లీప్ ఇయర్ సందర్భంగా గూగుల్ పెట్టిన డూడుల్
ఏడాదికి 365 రోజులు.. ఏ రోజు.. ఏ పని చేయాలో మనలో చాలా మంది క్యాలెండర్‌లో టిక్ చేసుకుని పెట్టుకుంటారు... అదే లీప్ ఇయర్ అయితే.. ఏడాదిలో ఒక్కరోజు అదనంగా వచ్చి చేరుతుంది... 365 రోజుల క్యాలెండర్ కాస్తా 366 తేదీలతో కళకళలాడుతుంది.. ఈ ఏడాది ఆ ప్రత్యేకమైన రోజు శనివారం రావడంతో స్పెషల్ డే కాస్తా చాలామందికి హాలిడే అయిపోయింది. అయితేనేం నాలుగేళ్లకొకసారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ అరుదైన రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనే వారి ఆనందం రెట్టింపైంది. అంతేకాదు సర్చ్ ఇంజన్ గూగుల్.. ఈసారి ‘జంపింగ్ డూడుల్’తో లీప్ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా... అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది.. ఈ ఎక్స్‌ట్రా డే వెనుక ఉన్న వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం.
అందుకే 29 రోజులు
మానవాళి మనుగడ సాగించే భూ గ్రహం.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపు 365.2422 రోజుల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో 365 రోజుల కాలాన్ని సాధారణంగా ఒక సంవత్సరంగా పేర్కొంటారు. అయితే, 365 మీద ఉన్న 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. ఇదంతా కలిసి, నాలుగేళ్లకు 24 గంటలు అంటే ఒక రోజు అవుతుంది. అలా మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్‌లో చేర్చుతారు. ఇలా అదనపు రోజు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరంగా పిలుస్తారు. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. లీపు సంవత్సరంలో 29 రోజులుంటాయి.
రోమన్ చక్రవర్తి జూలియన్ సీజర్ కాలంలో లీపు సంవత్సరం ప్రారంభమైంది. క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత.. క్రీస్తు పూర్వం 45లో జూలియన్ సీజర్ నాలుగేళ్లకోసారి.. ఈ అదనపు రోజును క్యాలెండర్‌లో చేర్చాడు. అయితే క్రీస్తుశకం 1582లో జూలియన్ క్యాలెండర్ రూపకల్పనలో పదిరోజుల వ్యత్యాసం రావడంతో.. పోప్ గ్రెగరీ 13 కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అందులో ఒకరోజు అధికంగా వచ్చే సంవత్సరానికి ‘లీప్ సంవత్సరం’గా నామకరణం చేశాడు. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ చేర్చి దానిని అధికారికంగా క్యాలెండర్‌లో చేర్చాడు.
శేషం 0 అయితే లీపు సంవత్సరమేనా?
నాలుగుతో భాగిస్తే శేషం 0 వచ్చే సంవత్సరం లీపు ఇయర్ అవుతుందని చాలామంది భావిస్తారు. అయితే శేషం వచ్చిన ప్రతీ ఏడాది లీప్ ఇయర్ కాదు. ఉదాహరణకు 2100ను 4తో భాగిస్తే శేషం 0 అయినప్పటికీ అది లీపు సంవత్సరం కాదు. ఎందుకంటే... మనం చెప్పుకొన్నట్లుగా భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. ఇందులో మనం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ, నిజానికి 365.2422ను కచ్చితంగా లెక్కిస్తే.. అంతా కలిసి 400 ఏళ్లలో మూడు రోజులు అవుతాయి. అలా నాలుగు శతాబ్దాల్లోని మూడు రోజుల వ్యత్యాసం భర్తీ అయ్యేక్రమంలో.. మూడు లీపు సంవత్సరాలు మిస్సవుతాయి.
ఇక ఫిబ్రవరి 29న జన్మించిన వారిని లీప్ లింగ్స్ లేదా లీపర్స్ అని పిలుస్తారు. వీరు అందరిలా ఏడాదికోసారి కాకుండా.. నాలుగేళ్లకు ఓసారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. మనిషి సగటు ఆయుష్షు 60 ఏళ్లు అనుకుంటే వీరు కేవలం 15సార్లు మాత్రమే బర్త్‌డే కేక్ కట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం పైన చెప్పుకొన్నట్లు మిస్సైన మూడు లీపు సంవత్సరాల్లోని ఏడాదిలో వస్తే మరో బర్త్‌డే సెలబ్రేషన్ కూడా మిస్సవుతారు.
వాతావరణ పరంగా లీప్ ఇయర్‌లో గుర్తుంచుకోదగిన రోజులు
హాటెస్ట్ లీప్‌డే: 1940(టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలు)
కోల్డెస్ట్ లీప్‌డే: 1956(-66 డిగ్రీ ఫారెన్‌హీట్లు, అలస్కా)
వెట్టెస్ట్ లీప్‌డే: 1984(21 ఇంచుల వర్షపాతం- హవాయి)
స్నోయియెస్ట్ లీప్‌డే: 1944(33 ఇంచుల హిమపాతం- కాలిఫోర్నియా)
Comments
Please login to add a commentAdd a comment