లీప్‌ ఇయర్‌లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా.. | Prime Minister Of India Morarji Desai Profile, Biography, Political Career, Awards And Honours In Telugu - Sakshi
Sakshi News home page

Morarji Desai Life Story In Telugu: లీప్‌ ఇయర్‌లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..

Published Thu, Feb 29 2024 8:42 AM | Last Updated on Thu, Feb 29 2024 10:27 AM

Prime Ministers of India Morarji Desai Profile - Sakshi

‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. 

మొరార్జీ దేశాయ్‌ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి.

ప్రారంభ జీవితం 
మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్‌ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. 

రాజకీయ జీవితం 
1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్‌ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు.

1977లో ప్రధానిగా.. 
నవంబర్ 1969లో కాంగ్రెస్‌లో చీలిక  ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు.
 
అవార్డులు, గౌరవ పురస్కారాలు 
మొరార్జీ దేశాయ్‌  భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్‌ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement