ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్‌స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్‌స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్‌ను కలిసి సీజర్‌ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్‌ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్‌ను చూస్తాడు.
తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్‌ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్‌ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్‌ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్‌ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్‌పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు.
‘సీజర్‌కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్‌వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్‌ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్‌ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్‌స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది.
వాండ్రంగి కొండలరావు
Comments
Please login to add a commentAdd a comment