సినిమా.. పందెపు గుర్రమా?
ఆరు దశాబ్దాలకుపైగా సినీ పత్రికా రచనలో ఉన్న ఎనిమిది పదుల అనుభవ జ్ఞుడు నందగోపాల్. సినిమా ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పరిణామాలనూ, సినీ సాంకేతిక శాఖల్లో వచ్చిన మార్పులనూ, ప్రత్యేకించి తెలుగు సినీ అనుభవాలనూ ఈ నిత్య విద్యార్థి పుస్తకరూపంలో తెచ్చారు. తాజా జాతీయ అవార్డుల్లో ‘ఉత్తమ గ్రంథం’గా ఎంపికైన ఈ రచన నుంచి కొన్ని ముచ్చట్లు...
పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక సిబ్బందికి గొడుగు లాంటి స్డూడియో వ్యవస్థ ఏనాడో కూలిపోయింది. ‘స్టార్’ చుట్టూ కథలు తిరిగాయి. బేరసారాలు జరిగాయి. అప్పటివరకూ నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు - చిత్రనిర్మాణంలో లాభనష్టాలలో పాలుపంచుకునేవారు. డిస్ట్రిబ్యూటర్ స్థానే బయ్యర్లు రంగ ప్రవేశం చేశారు. ఇది తమిళనాడులో ప్రారంభమై మనకు వ్యాపించింది. ‘సినిమా అనేది ఈనాడు (క్షమించండి) వ్యాపారమూ కళా రెండూ కాకుండా పోయింది. సినిమా తీయటం అనేది ‘గుర్రపు పందెం లాంటిది’ అనే భావం జనంలో సర్వత్రా వ్యాపించింది. ఈ దొమ్మీలో, ఈ పందెంలో ఎందరి జేబులో పోతున్నాయి. ఏదో ఒక్క జేబు మాత్రమే నిండుతున్నది’ అన్నారు దుక్కిపాటి మధుసూదనరావు.
హాలీవుడ్‌లో నిర్మాతకు 8 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. అదే ఇక్కడ 18 శాతం. డబ్బు విషయం వస్తే నవతా కృష్ణంరాజు మాట గుర్తుకు వస్తుంది. 1977లో ఓ మాట అన్నారు - ‘‘మా రోజుల్లో మంచి కథ ఎవరు రాస్తారు? ఎక్కడ దొరుకుతుందని వెతికేవాళ్ళం. నేడు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారిలో అధిక భాగం ఫైనాన్సియర్ అడ్రసు అడుగుతున్నారు’’ అని! నిర్మాత నవతా కృష్ణంరాజు గదిలో ఆయనకు ఎదురుగా సత్యజిత్ రే, సుందరయ్య చిత్రపటాలుండేవి. అవి ఆయన జీవిత దృక్పథానికి దర్పణాలు.
‘భువన సుందరి కథ’ (1967) షూటింగ్‌లో ఓ రోజున నిర్మాత తోట సుబ్బారావు, దర్శకుడు సి. పుల్లయ్యతో ‘గురువుగారూ! అందరూ స్పీడ్‌గా తీస్తున్నారు. మనం కూడా స్పీడ్ పెంచుదాం సార్’ అన్నారు. దానికి సి. పుల్లయ్య ‘‘నీ ‘పరమానందయ్య శిష్యుల కథ’ నేనే తీశాను. అది 100 రోజులు ఆడింది. అది ఏ స్పీడ్‌లో తీశామో, అదే స్పీడ్‌లో ఇదీ తీస్తున్నాం. సినిమాకూ, కెమెరాకూ ఓ స్పీడ్ ఉంది. సెకనుకు 24 ఫ్రేములు, ఇక్కడ నేను స్పీడ్ పెంచినా అక్కడ థియేటర్‌లో ప్రొజెక్టరులో ఫిలిం స్పీడ్‌గా తిరగదు. అదీ సెకనుకు 24 ఫ్రేములే తిరుగుతుంది. సినిమా అంటే పందెపు గుర్రం కాదు. స్పీడ్ కావాలంటే నన్ను మార్చుకో’’ అంటూ పైపంచ భుజాన వేసుకున్నారు.
ముప్ఫై ఏళ్ల సినీ జీవితంలో బియన్ తీసింది 11 చిత్రాలే. వాటిలో ఓ మణిపూస ‘బంగారుపాప’ (1954). కరకు కసాయిగా మారిన వ్యక్తిలో ఓ అనాథ పాప మానవతను మేల్కొల్పటం ఇతివృత్తం. చిత్రం ఆర్థికంగా నిరాశ పరచింది. కానీ ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకం అందుకుంది. దేవకీ బోస్, బియన్ ఇద్దరూ ఆత్మీయ మిత్రులు. బియన్ వద్దన్నా వినకుండా దేవకీ బోస్ ‘బంగారు పాప’ను బెంగాలీలో ‘సోనార్ కాఠీ’ పేరుతో తీశారు. అక్కడా చిత్రం ఫ్లాపే. ‘దేవకీబోస్ నుండి రీమేక్ హక్కుల కింద ఒక్క రూపాయి తీసుకున్నా. కానీ నా దురదృష్టం బెంగాల్ దాకా ప్రయాణిస్తుందనుకోలేదు’ అన్నారు బి.యన్ నాతో!
తెలుగు సినిమా పత్రికా రంగానికీ ఓ స్వర్ణయుగం ఉంది. ఈ యుగాన్ని ప్రభావితం చేసిన ప్రతిభామూర్తులు కమలాకర కామేశ్వరరావు, కొడవటిగంటి, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు. సినిమా సమీక్షకు ఓ నమునా ఏర్పరచారు. కొన్ని ప్రమాణాలు నెలకొల్పారు. 1953 నుండి బొమ్మకంటి ‘ఆంధ్రప్రభ వారపత్రిక’లో పనిచేస్తూ ఉండేవారు. సినిమా విలేకరిగా, విమర్శకునిగా. 1954 లో విజయా వారి ‘చంద్రహారం’ విడుదలైంది.
అపుడు ‘ఆంధ్రప్రభ’ ప్రకటనల విభాగం (అడ్వర్టయిజింగ్ సెక్షన్) అధిపతి, బొమ్మకంటితో ‘చంద్రహారం సమీక్షలో చూసీ, చూడనట్లు పొండి. ఘాటు తగ్గించండి, విజయా నుండి బోలెడు ప్రకటనలు రానున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి’ అన్నాడు. సమీక్షకు బదులు తన ఉద్యోగానికి రాజీనామా పత్రం పంపారు యాజమాన్యానికి - ఆదర్శ కలం జీవి బొమ్మకంటి సుబ్బారావు. సినిమాలో రావలసిన మార్పుకు వైతాళికుడు ఫిల్మ్ క్రిటిక్.