Julius Caesar
-
శేషం ‘0’ వస్తే లీపు సంవత్సరమేనా?
ఏడాదికి 365 రోజులు.. ఏ రోజు.. ఏ పని చేయాలో మనలో చాలా మంది క్యాలెండర్లో టిక్ చేసుకుని పెట్టుకుంటారు... అదే లీప్ ఇయర్ అయితే.. ఏడాదిలో ఒక్కరోజు అదనంగా వచ్చి చేరుతుంది... 365 రోజుల క్యాలెండర్ కాస్తా 366 తేదీలతో కళకళలాడుతుంది.. ఈ ఏడాది ఆ ప్రత్యేకమైన రోజు శనివారం రావడంతో స్పెషల్ డే కాస్తా చాలామందికి హాలిడే అయిపోయింది. అయితేనేం నాలుగేళ్లకొకసారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ అరుదైన రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనే వారి ఆనందం రెట్టింపైంది. అంతేకాదు సర్చ్ ఇంజన్ గూగుల్.. ఈసారి ‘జంపింగ్ డూడుల్’తో లీప్ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా... అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది.. ఈ ఎక్స్ట్రా డే వెనుక ఉన్న వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం. అందుకే 29 రోజులు మానవాళి మనుగడ సాగించే భూ గ్రహం.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపు 365.2422 రోజుల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో 365 రోజుల కాలాన్ని సాధారణంగా ఒక సంవత్సరంగా పేర్కొంటారు. అయితే, 365 మీద ఉన్న 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. ఇదంతా కలిసి, నాలుగేళ్లకు 24 గంటలు అంటే ఒక రోజు అవుతుంది. అలా మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్లో చేర్చుతారు. ఇలా అదనపు రోజు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరంగా పిలుస్తారు. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. లీపు సంవత్సరంలో 29 రోజులుంటాయి. రోమన్ చక్రవర్తి జూలియన్ సీజర్ కాలంలో లీపు సంవత్సరం ప్రారంభమైంది. క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత.. క్రీస్తు పూర్వం 45లో జూలియన్ సీజర్ నాలుగేళ్లకోసారి.. ఈ అదనపు రోజును క్యాలెండర్లో చేర్చాడు. అయితే క్రీస్తుశకం 1582లో జూలియన్ క్యాలెండర్ రూపకల్పనలో పదిరోజుల వ్యత్యాసం రావడంతో.. పోప్ గ్రెగరీ 13 కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అందులో ఒకరోజు అధికంగా వచ్చే సంవత్సరానికి ‘లీప్ సంవత్సరం’గా నామకరణం చేశాడు. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ చేర్చి దానిని అధికారికంగా క్యాలెండర్లో చేర్చాడు. శేషం 0 అయితే లీపు సంవత్సరమేనా? నాలుగుతో భాగిస్తే శేషం 0 వచ్చే సంవత్సరం లీపు ఇయర్ అవుతుందని చాలామంది భావిస్తారు. అయితే శేషం వచ్చిన ప్రతీ ఏడాది లీప్ ఇయర్ కాదు. ఉదాహరణకు 2100ను 4తో భాగిస్తే శేషం 0 అయినప్పటికీ అది లీపు సంవత్సరం కాదు. ఎందుకంటే... మనం చెప్పుకొన్నట్లుగా భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. ఇందులో మనం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ, నిజానికి 365.2422ను కచ్చితంగా లెక్కిస్తే.. అంతా కలిసి 400 ఏళ్లలో మూడు రోజులు అవుతాయి. అలా నాలుగు శతాబ్దాల్లోని మూడు రోజుల వ్యత్యాసం భర్తీ అయ్యేక్రమంలో.. మూడు లీపు సంవత్సరాలు మిస్సవుతాయి. ఇక ఫిబ్రవరి 29న జన్మించిన వారిని లీప్ లింగ్స్ లేదా లీపర్స్ అని పిలుస్తారు. వీరు అందరిలా ఏడాదికోసారి కాకుండా.. నాలుగేళ్లకు ఓసారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. మనిషి సగటు ఆయుష్షు 60 ఏళ్లు అనుకుంటే వీరు కేవలం 15సార్లు మాత్రమే బర్త్‌డే కేక్ కట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం పైన చెప్పుకొన్నట్లు మిస్సైన మూడు లీపు సంవత్సరాల్లోని ఏడాదిలో వస్తే మరో బర్త్‌డే సెలబ్రేషన్ కూడా మిస్సవుతారు. వాతావరణ పరంగా లీప్ ఇయర్లో గుర్తుంచుకోదగిన రోజులు హాటెస్ట్ లీప్డే: 1940(టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలు) కోల్డెస్ట్ లీప్డే: 1956(-66 డిగ్రీ ఫారెన్హీట్లు, అలస్కా) వెట్టెస్ట్ లీప్డే: 1984(21 ఇంచుల వర్షపాతం- హవాయి) స్నోయియెస్ట్ లీప్డే: 1944(33 ఇంచుల హిమపాతం- కాలిఫోర్నియా) -
జూలియస్ సీజర్
ఎప్పుడో నాలుగు శతాబ్దాల క్రితం షేక్స్పియర్ రాసిన చారిత్రక విషాదాంత నాటకం ‘జూలియస్ సీజర్’ నేటికీ ప్రదర్శితమవుతోంది. పాత్రల స్వరూప స్వభావాలను లోతుగా అధ్యయనం చేసి బరువైన సంభాషణలతో ఈ నాటకం రాశారు షేక్స్పియర్. సీజర్ గొప్ప వీరుడు. రోమ్ సైన్యాధిపతిగా ఉన్న సీజర్ ఓసారి ఆఫ్రికా నుంచి రోమ్ నగరానికి విజయగర్వంతో వస్తాడు. మార్గమధ్యంలో ఓ జ్యోతిష్కుడు ఎదురై ‘మార్చి 15వ తేదీ వస్తోంది, జాగ్రత్త’ అని హెచ్చరిస్తాడు. మూఢనమ్మకాలంటే గిట్టని సీజర్ ఆ మాటల్ని కొట్టేస్తాడు. సీజర్ బలపడుతున్నాడనీ, నియంతగా మారతాడనీ, గణతంత్రానికి గండి పడుతుందనీ భయపడిన వాళ్లలో బ్రూటస్ ఒకడు. రోమ్ నగర పెద్దలలో ఒకడైన కేషియస్... బ్రూటస్ను కలిసి సీజర్‌ను హతమార్చడమే తక్షణ కర్తవ్యమని బ్రూటస్ను సన్నద్ధం చేస్తాడు. మానవ స్వభావాన్ని అవపోసన పట్టిన సీజర్ ఓసారి బ్రూటస్ పక్కనే వున్న కేషియస్ను చూస్తాడు. తనకు ఆప్తుడైన ఆంటోనీతో ‘ఆ కేషియస్ను చూశావా? బక్కపలుచని శరీరం ఉన్నవాళ్లు, ఆకలిచూపుల వాళ్లు, ఎప్పుడూ అదేపనిగా ఆలోచిస్తుండేవాళ్లు, నవ్వలేనివాళ్లు, సంగీతాన్ని మెచ్చుకోలేనివాళ్లు ఎంతో ప్రమాదకరమైనవాళ్లు’ అంటాడు.సీజర్ హత్య జరగబోయే ముందురోజు రాత్రి అతని భార్య కాల్ఫూర్నియా ఓ పీడకల కంటుంది. సీజర్‌ను హత్య చేస్తున్నారు అని మూడుసార్లు బిగ్గరగా అరుస్తుంది. సెనేట్ సమావేశానికి గైర్హాజరు కమ్మని విన్నవిస్తుంది. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారే చవిచూస్తారు. ప్రమాదం కంటే సీజర్ ప్రమాదకారి’ అంటూ సీజర్ జవాబిస్తాడు. సీజర్ సెనేట్ మందిరానికి వెళ్తాడు. కుట్రదారులు కత్తితో పొడుస్తారు. బ్రూటస్ది చివరి కత్తిపోటు. ‘బ్రూటస్ నువ్వు కూడానా’ అంటూ సీజర్ ప్రాణాలు విడుస్తాడు. సీజర్ అంత్యక్రియలకు ముందు ఓ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బ్రూటస్, సీజర్‌పై నాకు ద్వేషం లేదు, అతనికి అధికార కాంక్ష పెరిగింది, ఆయన బతికివుంటే నియంతగా మారతాడు, మీరంతా బానిసలు అవుతారని వివరిస్తాడు. ఇంతలో ఆంటోనీ, సీజర్ పార్థివదేహాన్ని తీసుకొని వస్తాడు. ‘సీజర్కు మూడు సార్లు కిరీటం ఇచ్చినా తిరస్కరించాడు. ఇదేనా సీజర్ అధికార దాహం’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. నేను బ్రూటస్వంటి మాటకారినైతే సీజర్ గాయాలతో మాట్లాడించగలను, రోమ్ రాళ్లతో ప్రతిఘటించగలను అంటాడు. మేం తిరగబడతాం, అంటూ మృతదేహం వద్ద గుమికూడిన ప్రజలు గర్జిస్తారు. ఇదిలావుండగా ఆంటోనీ బలపరాయణుడని గుర్తించిన బ్రూటస్ భార్య పోర్షియా నిప్పులు మింగి చనిపోతుంది. తర్వాత ఆంటోనీ, బ్రూటస్ వర్గాల మధ్య పోరు సాగుతుంది. సీజర్‌ను పొడిచిన కత్తితోనే నౌకరు చేత పొడిపించుకుని కేషియస్ చనిపోతాడు. బ్రూటస్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోతాడు. అంతిమ విజయం ఆంటోనీ, అతని మిత్రుడు ఆక్టేవియస్ సీజర్‌ను వరిస్తుంది. ఆక్టేవియస్ రోమన్ సామ్రాజ్యాధిపతి అవుతాడు. గగుర్పాటు కలిగించే విధంగా అన్ని పాత్రలనూ తన శైలీ సంభాషణలతో షేక్స్పియర్ తీర్చిదిద్దిన నాటకం ఇది. వాండ్రంగి కొండలరావు -
సీజర్ అంటే ఏమనుకున్నావ్..?
‘‘పురుషులందు పుణ్యపురుషులు..’’ అంటారు పెద్దలు. ఈ మాటకు వేర్వేరు అర్థాలు వాడుకలో ఉన్నా..ఎప్పటికప్పుడు మహానుభావులు మనకు ఎదురవుతూనే ఉంటారు. వీరు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో వారికే ఓ పట్టాన బోధపడదు. ‘కిక్’ సినిమాలో కథానాయకుడిలా ఏదో ఒక వింత పని చేయందే వీరికి కిక్కుండదు. క్రీస్తు పూర్వం చివరిదశ కాలానికి చెందిన రోమన్ జనరల్ జూలియస్ సీజర్ కూడా అలాంటివాడే..! ప్రాచీన రోమన్ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, సైన్యాధిపతి అయిన ‘జూలియస్ సీజర్’ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకొంటారు చరిత్రకారులు. ఇతడు రాజనీతి వ్యవహారాల్లోనే గాక లాటిన్ భాషలో గద్య కవిత్వం రాయడంలోనూ దిట్ట. ఈయన గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..! క్రీ.పూ.75వ సంవత్సరంలో ప్రస్తుత గ్రీసు, టర్కీల మధ్యనున్న ఏజియన్ సముద్రం గుండా ప్రయాణిస్తున్నాడు పాతికేళ్ల సీజర్. సహాయకులు సేవలందిస్తుండగా.. ప్రకృతి అందాలను ఓడపై నుంచి చూస్తూ హాయిగా సముద్రయానం చేసేస్తున్నాడు. అలా ఓడ ఓ దీవి సమీపానికి చేరుకోగానే ఊహించని ప్రమాదం ఎదురైంది సీజర్ బృందానికి. కండలు తిరిగిన సముద్రపు దొంగలు (పైరేట్స్) ఓడను చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో సీజర్కు అర్థమయ్యేలోపే మారణాయుధాల సాయంతో అతడి బృందాన్ని బంధించి, తమ నౌకల్లోకి ఎక్కించుకున్నారు. తమను ఎందుకు బంధించారో తెలియని సీజర్.. విడుదల చేయాల్సిందిగా సముద్రపు దొంగలను కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు. ‘‘అడగ్గానే విడిచిపెట్టేయడానికి వెర్రివాళ్లలా కనిపిస్తున్నామా..? 20 టాలెంట్ల వెండి ఇస్తేనే నిన్ను విడిచిపెడతాం’’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ మొత్తాన్నీ ఇప్పటి లెక్కల్లో చెప్పుకోవాలంటే 620 కేజీలకు పైమాటే! వేరే ఎవరైనా అయితే తమ సహాయకులను పంపించి పైరేట్లు కోరిన మొత్తాన్నీ తెప్పించేవారు. కానీ, జూలియస్ సీజర్ అలా చేయలేదు. పైరేట్లను ఎగాదిగా చూస్తూ వికటాట్టహాసం చేశాడు. ‘‘ఏయ్..! సీజర్ అంటే ఏమనుకున్నారు..? ముష్టి 20 టాలెంట్ల వెండి అడుగుతారా..? నా విలువ ఎంతో తెలుసా..! కనీసం 50 టాలెంట్లు అడిగితే కానీ నా సహాయకులను పంపను’’ అంటూ పట్టుదలకు పోయాడు. సీజర్ మాటలకు సముద్రపు దొంగలు తొలుత బుర్రలు గోక్కున్నారు. అయినప్పటికీ, చేసేదేం లేక అతడు చెప్పినట్టే కానిచ్చారు. అలా, వెళ్లిన సీజర్ పరిచారకులు వెండితో తిరిగి వచ్చేసరికి 38 రోజులు పట్టింది. అయితే, ఇన్ని రోజులూ ఈ రోమ్ వీరుడు పైరేట్ల చేతిలో బందీగా ఉండాల్సింది పోయి, వారిపైనే పెత్తనం చెలాయించాడట! పైరేట్లకు కవిత్వం చెబుతూ, లాటిన్ భాషలో వ్యాసాలు రాస్తూ కాలం గడిపేశాడట. అక్కడితో ఆగక.. సముద్రపు దొంగలతో తన వ్యక్తిగత పనులనూ ఈయన చేయించుకునేవాడని చెబుతాడు చరిత్రకారుడు ప్లుటార్చ్. అలా కొద్ది రోజులు గడిచాక పైరేట్లు సీజర్ పెత్తనాన్ని తట్టుకోలేకపోయారట. అతడితో వేగలేక, సొమ్ము వచ్చినా రాకున్నా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని అతడితో చెప్పారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బందీలు ఎగిరి గంతేస్తారు. కానీ, ఈ రోమన్ జనరల్ మాత్రం చిత్రంగా ప్రవర్తించాడు. పైరేట్ల మాటలను పట్టించుకోకుండా.. ‘‘మీకు నగదు ముట్టచెప్పందే నేను ఇక్కడి నుంచి వెళ్లను..’’ అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. తీరా నగదు వచ్చాక వారికి అందిస్తూ.. ‘‘మీ అంతు చూస్తాను. మిమ్మల్నందరినీ శిలువలకు వేలాడదీస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు. చెప్పినట్టుగానే కొద్ది వారాల వ్యవధిలోనే ఒక చిన్న ఓడల సమూహాన్ని వెంటబెట్టకుని అక్కడకు చేరుకున్నాడు సీజర్. అయితే, అతడి హెచ్చరికను పెద్దగా పట్టించుకోని పైరేట్లు అక్కడే కాలక్షేపం చేస్తూ కనిపించారు. అంతే.. వారందరినీ బందీలుగా పట్టుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. పనిలో పనిగా తన 50 టాలెంట్ల వెండితో పాటు దొంగల సొత్తును సైతం వెనక్కి తీసుకొచ్చాడు. ఇన్ని చేసిన వాడు శూల దండన విధించకుండా ఉంటాడా..! ఇదంతా చూసిన అప్పటి ప్రజలు జూలియస్ సీజర్ వింత ప్రవర్తనకు నోరెళ్లబెట్టారట! భలే విచిత్రమైన వ్యక్తి కదూ..!