హాలీవుడ్ చిత్రంలో ఓ పాత్రకు డబ్బింగ్
హాలీవుడ్ చిత్రంలో ఓ పాత్రకు డబ్బింగ్
Published Fri, Aug 30 2013 12:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
ఉత్తరాది భామ తాప్సీ దక్షిణాదిన ఏ స్థాయిలో రాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చేతిలో మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇటీవల ఓ అరుదైన అవకాశం వచ్చింది. హాలీవుడ్ చిత్రం ‘రిడ్డిక్’లో కటీ సాకాఫ్ పోషించిన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం అది. విన్ డీసిల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ మూడు భాషల్లో ఎవరైనా ప్రముఖ తారతో కటీ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని భావించారట. తెలుగు, తమిళ భాషల్లో తాప్సీకి కావల్సినంత ప్రాచుర్యం ఉంది. ఈ మధ్యకాలంలో నటిస్తున్న తెలుగు చిత్రాల్లో తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారామె. తెలుగు ఎలాగూ చెప్పారు కాబట్టి.. తమిళ్ చెప్పడం కష్టమేం కాదు.
ఇక, ఈ బ్యూటీ పుట్టి, పెరిగింది ఢిల్లీలో కాబట్టి హిందీ సునాయాసంగా మాట్లాడేస్తారు. ‘చష్మే బద్దూర్’ ద్వారా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తాప్సీతో డబ్బింగ్ చెప్పించాలనుకుని ఉంటారు. ఇలాంటి అవకాశం రావడం ఇదే మొదటిసారి అని, కచ్చితంగా మూడు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పగల సమర్థత తనకుందని తాప్సీ అంటున్నారు. అయితే షూటింగ్స్ వరుసగా ఉండటంతో డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలా? అని ఆలోచిస్తున్నారట.
Advertisement
Advertisement