్కలతో ఎదురుపడే జీవితాన్ని ఎదుర్కొనేందుకు పాఠకుణ్ణి సిద్ధం చేయక’ అన్నాడు టాల్‌స్టాయ్. వార్ అండ్ పీస్, ఆనా కెరెనీనా, కొసక్కులు... ఈ మహాగ్రంథాల్లో, టాల్‌స్టాయ్ కథల్లో ఎవరు ఏదైనా వెతకనీగాక ఆయన సమస్త సారస్వత సారం అదే. సిద్ధం చేయడం! ధైర్యంగా నిలబడి, తెగువగా నిలబడి, భీరువుతనం మాని, తడబడటాన్ని వదిలి, జీవితాన్ని ఎదుర్కొనడం తెలియజెప్పడమే ఆయన రచనల ఉద్దేశం. అవి చదవితే దిగులు రాదు. చీకటి కమ్ముకోదు. నైరాశ్యం అలుముకోదు. రచనలన్నింటా పోరాటం, పెనుగులాట, బాధ ఉంటాయి. కాని పాఠకుణ్ణి నిలబెట్టే ఉంటాడాయన. ధైర్యం చిక్కబట్టుకునేలా ఉంటాడాయన. భరోసా ఇస్తుంటాడాయన. ఇదిగో అలాంటి భరోసా ఇచ్చేందుకు కథలు రాస్తారు కొందరు. ‘ఒరే బాబూ... ఇదిగో నీ బతుకు ఇలా ఉంది. నేను చూశా. చూశా ఏంటి. నీతో పాటు నేను కూడా పార అందుకున్నా. పలుగు అందుకున్నా. చెమట కార్చా. పాదాల వెంట నెత్తురు చిమ్మించా. ఒరే బాబూ... రక్తం గడ్డకట్టే చలిలో వజవజమని వణుకుతూ ఆకలికి అరుస్తున్న పేగులను బొబ్బోపెడుతూ ఒరే... నిజంగా అవన్నీ పడ్డాన్రా బాబూ... వద్దురా... ఇలా వద్దు మనం.... దీన్ని సరి చేయాల్రా... చేద్దాం పదా’ అని బీదా బిక్కి జనాలని నిశానీగాళ్లని నాలుగు అక్షరంముక్కలు నేర్చుకున్న అట్టడుగు రష్యన్ ప్రజలను ప్రభాతంలోకి నడిపించడానికి వచ్చినవాడు గోర్కి. ఫ్యూడలిజం అంటే ఒక పులి అని అది పచ్చినెత్తురు తాగుతుంది అని కేపిటలిజం అంటే మంచి ఖరీదైన ఆస్పత్రి అని అది మనకు మేలు చేయడానికే అన్నట్టుగా మన రక్తం చల్లగా తీసుకుంటుందని చెప్పి, అందుకు అరవకుండా కరవకుండా స్థిరమైన పద్ధతిలో వ్యవస్థకు వ్యతిరేకంగా విరుగుడు ఎక్కించడానికి వచ్చిన రచయిత గోర్కి. ప్రపంచం మెచ్చిన శ్రామికవర్గ రచయిత. పోరాట రచయిత. అదిగో ఆ మాట అనిపించుకోవడానికి కథలు రాస్తారు కొందరు. ‘చీకట్లో నీడలుంటాయ్. మనసులో దెయ్యాలూ భూతాలూ తిరుగాడుతాయ్. ఛీఛాలు పడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఆశపడి భంగపడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. పేదరికం కాలి కింద తొక్కి పెడితే అణిగిపోయి ఆత్మవిస్వాసం కోల్పోయి ముడుచుకుపోయి గొణుక్కుంటూ సణుక్కుంటూ ఉండే మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. నిరాశ వల్ల, నిస్పృహ వల్ల, ఈర్ష్య వల్ల, అసూయ వల్ల, ఓర్వలేనితనం వల్ల, నిరాకరణను ఎదుర్కొన్నందు వల్ల, చిన్న చిర్నవ్వుకు నోచుకోకపోవడం వల్ల, నేల మాళిగల్లో మురికివాడల్లో చీకటి గుయ్యారాల్లో మజ్జుగా ఉండే పరిసరాల్లో సదా వసించడం వల్ల నలత పడ్డ మనుషులు కొందరుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఈ మనుషుల్ని చూపించాలి. ఈ మనుషులున్న స్పృహను లోకానికి పట్టి ఇవ్వాలి. ఇటువంటి వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలపైని తెరలను చింపెయ్యాలి. పైకి కనిపించని విధ్వంసం. పైకి తెలియని శైధిల్యం. కంటికి గోచరం కాని రోదనా ప్రవాహం. ఇవన్నీ చూపించి తీరాలి’ అని వచ్చినవాడు దోస్తవ్ స్కీ. అదిగో ఆ అథోదారుల్లో నడవడానికి రాస్తారు కొందరు. కథ ఎప్పుడూ వినోదం కోసం కాదు. దాని వల్ల వినోదం కలిగితే కలగవచ్చుగాక కాని కేవలం వినోదం కలిగించడమే దాని లక్షణం కాదు. అది దాని పుట్టుకలోనే లేదు. వందల ఏళ్ల క్రితం ఒక యువరాజు ఆడవాళ్ల మీద ద్వేషంతో పెళ్లి నాటకం ఆడి తొలిరాత్రినాడే వాళ్లను కడ తేరుస్తుంటే తెలివిగల్ల పిల్ల ఒకత్తి వాణ్ణి తెల్లారేదాక మాటల్లో పెట్టడానికి కథలు మొదలుపెట్టింది. తెల్లారే దాకా చెప్పి, ఉత్కంఠ కలిగించే ముగింపులో ఆపి, తరువాయి తరువాత అనంటే ఆమెను చంపగలడా? తర్వాతి కథను వినకుండా ఆగగలడా? అలా ఆ పిల్ల బతికింది. ఆమె చెప్పిన కథలు ‘అరేబియన్ నైట్స్’గా ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎతిమతం శుంఠలుగా తయారైన రాజుగారి కొడుకులను మనుషులుగా తీర్చిదిద్దడానికి నాలుగు బుద్ధి మాటలు చెప్పడానికి కథలే కదా అవసరమయ్యాయి. అవి పంచతంత్రమై ఇవాళ మన అన్ని తంత్రాల్లోనూ ఆదుకుంటున్నాయి. ముడుక్కుని ముసుగేయించి పాఠకుణ్ణి పడుకోబెట్టేందుకు కథ పుట్టలేదు. మూడు దిక్కుల్లో పో ఉత్తరం దిక్కు తప్ప అని హెచ్చరించి కేవలం ఉత్తరం దిక్కువైపే వెళ్లేలా ప్రబోధించడానికే అది పుట్టింది. అన్వేషించడానికి, కొత్తవైపు కదలడానికి, ప్రమాదభరితమైన అనూహ్యమైన ఎదుట ఏముందో తెలియని జీవితం వైపు తరమడానికే కథ పుట్టింది. అదిగో అలా తరమడానికీ పాఠకుణ్ణి అశ్వరూఢుణ్ణి చేసి ఉత్తర దిక్కు వైపు బయలుదేరేలా చేయడానికీ చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తుంటారు. - ఖదీర్