నా చేత్తో పట్టుకొన్న అన్నం నాది అనేది తప్పయితే ఎవరయినా సరే భోజనం చేయడం ఎలా? తక్కిన వాళ్ల మాట అలా ఉండనీ, మహర్షి ఇంట్లోనే ఈ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లు పనిచేయలేదు.
శ్రీమంతుడి కొడుకుగా పుట్టి, శ్రీమంత యువకుడిలా విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించి, యోధుడిగా కీర్తి పొంది, అత్యుత్తమ గ్రంథాలను రచించి సాహిత్య కేసరి అన్న బిరుదం గడించి, సంసారిగా జీవన సౌఖ్యాన్ని రుచి చూసిన ప్రభు లియో టాల్‌స్టాయ్ తన నడి వయస్సులో జీవితం మీద విరక్తి చెందాడు. ప్రాణత్యాగం ఒక్కటే మార్గం అన్నంత తీవ్రమైన వైరాగ్యానికి లోనయ్యాడు.
ఆస్తి అనేది మానవజాతి క్షేమానికి ఎదురవుతున్న మొట్ట మొదటి సమస్య.
అందువల్ల, ఇకముందు తన పిత్రార్జితమైన ఆస్తిని వాడుకోరాదు; తాను సంపాదించుకొన్న ఆస్తి అయినా సరే తనదిగా ఉంచుకోరాదు; తాను రచించిన పుస్తకాలను తనవే అని ఉంచుకొన్నా ఇతరులు ముద్రింపదలిస్తే అభ్యంతరం ఉండకూడదు; ముఖ్యంగా ఇకముందు ఇది నాది అని దేన్నీ భావించకూడదు.
ఈ నిర్ణయానికి వచ్చిన టాల్‌స్టాయ్ ప్రభువు అన్ని రూపాల్లో ఉన్న ఆస్తిని త్యజించినట్టు లోకానికి ప్రకటించాడు. తాను పాశ్చాత్యలోకపు ఆధునిక యుగపు సన్యాసి అయ్యాడు.
లోకంలోని జిజ్ఞాసువులు ఇతని భావాలు ఉదాత్తమైనవని అంగీకరించారు. అయితే అనేకులు ఇతని మార్గాన్ని అనుసరించలేదు. జీవితంలో ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తికి సాధ్యం కాని ఒక జనసముదాయం అనుసరించే నిర్ణయం కాదు. నా చేత్తో పట్టుకొన్న అన్నం నాది అనేది తప్పయితే ఎవరయినా సరే భోజనం చేయడం ఎలా? తక్కిన వాళ్ల మాట అలా ఉండనీ, మహర్షి ఇంట్లోనే ఈ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లు పనిచేయలేదు. పిత్రార్జితమైన ఆస్తి అవసరం లేదు, తనదంటూ ఎలాంటి ఆదాయమూ లేదు. ఇలా అయితే ఇంట్లో ప్రతిరోజూ జీవనమెలా గడుస్తుంది?
ఒక్కడుంటే ఆకలితో ఉంటాననవచ్చు. టాల్‌స్టాయ్ ఇంట్లో అంతవరకూ సుఖంగా బ్రతుకుతూ వచ్చిన అతని భార్య సోఫియా కూడా ఉండేది. వీళ్లకు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. సాధారణంగా శ్రీమంతుల్ని ఆశ్రయించుకొని బ్రతికే బంధువులు ఉన్నారు. టాల్‌స్టాయ్ గొప్ప రచయిత కాబట్టి ఆయనకు పరిచయం ఉన్న రచయితలు ఇంటికి వచ్చి పోయేవాళ్లు. వీళ్లలో చాలామంది బీదరికంతో బాధపడుతున్నవాళ్లు. వీళ్లందరూ రోజూ వాడుక ప్రకారంగా భోజనం చేయాలి. దీన్ని నడిపించడానికి మార్గం ఏది?
ప్రభుపత్ని సోఫియా దేవి, తన భర్త ఏమైనా చెప్పనీ, ఈ ఆస్తి ఈ ఆదాయం లేకపోతే వీళ్లెవ్వరూ బ్రతకలేరనీ, కనీసం తన భర్త కూడా జీవించడం కష్టమనీ నిశ్చయించుకొంది. ఇతను ఆస్తి వద్దనవచ్చు, నేను అలా అంటే వీలవుతుందా? పిల్లలు కూడా వద్దనాలా? ఇలా ఆలోచించి తన భర్త వదిలివేసిన వ్యవహారాలన్నింటిని తన చేతికి తీసుకుంది.
టాల్‌స్టాయ్ మిత్రుల్లో ముగ్గురు ముఖ్యులు. చెర్ట్ కాఫ్, గోర్కి, సూలర్ జెట్స్‌కీ. ఆస్తి సమాజాన్ని నాశనం చేసిన వ్యవస్థ అని చెర్ట్ కాఫ్ దృఢ నమ్మకం. టాల్‌స్టాయ్ ప్రతిపాదించిన స్వామ్య విరుద్ధ వాదాన్ని ప్రశంసించిన వాళ్లలో ఇతను ప్రముఖుడు. గోర్కి కూడా ఆస్తికి విరోధే. ఆస్తి కావాలనే వారు ఆస్తి వ్యవస్థను దురుపయోగపరచినట్లే ఆస్తి వద్దనేవాళ్లు తమ నీతిని దురుపయోగం చేస్తారనేది ఇతని వాదం. సూలర్ కొద్దిగా అటువైపూ, కొద్దిగా ఇటువైపూ ఉంటూ ఈ రెండు తర్కాల మధ్య నిలబడ్డవాడు.
టాల్‌స్టాయ్ ఇంటి దగ్గర ఒక భూర్జవనం ఉండేది. టాల్‌స్టాయ్ యువకుడిగా ఉన్న రోజుల్లో కొన్ని చెట్లు మాత్రమే ఇక్కడ ఉండేవి. ఆ స్థలాన్ని, చెట్లను ఆయన ఎక్కువగా ఇష్టపడటం వల్ల అక్కడే ఆ రోజుల్లోనే ఒక వంద చెట్లను నాటించాడు. అవి పెరిగిన తర్వాత ఆనందించాడు. ఆస్తికి యజమాని అయ్యాక మరో వంద చెట్లను నాటించి ఆ ప్రదేశాన్ని వనంగా తీర్చిదిద్దాడు. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో అతిథులు ఎవరు వచ్చినా వాళ్లను ఈ వనానికి పిలుచుకుని వచ్చి చూపించేవాడు. ప్రేమను త్యజించిన రుషికి ఒక జింకమీద కలిగిన కనికరం ప్రేమగా మారిందని భారతీయ పురాణం చెప్పినట్టు, స్వామ్యం, దుష్టం అని ప్రతిపాదించిన రుషికల్పుడైన అగ్రరచయితకు ఈ భూర్జవనం విషయంలో తనకే తెలియని స్వామ్యభావం, అభిమానం ఏర్పడ్డాయి.
ఇంటి ఖర్చుకు డబ్బు అవసరమై సోఫియా దేవి ఒకసారి ఈ వనంలోని పాత చెట్లలో పదింటిని అమ్మాలని ఆలోచించింది. బాగా పెరిగి దృఢంగా ఉన్న చెట్లు. మంచి ధర కూడా పలికేది. ఎవరో వచ్చి అడగనూ అడిగారు. ఈలోగా విషయం టాల్‌స్టాయ్ చెవిన పడి ఛ! ఎలాంటి వనం అది, చెట్లను అమ్మి దాన్ని పాడు చేయడమా? అనుకున్నాడు.
భర్త అభిప్రాయం తెలిసిన సోఫియా ఆ ఆలోచనని విరమించుకుంది. యజమాని చెట్లను నాటించాడు; ఇప్పుడు అనారోగ్యం పాలయ్యాడు; చూడటంలో సంతోషపడుతున్నాడు; ఇంకెన్ని రోజులు ఈ సంతోషాన్ని పొందుతాడో; ఇప్పుడెందుకీ చెట్లను నరికించి ఆయన మనస్సును బాధించడం?
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు వీళ్లుంటున్న గ్రామంలో కూలినాలి చేసుకుని బ్రతికే నూరుమంది, చెర్ట్ కాఫ్ దగ్గరికి వెళ్లి, మాకెవరికీ ఇళ్లు లేవు; చిన్న చిన్న ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాము; యజమానికి చెప్పి ఈ భూర్జవనంలోని చెట్లను ఇప్పించండి; ఆయన పెద్ద మనస్సు చేశారు; ఆస్తి వద్దంటున్నారు; ఎవరైనా వచ్చి ఈ చెట్లను నరికి తీసుకుని పోగలరు; వీటిని మాకు అప్పగించండి అని అడిగారు.
టాల్‌స్టాయ్ వెంటనే ఏమీ చెప్పలేదు. చెర్ట్ కాఫ్ మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించగానే, స్వామ్యం అక్కర లేదన్న తర్వాత నేను అనుమతి ఇవ్వడమేమిటి? కూలీలు ఉన్నారు, చెట్లున్నాయి అన్నాడు. ఇది అతను ఆనందంతో చెప్పిన మాటలు కావు. చెర్ట్ కాఫ్ ఇది గమనించాడు. అయితే టాల్‌స్టాయ్ మాటల్ని ఉపయోగించుకుని కూలీలు చెట్లు నరకడానికి అడ్డులేదని ఈ కార్యం కొనసాగించ దలచుకున్నాడు.
ఈ విషయం సోఫియాదేవికి తెలిసింది. దాన్ని నరికించకూడదని నేనే మౌనంగా ఉండిపోయాను, దీన్ని ఎవరో వచ్చి నరికేలా చేస్తున్నావా? అని అడ్డు చెప్పింది.
చెర్ట్ కాఫ్, రుషితుల్యుడైన మీ భర్త ఔదార్యం మీ వల్ల నిష్ఫలమవుతుంది, మీకిది భావ్యం కాదు అని అన్నాడు.
ఆమె, యజమాని ఔదార్యం ఫలించడమనేది నాకంటే నీకు బాగా తెలుసా? ఈ అధిక ప్రసంగం అనవసరం. మీరందరూ ఇక్కడికి వచ్చి భోంచేస్తున్నారు కదా, ఆస్తి లేకుండా ఇవన్నీ ఎలా వస్తాయి? మా ఇంటి విషయం మాకు వదిలెయ్యండి అంది.
మాటకు మాట పెరిగింది. చెర్ట్ కాఫ్, సోఫియాకు మతి సరిగ్గా లేదని తీర్మానించుకుని, ఈమె ఇష్టం వచ్చింది చెప్పనీ, నేను యజమాని అభిప్రాయాన్ని జరిపిస్తాను, అన్నాడు. కూలీలతో మీరు వచ్చి చెట్లను నరుక్కుని పొండి అన్నాడు.
కూలీలు వచ్చి చెట్లను నరకడం ప్రారంభించారు. సోఫియా డబ్బిచ్చి వేరేవాళ్లను పిలిపించింది. వాళ్లను చెట్లను నరకకుండా ఏర్పాటు చేసింది. కూలీలకు దెబ్బలు తగిలాయి. వాళ్లు ఈమెను చాలా క్రూరురాలని నిందించారు. అప్పటికి ఊరుకున్నారు. డబ్బిచ్చి పిలిపించిన జీతగాళ్లు వెళ్లిపోగానే మళ్లీ వచ్చారు, చెట్లను నరికారు. కూలీలు పదిసార్లు ఇలా వనాన్ని నరికారు. సోఫియాదేవి పదిసార్లూ అడ్డుకుంది. ఆరు నెలల్లో భూర్జవనం నేలమట్టమయ్యింది. అక్కడ వనం ఉండేదనడానికి నిదర్శనంగా రంపంతో కోయబడ్డ చెట్ల మొదళ్లు మాత్రం మిగిలాయి.
ఇంత జరుగుతున్నా టాల్‌స్టాయ్ ఏమీ మాట్లాడలేదు. చెట్లు అలాగే ఉండటం అతనికిష్టమని సోఫియాకు తెలుసు. అయితే ఆమె ప్రయత్నమంతా వ్యర్థమయింది. ఆమె పిచ్చిదానిలాగా తయారయింది. టాల్‌స్టాయ్ చెప్పరానంత కృశించి పోయాడు.
ఆ తర్వాత కొన్ని నెలలకు ఒకరోజు ఎవ్వరికీ చెప్పకనే ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇంట్లో పిల్లలకీ విషయం తెలిసింది. వెతకటానికి మనుష్యుల్ని పంపారు. వాళ్లు ఈయనను ఒక రైల్వే స్టేషన్‌లో చూశారు. టాల్‌స్టాయ్ ఆపాటికే బాగా నీరసించి పోయాడు. స్టేషన్‌లోనే ఉండిపోయాడు. ఆయన అక్కడ ఉండటాన్ని తెలుసుకుని కావలసినవాళ్లు వచ్చారు. అక్కడినుంచి ఆయన్ని మరోచోటికి మార్చే ఏర్పాటు చేశారు. ఈలోగానే ఆయన రైల్వేస్టేషన్‌లోనే కన్నుమూశాడు.
చెట్లు పోయాయని దుఃఖమా? భార్య తన ఔదార్యానికి అడ్డు వచ్చిందన్న బాధా? ఆస్తి కూడదని బుద్ధి చెప్తున్న సమయంలో చెట్లు తనవన్న అభిమానం వెంటాడిందన్న ఉద్వేగమా? అతని జీవం వీటిలో ఏ విషయంగా చింతిస్తూ ముగిసింది? లేదా పై మూడు భావాలు మనస్సులో ఆయన కన్ను మూసే సమయంలో పీడించాయా?
ఈ విషయం గురించి ఇప్పుడెవ్వరూ చెప్పలేరు.
మాస్తి వెంకటేశ అయ్యంగార్
మాస్తి వెంకటేశ అయ్యంగార్(1891–1986) కథ ‘టాల్‌స్టాయ్ మహర్షి భూర్జవృక్షాలు’కు ఇది సంక్షిప్త రూపం. టాల్‌స్టాయ్ చింతన ఆధారంగా టాల్‌స్టాయ్‌నే పాత్రని చేసి కథ రాయడం ఇందులోని ప్రత్యేకత. రచనాకాలం 1968. ‘మాస్తి కన్నడ ఆస్తి’ అని కన్నడిగులు సగర్వంగా పిలుచుకునే గొప్ప కథకుడు, ‘కన్నడ కథానికా జనకుడు’, నవలాకారుడు అయిన మాస్తి వెంకటేశ అయ్యంగార్ యావద్భారత దేశానికి కూడా తరగని ఆస్తే. ఈ కథా సౌజన్యం: 1999 నాటి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘మాస్తి చిన్న కథలు’. తెలుగు అనువాదం: జి.ఎస్.మోహన్.
Comments
Please login to add a commentAdd a comment