War and Peace
-
యుద్ధము – అశాంతి
ప్రపంచం తన గురించి తాను రాసుకోగలిగితే, అది టాల్‌స్టాయ్‌లాగా రాస్తుంది; అంటాడు ఐజాక్ బేబెల్. అదే ప్రపంచం తన గురించి ఒకే ఒక్క నవల రాసుకుంటే, అది కచ్చితంగా ‘వార్ అండ్ పీస్’ అవుతుంది. పన్నెండు వందల పేజీలు, ఐదు వందల పాత్రలు, ఇందులో కనీసం 160 మంది చరిత్రలో వాస్తవమైన మనుషులు, ప్రతి పాత్రకూ తనదైన వ్యక్తిత్వం, ఆహార్యం, దృక్కోణం లాంటి భయపెట్టే వివరాలకు తోడు, తన కాలానికి అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లి టాల్‌స్టాయ్ ఈ మహానవలను రాశాడు. ఇది రెండు రకాల ఫీట్. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకోవడంతో పాటు వాటన్నింటినీ గతంలో భాగం చేయడం! పైగా ఈ బృహత్ నవలను టాల్‌స్టాయ్ తొమ్మిది సార్లు తిరగరాశాడంటారు. ఆ అన్నిసార్లూ కూడా టాల్‌స్టాయ్ చేతిరాతను అర్థం చేసుకుంటూ ఆయన భార్య సోఫియా దాన్ని ఫెయిర్ చేసింది. అలా ఈ మహా నిర్మాణానికి ఆమె కూడా రాళ్లెత్తిన కూలీ. తొలుత టాల్‌స్టాయ్ దీనికి పెట్టిన పేరు: 1805. జారిస్టు రష్యాను నెపోలియన్ నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆక్రమించిన 1805–1812 నాటి కాలాన్ని చిత్రించిన ఈ నవల తొలిభాగం 1863లో ప్రచురితమైంది. చరిత్ర పుస్తకాలు, తత్వశాస్త్ర పాఠాలు, డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ శోధించి, క్రిమియన్ యుద్ధంలో సైనికుడిగా తన అనుభవాలను జోడించి, చరిత్రనూ కల్పననూ కలగలుపుతూ, తన యౌవనశక్తిని అంతా రంగరించి టాల్‌స్టాయ్ సృజించిన ఈ నవల వంద కెమెరాలు మోహరించినట్టుగా యుద్ధ బీభత్సాన్ని ప్రతి కోణం నుంచి చూపుతుంది. వేలాది మంది చచ్చిపోతారు; మాస్కో తగలబడుతుంది; జనాలు బళ్లు కట్టుకుని దొరికిన సామాన్లు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోతారు; ఇవ్వాళ్టి యుద్ధంలో గెలిచిన సైనికుడు రేపు ఓడిపోతాడు; గుడారాల్లో కాగితం మీద గీసుకునే గీతలు, కార్యక్షేత్రంలో పూర్తి భిన్నమైన తలరాతను రాస్తాయి. జీవితానికో అర్థవంతమైన లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విఫలయత్నాలు చేసే పియరీ, రష్యన్ విలాస సమాజం పట్ల విసిగిపోయిన ఆంద్రేయ్, చురుకైన బాలిక నుంచి పొందికైన ప్రౌఢగా పరిణామం చెందే నటాషా ప్రధాన పాత్రలుగా, బెష్కోవులు, బోల్‌కోన్‌స్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, డ్రౌబెట్‌స్కాయ్‌లు అనే ఐదు కులీన కుటుంబాల మధ్య గల సంబంధాల భూమికగా రాసిన ఈ నవలలో టాల్‌స్టాయ్– ఆర్టిస్టు, సైకాలజిస్టు, తాత్వికుడు, చరిత్రకారుడిగా భిన్న పాత్రలు పోషిస్తాడు. పూర్తి నవలా లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ– యుద్ధ సన్నివేశాలను మాంటేజ్ షాట్స్‌లా చూపడం, ప్రతి సన్నివేశాన్ని ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమనే శిల్పపరమైన పనితనం టాల్‌స్టాయ్‌ను గొప్ప దృశ్యమాన రచయితగా నిలబెడుతాయి. అది సూడాన్, ఇరాక్, కశ్మీర్, అఫ్గానిస్తాన్ ఏదైనా కావచ్చు; రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అన్నట్టుగా– ఈ ప్రపంచం నిత్య సంక్షోభం, కల్లోలం. అయితే, నెపోలియన్ చక్రవర్తి అంతటివాడే అయినాసరే, అతడు కోరుకున్నంత మాత్రాన యుద్ధం రాదు; ఒకవేళ అతడు ఆపాలనుకున్నా ఆపలేడు. మనం ఇచ్ఛా స్వాతంత్య్రాలు అనుకునేవి భ్రాంతి జన్యం. ఇంద్రియ గోచరం కాని పరాధీనత అనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఎన్నో శక్తులు ఎన్నో రీతుల్లో ప్రవర్తిస్తున్న తుది పర్యవసానం ఈ వర్తమానపు వాస్తవం. నవల చివరన టాల్‌స్టాయ్ చేసే ప్రతిపాదనలు ఈ ప్రపంచ నడతకు మనల్ని ఏకకాలంలో బాధ్యులుగానూ, బాధితులుగానూ నిలబెడతాయి. అయితే ఈ యుద్ధం ‘అనివార్యం’ అవుతున్నప్పుడు కూడా, సామాన్య మానవుడు తన రోజువారీ జీవన సంరంభంలో భాగం అవుతున్నాడు. అదే అతడి ధిక్కార ప్రకటన. ఆ యుద్ధ శాంతులను సమాంతరంగా చిత్రించడమే జీవితానికి టాల్‌స్టాయ్ ఇచ్చిన భరోసా! టాల్‌స్టాయ్ రుషుల పరంపరలోని రచయిత. అందుకే గాంధీజీ లాంటి మరో రుషితుల్యుడిని దక్షిణాఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫార్మ్’ నెలకొల్పేలా ప్రభావితం చేయగలిగాడు. మరింత సమకాలీనం కావడమే గొప్ప రచనల లక్షణం. ఈ కాలానికి కూడా అవశ్యమైన రచన ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం కావడంతోపాటు సినిమాలుగా, సీరియళ్లుగా, సంగీత రూపకాలుగా, నాటకాలుగా, రేడియో నాటకాలుగా ఎన్నో రూపాల్లో ఇది ప్రపంచంలోని శూన్యాన్ని భర్తీ చేస్తూనే వుంది. దీన్ని ఒక్కసారైనా చదవడం ఏ సీరియస్ పాఠకుడికైనా జీవితలక్ష్యం లాంటిది కావడంలో తప్పేమీలేదు. దాన్నే మరోసారి పురిగొల్పుతోంది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో ఈ అనిశ్చిత జీవితంతో విసుగెత్తి, అందివచ్చిన ఆన్లైన్ ఆయుధాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంది లీ. మనుషులను కలిసే వీల్లేని సంక్షోభ కాలంలో, అంతరంగాలకు చేరువయ్యేలా సామూహిక పఠనానికి పిలుపునిచ్చింది. దానికి ఆమె ఎంచుకున్న నవల: వార్ అండ్ పీస్. ‘పబ్లిక్‌స్పేస్’ ఆధ్వర్యంలో 2020 మార్చ్ 18 నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త టాల్‌స్టాయ్ అభిమానులు భాగమయ్యారు. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం చేశారు. 85 రోజుల్లో నవల పూర్తయ్యింది. ఆ పఠనానుభవాలతో ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఈ సెప్టెంబర్ 14న అది విడుదల కానుంది. అంతేనా, ఈ ఉత్సాహంతో మరో విడత పఠనానికి సెప్టెంబర్ 15 నుంచి సిద్ధమవుతున్నారు. పాల్గొనడానికి అర్హత పుస్తకం ఉండటమే! తెలుగులోనూ రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు అనువాదం మన ముందుంది. ఆ మధ్య ‘సాహితి’ వారి రీప్రింటూ వచ్చింది. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి పనికి పూనుకోవచ్చు. -
టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర: యుద్ధము–శాంతి
పఠనానుభవం మొత్తానికి టాల్‌స్టాయ్ ‘యుద్ధము – శాంతి’ పూర్తి చేయగలిగా. ఇప్పుడుగనక చదవకపోతే ఇక జీవితంలో సాధ్యపడదని చదవటం మొదలెట్టా. అయితే ఈ నవలలోకి ప్రవేశించటానికి చాలా యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక రాజకుటుంబాలు, గుర్తు పెట్టుకోలేనన్ని పాత్రలు, రష్యన్, యూరోపియన్ జియోగ్రఫి, చరిత్ర... ఇదంతా ఫాలో అయి అర్థంచేసుకోవటం... ఎలాగైతేనేం ఒక యాభై పేజీలు ఆపకుండా చదివేసరికి మిగతా నవలంతా దానంతట అదే గుర్రబ్బండిలా పరుగెత్తసాగింది. ఒకపక్క నవల పొడుగూతా వందలకొద్దీ పాత్రలు, ఊళ్లు, నదులు, రష్యన్ నగరాలు, బాల్రూమ్ నృత్యాలు, విందులు, వినోదాలు, ప్రేమలు, పెళ్లిళ్లు. మరోపక్క ఫ్రాన్స్‌లో మొదలైన కల్లోలం నెపోలియన్ రూపంలో దేశదేశాల నుంచి రష్యాకు విస్తరిస్తున్న సమరం. వెరసి విస్తృతమైన టైమ్ అండ్ స్పేస్‌లో నడిచిన బృహత్తర చారిత్రక నవల! మొదట టాల్‌స్టాయ్ దీనికి 1805 అని పేరుపెట్టాడు. చివరికి ‘వార్ అండ్ పీస్’గా మార్చాడు. దీన్ని నవలగా చెప్పడానికి టాల్‌స్టాయ్‌కే చాలా అభ్యంతరాలున్నాయి. ఇందులోని చరిత్ర, చరిత్రకు సంబంధించి టాల్‌స్టాయ్ వ్యాఖ్యానాలు పక్కకుతీసి చూస్తే ఈ నవలలో నడిచిన పాత్రల కథనం, గమనం ఆయన ఇతర రచనల మాదిరిగానే ఉంటుంది. ఇందులో నెపోలియన్ బోనాపార్టి రక్తమాంసాలతో ఉన్న ఒక పాత్ర. తన సైనికులతో, రష్యన్ రాయబారులతో ఆయన సంభాషణలు తారీఖులతో సహా ఉన్నాయి. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్, అప్పటి యుద్ధంలో పాల్గొన్న రష్యన్ ఆర్మీ చీఫ్ కొటోజొవ్ కూడా ఉన్నారు. నాకనిపించింది ఏమంటే ఈ నవలలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు, వాళ్ల ద్వారా నడిచిన కథనాన్ని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోవడంకంటే ఇందులో వర్ణించిన ఆ కాలంనాటి యుద్ధవాతావరణాన్నీ, ఆనాడు నడిచిన యూరోపియన్ రాజకీయాలనూ, ఇరుపక్షాల యుద్ధ తంత్రాలనూ, ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్ యుద్ధ నైపుణ్యాన్నీ, జార్ అలెగ్జాండర్ వైఖరినీ, రష్యన్ సేనాని కొటోజొవ్ యుద్ధవ్యూహాన్నీ అవగతం చేసుకోవడం మరింత కష్టమైన పని. అంతకుమించి చరిత్ర రచన గురించి టాల్‌స్టాయ్ తాత్విక దృక్పథాన్ని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన విషయం. ఈ నవల ఆనాటి ఫ్రెంచి, రష్యన్ పాఠకులకు ఎలా అనిపించింది? నెపోలియన్ గురించీ, ఫ్రెంచి సైన్యాన్ని గురించీ టాల్‌స్టాయ్ చేసిన వాఖ్యలను వాళ్లు ఏవిధంగా అర్థం చేసుకుని ఉంటారు? రెండు వందల సంవత్సరాల తరువాత ఇప్పటి ఈ కాలరేఖమీద నిలబడి దీన్ని ఎలా చూడాలి? టాల్‌స్టాయ్ చెప్పిన విషయాలు అందరికీ ఆమోదయోగ్యమేనా? అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగించే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. నవల ప్రారంభమైనప్పుడు ఇందులోని పాత్రలన్నీ దాదాపు తరుణ వయస్కులైన యువతీ యువకులు. వీళ్లంతా ఉన్నత తరగతికి చెందిన రాజకుటుంబాలకు చెందినవారు. వాళ్లకు తెలిసిందల్లా ప్రేమించడం, కలలుగనడం. యుద్ధం ముగిసేనాటికి వాళ్లలో కొందరు చనిపోతారు. కొందరు భగ్నప్రేమికులవుతారు. జీవితం అనేక మలుపులు తిరిగి తాము ప్రేమించినవారిని కాక మరొకరిని పెళ్లాడతారు. కొందరు పెళ్లికాకుండా అలాగే మిగిలిపోతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించినట్లు వాళ్ల ఆలోచనా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. నవల మొదట్లో నెపోలియన్ పట్ల ఆరాధనాభావంతో ఉండే పీటర్ ఫ్రెంచి సైన్య మాస్కో ముట్టడి తరవాత అవకాశం వస్తే నెపోలియన్‌ను హత్య చేయాలనుకుంటాడు. కౌమార దశలో ఉన్న నటాషా మొదట బోరిస్‌ని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఆండ్రూతో నిశ్చితార్థమవుతుంది. మరొకసారి అనెటోవ్తో లేచి పోదామనుకుంటుంది. నవలాంతానికి ఆండ్రూ యుద్ధంలో గాయపడి నటాషా దగ్గరే మరణిస్తాడు. నటాషా చివరికి పీటర్‌ను పెళ్లాడి నలుగురు పిల్లలతో పరిపూర్ణ స్త్రీ అవుతుంది. ఆమె వక్షోజాలు పసరు మొగ్గల్లాగా ఉన్నప్పుడు మొదలైన నవల ముగ్గురు పిల్లల్ని కని వాళ్లకు పాలిస్తున్న తల్లిగా మారడం వరకు నడుస్తుంది. ఈ కథనాన్నంతా అవతల యుద్ధానికి సమాంతరంగా నడిపిస్తాడు టాల్‌స్టాయ్. చరిత్ర అవ్యక్తమైందనీ, విధాత అధీనంలో ఉందనీ భావించిన టాల్‌స్టాయ్ తను సృష్టించిన పాత్రల గమనాన్ని కూడా అదే దృష్టితో రూపొందించాడా అనేది మరొక ఆసక్తికరమైన పరిశీలన. 1812లో నెపోలియన్ మాస్కో నగరాన్ని ముట్టడించాడు. ఫ్రెంచి సైనికులు మాస్కోకు నిప్పుపెట్టారు. నగరం చాలా వరకు ధ్వంసమైంది. నెపోలియన్ 1821లో మరణించాడు. 1828లో పుట్టిన టాల్‌స్టాయ్ తన ముప్పయ్యారవ యేట ఈ నవల ప్రారంభించాడు. అంటే సుమారు యాభై ఏళ్ల వెనక్కు వెళ్లి తారీఖులతో సహా ఇందులోని సంఘటనలనూ యుద్ధక్రమాన్నీ ఊహించి విశదీకరించాడు. అందుకోసం రష్యాపై ఫ్రెంచివారి దండయాత్రని అధ్యయనం చేశాడు. అనేక ఊళ్లు తిరిగాడు. యుద్ధంలో పాల్గొన్నవారితో మాట్లాడాడు. నెపోలియన్ మీద పుస్తకాలు, ఆయన రాసిన ఉత్తరాలు చదివాడు. వాటినే ఇందులో పొందుపరిచాడు. టాల్‌స్టాయ్ యాభై ఏళ్లు వెనక్కువెళ్లి యుద్ధాన్ని ఎలా చూసాడు? అప్పటి యూరప్ రాజకీయాలు అలానే ఉన్నాయా? సమరం ఈ తీరుగానే నడిచిందా? వాళ్లు అలానే ఆ పర్వతాలు దాటి వెళ్లారా? వాళ్లు అలానే నిమెన్ నదిని దాటారా? ఇదంతా ఎవరు చూశారు? రష్యన్ చీఫ్ కమాండర్ కొటోజవేనా? అతడు టాల్‌స్టాయ్ చెప్పినట్టే ఉండేవాడా? ఇందులో వర్ణించిన చక్రవర్తులు, సేనాధిపతులు, గవర్నర్లు, జనరల్స్ వివిధ సందర్భాల్లో వాళ్ల ప్రవర్తన, నడవడిక, హావభావాలు ఇవన్నీ అప్పుడు ఆయా సందర్భాల్లో జీవించిన ఆ తరానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ నవలని çసృష్టించిన టాల్‌స్టాయ్‌కి కూడా! ఇదంతా కల్పన. ఇందులో ఇమిడివున్న అనేక దేశాల సార్వభౌమత్వం, యుద్ధతంత్రం గురించి రాయగల సాధికారత ఒక్క టాల్‌స్టాయ్‌కే సాధ్యం. ఇంతకీ ఈ యుద్ధంలో టాల్‌స్టాయ్ ఏ పక్షం తీసుకున్నాడు? నెపోలియన్‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? టాల్‌స్టాయ్ రష్యన్ కాబట్టి ఫ్రెంచివారిని విమర్శించాడా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే నవల చివర టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాలని అర్థం చేసుకోవాలి. అసలు చరిత్ర ధర్మం ఏమిటి? చరిత్రని సంస్కర్తలు, రాజులు, చక్రవర్తులు నడిపించారంటే నమ్మడం కేవలం ఊహాజనితంగా ఉంటుందంటాడు టాల్‌స్టాయ్. ఆర్థిక, రాజకీయ భౌగోళిక శాస్త్రాల ధర్మాలతో అన్వయించడం చరిత్ర ధర్మాలకు విరుద్ధం అంటాడు. మానవజాతి ప్రగతిని వ్యాఖ్యానించడమే చరిత్ర యొక్క ప్రధాన ప్రయోజనమైతే మానవజాతి ప్రగతిని నిర్దేశిస్తున్న శక్తి ఏది అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవలసి ఉంది. కాని ఈ పశ్నకు ఆధునిక చరిత్రకారుల వ్యాఖ్యానాలలో జవాబు దొరకదు. ఎవరు చరిత్రలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి వహించారో వారంతా కేవలం నామమాత్రులే. సంఘటనలకు ఊరకే వారి పేర్లు తగిలిస్తారు కానీ, వాస్తవానికి వారికీ ఆ సంఘటనలకూ– ఒక పేరుకూ ఆ పేరు పెట్టిన వస్తువుకూ ఉన్న సంబంధం కూడా ఉండదు. వారు తమంతట తామే చేశామనుకునే పనులలో ఏ పని కూడా నిజంగా వారలా చేసింది కాదు. దానికీ చరిత్రగతికీ మానవజీవిత గతికీ ఒక సంబంధం ఉన్నది. కాలం మొదలుపెట్టినప్పటినుంచీ దాని స్థానం ముందే నిర్ణీతమై ఉన్నది అంటాడు టాల్‌స్టాయ్. యుద్ధం రావలసివుంది కాబట్టి వచ్చింది. అందుకనే కొన్ని కోట్ల మంది ఇంగితజ్ఞానాన్నీ మానవత్వాన్నీ మర్చిపోయి పశ్చిమాన్నుంచి ప్రాచ్యముఖంగా వారి తోటివారిని వధించటం కోసం తరలివచ్చారు. జాతుల యొక్క రక్తం ప్రవహింపచేయాలా వద్దా అనే విషయం తన నిర్ణయం మీద ఆధారపడి వుందని నెపోలియన్ అనుకున్నప్పటికీ అతనికి తెలీకుండానే అతణ్ని చరిత్ర ముందుకు లాక్కొనిపోతూవుంది. రాజులు చరిత్రకు బానిసలు అంటాడు టాల్‌స్టాయ్. పరిసరాల్నీ మనుషుల్నీ సంఘటనల్నీ వాటి తీరుతెన్నుల పరిణామాన్నీ నిశితంగా పరిశీలించే మనుçషులు ఎప్పుడూ ఉంటారు. ఊహకందని కొన్ని సూత్రాల ప్రకారం ఈ ప్రపంచం, ఈ చరాచర జగత్తు నడుస్తూ నడిపించబడుతూ ఉందంటే హేతువాదులు, ప్రగతిశీలురు ఒప్పుకోవడం కష్టమే. ఆ సిద్ధాంతం పాతది కూడాను. ఎప్పటికో గతానికి వెళ్లి చూడటం కాదు. ఇప్పుడు మన కళ్లముందు జరిగే సంఘటనల పూర్వాపరాలను వ్యాఖ్యానించడంలోనే మనకు అనేక అభిప్రాయ భేదాలున్నాయి. అలాంటి సందర్భంలో టాల్‌స్టాయ్ చెప్పిన చరిత్ర ధర్మాన్ని మనం ఎందుకు కాదనాలి? నవలలో కొన్నిసార్లు బాల్ రూమ్ దృశ్యాల వర్ణన. మరొకసారి కెమెరా కంటికి దొరకని మనుషుల అతి సున్నితమైన హావభావాలు. సంభాషణలతో కాక పాత్రల అంతరంగాన్ని విడమర్చి చెప్పే ముఖకవళికలు. కొన్నిచోట్ల (సైనికుల తరలింపు) చదువుతుంటే ఇంగ్లీషు సినిమా డైరెక్టర్లు టాల్‌స్టాయ్ వర్ణనలను కాపీకొట్టారనిసిస్తుంది. యుద్ధం గురించి వచ్చినప్పుడు, చరిత్ర గురించి వచ్చినప్పుడు పేజీలు తిప్పేసే అలవాటు కొంతమందికి ఉంది. ఇది రుచికలిగించే దినుసుల్ని ఊసేసి రుచిలేని పాయసాన్ని తాగటంలాంటిది. సైనికుల ప్రయాణాలూ, వాళ్లని తరలించడమూ, యుద్ధ తంత్రాలూ, చరిత్రా ఇవన్నీ నవలలో భాగంగా చూసి చదవటం మంచిది. కేవలం పాత్రలతో కూడిన నవల పూర్తిచేద్దామనుకుంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లే. భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భూమి కదులుతూ ఉన్నట్లు మనం గ్రహించాలి. అలానే భ్రాంతిజన్యమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అధిగమించి గోచరం కాని ఒక పరాధీనతను మనం అంగీకరించాలి అంటాడు టాల్‌స్టాయ్. ఇదే ఇంతపెద్ద నవలలోని ఆఖరు వాక్యం. చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా నెపోలియన్ ఎప్పుడూ కీర్తించబడుతూనే ఉంటాడు. చరిత్రకారులు ఆయన గొప్పతనాన్నీ ఔదార్యాన్నీ ఖడ్గాన్నీ ప్రస్తుతిస్తూనే ఉంటారు. అయితే చరిత్రలో నెపోలియన్‌తో పాటు టాల్‌స్టాయ్ కూడా ఉన్నాడు. చరిత్ర ధర్మంలో మానవుల పాత్ర ఎంత నామమాత్రమైందో, ఎంత పరిమితమైందో యుద్ధము–శాంతి ద్వారా మనకెప్పుడూ చెబుతూనే ఉంటాడు. - బి.అజయ్‌ప్రసాద్ 9247733602 -
మూడు ఓల్గా ప్రవాహాలు
కథలెందుకు రాస్తారు? ‘సమస్యా పరిష్కారం సంగతి నీకెందుకయ్యా. సమస్త తలతిక్కలతో ఎదురుపడే జీవితాన్ని ఎదుర్కొనేందుకు పాఠకుణ్ణి సిద్ధం చేయక’ అన్నాడు టాల్‌స్టాయ్. వార్ అండ్ పీస్, ఆనా కెరెనీనా, కొసక్కులు... ఈ మహాగ్రంథాల్లో, టాల్‌స్టాయ్ కథల్లో ఎవరు ఏదైనా వెతకనీగాక ఆయన సమస్త సారస్వత సారం అదే. సిద్ధం చేయడం! ధైర్యంగా నిలబడి, తెగువగా నిలబడి, భీరువుతనం మాని, తడబడటాన్ని వదిలి, జీవితాన్ని ఎదుర్కొనడం తెలియజెప్పడమే ఆయన రచనల ఉద్దేశం. అవి చదవితే దిగులు రాదు. చీకటి కమ్ముకోదు. నైరాశ్యం అలుముకోదు. రచనలన్నింటా పోరాటం, పెనుగులాట, బాధ ఉంటాయి. కాని పాఠకుణ్ణి నిలబెట్టే ఉంటాడాయన. ధైర్యం చిక్కబట్టుకునేలా ఉంటాడాయన. భరోసా ఇస్తుంటాడాయన. ఇదిగో అలాంటి భరోసా ఇచ్చేందుకు కథలు రాస్తారు కొందరు. ‘ఒరే బాబూ... ఇదిగో నీ బతుకు ఇలా ఉంది. నేను చూశా. చూశా ఏంటి. నీతో పాటు నేను కూడా పార అందుకున్నా. పలుగు అందుకున్నా. చెమట కార్చా. పాదాల వెంట నెత్తురు చిమ్మించా. ఒరే బాబూ... రక్తం గడ్డకట్టే చలిలో వజవజమని వణుకుతూ ఆకలికి అరుస్తున్న పేగులను బొబ్బోపెడుతూ ఒరే... నిజంగా అవన్నీ పడ్డాన్రా బాబూ... వద్దురా... ఇలా వద్దు మనం.... దీన్ని సరి చేయాల్రా... చేద్దాం పదా’ అని బీదా బిక్కి జనాలని నిశానీగాళ్లని నాలుగు అక్షరంముక్కలు నేర్చుకున్న అట్టడుగు రష్యన్ ప్రజలను ప్రభాతంలోకి నడిపించడానికి వచ్చినవాడు గోర్కి. ఫ్యూడలిజం అంటే ఒక పులి అని అది పచ్చినెత్తురు తాగుతుంది అని కేపిటలిజం అంటే మంచి ఖరీదైన ఆస్పత్రి అని అది మనకు మేలు చేయడానికే అన్నట్టుగా మన రక్తం చల్లగా తీసుకుంటుందని చెప్పి, అందుకు అరవకుండా కరవకుండా స్థిరమైన పద్ధతిలో వ్యవస్థకు వ్యతిరేకంగా విరుగుడు ఎక్కించడానికి వచ్చిన రచయిత గోర్కి. ప్రపంచం మెచ్చిన శ్రామికవర్గ రచయిత. పోరాట రచయిత. అదిగో ఆ మాట అనిపించుకోవడానికి కథలు రాస్తారు కొందరు. ‘చీకట్లో నీడలుంటాయ్. మనసులో దెయ్యాలూ భూతాలూ తిరుగాడుతాయ్. ఛీఛాలు పడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఆశపడి భంగపడ్డ మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. పేదరికం కాలి కింద తొక్కి పెడితే అణిగిపోయి ఆత్మవిస్వాసం కోల్పోయి ముడుచుకుపోయి గొణుక్కుంటూ సణుక్కుంటూ ఉండే మనుషులుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. నిరాశ వల్ల, నిస్పృహ వల్ల, ఈర్ష్య వల్ల, అసూయ వల్ల, ఓర్వలేనితనం వల్ల, నిరాకరణను ఎదుర్కొన్నందు వల్ల, చిన్న చిర్నవ్వుకు నోచుకోకపోవడం వల్ల, నేల మాళిగల్లో మురికివాడల్లో చీకటి గుయ్యారాల్లో మజ్జుగా ఉండే పరిసరాల్లో సదా వసించడం వల్ల నలత పడ్డ మనుషులు కొందరుంటారు. వాళ్లు ఒకలాగ ఉంటారు. ఈ మనుషుల్ని చూపించాలి. ఈ మనుషులున్న స్పృహను లోకానికి పట్టి ఇవ్వాలి. ఇటువంటి వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలపైని తెరలను చింపెయ్యాలి. పైకి కనిపించని విధ్వంసం. పైకి తెలియని శైధిల్యం. కంటికి గోచరం కాని రోదనా ప్రవాహం. ఇవన్నీ చూపించి తీరాలి’ అని వచ్చినవాడు దోస్తవ్ స్కీ. అదిగో ఆ అథోదారుల్లో నడవడానికి రాస్తారు కొందరు. కథ ఎప్పుడూ వినోదం కోసం కాదు. దాని వల్ల వినోదం కలిగితే కలగవచ్చుగాక కాని కేవలం వినోదం కలిగించడమే దాని లక్షణం కాదు. అది దాని పుట్టుకలోనే లేదు. వందల ఏళ్ల క్రితం ఒక యువరాజు ఆడవాళ్ల మీద ద్వేషంతో పెళ్లి నాటకం ఆడి తొలిరాత్రినాడే వాళ్లను కడ తేరుస్తుంటే తెలివిగల్ల పిల్ల ఒకత్తి వాణ్ణి తెల్లారేదాక మాటల్లో పెట్టడానికి కథలు మొదలుపెట్టింది. తెల్లారే దాకా చెప్పి, ఉత్కంఠ కలిగించే ముగింపులో ఆపి, తరువాయి తరువాత అనంటే ఆమెను చంపగలడా? తర్వాతి కథను వినకుండా ఆగగలడా? అలా ఆ పిల్ల బతికింది. ఆమె చెప్పిన కథలు ‘అరేబియన్ నైట్స్’గా ఇప్పటికీ బతికి ఉన్నాయి. ఎతిమతం శుంఠలుగా తయారైన రాజుగారి కొడుకులను మనుషులుగా తీర్చిదిద్దడానికి నాలుగు బుద్ధి మాటలు చెప్పడానికి కథలే కదా అవసరమయ్యాయి. అవి పంచతంత్రమై ఇవాళ మన అన్ని తంత్రాల్లోనూ ఆదుకుంటున్నాయి. ముడుక్కుని ముసుగేయించి పాఠకుణ్ణి పడుకోబెట్టేందుకు కథ పుట్టలేదు. మూడు దిక్కుల్లో పో ఉత్తరం దిక్కు తప్ప అని హెచ్చరించి కేవలం ఉత్తరం దిక్కువైపే వెళ్లేలా ప్రబోధించడానికే అది పుట్టింది. అన్వేషించడానికి, కొత్తవైపు కదలడానికి, ప్రమాదభరితమైన అనూహ్యమైన ఎదుట ఏముందో తెలియని జీవితం వైపు తరమడానికే కథ పుట్టింది. అదిగో అలా తరమడానికీ పాఠకుణ్ణి అశ్వరూఢుణ్ణి చేసి ఉత్తర దిక్కు వైపు బయలుదేరేలా చేయడానికీ చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తుంటారు. - ఖదీర్