
దేశంలోని ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే పలు విచిత్ర ఉదంతాలు మనకు కనిపిస్తాయి. వీటిలోని కొన్నింటిని విన్నప్పుడు మనకు ఒక పట్టాన నమ్మాలని అనిపించదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే నాటి ఎన్నికల్లో దిగ్గజనేతలైన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, నరసింహారావు ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తదుపరి 12 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో దేశానికి ప్రధానులుగా మారడం విచిత్రం.
చంద్రశేఖర్
జనతా పార్టీ నుంచి నాడు ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ తన సంప్రదాయ స్థానమైన బల్లియా(యూపీ) నుంచి పోటీకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్‌కు చెందిన జగన్నాథ్ చౌదరి 53,940 ఓట్ల తేడాతో సునాయాసంగా చంద్రశేఖర్‌ను ఓడించారు. ఆ తర్వాత 1990లో చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు.
పీవీ నరసింహారావు
కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1984లొ దక్షిణాదిలో బీజేపీ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీ జంగారెడ్డి 54,198 ఓట్ల తేడాతో నరసింహారావుపై విజయం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత సీ జంగా రెడ్డి. 1991లో నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు.
వాజ్‌పేయి
అటల్ బిహారీ వాజ్‌పేయి 1984 ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో వాజ్‌పేయి ఓటమి పాలయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1996లో దేశానికి ప్రధాని అయ్యారు.