చరిత్రని ప్రతిఫలింప చేసే ‘యుద్ధము–శాంతి’ నవలని టాల్‌స్టాయ్ అయిదేళ్లు రాశాడు. ఆనాటి జీవితానికి అద్దం పట్టిన ‘అన్నా కెరనినా’ నవలకీ ఇంచుమించు అయిదేళ్లే పట్టింది. జీవితం అప్పటికే లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి 1870లలో రష్యన్ సాహిత్యంలో జరిగిన సాహసోపేతమైన ప్రయత్నం ఈ నవల. టాల్‌స్టాయ్ ఆధ్యాత్మిక శోధననీ, కుటుంబ పరిస్థితుల ద్వారా నాటి సమకాలీన జీవిత సాధారణ క్రమాల్ని అర్థం చేసుకునేందుకు ఆయన చేసే ప్రయత్నాలన్నీ ఈ నవల ప్రతిబింబించింది.
‘‘అన్నా కెరనినా’’ రాయడానికి సమాయత్తం అయ్యే సంవత్సరాలలో టాల్‌స్టాయ్ ‘తనతో, తన కుటుంబంతో సామరస్యంగా జీవించాలని ఆశించాడు. కాని అది జరగలేదు. నూతన తాత్విక, ఆచరణ ఉద్దేశాలు ఆయనకి కలిగాయి. అవి పాతుకుపోయిన ప్రభువంశీకుల జమీ జీవితంతో సంఘర్షించాయి. దాంతో కుటుంబ జీవిత రాగంలో జీరస్వరం వచ్చింది. ఈ జీవితంలో ఉన్న చారిత్రక అన్యాయం ఆయనకు క్రమేపీ వెల్లడైంది. ‘‘కోరికలూ వ్యామోహాలూ తృప్తిపరచుకోవాలనుకునే’’ ఆ జీవితాన్ని త్యజించాలన్న కోరిక ఆయనకి కలిగింది. కాని ఈ నవల్లోని నాయకత్వ ప్రాముఖ్య పాత్రలు అయిన అన్నా, ఆమె తమ్ముడు అబ్లాన్‌స్కీ, వ్రాన్‌స్కీ, యాశ్విన్ తదితరులు, సరిగ్గా అదే పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. భౌతిక వాంఛా పరిపూర్తి ప్రేరణలు, ‘కులాసా వేదాంత’ ధోరణి ప్రేరణలు బాగా తెలిసిన లేవిన్ ఒక్కడికి మాత్రం ఆ జీవిత సమంజసత్వం గురించి సందేహాలు కలుగుతాయి. టాల్‌స్టాయ్ మాదిరీ లేవిన్ ఆర్థిక, రాజకీయ విప్లవం గురించి ఆలోచించలేదు. మానసిక పరివర్తన గురించి ఆలోచిస్తాడు. ఇది ప్రజలలో ‘‘శత్రుత్వం వైషమ్యం’’ బదులుగా ‘‘సమరస భావం, సత్సంబంధాలు’’ స్థాపిస్తుందని ఆయన అభిప్రాయం.
‘‘ఈ నవల ఇతివృత్తం వివాహబంధాన్ని భార్య అతిక్రమించడం, దానివల్ల రేగిన మొత్తం ఘటనలు’’ అని టాల్‌స్టాయ్ నవల రాయడం మొదలుపెట్టినప్పుడే అన్నాడు. పుస్తకంలో పైకి గోచరమయ్యే పార్శ్వం ఇది. కాని అంతర్గతంగా ఉన్న అర్థం ‘‘కుటుంబ గాథ’’ని అధిగమించి ఉంటుంది. టాల్‌స్టాయ్ అన్నా కెరనినా మీద అభియోగం మోపేవాడు కాదు, సమర్థన చేసేవాడూ కాదు. జీవితం కోసం అహంకారపూరితంగా ఆమె చేసే పోరాటంలో సంభవించిన మహా విషాదంలో దేన్నీ వదిలిపెట్టని చరిత్రకారుడు ఆయన. మనిషి చేసే చర్యలకీ, అనే మాటలకీ నైతిక బాధ్యత మనిషిదే అని టాల్‌స్టాయ్ విశ్వసించాడు.
గాఢంగా రష్యన్ స్వభావాన్ని ప్రతిబింబించడమూ, అదే సమయంలో సార్వజనీనమూ అయినందుకే నవల మనకు ఆదరణీయం అవుతోంది. ‘‘అన్నా కెరనినా’’ కాలం ఎప్పుడో పాతబడి పోయింది. కాని టాల్‌స్టాయ్ కళకి వార్ధక్యం లేదు. ‘‘తడుముకోకుండా చెప్తాను, ప్రపంచ సాహిత్యం మొత్తంలో ‘అన్నా కెరనినా’ మహత్తర నవల’’అని థామస్ మాన్ రాశాడు. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి రచనలని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
(టాల్‌స్టాయ్ పుస్తకాలు కొన్ని తాజాగా ‘సాహితి ప్రచురణలు’ ద్వారా తెలుగులో పునర్ముద్రణ పొందాయి. ‘అన్నా కెరనినా’కు ఆర్వీయార్ చేసిన అనువాదం వాటిల్లో ఒకటి. పై భాగం, ఎడ్వర్డ్ బబాయేన్ రాసిన ముందుమాటలోంచి సంక్షిప్తం.)
Published Mon, Oct 22 2018 1:21 AM | Last Updated on Mon, Oct 22 2018 1:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment