ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం
అంతర్గత పోరుతో కుదేలైన జనతా
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్‌సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు...
‘జనతా’ బలహీనత
ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే.
ఆనియన్ ఎలక్షన్
హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం!
కాంగ్రెస్‌లో మరో చీలిక
1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర!
విశేషాలు... ఇందిర దారుణహత్య
► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్‌కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది.
► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు.
► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు.
► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు.
ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు
(మొత్తం స్థానాలు 542)
పార్టీ స్థానాలు
కాంగ్రెస్ 353
జనతా (ఎస్) 43
సీపీఎం 39
జనతా పార్టీ 31
డీఎంకే 16
కాంగ్రెస్(యూ) 13
సీపీఐ 10
ఇతరులు 28
స్వతంత్రులు 9
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment