టాల్‌స్టాయ్‌ చెప్పిన చరిత్ర: యుద్ధము–శాంతి | B.Ajay prasad's reading experience of tolstoy's war and peace | Sakshi
Sakshi News home page

టాల్‌స్టాయ్‌ చెప్పిన చరిత్ర: యుద్ధము–శాంతి

Published Sun, Jul 16 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

ఫ్యోదర్‌ అలెక్సీవ్‌ గీసిన మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ చిత్రం (1801) (ఇన్‌సెట్‌- టాల్‌స్టాయ్‌)

ఫ్యోదర్‌ అలెక్సీవ్‌ గీసిన మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ చిత్రం (1801) (ఇన్‌సెట్‌- టాల్‌స్టాయ్‌)

పఠనానుభవం
మొత్తానికి టాల్‌స్టాయ్‌ ‘యుద్ధము – శాంతి’ పూర్తి చేయగలిగా. ఇప్పుడుగనక చదవకపోతే ఇక జీవితంలో సాధ్యపడదని చదవటం మొదలెట్టా. అయితే ఈ నవలలోకి ప్రవేశించటానికి చాలా యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక రాజకుటుంబాలు, గుర్తు పెట్టుకోలేనన్ని పాత్రలు, రష్యన్, యూరోపియన్‌ జియోగ్రఫి, చరిత్ర... ఇదంతా ఫాలో అయి అర్థంచేసుకోవటం... ఎలాగైతేనేం ఒక యాభై పేజీలు ఆపకుండా చదివేసరికి మిగతా నవలంతా దానంతట అదే గుర్రబ్బండిలా పరుగెత్తసాగింది.

ఒకపక్క నవల పొడుగూతా వందలకొద్దీ పాత్రలు, ఊళ్లు, నదులు, రష్యన్‌ నగరాలు, బాల్‌రూమ్‌ నృత్యాలు, విందులు, వినోదాలు, ప్రేమలు, పెళ్లిళ్లు. మరోపక్క ఫ్రాన్స్‌లో మొదలైన కల్లోలం నెపోలియన్‌ రూపంలో దేశదేశాల నుంచి రష్యాకు విస్తరిస్తున్న సమరం. వెరసి విస్తృతమైన టైమ్‌ అండ్‌ స్పేస్‌లో నడిచిన బృహత్తర చారిత్రక నవల! మొదట టాల్‌స్టాయ్‌ దీనికి 1805 అని పేరుపెట్టాడు. చివరికి ‘వార్‌ అండ్‌ పీస్‌’గా మార్చాడు. దీన్ని నవలగా చెప్పడానికి టాల్‌స్టాయ్‌కే చాలా అభ్యంతరాలున్నాయి. ఇందులోని చరిత్ర, చరిత్రకు సంబంధించి టాల్‌స్టాయ్‌ వ్యాఖ్యానాలు పక్కకుతీసి చూస్తే ఈ నవలలో నడిచిన పాత్రల కథనం, గమనం ఆయన ఇతర రచనల మాదిరిగానే ఉంటుంది.

ఇందులో నెపోలియన్‌ బోనాపార్టి రక్తమాంసాలతో ఉన్న ఒక పాత్ర. తన సైనికులతో, రష్యన్‌ రాయబారులతో ఆయన సంభాషణలు తారీఖులతో సహా ఉన్నాయి. అప్పటి జార్‌ చక్రవర్తి అలెగ్జాండర్, అప్పటి యుద్ధంలో పాల్గొన్న రష్యన్‌ ఆర్మీ చీఫ్‌ కొటోజొవ్‌ కూడా ఉన్నారు. నాకనిపించింది ఏమంటే ఈ నవలలోని పాత్రలు, వాటి తీరుతెన్నులు, వాళ్ల ద్వారా నడిచిన కథనాన్ని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకోవడంకంటే ఇందులో వర్ణించిన ఆ కాలంనాటి యుద్ధవాతావరణాన్నీ, ఆనాడు నడిచిన యూరోపియన్‌ రాజకీయాలనూ, ఇరుపక్షాల యుద్ధ తంత్రాలనూ, ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ యుద్ధ నైపుణ్యాన్నీ, జార్‌ అలెగ్జాండర్‌ వైఖరినీ, రష్యన్‌ సేనాని కొటోజొవ్‌ యుద్ధవ్యూహాన్నీ అవగతం చేసుకోవడం మరింత కష్టమైన పని. అంతకుమించి చరిత్ర రచన గురించి టాల్‌స్టాయ్‌ తాత్విక దృక్పథాన్ని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన విషయం.

ఈ నవల ఆనాటి ఫ్రెంచి, రష్యన్‌ పాఠకులకు ఎలా అనిపించింది? నెపోలియన్‌ గురించీ, ఫ్రెంచి సైన్యాన్ని గురించీ  టాల్‌స్టాయ్‌ చేసిన వాఖ్యలను వాళ్లు ఏవిధంగా అర్థం చేసుకుని ఉంటారు? రెండు వందల సంవత్సరాల తరువాత ఇప్పటి ఈ కాలరేఖమీద నిలబడి దీన్ని ఎలా చూడాలి? టాల్‌స్టాయ్‌ చెప్పిన విషయాలు అందరికీ ఆమోదయోగ్యమేనా? అధ్యయనం చేయడానికి ఆసక్తి కలిగించే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి.

నవల ప్రారంభమైనప్పుడు ఇందులోని పాత్రలన్నీ దాదాపు తరుణ వయస్కులైన యువతీ యువకులు. వీళ్లంతా  ఉన్నత తరగతికి చెందిన రాజకుటుంబాలకు చెందినవారు. వాళ్లకు తెలిసిందల్లా ప్రేమించడం, కలలుగనడం. యుద్ధం ముగిసేనాటికి వాళ్లలో కొందరు చనిపోతారు. కొందరు భగ్నప్రేమికులవుతారు. జీవితం అనేక మలుపులు తిరిగి తాము ప్రేమించినవారిని కాక మరొకరిని పెళ్లాడతారు. కొందరు పెళ్లికాకుండా అలాగే మిగిలిపోతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించినట్లు వాళ్ల ఆలోచనా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. నవల మొదట్లో నెపోలియన్‌ పట్ల ఆరాధనాభావంతో ఉండే పీటర్‌ ఫ్రెంచి సైన్య మాస్కో ముట్టడి తరవాత అవకాశం వస్తే నెపోలియన్‌ను హత్య చేయాలనుకుంటాడు. కౌమార దశలో ఉన్న నటాషా మొదట బోరిస్‌ని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఆండ్రూతో నిశ్చితార్థమవుతుంది. మరొకసారి అనెటోవ్‌తో లేచి పోదామనుకుంటుంది. నవలాంతానికి ఆండ్రూ యుద్ధంలో గాయపడి నటాషా దగ్గరే మరణిస్తాడు. నటాషా చివరికి పీటర్‌ను పెళ్లాడి నలుగురు పిల్లలతో పరిపూర్ణ స్త్రీ అవుతుంది. ఆమె వక్షోజాలు పసరు మొగ్గల్లాగా ఉన్నప్పుడు మొదలైన నవల ముగ్గురు పిల్లల్ని కని వాళ్లకు పాలిస్తున్న తల్లిగా మారడం వరకు నడుస్తుంది. ఈ కథనాన్నంతా అవతల యుద్ధానికి సమాంతరంగా నడిపిస్తాడు టాల్‌స్టాయ్‌. చరిత్ర అవ్యక్తమైందనీ, విధాత అధీనంలో ఉందనీ భావించిన టాల్‌స్టాయ్‌ తను సృష్టించిన పాత్రల గమనాన్ని కూడా అదే దృష్టితో రూపొందించాడా అనేది మరొక ఆసక్తికరమైన పరిశీలన.

1812లో నెపోలియన్‌ మాస్కో నగరాన్ని ముట్టడించాడు. ఫ్రెంచి సైనికులు మాస్కోకు నిప్పుపెట్టారు. నగరం చాలా వరకు ధ్వంసమైంది. నెపోలియన్‌ 1821లో మరణించాడు. 1828లో పుట్టిన టాల్‌స్టాయ్‌ తన ముప్పయ్యారవ యేట ఈ నవల ప్రారంభించాడు. అంటే సుమారు యాభై ఏళ్ల వెనక్కు వెళ్లి తారీఖులతో సహా ఇందులోని సంఘటనలనూ యుద్ధక్రమాన్నీ ఊహించి విశదీకరించాడు. అందుకోసం రష్యాపై ఫ్రెంచివారి దండయాత్రని అధ్యయనం చేశాడు. అనేక ఊళ్లు తిరిగాడు. యుద్ధంలో పాల్గొన్నవారితో మాట్లాడాడు. నెపోలియన్‌ మీద పుస్తకాలు, ఆయన రాసిన ఉత్తరాలు చదివాడు. వాటినే ఇందులో పొందుపరిచాడు.

టాల్‌స్టాయ్‌ యాభై ఏళ్లు వెనక్కువెళ్లి యుద్ధాన్ని ఎలా చూసాడు? అప్పటి యూరప్‌ రాజకీయాలు అలానే ఉన్నాయా? సమరం ఈ తీరుగానే నడిచిందా? వాళ్లు అలానే ఆ పర్వతాలు దాటి వెళ్లారా? వాళ్లు అలానే నిమెన్‌ నదిని దాటారా? ఇదంతా ఎవరు చూశారు? రష్యన్‌ చీఫ్‌ కమాండర్‌ కొటోజవేనా? అతడు టాల్‌స్టాయ్‌ చెప్పినట్టే ఉండేవాడా? ఇందులో వర్ణించిన చక్రవర్తులు, సేనాధిపతులు, గవర్నర్లు, జనరల్స్‌ వివిధ సందర్భాల్లో వాళ్ల ప్రవర్తన, నడవడిక, హావభావాలు ఇవన్నీ అప్పుడు ఆయా సందర్భాల్లో జీవించిన ఆ తరానికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ నవలని çసృష్టించిన టాల్‌స్టాయ్‌కి కూడా! ఇదంతా కల్పన. ఇందులో ఇమిడివున్న అనేక దేశాల సార్వభౌమత్వం, యుద్ధతంత్రం గురించి రాయగల సాధికారత ఒక్క టాల్‌స్టాయ్‌కే సాధ్యం.

ఇంతకీ ఈ యుద్ధంలో టాల్‌స్టాయ్‌ ఏ పక్షం తీసుకున్నాడు? నెపోలియన్‌ను ఎలా అర్థం చేసుకున్నాడు? టాల్‌స్టాయ్‌ రష్యన్‌ కాబట్టి ఫ్రెంచివారిని విమర్శించాడా? ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే నవల చివర టాల్‌స్టాయ్‌ చెప్పిన చరిత్ర ధర్మాలని అర్థం చేసుకోవాలి.

అసలు చరిత్ర ధర్మం ఏమిటి? చరిత్రని సంస్కర్తలు, రాజులు, చక్రవర్తులు నడిపించారంటే నమ్మడం కేవలం ఊహాజనితంగా ఉంటుందంటాడు టాల్‌స్టాయ్‌. ఆర్థిక, రాజకీయ భౌగోళిక శాస్త్రాల ధర్మాలతో అన్వయించడం చరిత్ర ధర్మాలకు విరుద్ధం అంటాడు.

మానవజాతి ప్రగతిని వ్యాఖ్యానించడమే చరిత్ర యొక్క ప్రధాన ప్రయోజనమైతే మానవజాతి ప్రగతిని నిర్దేశిస్తున్న శక్తి ఏది అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పుకోవలసి ఉంది. కాని ఈ పశ్నకు ఆధునిక చరిత్రకారుల వ్యాఖ్యానాలలో జవాబు దొరకదు.

ఎవరు చరిత్రలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి వహించారో వారంతా కేవలం నామమాత్రులే. సంఘటనలకు ఊరకే వారి పేర్లు తగిలిస్తారు కానీ, వాస్తవానికి వారికీ ఆ సంఘటనలకూ– ఒక పేరుకూ ఆ పేరు పెట్టిన వస్తువుకూ ఉన్న సంబంధం కూడా ఉండదు. వారు తమంతట తామే చేశామనుకునే పనులలో ఏ పని కూడా నిజంగా వారలా చేసింది కాదు. దానికీ చరిత్రగతికీ మానవజీవిత గతికీ ఒక సంబంధం ఉన్నది. కాలం మొదలుపెట్టినప్పటినుంచీ   దాని స్థానం ముందే నిర్ణీతమై ఉన్నది అంటాడు టాల్‌స్టాయ్‌.

యుద్ధం రావలసివుంది కాబట్టి వచ్చింది. అందుకనే కొన్ని కోట్ల మంది ఇంగితజ్ఞానాన్నీ మానవత్వాన్నీ మర్చిపోయి పశ్చిమాన్నుంచి ప్రాచ్యముఖంగా వారి తోటివారిని వధించటం కోసం తరలివచ్చారు. జాతుల యొక్క రక్తం ప్రవహింపచేయాలా వద్దా అనే విషయం తన నిర్ణయం మీద ఆధారపడి వుందని నెపోలియన్‌ అనుకున్నప్పటికీ అతనికి తెలీకుండానే అతణ్ని చరిత్ర ముందుకు లాక్కొనిపోతూవుంది. రాజులు చరిత్రకు బానిసలు అంటాడు టాల్‌స్టాయ్‌.

పరిసరాల్నీ మనుషుల్నీ సంఘటనల్నీ వాటి తీరుతెన్నుల పరిణామాన్నీ నిశితంగా పరిశీలించే మనుçషులు ఎప్పుడూ ఉంటారు. ఊహకందని కొన్ని సూత్రాల ప్రకారం ఈ ప్రపంచం, ఈ చరాచర జగత్తు నడుస్తూ నడిపించబడుతూ ఉందంటే హేతువాదులు, ప్రగతిశీలురు ఒప్పుకోవడం కష్టమే. ఆ సిద్ధాంతం పాతది కూడాను. ఎప్పటికో గతానికి వెళ్లి చూడటం కాదు. ఇప్పుడు మన కళ్లముందు జరిగే సంఘటనల పూర్వాపరాలను వ్యాఖ్యానించడంలోనే మనకు అనేక అభిప్రాయ భేదాలున్నాయి. అలాంటి సందర్భంలో టాల్‌స్టాయ్‌ చెప్పిన చరిత్ర ధర్మాన్ని మనం ఎందుకు కాదనాలి?

నవలలో కొన్నిసార్లు బాల్‌ రూమ్‌ దృశ్యాల వర్ణన. మరొకసారి కెమెరా కంటికి దొరకని మనుషుల అతి సున్నితమైన హావభావాలు. సంభాషణలతో కాక పాత్రల అంతరంగాన్ని విడమర్చి చెప్పే ముఖకవళికలు. కొన్నిచోట్ల (సైనికుల తరలింపు) చదువుతుంటే ఇంగ్లీషు సినిమా డైరెక్టర్లు టాల్‌స్టాయ్‌ వర్ణనలను కాపీకొట్టారనిసిస్తుంది.

యుద్ధం గురించి వచ్చినప్పుడు, చరిత్ర గురించి వచ్చినప్పుడు పేజీలు తిప్పేసే అలవాటు కొంతమందికి ఉంది. ఇది రుచికలిగించే దినుసుల్ని ఊసేసి రుచిలేని పాయసాన్ని తాగటంలాంటిది. సైనికుల ప్రయాణాలూ, వాళ్లని తరలించడమూ, యుద్ధ తంత్రాలూ, చరిత్రా ఇవన్నీ నవలలో భాగంగా చూసి చదవటం మంచిది. కేవలం పాత్రలతో కూడిన నవల పూర్తిచేద్దామనుకుంటే మనకు మనం అన్యాయం చేసుకున్నట్లే.

భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భూమి కదులుతూ ఉన్నట్లు మనం గ్రహించాలి. అలానే భ్రాంతిజన్యమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అధిగమించి గోచరం కాని ఒక పరాధీనతను మనం అంగీకరించాలి అంటాడు టాల్‌స్టాయ్‌. ఇదే ఇంతపెద్ద నవలలోని ఆఖరు వాక్యం.

చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా నెపోలియన్‌ ఎప్పుడూ కీర్తించబడుతూనే ఉంటాడు. చరిత్రకారులు ఆయన గొప్పతనాన్నీ ఔదార్యాన్నీ ఖడ్గాన్నీ ప్రస్తుతిస్తూనే ఉంటారు. అయితే చరిత్రలో నెపోలియన్‌తో పాటు టాల్‌స్టాయ్‌ కూడా ఉన్నాడు. చరిత్ర ధర్మంలో మానవుల పాత్ర ఎంత నామమాత్రమైందో, ఎంత పరిమితమైందో యుద్ధము–శాంతి ద్వారా మనకెప్పుడూ చెబుతూనే ఉంటాడు.

- బి.అజయ్‌ప్రసాద్‌
9247733602

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement