
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. సినీ ఇండస్ట్రీలో కుంభస్థలం అంటే ఆస్కారే (Oscars 2025)! ఎన్ని సినిమాలు తీసినా, ఎన్నింటిలో నటించినా, ఎన్నో యేళ్లుగా పని చేస్తున్నా.. ఒక్కసారైనా ఆస్కార్‌ను ముద్దాడాలని తహతహలాడేవారు ఎంతోమంది. కానీ అంతటి అదృష్టం అందరికీ వరించదు.. కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది.
అగ్నిమాపక సిబ్బందికి సలాం
అలా ఈసారి 97వ అకాడమీ అవార్డు వేడుకల్లో పలువురూ పురస్కారాలు అందుకున్నారు. అనోరా ఉత్తమచిత్రంగా నిలిచి సెన్సేషన్ దృష్టించింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ వేడుక జరిగింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజిల్స్ నగరం మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే! దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది వారాల తరబడి కృషి చేశారు. అందుకుగానూ వారిని ఆస్కార్ వేదికపై ప్రశంసించారు.
భారత ప్రేక్షకుల కోసం స్పెషల్ స్పీచ్
అలాగే ఈ విపత్తు వల్ల 29 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరికోసం విరాళాలు సేకరించనున్నట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత, కమెడియన్ కోనన్ ఓబ్రీన్ హిందీలో మాట్లాడటం విశేషం. భారత ప్రజలకు నమస్కారాలు.. అక్కడ ఉదయం అయింది కాబట్టి అల్పాహారం భుజిస్తూ ఆస్కార్‌ను వీక్షించండి అని హిందీలో వెల్‌కమ్ స్పీచ్ ఇచ్చాడు.
(చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా')
ఖరీదైన గిఫ్ట్ బ్యాగులు
ఇక ఆస్కార్ గెలిచినవారికి ట్రోఫీ తప్ప ఏదీ అందదు. నామినీలకు మాత్రం 'ఎవ్రీబడ్ విన్స్' పేరిట విలువైన గిఫ్ట్ బ్యాగులు అందుతాయి. ఈ బహుమతులకు అకాడమీతో ఎటువంటి సంబంధం ఉండదు. డిస్టింక్టివ్ అసెట్స్ అనే కంపెనీ గత 22 ఏళ్లుగా క్రమం తప్పకుండా వీటిని బహుకరిస్తోంది. ఆస్కార్ హోస్ట్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో నామినేట్ అయినవారికి మాత్రమే ఈ బ్యాగ్ ఇస్తారు.
ఒక్క బ్యాగులో 60 బహుమతులు
ఒక్కో బ్యాగు విలువ సుమారు రూ.1.92 కోట్లు ఉంటుందని సమాచారం. అందులో రూ.20 వేల విలువైన కటింగ్ బోర్డు నుంచి లక్షలు విలువ చేసే కూపన్ల వరకు ఉంటాయి. మాల్దీవుల్లో విడిది చేసేందుకు రూ.20 లక్షల మేర కూపన్, ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసేందుకు రూ.4 లక్షలు, మైసన్ కన్‌స్ట్రక్షన్ ద్వారా గృహ ఆధునీకరణ ప్రాజెక్ట్ కోసం రూ.43 లక్షలు ఇస్తారు. రూ.33.7 లక్షలు విలువ చేసే కాస్మొటిక్ ట్రీట్‌మెంట్స్ కూపన్స్ ఉంటాయి. ఇలా దాదాపు 60 వరకు బహుమతులు ఉంటాయి.
Good attempt, but frankly, Conan totally butchered the Hindi greeting! #Oscars #Oscars2025 pic.twitter.com/v83eWj23H8
— Sanjay Kalra, Digital Transformation Sherpa™️ (@sanjaykalra) March 3, 2025