కథలెందుకు రాస్తారు?
‘సమస్యా పరిష్కారం సంగతి నీకెందుకయ్యా. సమస్త తలతిక్కలతో ఎదురుపడే జీవితాన్ని ఎదుర్కొనేందుకు పాఠకుణ్ణి సిద్ధం చేయక’ అన్నాడు టాల్‌స్టాయ్.
వార్ అండ్ పీస్, ఆనా కెరెనీనా, కొసక్కులు... ఈ మహాగ్రంథాల్లో, టాల్‌స్టాయ్ కథల్లో ఎవరు ఏదైనా వెతకనీగాక ఆయన సమస్త సారస్వత సారం అదే. సిద్ధం చేయడం! ధైర్యంగా నిలబడి, తెగువగా నిలబడి, భీరువుతనం మాని, తడబడటాన్ని వదిలి, జీవితాన్ని ఎదుర్కొనడం తెలియజెప్పడమే ఆయన రచనల ఉద్దేశం. అవి చదవితే దిగులు రాదు. చీకటి కమ్ముకోదు. నైరాశ్యం అలుముకోదు. రచనలన్నింటా పోరాటం, పెనుగులాట, బాధ ఉంటాయి. కాని పాఠకుణ్ణి నిలబెట్టే ఉంటాడాయన. ధైర్యం చిక్కబట్టుకునేలా ఉంటాడాయన. భరోసా ఇస్తుంటాడాయన. ఇదిగో అలాంటి భరోసా ఇచ్చేందుకు కథలు రాస్తారు కొందరు.
‘ఒరే బాబూ... ఇదిగో నీ బతుకు ఇలా ఉంది. నేను చూశా. చూశా ఏంటి. నీతో పాటు నేను కూడా పార అందుకున్నా. పలుగు అందుకున్నా. చెమట కార్చా. పాదాల వెంట నెత్తురు చిమ్మించా. ఒరే బాబూ... రక్తం గడ్డకట్టే చలిలో వజవజమని వణుకుతూ ఆకలికి అరుస్తున్న పేగులను బొబ్బోపెడుతూ ఒరే... నిజంగా అవన్నీ పడ్డాన్రా బాబూ... వద్దురా... ఇలా వద్దు మనం.... దీన్ని సరి చేయాల్రా... చేద్దాం పదా’ అని బీదా బిక్కి జనాలని నిశానీగాళ్లని నాలుగు అక్షరంముక్కలు నేర్చుకున్న అట్టడుగు రష్యన్ ప్రజలను ప్రభాతంలోకి నడిపించడానికి వచ్చినవాడు గోర్కి. ఫ్యూడలిజం అంటే ఒక పులి అని అది పచ్చినెత్తురు తాగుతుంది అని కేపిటలిజం అంటే మంచి ఖరీదైన ఆస్పత్రి అని అది మనకు మేలు చేయడానికే అన్నట్టుగా మన రక్తం చల్లగా తీసుకుంటుందని చెప్పి, అందుకు అరవకుండా కరవకుండా స్థిరమైన పద్ధతిలో వ్యవస్థకు వ్యతిరేకంగా విరుగుడు ఎక్కించడానికి వచ్చిన రచయిత గోర్కి. ప్రపంచం మెచ్చిన శ్రామికవర్గ రచయిత. పోరాట రచయిత. అదిగో ఆ మాట అనిపించుకోవడానికి కథలు రాస్తారు కొందరు.
‘చీకట్లో నీడలుంటాయ్. మనసులో దెయ్యాలూ భూతాలూ తిరుగాడుతాయ్. ఛీఛాలు పడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఆశపడి భంగపడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. పేదరికం కాలి కింద తొక్కి పెడితే అణిగిపోయి ఆత్మవిస్వాసం కోల్పోయి ముడుచుకుపోయి గొణుక్కుంటూ సణుక్కుంటూ ఉండే మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. నిరాశ వల్ల, నిస్పృహ వల్ల, ఈర్ష్య వల్ల, అసూయ వల్ల, ఓర్వలేనితనం వల్ల, నిరాకరణను ఎదుర్కొన్నందు వల్ల, చిన్న చిర్నవ్వుకు నోచుకోకపోవడం వల్ల, నేల మాళిగల్లో మురికివాడల్లో చీకటి గుయ్యారాల్లో మజ్జుగా ఉండే పరిసరాల్లో సదా వసించడం వల్ల నలత పడ్డ మనుషులు కొందరుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఈ మనుషుల్ని చూపించాలి. ఈ మనుషులున్న స్పృహను లోకానికి పట్టి ఇవ్వాలి. ఇటువంటి వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలపైని తెరలను చింపెయ్యాలి. పైకి కనిపించని విధ్వంసం. పైకి తెలియని శైధిల్యం. కంటికి గోచరం కాని రోదనా ప్రవాహం. ఇవన్నీ చూపించి తీరాలి’ అని వచ్చినవాడు దోస్తవ్ స్కీ. అదిగో ఆ అథోదారుల్లో నడవడానికి రాస్తారు కొందరు.
కథ ఎప్పుడూ వినోదం కోసం కాదు.
దాని వల్ల వినోదం కలిగితే కలగవచ్చుగాక కాని కేవలం వినోదం కలిగించడమే దాని లక్షణం కాదు. అది దాని పుట్టుకలోనే లేదు. వందల ఏళ్ల క్రితం ఒక యువరాజు ఆడవాళ్ల మీద ద్వేషంతో పెళ్లి నాటకం ఆడి తొలిరాత్రినాడే వాళ్లను కడ తేరుస్తుంటే తెలివిగల్ల పిల్ల ఒకత్తి వాణ్ణి తెల్లారేదాక మాటల్లో పెట్టడానికి కథలు మొదలుపెట్టింది. తెల్లారే దాకా చెప్పి, ఉత్కంఠ కలిగించే ముగింపులో ఆపి, తరువాయి తరువాత అనంటే ఆమెను చంపగలడా? తర్వాతి కథను వినకుండా ఆగగలడా? అలా ఆ పిల్ల బతికింది. ఆమె చెప్పిన కథలు ‘అరేబియన్ నైట్స్’గా ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎతిమతం శుంఠలుగా తయారైన రాజుగారి కొడుకులను మనుషులుగా తీర్చిదిద్దడానికి నాలుగు బుద్ధి మాటలు చెప్పడానికి కథలే కదా అవసరమయ్యాయి. అవి పంచతంత్రమై ఇవాళ మన అన్ని తంత్రాల్లోనూ ఆదుకుంటున్నాయి.
ముడుక్కుని ముసుగేయించి పాఠకుణ్ణి పడుకోబెట్టేందుకు కథ పుట్టలేదు. మూడు దిక్కుల్లో పో ఉత్తరం దిక్కు తప్ప అని హెచ్చరించి కేవలం ఉత్తరం దిక్కువైపే వెళ్లేలా ప్రబోధించడానికే అది పుట్టింది. అన్వేషించడానికి, కొత్తవైపు కదలడానికి, ప్రమాదభరితమైన అనూహ్యమైన ఎదుట ఏముందో తెలియని జీవితం వైపు తరమడానికే కథ పుట్టింది.
అదిగో అలా తరమడానికీ పాఠకుణ్ణి అశ్వరూఢుణ్ణి చేసి ఉత్తర దిక్కు వైపు బయలుదేరేలా చేయడానికీ చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తుంటారు.
- ఖదీర్
మూడు ఓల్గా ప్రవాహాలు
Published Fri, Oct 24 2014 11:24 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement
Advertisement