Best book
-
బతుకు కంటే వాస్తవమైంది నటన
ఎవరైనా– మన లోపలి సమస్త కల్మషాన్ని స్వీకరించి మనల్ని నిత్యం చిరునవ్వుతూ ఉండేలా చేస్తే? రోజురోజుకీ మన పెరిగే వయసును స్వీకరించి మనల్ని ఎల్లప్పుడూ నవయౌవనంలో ఉండేలా చేస్తే? డోరియన్ గ్రేకు అట్లాంటి మహదవకాశం వస్తుంది. అతడి తప్పులనూ వృద్ధాప్యాన్నీ స్వీకరించేలా ఒక అరుదైన చిత్రాన్ని గీస్తాడు కళాకారుడు బేసిల్ హాల్వార్డ్. ఇక, ఏ నియమాలకూ లొంగనక్కర్లేని, ఏ మృత్యువుకూ భయపడనక్కర్లేని గొప్ప అందగాడైన డోరియన్ గ్రే తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఏదో ఒక దశలో తనకు బదులుగా తన చిత్తరువు పొందుతున్న వికృతరూపాన్ని చూసుకున్నాక ఏమయ్యాడు? ఇదీ స్థూలంగా ఐరిష్ రచయిత ఆస్కార్ వైల్డ్ నవల ‘ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ (1890). దీన్ని తెలుగులోకి డోరియన్ గ్రేగా బెల్లంకొండ రామదాసు అనువదించారు. గొప్పగానూ, తీవ్రంగానూ, విపరీతంగానూ అనిపించే ఆ పుస్తకంలోని కొన్ని పంక్తులు ఇక్కడ. అయితే గ్రహించవలసింది ఇవి ఆయా పాత్రల అంతరంగ తీరును బట్టి పలికేవని. లోకంలో మనల్ని గురించి నలుగురూ చెప్పుకోవటం కంటే అధ్వాన్నమైంది ఒకటే ఉంది– అది మనల్ని గురించి ఎవరూ చెప్పుకోకుండా ఉండటం. మేధస్సు సన్నగిల్లినవాళ్లే వాదనలోకి దిగుతారు. ప్రేమ పట్ల విశ్వాసం గలవాళ్లకు దాని లోతుపాతులు తెలియవు. దాని పై మెరుపులే తెలుస్తాయి. విశ్వాసం లేనివారికే ప్రేమ యొక్క వైఫల్యాలూ, విషాదాంతాలూ తెలుస్తాయి.జీవితంలో అలసిపోయినప్పుడు పురుషులు పెళ్లాడుతారు. ఔత్సుక్యం వల్ల స్త్రీలు పెళ్లాడుతారు. ఇద్దరి ఆశలూ విఫలమవుతాయి. మనల్ని మనం మోసం చేసుకోవడంతో మన ప్రేమ ప్రారంభిస్తుంది. ఇతరులను మోసం చెయ్యడంతో అంతమవుతుంది. దీన్నే ప్రపంచం ‘ప్రణయం’ అనే పేరుతో పిలుస్తూ ఉంటుంది. అభివృద్ధి ఆగిపోయిన జీవితం తప్ప మరే జీవితమూ పాడైనట్టు కాదు. నీవు ఒక వ్యక్తిని పాడుచెయ్యాలంటే అతన్ని సంస్కరించు చాలు. వివాహమంటే ఏమిటి? ఆడి తప్పని ప్రతిజ్ఞ. సంస్కారం గల ఏ వ్యక్తి అయినా తను నివసించేనాటి నైతిక ప్రమాణాన్ని ఒప్పుకున్నాడంటే అంతకంటే అవినీతి మరొకటి లేదు. స్త్రీలు మనల్ని గొప్ప కళాఖండాలు సృష్టించడానికి ప్రేరేపిస్తారు. కాని అవి పూర్తికాకుండా మనకు అవరోధాలవుతారు. బ్రతుకు కంటే వాస్తవమైంది నటన. ప్రేమ కళకంటే అద్భుతమైంది. మనం ఎవరిని లెక్క చెయ్యమో వారిపట్ల దయగా ఉంటాం. మనం ఒక విచిత్రమైన యుగంలో నివసిస్తున్నాం. విజ్ఞానం నశించేటంత చదువూ, అందం నశించేటంత ఆలోచనా ఉన్న యుగం ఇది. ఒక ఉద్వేగం నుంచి విముక్తి పొందడానికి సంవత్సరాల తరబడి కాలం కావలసింది ఒక్క వ్యర్థులకు మాత్రమే. పరిపక్వత పొందిన వారికి అంతకాలం అనవసరం. తనపై తనకు స్వాధీనతగల వ్యక్తి ఒక కొత్త ఆనందాన్ని ఎంత సులువుగా కనిపెట్టగలడో అంత సులువుగా ఒక దుఃఖాన్ని సమాప్తి చేసుకోగలడు. -
ఏడు తరాలు
అలెక్స్ హేలీ ఇంగ్లిష్‌లో రాసిన నవల ‘రూట్స్’. దీన్ని ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి తెలుగులోకి అనువదించారు. ఇందులో కుంటా కింటే అనే ఆఫ్రికా యువకుణ్ని అమెరికావాసులు కిడ్నాప్ చేసి బానిసల వేలంపాటలో అమ్మివేస్తారు. అమెరికాలో దుర్భర బానిస జీవితం గడిపే కుంటా రోదన ఒకవైపూ, కొడుకు ఏమయ్యాడో తెలియని తల్లిదండ్రుల వేదన మరోవైపూ మనల్ని కంటతడి పెట్టిస్తాయి. 16,17వ శతాబ్దంలో యూరప్, అమెరికావాళ్లు ముందస్తుగా పారిశ్రామిక విప్లవం సాధించి, ఇతర దేశాల ప్రజలందరినీ ఎలా ఏడిపించారనే దానికి ఈ నవల బలమైన సాక్ష్యం. కుంటా బానిస జీవితం గడుపుతూ తోటి బానిస స్త్రీ బెల్‌ను వివాహం చేసుకుంటాడు. పుట్టిన కూతురికి వాళ్ల జేజమ్మ పేరు కిజ్జీ అని పెట్టుకుంటాడు. బానిస జీవితాన్ని ఏవగించుకుంటూనే జీవితాన్ని ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ అమెరికా శ్వేత జాతీయులు కుంటా జీవితంలో మరోసారి నిప్పులు పోస్తారు. కిజ్జీ ఎవరినో ప్రేమించి బానిస జీవితం నుంచి తప్పించుకోజూసిందని అందుకు శిక్షగా ఆమెను తండ్రి నుంచి దూరం చేసి బానిసల గుంపుతో దూరప్రాంతానికి పంపిస్తారు. బలవంతుల దుర్మార్గానికి చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై, ఇప్పుడు అదే దుర్మార్గుల వల్ల కన్నకూతురు దూరమవుతుంటే గుండె పగిలి కుంటా నిర్జీవుడైపోతాడు. కథ అంతటితో ఆగదు. కిజ్జీ ఇంకో శ్వేత జాతీయుడికి ఉంపుడుగత్తెగా కొడుకు జార్జ్‌ను కంటుంది. జార్జ్ కూడా బానిసగా పెరిగి పెద్దవాడై, మద్యపానం, కోళ్లపందేలు వంటి వ్యసనాలతో జీవిస్తాడు. కోళ్ల జార్జ్ అని పేరు తెచ్చుకుంటాడు. ఆయన పిల్లల్లో ఒకడు టామ్. టామ్ పెరిగేనాటికి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవుతాడు. మనుషులంతా ఒక్కటేనని బానిసత్వాన్ని రద్దు చేశాడు. దీన్ని సహించలేని ప్రత్యర్థుల చేతిలో హత్య గావించబడ్డాడు. లింకన్ పుణ్యమా అని లక్షల మంది ఆఫ్రికన్ అమెరికన్లు బానిసత్వం నుంచి విముక్తి పొందారు. టామ్‌కు కూడా స్వేచ్ఛ లభించింది. టామ్ వడ్రంగిగా జీవితం కొనసాగించి ఎనిమిది మంది పిల్లల్ని కంటాడు. అందులో ఒక కూతురు సింథియా. ఈమె కూతురు బెర్తా. ఈమె కొడుకు ఎలెక్స్ హేలీ. ఈ హేలీ తన జీవిత మూలాలను వెతుక్కుంటూ ఆఫ్రికా వెళ్లి 17వ శతాబ్దం నాటి తన తాతల ముత్తాత కుంటా జీవితాన్ని 19వ శతాబ్దంలో మన ముందుంచాడు. ఈ పుస్తకం చదివిన తరవాత నాకు తెల్సిన విషయం ఏమిటంటే, జ్ఞానం వున్న ప్రతివాడూ ధర్మాత్ముడు కాలేడు. కాని దయగల ప్రతివాడూ ధర్మాత్ముడవుతాడు. ప్రపంచానికి జ్ఞానం అవసరమే కానీ దయలేని జ్ఞానం వల్ల కీడే కానీ మేలు జరగదనీ, కావున మనిషన్నవాడు దయ కలిగి వుండాలనీ ఇటు ఏడుతరాల, అటు ఏడుతరాల పెద్ద మనుషుల అభిమతం ఇదేనని నమ్ముతూ ఇంతటితో విరమిస్తున్నాను. -పి.శాలిమియ్య -
రసార్ణవ సుధాకరము
రాచకొండ ప్రభువులు యుద్ధతంత్రంలో ఎంత గొప్పవారో సాహిత్యరంగంలోనూ అంతటి ప్రవీణులు. ‘సర్వజ్ఞ’ బిరుదమున కన్వర్థమైన వారు. వీరిలో సింగభూపాలుడు (1425–75) స్వయంగా రసార్ణవ సుధాకరమనే గొప్ప అలంకార శాస్త్రాన్ని రచించటమే గాక– శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరానికి సంగీత సుధాకరమనే వ్యాఖ్యను రచించి– రత్నపాంచాలిక (కువలయావళి) అనే నాటకాన్ని, కందర్ప సంభవమనే భాణాన్ని(నాటకభేదము) రచించినాడు. అమరకోశానికి వ్యాఖ్య వ్రాసిన బొమ్మకంటి అప్పయార్యుడు, చమత్కార చంద్రిక, వీరభద్ర విజృంభణము మొదలగు వానిని రచించిన విశ్వేశ్వరకవి, ఈయన శిష్యుడు విష్ణుపురాణాంధ్రీకర్త నాగనాథుడు, ఈ ఆస్థానం వారే కావటం విశేషం. సాహిత్య తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి అలంకార శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. దీన్నే కావ్యశాస్త్రం, సౌందర్యశాస్త్రం అని కూడా వ్యవహరిస్తారు. కావ్య శోభాసంబంధి సమస్త విషయాలను తెల్పుతుంది కాబట్టి దీనికి అలంకార శాస్త్రమనే పేరు వచ్చింది. మన భాషకు వ్యాకరణం బహిః ప్రాణం. సాహిత్య శాస్త్రం అంతః ప్రాణంగా వుండి మొదటిది శబ్దశుద్ధిని, రెండవది శబ్దార్థ రామణీయకతను తెల్పుతున్నాయి. సింగభూపాలుడు సాహిత్య రంగాన్ని బాగా పరిశీలించిన తర్వాతనే రసార్ణవ... రచనకు ఉపక్రమించినాడు. భరతుడు నాటకానికి వస్తువు ముఖ్యమనగా– సింగభూపాలుడు చమత్కృతి జనకవస్తువు నాటకానికి ముఖ్యమనే అభిప్రాయం కలవాడు. అంతేగాక భరతుడు చెప్పని సంధ్యంతరాలను చెప్పినాడు. ఒక విధంగా రసార్ణవ... రచన తెలంగాణంలోని ‘నాటకం’ కేంద్రంగా వచ్చిన అలంకార శాస్త్రం. రసార్ణవ సుధాకరం మొత్తం 3 ఉల్లాసాల పరిమితం. ఇవి, రంజకోల్లాస, రసికోల్లాస, భావకోల్లాసములనే సార్థకనామంగా ఉన్నాయి. ప్రథమ విలాసంలో– తన వంశానువర్ణన చేస్తూ చతుర్థ వర్ణానికి గౌరవమాపాదించే యుపపత్తులు చూపి తన వంశ పూర్వుడైన యాచమనాయకునితో ఆరంభించి 40 శ్లోకాలతో పూర్తి చేసి చాలా విషయాలను తెల్పి– అనంతరం నాట్యవేదోత్పత్తి, నాట్యలక్షణం, రసలక్షణాలను సంక్షేపంగా తెల్పి నాయకానాయికా ప్రకరణాలను విపులంగా లక్ష్యలక్షణాలతో వివరించినాడు. ద్వితీయ విలాసమైన రసికోల్లాసంలో– వ్యభిచారి భావాలు, స్థాయి రస, రసాభాస మొదలైనవి సోదాహరణంగా విపులంగా చెప్పబడినవి. మూడవ విలాసంలో– దశరూపక వివరణం, సంధి, సంధ్యాంగాది రూపక సామగ్రి వివరణం, సంస్కృత ప్రాకృత భాషా ప్రయోజనం తెల్పి సత్కావ్య ప్రశంసతో గ్రంథాన్ని పూర్తి చేసినాడు. ఈ కృతి అర్ణవరూపరస వివేచనకు సుధాకరుని వంటిదగుట వలన దీనికి రసార్ణవ సుధాకరమనే పేరు తగియున్నది. రసార్ణవ సుధాకరాన్ని ప్రప్రథమంగా తెలుగు లిపిలో ప్రచురించిన (1895) కీర్తి వెంకటగిరి సంస్థానాధిపతులకే దక్కుతుంది. 1950 సం.లో పిఠాపురం మహారాజ డాక్టర్ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దర్ గార్డెన్ ప్రెస్, మద్రాసు–5లో ముద్రణ చేయించినారు. ప్రస్తుత ముద్రణమునకు ఈ ప్రతియే ముఖ్యాధారము. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా సుధాకర పునర్దర్శనం కావటం ఆనందదాయకం. - శ్రీరంగాచార్య సర్వజ్ఞ సింగభూపాల విరచితం ‘రసార్ణవ సుధాకరము’ను శ్రీరంగాచార్య సంపాదకుడిగా తెలంగాణ సాహిత్య అకాడమి పునర్ముద్రించింది. పేజీలు: 584; వెల: 250. ఇది క్లుప్త సంపాదకీయ వ్యాఖ్య. -
జూలియస్ సీజర్
ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్ను కలిసి సీజర్‌ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్ను చూస్తాడు. తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్‌ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్‌పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు. ‘సీజర్కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్‌ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్‌ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది. వాండ్రంగి కొండలరావు -
సినిమా.. పందెపు గుర్రమా?
ఆరు దశాబ్దాలకుపైగా సినీ పత్రికా రచనలో ఉన్న ఎనిమిది పదుల అనుభవ జ్ఞుడు నందగోపాల్. సినిమా ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పరిణామాలనూ, సినీ సాంకేతిక శాఖల్లో వచ్చిన మార్పులనూ, ప్రత్యేకించి తెలుగు సినీ అనుభవాలనూ ఈ నిత్య విద్యార్థి పుస్తకరూపంలో తెచ్చారు. తాజా జాతీయ అవార్డుల్లో ‘ఉత్తమ గ్రంథం’గా ఎంపికైన ఈ రచన నుంచి కొన్ని ముచ్చట్లు... పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక సిబ్బందికి గొడుగు లాంటి స్డూడియో వ్యవస్థ ఏనాడో కూలిపోయింది. ‘స్టార్’ చుట్టూ కథలు తిరిగాయి. బేరసారాలు జరిగాయి. అప్పటివరకూ నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు - చిత్రనిర్మాణంలో లాభనష్టాలలో పాలుపంచుకునేవారు. డిస్ట్రిబ్యూటర్ స్థానే బయ్యర్లు రంగ ప్రవేశం చేశారు. ఇది తమిళనాడులో ప్రారంభమై మనకు వ్యాపించింది. ‘సినిమా అనేది ఈనాడు (క్షమించండి) వ్యాపారమూ కళా రెండూ కాకుండా పోయింది. సినిమా తీయటం అనేది ‘గుర్రపు పందెం లాంటిది’ అనే భావం జనంలో సర్వత్రా వ్యాపించింది. ఈ దొమ్మీలో, ఈ పందెంలో ఎందరి జేబులో పోతున్నాయి. ఏదో ఒక్క జేబు మాత్రమే నిండుతున్నది’ అన్నారు దుక్కిపాటి మధుసూదనరావు. హాలీవుడ్లో నిర్మాతకు 8 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. అదే ఇక్కడ 18 శాతం. డబ్బు విషయం వస్తే నవతా కృష్ణంరాజు మాట గుర్తుకు వస్తుంది. 1977లో ఓ మాట అన్నారు - ‘‘మా రోజుల్లో మంచి కథ ఎవరు రాస్తారు? ఎక్కడ దొరుకుతుందని వెతికేవాళ్ళం. నేడు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారిలో అధిక భాగం ఫైనాన్సియర్ అడ్రసు అడుగుతున్నారు’’ అని! నిర్మాత నవతా కృష్ణంరాజు గదిలో ఆయనకు ఎదురుగా సత్యజిత్ రే, సుందరయ్య చిత్రపటాలుండేవి. అవి ఆయన జీవిత దృక్పథానికి దర్పణాలు. ‘భువన సుందరి కథ’ (1967) షూటింగ్లో ఓ రోజున నిర్మాత తోట సుబ్బారావు, దర్శకుడు సి. పుల్లయ్యతో ‘గురువుగారూ! అందరూ స్పీడ్‌గా తీస్తున్నారు. మనం కూడా స్పీడ్ పెంచుదాం సార్’ అన్నారు. దానికి సి. పుల్లయ్య ‘‘నీ ‘పరమానందయ్య శిష్యుల కథ’ నేనే తీశాను. అది 100 రోజులు ఆడింది. అది ఏ స్పీడ్‌లో తీశామో, అదే స్పీడ్‌లో ఇదీ తీస్తున్నాం. సినిమాకూ, కెమెరాకూ ఓ స్పీడ్ ఉంది. సెకనుకు 24 ఫ్రేములు, ఇక్కడ నేను స్పీడ్ పెంచినా అక్కడ థియేటర్లో ప్రొజెక్టరులో ఫిలిం స్పీడ్‌గా తిరగదు. అదీ సెకనుకు 24 ఫ్రేములే తిరుగుతుంది. సినిమా అంటే పందెపు గుర్రం కాదు. స్పీడ్ కావాలంటే నన్ను మార్చుకో’’ అంటూ పైపంచ భుజాన వేసుకున్నారు. ముప్ఫై ఏళ్ల సినీ జీవితంలో బియన్ తీసింది 11 చిత్రాలే. వాటిలో ఓ మణిపూస ‘బంగారుపాప’ (1954). కరకు కసాయిగా మారిన వ్యక్తిలో ఓ అనాథ పాప మానవతను మేల్కొల్పటం ఇతివృత్తం. చిత్రం ఆర్థికంగా నిరాశ పరచింది. కానీ ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకం అందుకుంది. దేవకీ బోస్, బియన్ ఇద్దరూ ఆత్మీయ మిత్రులు. బియన్ వద్దన్నా వినకుండా దేవకీ బోస్ ‘బంగారు పాప’ను బెంగాలీలో ‘సోనార్ కాఠీ’ పేరుతో తీశారు. అక్కడా చిత్రం ఫ్లాపే. ‘దేవకీబోస్ నుండి రీమేక్ హక్కుల కింద ఒక్క రూపాయి తీసుకున్నా. కానీ నా దురదృష్టం బెంగాల్ దాకా ప్రయాణిస్తుందనుకోలేదు’ అన్నారు బి.యన్ నాతో! తెలుగు సినిమా పత్రికా రంగానికీ ఓ స్వర్ణయుగం ఉంది. ఈ యుగాన్ని ప్రభావితం చేసిన ప్రతిభామూర్తులు కమలాకర కామేశ్వరరావు, కొడవటిగంటి, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు. సినిమా సమీక్షకు ఓ నమునా ఏర్పరచారు. కొన్ని ప్రమాణాలు నెలకొల్పారు. 1953 నుండి బొమ్మకంటి ‘ఆంధ్రప్రభ వారపత్రిక’లో పనిచేస్తూ ఉండేవారు. సినిమా విలేకరిగా, విమర్శకునిగా. 1954 లో విజయా వారి ‘చంద్రహారం’ విడుదలైంది. అపుడు ‘ఆంధ్రప్రభ’ ప్రకటనల విభాగం (అడ్వర్టయిజింగ్ సెక్షన్) అధిపతి, బొమ్మకంటితో ‘చంద్రహారం సమీక్షలో చూసీ, చూడనట్లు పొండి. ఘాటు తగ్గించండి, విజయా నుండి బోలెడు ప్రకటనలు రానున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి’ అన్నాడు. సమీక్షకు బదులు తన ఉద్యోగానికి రాజీనామా పత్రం పంపారు యాజమాన్యానికి - ఆదర్శ కలం జీవి బొమ్మకంటి సుబ్బారావు. సినిమాలో రావలసిన మార్పుకు వైతాళికుడు ఫిల్మ్ క్రిటిక్.