ప్రపంచం తన గురించి తాను రాసుకోగలిగితే, అది టాల్‌స్టాయ్‌లాగా రాస్తుంది; అంటాడు ఐజాక్ బేబెల్. అదే ప్రపంచం తన గురించి ఒకే ఒక్క నవల రాసుకుంటే, అది కచ్చితంగా ‘వార్ అండ్ పీస్’ అవుతుంది. పన్నెండు వందల పేజీలు, ఐదు వందల పాత్రలు, ఇందులో కనీసం 160 మంది చరిత్రలో వాస్తవమైన మనుషులు, ప్రతి పాత్రకూ తనదైన వ్యక్తిత్వం, ఆహార్యం, దృక్కోణం లాంటి భయపెట్టే వివరాలకు తోడు, తన కాలానికి అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లి టాల్‌స్టాయ్ ఈ మహానవలను రాశాడు. ఇది రెండు రకాల ఫీట్. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకోవడంతో పాటు వాటన్నింటినీ గతంలో భాగం చేయడం! పైగా ఈ బృహత్ నవలను టాల్‌స్టాయ్ తొమ్మిది సార్లు తిరగరాశాడంటారు. ఆ అన్నిసార్లూ కూడా టాల్‌స్టాయ్ చేతిరాతను అర్థం చేసుకుంటూ ఆయన భార్య సోఫియా దాన్ని ఫెయిర్ చేసింది. అలా ఈ మహా నిర్మాణానికి ఆమె కూడా రాళ్లెత్తిన కూలీ.
తొలుత టాల్‌స్టాయ్ దీనికి పెట్టిన పేరు: 1805. జారిస్టు రష్యాను నెపోలియన్ నేతృత్వంలోని ఫ్రాన్స్ ఆక్రమించిన 1805–1812 నాటి కాలాన్ని చిత్రించిన ఈ నవల తొలిభాగం 1863లో ప్రచురితమైంది. చరిత్ర పుస్తకాలు, తత్వశాస్త్ర పాఠాలు, డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ శోధించి, క్రిమియన్ యుద్ధంలో సైనికుడిగా తన అనుభవాలను జోడించి, చరిత్రనూ కల్పననూ కలగలుపుతూ, తన యౌవనశక్తిని అంతా రంగరించి టాల్‌స్టాయ్ సృజించిన ఈ నవల వంద కెమెరాలు మోహరించినట్టుగా యుద్ధ బీభత్సాన్ని ప్రతి కోణం నుంచి చూపుతుంది. వేలాది మంది చచ్చిపోతారు; మాస్కో తగలబడుతుంది; జనాలు బళ్లు కట్టుకుని దొరికిన సామాన్లు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోతారు; ఇవ్వాళ్టి యుద్ధంలో గెలిచిన సైనికుడు రేపు ఓడిపోతాడు; గుడారాల్లో కాగితం మీద గీసుకునే గీతలు, కార్యక్షేత్రంలో పూర్తి భిన్నమైన తలరాతను రాస్తాయి.
జీవితానికో అర్థవంతమైన లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విఫలయత్నాలు చేసే పియరీ, రష్యన్ విలాస సమాజం పట్ల విసిగిపోయిన ఆంద్రేయ్, చురుకైన బాలిక నుంచి పొందికైన ప్రౌఢగా పరిణామం చెందే నటాషా ప్రధాన పాత్రలుగా, బెష్కోవులు, బోల్‌కోన్‌స్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, డ్రౌబెట్‌స్కాయ్‌లు అనే ఐదు కులీన కుటుంబాల మధ్య గల సంబంధాల భూమికగా రాసిన ఈ నవలలో టాల్‌స్టాయ్– ఆర్టిస్టు, సైకాలజిస్టు, తాత్వికుడు, చరిత్రకారుడిగా భిన్న పాత్రలు పోషిస్తాడు. పూర్తి నవలా లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ– యుద్ధ సన్నివేశాలను మాంటేజ్ షాట్స్‌లా చూపడం, ప్రతి సన్నివేశాన్ని ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమనే శిల్పపరమైన పనితనం టాల్‌స్టాయ్‌ను గొప్ప దృశ్యమాన రచయితగా నిలబెడుతాయి.
అది సూడాన్, ఇరాక్, కశ్మీర్, అఫ్గానిస్తాన్ ఏదైనా కావచ్చు; రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అన్నట్టుగా– ఈ ప్రపంచం నిత్య సంక్షోభం, కల్లోలం. అయితే, నెపోలియన్ చక్రవర్తి అంతటివాడే అయినాసరే, అతడు కోరుకున్నంత మాత్రాన యుద్ధం రాదు; ఒకవేళ అతడు ఆపాలనుకున్నా ఆపలేడు. మనం ఇచ్ఛా స్వాతంత్య్రాలు అనుకునేవి భ్రాంతి జన్యం. ఇంద్రియ గోచరం కాని పరాధీనత అనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఎన్నో శక్తులు ఎన్నో రీతుల్లో ప్రవర్తిస్తున్న తుది పర్యవసానం ఈ వర్తమానపు వాస్తవం. నవల చివరన టాల్‌స్టాయ్ చేసే ప్రతిపాదనలు ఈ ప్రపంచ నడతకు మనల్ని ఏకకాలంలో బాధ్యులుగానూ, బాధితులుగానూ నిలబెడతాయి. అయితే ఈ యుద్ధం ‘అనివార్యం’ అవుతున్నప్పుడు కూడా, సామాన్య మానవుడు తన రోజువారీ జీవన సంరంభంలో భాగం అవుతున్నాడు. అదే అతడి ధిక్కార ప్రకటన. ఆ యుద్ధ శాంతులను సమాంతరంగా చిత్రించడమే జీవితానికి టాల్‌స్టాయ్ ఇచ్చిన భరోసా!
టాల్‌స్టాయ్ రుషుల పరంపరలోని రచయిత. అందుకే గాంధీజీ లాంటి మరో రుషితుల్యుడిని దక్షిణాఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫార్మ్’ నెలకొల్పేలా ప్రభావితం చేయగలిగాడు. మరింత సమకాలీనం కావడమే గొప్ప రచనల లక్షణం. ఈ కాలానికి కూడా అవశ్యమైన రచన ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం కావడంతోపాటు సినిమాలుగా, సీరియళ్లుగా, సంగీత రూపకాలుగా, నాటకాలుగా, రేడియో నాటకాలుగా ఎన్నో రూపాల్లో ఇది ప్రపంచంలోని శూన్యాన్ని భర్తీ చేస్తూనే వుంది. దీన్ని ఒక్కసారైనా చదవడం ఏ సీరియస్ పాఠకుడికైనా జీవితలక్ష్యం లాంటిది కావడంలో తప్పేమీలేదు. దాన్నే మరోసారి పురిగొల్పుతోంది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ.
కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో ఈ అనిశ్చిత జీవితంతో విసుగెత్తి, అందివచ్చిన ఆన్‌లైన్ ఆయుధాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంది లీ. మనుషులను కలిసే వీల్లేని సంక్షోభ కాలంలో, అంతరంగాలకు చేరువయ్యేలా సామూహిక పఠనానికి పిలుపునిచ్చింది. దానికి ఆమె ఎంచుకున్న నవల: వార్ అండ్ పీస్. ‘పబ్లిక్‌స్పేస్’ ఆధ్వర్యంలో 2020 మార్చ్ 18 నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్త టాల్‌స్టాయ్ అభిమానులు భాగమయ్యారు. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం చేశారు. 85 రోజుల్లో నవల పూర్తయ్యింది. ఆ పఠనానుభవాలతో ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఈ సెప్టెంబర్ 14న అది విడుదల కానుంది. అంతేనా, ఈ ఉత్సాహంతో మరో విడత పఠనానికి సెప్టెంబర్ 15 నుంచి సిద్ధమవుతున్నారు. పాల్గొనడానికి అర్హత పుస్తకం ఉండటమే! తెలుగులోనూ రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు అనువాదం మన ముందుంది. ఆ మధ్య ‘సాహితి’ వారి రీప్రింటూ వచ్చింది. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి పనికి పూనుకోవచ్చు.
యుద్ధము – అశాంతి
Published Mon, Aug 30 2021 12:59 AM | Last Updated on Mon, Aug 30 2021 1:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment