నెహ్రూ వారసురాలిగా తెరపైకి
1966లో ప్రధానిగా బాధ్యతలు
ఐదేళ్లలోనే నలుగురు ప్రధానులు
కొత్త పార్టీలొచి్చనా సాగిన కాంగ్రెస్ హవా
కీలక మార్పులకు వేదికైన మూడో లోక్‌సభ
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్‌సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది.
పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్‌సభ కాలం వేదికగా నిలిచింది.
ఇందిరాగమనం...
పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్‌సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి.
361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి.
నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్‌బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఆకస్మిక మరణానికి గురయ్యారు.
మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్‌సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది.
చైనా, పాక్‌తో యుద్ధాలు
నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది.
భారత్‌లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్‌తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు.
సిరా చుక్కకు నాంది
ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది.
మూడో లోక్‌సభ కాలంలో ముఖ్య పరిణామాలు
► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి
► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం
► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్‌బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం
► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్‌గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం
► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం
మూడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు
(మొత్తం స్థానాలు 494)
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 361
సీపీఐ 29
స్వతంత్ర పార్టీ 18
ప్రజా సోషలిస్ట్ పార్టీ 12
భారతీయ జన సంఘ్ 14
ఇతరులు 40
స్వతంత్రులు 20
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment