తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ.
Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx
— The Academy (@TheAcademy) December 21, 2021
అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.
ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..