
రచయితకంటే ఆలోచనాపరుడిగా ఎక్కువగా కనిపిస్తాడు మిషిమా యుకియొ (1925–70).
అ–క్రమంగా ఉన్నదాన్ని ఒక క్రమంలోకి తేవడమే కళాకారుడి పనిగా భావించాడు. ‘ఎలా ఉన్నదో’ కాదు, ‘ఎలా ఉండాలో’ ముఖ్యం. పదాల మీద మిషిమాకు అమితమైన విశ్వాసం. ఒక చక్రవర్తి తన ఖడ్గంతో ప్రపంచాన్ని జయించినట్టే, ఒక కవీశ్వరుడు తన పదాలతో జయించాలని తలపోశాడు. ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మాస్క్’, ‘ద టెంపుల్ ఆఫ్ ద గోల్డెన్ పెవిలియన్’, ‘ద బ్లూ పీరియడ్’, ‘ఆఫ్టర్ ద బాంక్వెట్’ నవలలూ, ‘సన్ అండ్ స్టీల్’ ఆత్మకథా వ్యాసం ఆయన రచనల్లో కొన్ని.
20వ శతాబ్దపు జపాన్ ఉత్తమ రచయితల్లో ఒకడిగా నిలిచిన మిషిమా– దర్శకుడు, నటుడు, మోడల్‌గానూ కొనసాగాడు.
చిన్నతనంలో నానమ్మ దగ్గర పెరిగాడు మిషిమా. ఒంటరిగా ఉండేవాడు. మనిషి చేతన, బౌద్ధిక జ్ఞానం అందుకోలేని ప్రతిదాని పట్ల ఆయనకు భయం. ప్రతిదీ మాటల్లో చెప్పగలిగినప్పుడే దాని మీద పట్టు ఉంటుందని నమ్మాడు. మాటలకు అతీతమైన సంగీతం అన్నా భయమే. ఏ క్షణమైనా బోనును బద్దలుగొట్టుకుని మీద పడే వన్యమృగంలా అది తోచేది(చిత్రంగా, సంగీతం పట్ల ఒక స్త్రీ భయం ఎలా పోయిందో ‘ద మ్యూజిక్’లో రాశాడు. సంగీతం ఇక్కడ జడత్వానికి ప్రతీక).
సమాజం కూడా అలాంటి వన్యమృగంలానే కనబడింది. దాన్ని క్రమంలోకి తేవడానికి సాహిత్యం సరిపోదనిపించింది. శరీరాన్ని ధారవోశాడు. ‘మీటరు ఛాతీ’ పెంచాడు. జాతీయవాదిగా మారి తతెనొకాయ్ పేరుతో ప్రైవేటు సేనను స్థాపించాడు. యుద్ధానికి ముందటి చక్రవర్తి అధికారాలను తిరిగి నిలబెట్టే యోచనతో 1970లో తన సహచరులతో తంత్రంతో సైనిక స్థావరం మీద దాడి చేశాడు. అది విఫలమవడంతో జపాన్ సమురాయ్‌లు గౌరవంగా మన్నించే సంప్రదాయ ఆత్మహత్య ‘సెప్పుకు’(హరాకిరి)కు పాల్పడ్డాడు, తను రాస్తున్న నవల చివరి భాగం ‘ద డికే ఆఫ్ ద ఐంజిల్’ పూర్తిచేసి, నిజమైన సమురాయ్ మృత్యువును ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలని నమ్మి.