
రాచకొండ ప్రభువులు యుద్ధతంత్రంలో ఎంత గొప్పవారో సాహిత్యరంగంలోనూ అంతటి ప్రవీణులు. ‘సర్వజ్ఞ’ బిరుదమున కన్వర్థమైన వారు.
వీరిలో సింగభూపాలుడు (1425–75) స్వయంగా రసార్ణవ సుధాకరమనే గొప్ప అలంకార శాస్త్రాన్ని రచించటమే గాక– శార్‌జ్ఞదేవుని సంగీత రత్నాకరానికి సంగీత సుధాకరమనే వ్యాఖ్యను రచించి– రత్నపాంచాలిక (కువలయావళి) అనే నాటకాన్ని, కందర్ప సంభవమనే భాణాన్ని(నాటకభేదము) రచించినాడు.
అమరకోశానికి వ్యాఖ్య వ్రాసిన బొమ్మకంటి అప్పయార్యుడు, చమత్కార చంద్రిక, వీరభద్ర విజృంభణము మొదలగు వానిని రచించిన విశ్వేశ్వరకవి, ఈయన శిష్యుడు విష్ణుపురాణాంధ్రీకర్త నాగనాథుడు, ఈ ఆస్థానం వారే కావటం విశేషం.
సాహిత్య తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి అలంకార శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. దీన్నే కావ్యశాస్త్రం, సౌందర్యశాస్త్రం అని కూడా వ్యవహరిస్తారు. కావ్య శోభాసంబంధి సమస్త విషయాలను తెల్పుతుంది కాబట్టి దీనికి అలంకార శాస్త్రమనే పేరు వచ్చింది. మన భాషకు వ్యాకరణం బహిః ప్రాణం. సాహిత్య శాస్త్రం అంతః ప్రాణంగా వుండి మొదటిది శబ్దశుద్ధిని, రెండవది శబ్దార్థ రామణీయకతను తెల్పుతున్నాయి.
సింగభూపాలుడు సాహిత్య రంగాన్ని బాగా పరిశీలించిన తర్వాతనే రసార్ణవ... రచనకు ఉపక్రమించినాడు. భరతుడు నాటకానికి వస్తువు ముఖ్యమనగా– సింగభూపాలుడు చమత్కృతి జనకవస్తువు నాటకానికి ముఖ్యమనే అభిప్రాయం కలవాడు. అంతేగాక భరతుడు చెప్పని సంధ్యంతరాలను చెప్పినాడు. ఒక విధంగా రసార్ణవ... రచన తెలంగాణంలోని ‘నాటకం’ కేంద్రంగా వచ్చిన అలంకార శాస్త్రం.
రసార్ణవ సుధాకరం మొత్తం 3 ఉల్లాసాల పరిమితం. ఇవి, రంజకోల్లాస, రసికోల్లాస, భావకోల్లాసములనే సార్థకనామంగా ఉన్నాయి. ప్రథమ విలాసంలో– తన వంశానువర్ణన చేస్తూ చతుర్థ వర్ణానికి గౌరవమాపాదించే యుపపత్తులు చూపి తన వంశ పూర్వుడైన యాచమనాయకునితో ఆరంభించి 40 శ్లోకాలతో పూర్తి చేసి చాలా విషయాలను తెల్పి– అనంతరం నాట్యవేదోత్పత్తి, నాట్యలక్షణం, రసలక్షణాలను సంక్షేపంగా తెల్పి నాయకానాయికా ప్రకరణాలను విపులంగా లక్ష్యలక్షణాలతో వివరించినాడు.
ద్వితీయ విలాసమైన రసికోల్లాసంలో– వ్యభిచారి భావాలు, స్థాయి రస, రసాభాస మొదలైనవి సోదాహరణంగా విపులంగా చెప్పబడినవి. మూడవ విలాసంలో– దశరూపక వివరణం, సంధి, సంధ్యాంగాది రూపక సామగ్రి వివరణం, సంస్కృత ప్రాకృత భాషా ప్రయోజనం తెల్పి సత్కావ్య ప్రశంసతో గ్రంథాన్ని పూర్తి చేసినాడు.
ఈ కృతి అర్ణవరూపరస వివేచనకు సుధాకరుని వంటిదగుట వలన దీనికి రసార్ణవ సుధాకరమనే పేరు తగియున్నది.
రసార్ణవ సుధాకరాన్ని ప్రప్రథమంగా తెలుగు లిపిలో ప్రచురించిన (1895) కీర్తి వెంకటగిరి సంస్థానాధిపతులకే దక్కుతుంది. 1950 సం.లో పిఠాపురం మహారాజ డాక్టర్ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దర్ గార్డెన్ ప్రెస్, మద్రాసు–5లో ముద్రణ చేయించినారు. ప్రస్తుత ముద్రణమునకు ఈ ప్రతియే ముఖ్యాధారము. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా సుధాకర పునర్దర్శనం కావటం ఆనందదాయకం.
- శ్రీరంగాచార్య
సర్వజ్ఞ సింగభూపాల విరచితం ‘రసార్ణవ సుధాకరము’ను శ్రీరంగాచార్య సంపాదకుడిగా తెలంగాణ సాహిత్య అకాడమి పునర్ముద్రించింది.
పేజీలు: 584; వెల: 250.
ఇది క్లుప్త సంపాదకీయ వ్యాఖ్య.