నవ్వుల గజ్జెలు | Navvula Gajjalu Story By Bhaskara Batla Krishnarao | Sakshi
Sakshi News home page

నవ్వుల గజ్జెలు

Published Mon, Feb 10 2020 4:01 AM | Last Updated on Mon, Feb 10 2020 4:07 AM

Navvula Gajjalu Story By Bhaskara Batla Krishnarao - Sakshi

‘‘వేడిగా ఏ మే ముంది?’’‘‘వడ, దోసె, ఇడ్లీ, పూరీ, బోండా, మైసూర్‌పాక్‌’’ ఏకబిగిని రాము పాఠం వల్లించాడు. వాడి చూపులు ఫ్యామిలీ రూమ్స్‌కేసి పదే పదే పరుగులెత్తుతున్నాయి.‘‘రెండు ప్లేట్లు ఇడ్లీ చట్నీ పట్రా!’’రాము వడిగా వంటింటివేపు నడిచాడు. నడుస్తుంటే ఏదో పొరపాటు చేసినట్టు తట్టింది. చప్పున ఆర్డర్‌ తీసుకున్న టేబుల్‌ దగ్గరకు వెళ్లి ‘‘ఇడ్లీ లే’’దని సమాధానం చెప్పాడు.ఆర్డర్‌ యిచ్చిన కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. ‘‘అయితే రెండు కప్పుల టీ పట్రా!’’‘‘రెండు టీ’’ అని రాము గట్టిగా అరిచాడు. అరుపు వేగంతో వంటింట్లోకి వెళ్లాడు. కౌంటర్‌ పైన ‘టీ’ కనపడకపోవడంతో విసుక్కున్నాడు. కౌంటర్‌ మీద మోచేతులు ఆనించి, వదులుగా నిలబడ్డాడు. కొంతసేపటికి టీ కప్పులు కనపడ్డాయి. వెంటనే అందుకుని దుడుకుగా టేబుల్‌ దగ్గరకొచ్చాడు. కప్పుల అంచులు ఒరుసుకుని నడకలో టీ సాసర్లలో పడింది. టీ తగిలి, చేతి బొటనవ్రేలు చురుక్కుమంది. చెయ్యి వణికింది. చేతిలోంచి కప్పు జారి ఆర్డరిచ్చిన కుర్రాడి ఒళ్లో పడింది. అతను దిగ్గున లేచి రామును ఫెళ్లున చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకి రెండవకప్పు, ఎడమచేతి సాసర్‌లోంచి దొర్లి టేబుల్‌పైన ముక్కలైంది. రాము శరీరంపైన పడగలు విప్పి, పాములు, జెర్రులు పాకాయి. మనసులో కోపం లేదు. కాని ఒళ్లు తెలియని ఉద్రేకం పొంగి ఆర్డర్‌ యిచ్చిన కుర్రాడిని ఫెళ్లున కొట్టాడు. హోటలులోని మనుషులు ఈ సంఘటనకు ఏక కంఠంతో గొల్లుమన్నారు. కౌంటర్‌ మీది యజమాని తిట్ల వర్షంతో లేచాడు. దెబ్బలతో, తన్నులతో రాముని హోటల్‌నుంచి తరిమాడు. రాము గుడ్డల్ని గిరాటు వేశాడు. రాముకి యజమానిపై తిరగబడదామన్న వాంఛే కలగలేదు. నరాలన్నీ సడలి ఒక విధమైన ఆనందం కమ్మింది. శరీరం తడిబట్టకు మల్లే బిగుసుకు పోయింది. కళ్లముందు నగ్నంగా రోడ్డు పరుచుకొని వుంది. బరువుగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు.

కొంతదూరం అనాలోచితంగా నడిచాడు. కాళ్లు ఎందుకో పీక్కుపోతున్నాయి. కొద్దిగా ఆకలనిపించింది. ఆకలిని దులిపేసుకుని, రోడ్డు పక్కనున్న మైదానంలో గుమిగూడిన ఒక గుంపులోకి వెళ్లాడు. వెళ్లడంలో తనకు రెండింతలు పొడుగున్న మనిషి కాలు తొక్కాడు. అతను కస్సున లేచాడు. రాము పిల్లికి మల్లే ముందుకి వెళ్లి మొదటి వరుసలో కూర్చున్నాడు. అక్కడ మగకోతి, ఆడకోతిని బతిమాలుతున్నది. ఆడకోతి తల్లిగారింటికి వెడతానని మగకోతిని భయపెట్టుతున్నది. మగకోతి తల నిమరడానికి చూస్తోంది. ఆడకోతి గుర్రుమంటున్నది. ఆ కోతుల్ని చూస్తే నవ్వు వచ్చింది కాని, వాటి ఆలుమగల బాగోతం ఎందుకో కలత పెట్టింది. ఆడకోతి తల నిమరాలనిపించింది. లేచి ఆడకోతి వేపు వెళ్లాడు. కోతులాడించేవాడు ‘కుర్రాడా, కూర్చో’ అని గద్దించాడు. తనని ‘కుర్రా’డనటం వెగటుగా తోచింది. ఆ మాటతో ఉత్సాహం చచ్చింది. తన చోటుకి వచ్చి కూర్చున్నాడు. ఆడకోతి అంత బతిమిలాడించుకోవడం చూచి కోపం వచ్చింది. ఇంతలో మగ కోతి కర్ర తీసుకుని ఆడకోతి వెంట పడింది. ఆడకోతి కోతులాడించేవాడి చుట్టూ దొరకకుండా పరుగెత్తుతున్నది. మగకోతి వేగం హెచ్చింది. త్వరగా సమీపించి రెండు బాదింది. ఆడకోతి కీచుకీచులాడింది. మగకోతి చెప్పినట్టల్లా వినడం మొదలుపెట్టింది. రాముకు ఎందుకో ఆడకోతి మక్కెలు విరగదన్నాలనీ, ఆ తర్వాత తల నిమరాలనీ అనిపించింది. ఆట ముగిసింది. ఆడించేవాడు డబ్బులు అడుక్కుంటున్నాడు.

రాము లేచి, తిరిగి నడక సాగించాడు. రోడ్డుపైన ఒక జంట చిరునవ్వులతో సాగింది. రాము తన కళ్లని ఆ జంటకి వప్పగించాడు. పర్దాతో ఒక రిక్షా ఎదురుగా వచ్చి, దాటేసి వెళ్లింది. రాము కళ్లు ఆ పర్దాని చీల్చడానికి ప్రయత్నించాయి. ఒక అమ్మాయి గాలికి ఎగురుతున్న కొంగుతో, సైకిలు పైన దాటేసి వెళ్లింది. రాము చూపులు చక్రాల వేగంలో యిరుక్కొని పోయినాయి. ఆ సైకిలుని నిలుచున్న పాటున పడగొట్టాలనిపించింది. సైకిలు మళ్లిన సందులోకి వెళ్లాడు. సైకిలు కనపడలేదు. ఏదో పోగొట్టుకున్నవాడికి మల్లే సందును దిగులుగా కలియ జూశాడు. సందులో చీకట్లు అలముకొంటున్నాయి. కళ్లముందు మసక తెరల్ని ముంచుతున్నాయి. చీకట్లోకి వెళ్లడానికి మనస్సు ఒప్పుకోలేదు. తిరిగి హోటలుకు వెడితే బాగుండు ననిపించింది. నిలుచున్న పాటున తరిమివేసిన యజమాని ఆశ్రయమిస్తాడన్న నమ్మకం లేదు. ఎక్కడా తలదాచుకోవడానికి చోటు లేదన్న తలపుతో భయం వేసింది. ఆకలి వేస్తున్నది. తినడానికి ఏమైనా దొరికితే బాగుండు ననిపించింది. పోనీ చొక్కాలు అమ్ముకుంటే? చిరిగిన చొక్కాలు ఎవ్వరూ తీసుకోరనే అధైర్యం వెంటనే తగిలింది. బిచ్చమెత్తుకుంటే? హోటలు ముందు రోజూ బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ల దురవస్థ అతనికి వచ్చింది. వెళ్లగొట్టేముందు పని చేసిన జీతమైనా కట్టిస్తే బాగుండేది. రెండు సంవత్సరాలు చేసిన చాకిరీ అయినా యజమానికి గుర్తురాలేదు. ఎన్నడూ లేనిది ఈ మధ్యనే తిరగబడటం ఎక్కువైంది. కెలికి కయ్యం పెట్టుకోవాలని వుంటుంది. పట్నమంతా ఒకటే పనిగా తిరగాలని వుంటుంది.

ఏమీ తోచక వచ్చిన దారి పట్టాడు. తాను తిరిగిన రోడ్డుపై దీపాలు పెట్టివున్నాయి. పైన ఆకాశం మబ్బులతో పచ్చిగర్భిణిలా వుంది. వాన వస్తుందన్న భయమేసి, వడివడిగా నడిచాడు. వంద అడుగులు వేశాడో లేదో చినుకులు ప్రారంభమైనాయి. రాము వెంటనే ఒక కొట్టు చూరు కిందికి చేరుకున్నాడు. కొట్టులోని దీపాల వెలుతురులో రకరకాల చీరెలు జిగేలు మంటున్నాయి. రంగుచీరలన్నింటిని కప్పుకొని, వాటి మెత్తదనాన్ని ఆనందిస్తూ ఆ కొట్టులోనే పడుకోవాలనిపించింది. కాని కొట్టువాడి లావుపాటి శరీరం చూచి భయమేసింది. వర్షం ఎక్కువవుతున్నది. ఆకలి కలవర పెడుతున్నది. కాని వానతెరల్లోంచి వీధి దీపాలు ముచ్చటగా కనబడుతున్నాయి. ఏ హోటల్‌కైనా వెళ్లి తిరిగి సర్వర్‌గా చేరితే? చీరెల కొట్టువాడు కొట్టు కట్టేసే సన్నాహంలో ఉన్నాడు. దూరాన ఎక్కడో ఒక కుక్క ఏడుస్తున్నది. ఆకలి వేసి కాబోలు. కుక్కమోస్తరు ఆకలికి మనిషి ఎందుకు ఏడ్వడు? అయినా ఈ అర్ధరాత్రి ఉద్యోగం ఎవరిస్తారని? తిరిగి తన హోటల్‌కి వెళ్లి ఏ సర్వర్‌నైనా పట్టెడన్నం కోసం బతిమాలడం మంచిదనిపించింది. యజమాని రాత్రిపూట హోటల్‌లో ఉండడు. కొట్టువాడు కొట్టు మూశాడు. కొట్టు ముందుభాగం గుడ్డి చీకటిలో మునిగింది. కొట్టువాడు కారెక్కి యింటికి వెళ్లిపోయాడు. వర్షం యింకా కురుస్తూనే వుంది. చలి ఎక్కువవుతున్నది. రాము చంకలోని చొక్కాలు తీసి ఒకదానిపైన ఒకటి తొడుక్కున్నాడు. వర్షం వెలిసే సూచన కనబడలేదు. రెండు గంటలయింది. ఆకలికి పేగులు అరుస్తున్నాయి. హోటల్‌కి వెళ్లటం అసాధ్యమనిపించింది. ఉన్న రెండు బట్టలు తడుపుకోవడానికి మనస్సు ఒప్పుకోలేదు. కొట్టుముందే ఆకలి పడక వేయడానికి నిశ్చయించుకున్నాడు. కప్పుకున్న ధోవతి తీసి కింద పరిచాడు. ఇంతలోకే తడుస్తూ ఒక కుక్కకూన కొట్టు కప్పుకిందికి పరుగెత్తుకొచ్చింది. దాన్ని వెళ్లగొట్టే ఉద్దేశంతో కడుపులో ఒక తన్ను తన్నాడు. కుంయిమని ఒకమాటు వెలుపలకు వెళ్లి, వానకి తిరిగి లోపలికి వచ్చింది. దాని అవస్థ చూచి జాలి వేసింది. తనకు ఎదురుగా వున్న మూలకి నక్కి పడుకుంది. చేసేదేమీ లేక, ధోవతి మీద మేను వాల్చాడు. మిగిలిన యింకొక ధోవతి కప్పుకున్నాడు.

కళ్లు పొడుచుకున్నా నిద్ర రావడం లేదు. చలీ, ఆకలీ పోటీలు పడుతున్నాయి. వాటి తాకిడికి రోడ్డు దీపాల వంక చూస్తూ లొంగిపోతున్నాడు. జ్వరంతో శరీరం సలసల కాగుతున్నది. అయిదు, పది, యిరవై నిమిషాలు గడిచాయి. కుక్కకూన లేచి వచ్చి రాము పక్కలో పడుకుంది. రాము కుడి చెయ్యి అనాలోచితంగా కుక్కపైన పడి, దాని తల నిమరడం మొదలుపెట్టింది. కూన మరీ దగ్గరికి జరిగింది. రాము కళ్లు బరువుగా మూతలు పడ్డాయి. ఆడకోతి కిచకిచలు, రిక్షా చక్రాల గజ్జెలు, గాలిలో ఎగురుతున్న పమిటలు, అతని చెవుల్లో గలగలా మోగినై. కొట్లో కనిపించిన రంగురంగుల చీరెలు కప్పుకుంటూ నిద్రలో మునిగాడు. కొంతసేపటికి వాన వెలిసింది. కుక్కపిల్ల అతని చెయ్యి తప్పించుకుని తిరిగి వీధి కెక్కింది.

భాస్కరభట్ల కృష్ణారావు (1918– 1966) కథ ‘నవ్వుల గజ్జెలు’కు సంక్షిప్త రూపం ఇది. వయసుకు వస్తున్న ఒక కుర్రాడి మానసిక అవస్థ ఇందులో చిత్రితమైంది. సౌజన్యం: తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన ‘పరిసరాలు’. 1940–50 మధ్య వచ్చిన వివిధ రచయితల కథల్ని వట్టికోట ఆళ్వారుస్వామి రెండు సంపుటాలుగా వెలువరించారు. 1956లో దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన వీటిని ఒకే సంపుటంగా తె.సా.అ. గతేడాది తెచ్చింది. కథకుడు, నవలా రచయిత భాస్కరభట్ల ఆలిండియా రేడియోలో పనిచేశారు. కృష్ణారావు కథలు, చంద్రలోకానికి ప్రయాణం, వెన్నెల రాత్రి పేరుతో కథాసంపుటాలు వచ్చాయి. ‘వెల్లువలో పూచిక పుల్లలు’ ఆయనకు పేరుతెచ్చిన నవల. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement