రాజంపేట : అధికార దుర్వినియోగం అంటే ఇదేనేమో..ఏకంగా రాజంపేట పట్ట నడిబొడ్డులో ఉన్న అన్నమయ్య అతిథి గృహం కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్నమయ్య అతిథి గృహం రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తోంది. ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారులు వస్తారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ ప్రత్యేక నిధులు వెచ్చించి అతిథి గృహం తీర్చిదిద్దారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ టీడీపీ నియోజకవర్గనేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ అతిధి భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఆయన నేరుగా తన వాహనంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం చేరుకోగా, వెనువెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఇంకేముంది ఏకంగా.. సమావేశాలు, మంతనాలు కొనసాగించారు. ప్రోటోకాల్ పరంగా కూడా ఆర్‌అండ్‌బీ గదిని కేటాయించే వీలులేదు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రితోపాటు ప్రజాప్రతినిధులకు కోరిన మేరకే గదిని కేటాయిస్తారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు సుగవాసికి గదిని ఏ విధంగా అనుమతించారో తెలియడంలేదని స్థానికులు పెదవివిరిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులు కూడా వచ్చి బొకేలు, సన్మానాలు చేసి పోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
కారు ఢీకొని ఒకరు మృతి
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లె వద్ద బుధవారం రాత్రి మోటార్ సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..వినాయక చవితి విగ్రహాల కొనుగోలుకు తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన నాని(22) మరొకరితో కలిసి మోటార్ సైకిల్‌పై బుధవారం రాత్రి కంటేవారిపల్లెకు వచ్చారు. విగ్రహాలను చూసిన అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో బి.కొత్తకోట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో నాని అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు రఘునాయక్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కృష్ణా జట్టు ఘనవిజయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–19 అంతర్ జిల్లాల మల్టీ డేస్ క్రికెట్ టోర్నమెంట్‌లో కృష్ణా జట్టు విజయం సాధించగా, నెల్లూరు–కడప, చిత్తూరు–పశ్చిమగోదావరి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 122 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కృష్ణా జట్టు 57.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులో నిఖిల్ 62, ధనుష్ 56 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 36.5 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో థామస్ రామ్ 39, రోహిత్ కుమార్ 33 పరుగులు చేశారు. కృష్ణా బౌలర్ రాజేష్ 7 వికెట్లు తీయగా, సాయిప్రకాష్ 2 వికెట్లు తీశాడు. దీంతో కృష్ణా జట్టు 122 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కృష్ణా జట్టు 219 పరుగులు చేయగా, శ్రీకాకుళం జట్టు 137 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
నెల్లూరు, కడప మ్యాచ్ డ్రా..
కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 334 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన నెల్లూరు జట్టు 98 ఓవర్లలో 415 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని మన్విత్‌రెడ్డి 193 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కడప బౌలర్లు ధీరజ్ 3, ఆర్ధిత్‌రెడ్డి 2, నాగకుల్లాయప్ప 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. జట్టులోని గురుచరణ్ 45, సాయిచేతన్ 54 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్ మోహన్ 2, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment