షేక్‌స్పియర్‌ నోట అన్నమయ్య పాట | Annamayya Nanati Bathuku Comparison To Shakespeare Poem | Sakshi
Sakshi News home page

షేక్‌స్పియర్‌ నోట అన్నమయ్య పాట

Published Mon, Nov 30 2020 12:19 AM | Last Updated on Mon, Nov 30 2020 12:21 AM

Annamayya Nanati Bathuku Comparison To Shakespeare Poem - Sakshi

తెలుగునాట తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించిన అన్నమాచార్యులు  సంస్కృతాంధ్ర భాషల్లో రచించిన వేల పదకవితలు పండితులను, పామరులను రంజింపజేశాయి. తత్త్వసంకీర్తనలు గానం
చేస్తూ, తంబురమీటుతూ పురవీధులలో, తిరువీధులలో నాట్యం చేశాడు అన్నమయ్య. ఆనాటి వేద వాఙ్మయం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్ని ప్రక్రియల్లో కనిపించే మానవతాధర్మాలు
అన్నమయ్య పదాలలో  గమనించవచ్చు. 

‘నానాటి బతుకు నాటకము/ కానక కన్నది కైవల్యము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్ట నెదుట గల దీ ప్రపంచము/ కట్ట గడపటిది కైవల్యము/ కుడిచే దన్నము కోక చుట్టెడిది/ నడ మంత్రపు పని నాటకము/ వొడి గట్టుకొనిన వుభయ కర్మములు/ గడి దాటినపుడె కైవల్యము/ తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక/ గగనము మీదిది కైవల్యము’ అన్నాడు అన్నమయ్య. ఎదుట కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలం, దానిపై మానవుల అశాశ్వతమైన బతుకు నాటకమేనని ఉద్బోధించాడు. మనిషి పుట్టడం నిజం, మరణించడం నిజం, ఈ మధ్య జరుగుతున్న బతుకు కేవలం నాటకం; ఈ జనన మరణచక్రం ఎక్కడ ఆగుతుందో అదే కైవల్యము అన్నాడు.

అన్నమయ్య తదనంతరం 16వ శతాబ్దిలో బ్రిటన్‌లో జన్మించిన షేక్‌స్పియర్‌ నటుడిగా, నాటకకర్తగా, కవిగా ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచాడు. ఆయన నాటకాల్లో ‘యాజ్‌ యు లైక్‌ ఇట్‌’ ఒకటి.
ఇందులో ప్రేమకథను సుఖాంతంగా చిత్రించాడు. మానవ జీవితాంకాలు దశలుగా విభజించి నాటక రంగంలోని పాత్రలవలె మనిషి ఎలా జీవిస్తాడో షేక్‌స్పియర్‌ ఇందులో చెబుతాడు. The whole world is a
stage, and all the men and women merely actors. They have their exits and their entrances, and in his lifetime a man will play many parts... ప్రపంచమంతా ఒక నాటక రంగం. స్త్రీ పురుషులందరూ అందులో కేవలం పాత్రధారులు. వారి వారి ప్రవేశాలు, నిష్క్రమణలు వారికుంటాయి. ఒక మనిషి తన జీవితకాలంలో అనేక పాత్రల్ని పోషిస్తాడు’ అంటాడు షేక్‌స్పియర్‌.

భగవంతుడు ఈ అఖండ విశ్వాన్ని రంగస్థలముగా చేసి, అందులో మానవులకు వారి కర్మలనుబట్టి పాత్రలను కల్పించి, పావులుగా కదుపుతూ వారి జీవితాలతో ఆడుతున్న వింత నాటకమే ఈ
జగన్నాటకం అని ఇద్దరు మహాకవులూ విశదపరిచారు. విభిన్న దేశాలలో, విభిన్న కాలాలలో జీవించినప్పటికీ, వారి భాషలు వేరైనప్పటికీ వారి భావమొక్కటే. వీరిద్దరి పద, పద్య పాదాలను పరిశీలిస్తే
అన్నమయ్య తెలుగుపాటే షేక్‌స్పియర్‌ కవితగా మారిందా అనిపిస్తుంది.
-యానాద్రి
97018 57260

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement