పదహారు, పదిహేడో శతాబ్దాలలో బానిసలుగా అమెరికాకి తీసుకురాబడ్డ ఆఫ్రికన్లకు అమెరికన్ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది. ఎన్నో పోరాటాల తరవాత ఇప్పటికీ వీళ్లు సమానత్వం, అస్తిత్వాల కోసం ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ అని పోరాడాల్సి రావటం, శతాబ్దాలు మారినా కరడుగట్టిన జాత్యహంకారం కరగకపోవడం నేటి నిజాలు.
అమెరికాలో పొలీసు, న్యాయ వ్యవస్థలు ఆఫ్రో–అమెరికన్లపై చూపిన విద్వేషం, చేసిన హింస ఒక ప్రత్యేక చరిత్ర. ప్రపంచంలోని అన్ని దేశాలలోకన్నా, అమెరికాలోని జైళ్లలోనే అత్యధిక సంఖ్యలో నేరస్తులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వారిలో సింహభాగం ఎవరన్నది ఊహించడం కష్టం కాదు. ఆఫ్రో–అమెరికన్, లాయర్ అయిన బ్రయాన్ స్టీవెన్‌సన్ వృత్తిరీత్యా తను వాదించిన కొన్ని కేసుల విశేషాలనూ, న్యాయ వ్యవస్థలో తెచ్చిన, తేవలసిన మార్పులనూ ప్రస్తావిస్తూ, ఆఫ్రో–అమెరికన్ల వ్యథార్త జీవితాలలోని విషాదాలను తన జీవితంతో సమాంతరంగా చెప్పిన ఆత్మకథ ఈ ‘జస్ట్ మెర్సీ’.
పేదరికం, అభద్రతల మధ్య గడిచిన బ్రయాన్ బాల్యం, న్యాయశాస్త్రం చదవటానికి కాలేజీలో చేరడంతో మలుపు తిరుగుతుంది. కాలేజీ సెలవులప్పుడు అట్లాంటాలోని ఒక సంస్థలో చేరిన బ్రయాన్ మరణశిక్ష విధించబడిన ఖైదీని చూడటానికి జైలుకి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు గమనించిన అతనికి, న్యాయవాదిగా తను చేయాల్సిన పనిపట్ల స్పష్టత ఏర్పడి, ఆ ధ్యేయంతోనే న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేస్తాడు. చదువు ముగించిన బ్రయాన్, దక్షిణ అమెరికాలో జాతివివక్ష ఎక్కువగా ఉన్న అలబామా రాష్ట్రంలో, మరణశిక్షలు విధింపబడిన పేద, ఆఫ్రో అమెరికన్స్ కోసం ఉచితంగా పనిచేసే సంస్థను స్థాపించి న్యాయవాద వృత్తిని మొదలుపెడతాడు.
చేయని తప్పుకి మరణశిక్ష విధించబడి జైల్లో మగ్గుతున్న వాల్టర్ అనే ఆఫ్రో అమెరికన్ నేపథ్యంగా కథనం సాగినా, మరిన్ని వ్యథాభరిత జీవన వాహినులు పుస్తకమంతా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక హత్య కేసులో వాల్టర్‌ని ఇరికించి, హత్య జరిగిన సమయంలో వాల్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న సాక్ష్యాన్ని పట్టించుకోని పోలీసులు, వాల్టరే హత్య చేసినట్టు దొంగసాక్ష్యాలు సృష్టించి కోర్టులో అతనిని దోషిని చేస్తారు. హతురాలు అమెరికన్ యువతి కావటంతో వాల్టర్‌కి మరణశిక్ష పడుతుంది– ‘కాపిటల్ పనిష్మెంట్ అంటే కాపిటల్ లేనివారికి ఇచ్చే పనిష్మెంట్’ అని బ్రయాన్ స్నేహితుడు వ్యంగ్యంగా అన్నట్టు. వాల్టర్ పక్షాన బ్రయాన్ వాదనలు విన్న కోర్టు, కేసును పునఃపరిశీలించి వాల్టర్ శిక్షలన్నింటినీ రద్దుచేస్తుంది. పక్షపాత వైఖరి, ఉదాసీనత, నిర్లక్ష్యాల మూలంగా వెలువడే ఆధార రహిత తీర్పులు, వాటిపట్ల సమాజం ప్రదర్శించే తటస్థత, ఉపేక్ష సరి కావనీ, సరైన న్యాయం అందకపోతే నల్లజాతి మొత్తం నిర్వీర్యం అవుతుందన్న ఆవేదన బ్రయాన్ మాటల్లో ధ్వనిస్తుంది.
అమెరికన్ సివిల్ వార్ సమయంలో వచ్చిన బానిసత్వ నిర్మూలన కాగితాల మీద మాత్రమే అందించిన సంపూర్ణ స్వేచ్ఛ, పౌరసత్వం– ఇవేవీ ఆఫ్రో–అమెరికన్లకు భద్రత నివ్వలేదనీ, వారి జీవితాల్లోని విషాదాలనీ, జీవితాల మీద అరాచకాలను ఆపలేదనీ జిమ్‌క్రో న్యాయసూత్రాల నేపథ్యంలో వివరిస్తాడు రచయిత. వాదించిన కేసులూ, స్టేట్/ఫెడరల్ న్యాయ వ్యవస్థల్లో ఉన్న తేడాలూ, ఆఫ్రో–అమెరికన్లకు వ్యతిరేకంగా వెలువడిన తీర్పులూ, జడ్జీలలోనూ జ్యూరీలలోనూ తక్కువ శాతంలో కనిపించే ఆఫ్రో–అమెరికన్ల గురించీ ప్రస్తావిస్తాడు రచయిత.
వ్యాపార ధోరణితో నడిచే ప్రైవేట్ జైళ్లు, ప్రేమించిన నేరానికి జరిగిన లించింగ్‌లు, పిల్లలు కూడా పెద్దల కోర్టులలోనే విచారింపబడి పెరోల్ లేని జీవిత ఖైదులు అనుభవించటం, వాళ్లని కరడుగట్టిన నేరస్తులుండే పెద్దల జైళ్లకే తరలించడం, విచ్ఛిన్నమైన కుటుంబాలు, గృహహింస, పేదరికం, బాల్యమే తెలియని పసిపిల్లల జీవితాలు, జైళ్లలో అత్యాచారాలకి గురవుతున్న స్త్రీలూ– ఈ అణచివేతల్లోని వెతలు మనిషిలో అడుగంటిపోయిన వివేకాన్ని ప్రశ్నిస్తాయి. బ్రయాన్ తన సంస్థ ద్వారా వారికి చేస్తున్న సేవ, చూపిస్తున్న త్రోవ కొంతమేరకు కొత్త వూపిరి. బ్రయాన్ అన్నట్టు ‘‘పరస్పరం అన్న మానవ భావనకి అతీతంగా ఏ సంపూర్ణత్వమూ సిద్ధించదు.’’ ఈ పుస్తకం ఆధారంగా ఇదే పేరుతో 2019లో సినిమా కూడా వచ్చింది.
- పద్మప్రియ (నవల: జస్ట్ మెర్సీ, రచన: బ్రయాన్ స్టీవెన్‌సన్, ప్రచురణ: వన్ వల్డ్; 2015)
Comments
Please login to add a commentAdd a comment