Onion Price Hike
-
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధర వారం రోజుల నుంచి ఆకాశాన్నంటుతోంది. రాష్ట్రంలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ.. సామాన్యులకు కంటనీరు రప్పిస్తోంది. క్రమేపీ పెరుగుతున్న ఉల్లి ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు నెల రోజుల క్రితం క్వింటాల్ రూ.3000–3500 ఉండగా, ఒక్కసారిగా రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాలు దిగుమతి అవుతుండగా, ఇప్పుడు రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట వేయలేదని, అందుకే దిగుమతి తక్కువగా ఉంటోందని అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో ఆంధ్రా నుంచి ఉల్లి దిగుమతి తక్కువైందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. అక్రమార్కులపై నిఘా: కొత్తపంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్‌కు రూ. 6,000 నుంచి 8,000 వరకు ధర ఉంటుంది. నెల రోజులపాటు ఉల్లి ధర కిలో రూ.60 నుంచి 90 మధ్య ఉంటుంది. అక్రమ వ్యాపారులపై నిఘా పెట్టాం. -రవీందర్‌రెడ్డి, గ్రేడ్–3 కార్యదర్శి -
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఉల్లి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 20–25 గా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా పెరిగి సామాన్యుడి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు దిగుబడి తగ్గడంతో పాటు వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇటీవలి వరకు రూ. 20–25 లకే కేజీ ఉల్లిని విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు ఏకంగా రూ. 40–45 కు విక్రయిస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు ఉల్లి నాణ్యతను బట్టి మరింత ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని రైతులు నిల్వ చేసిన పాత ఉల్లికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో కొందరు రైతులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉన్న పంటలు నాశనమయ్యాయి. అదే సమయంలో నాటువేసిన ఉల్లి చేతికి రావాలంటే మరి కొద్ది నెలల సమయం పడుతుంది. దీంతో అప్పటి వరకు ఉల్లి కొరత తప్పదని, ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి: (రైతుకు విత్తన భరోసా) అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో కూడా వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన ఉల్లి పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. సాధారణంగా నవంబర్ మొదటి వారంలో కొత్త ఉల్లి మార్కెట్లోకి రావడం మొదలవుతుంది. కానీ, వర్షాల కారణంగా ఉల్లి పంటలకు అపార నష్టం వాటిల్లడంతో ఈసారి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతూనే ఉంటాయని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాగా, లాక్డౌన్ సమయంలో ఉల్లి ధరలు మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కేజీ ఉల్లి ధర రూ. 90–100 వరకు చేరిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ధరలు దిగిరావడంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత సుమారు ఐదారు నెలలపాటు ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ధరలు పెరగవని సామాన్యులు ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో వారి ఆశలన్ని అడియాశలు అవుతున్నాయి. -
భారీగా పెరిగిన ఉల్లి ధర
ముంబై: పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు ధరలు పెరిగి పోతుంటే ఇప్పుడు ఉల్లి గడ్డల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో కిలోకు 25-30 రూపాయలకు విక్రయిస్తున్న ఉల్లిపాయను ప్రస్తుతం కిలోకు 60-70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇలా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ఉల్లి పంట ఎక్కువగా నాశనమైంది. ఉత్పత్తి లేకపోవడం వల్ల సరఫరా కూడా తగ్గింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తుంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రెట్లుపైగా పెరిగింది. నవీ ముంబైలోని ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు 30-40 రూపాయల హోల్‌సేల్ ధరకు అమ్మేవారు. ముంబై, థానే, పూణే రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం ఉల్లిపాయ కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్గావ్లో ఉల్లిపాయల టోకు రేటు గత 10 రోజుల్లో 15శాతం నుంచి 20శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం రిటైల్ లో ఉల్లిపాయ ధర కిలోకు రూ.54గా ఉంది. మరోవైపు, డీజిల్ ధరలు నిరంతరం పెరగడం కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 73.87 రూపాయలు ఉండగా నేడు అది 78.38 రూపాయలుగా ఉంది. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
ఉల్లి ధరలపై వినూత్న నిరసన
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు రాష్ట్రంలో ఉల్లి ధరలపై రాజకీయాలు ఘాటెక్కాయి. ఉల్లి ధరల పెరుగుదలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డలతో తయారుచేసిన దండను చేపట్టి తేజస్వి యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగ సమస్యలతో సామాన్యుడు సతమతమవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు ఆహారంపై ఖర్చును భరించే స్థితిలో లేరని, చిరు వ్యాపారులను బీజేపీ దెబ్బతీసిందని తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. ఉల్లి దండలతో నిరసన తెలుపుతున్న ఫోటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఉల్లి ధర 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండగా ఉల్లి గురించి మాట్లాడిన వారంతా ఇప్పుడు కిలో 80 రూపాయలు దాటడంతో మౌనం దాల్చారని అన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఉపాథి కల్పన కీలక అంశమని పునరుద్ఘాటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : ఉచితంగా కోవిడ్ టీకా -
బాబోయ్ ధరలు!
న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్లో 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని తాకడం ఇదే ప్రథమం. రెండు శాతం అటూ, ఇటూగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రభుత్వం నిర్దేశించింది. కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆర్బీఐ .. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలనే పరిగణనలోకి తీసుకుంటుంది. ధరల పెరుగుదల భయాల కారణంగానే.. గత డిసెంబర్లో జరిగిన పరపతి విధాన సమీక్షలో మరో విడత వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆర్బీఐ కాస్త విరామమిచ్చింది. ఫిబ్రవరి 6న తదుపరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ తరుణంలో నిర్దేశించుకున్న స్థాయికి మించి ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదు కావడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్యోల్బణ గణాంకాలకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే.. ► 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో కూరగాయల ధరలు అత్యధికంగా 60.5 శాతం ఎగిశాయి. ► మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతం పెరిగింది. 2018 డిసెంబర్లో ఇది మైనస్ 2.65 శాతంగా ఉండగా, గతేడాది నవంబర్‌లో 10.01 శాతంగా ఉంది. ► పప్పుల ధరలు 15.44 శాతం, మాంసం.. చేపల రేట్లు 10 శాతం పెరిగాయి. రేట్ల కోతకు మరింత విరామం.. ఇప్పటికే ఎకానమీ మందగమనంలో ఉన్న తరుణంలో ద్రవ్యోల్బణం కూడా ఎగియడం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి ఆస్కారం లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇది స్టాగ్ఫ్లేషన్ (అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితి)కి దారి తీయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2020 ఆఖరు త్రైమాసికం దాకా రిజర్వ్ బ్యాంక్ మరో దఫా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జనవరిలో ద్రవ్యోల్బణం గణాంకాలు గణనీయంగా కరెక్షన్కు లోను కావొచ్చని, అయినప్పటికీ ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు కొన్నాళ్ల పాటు విరామం తప్పకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. -
సారీ.. నో ఆనియన్ !
సాక్షి, సనత్‌నగర్ : ఉల్లి.. ఇటు వంటింట్లోనే కాదు అటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కొండెక్కి కూర్చుంది. ధరలో సెంచరీ దాటేసిన దీనిని పట్టుకునేందుకు ఎవరి తరమూ కావట్లేదు. ఇప్పటికే ఇళ్లల్లో చాలా మటుకు ఉల్లికి స్వస్తి పలకగా, ఆ దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పయనిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా బిర్యానీలో ఉచితంగా ఇచ్చే ఆనియన్ సలాడ్‌కు ప్రత్యేక రేటు నిర్ణయించేశాయి. మరికొన్ని మొత్తంగా ఉల్లికి టాటా చెప్పేసి కీర, క్యారెట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయి. ఇక పలు హోటళ్లలో ఆనియన్ దోశ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల పాటు ఉల్లితో ముడిపడి ఉన్న ఆహార పదార్థాలకు తాత్కాలిక బ్రేక్ వేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చేశారు. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు.. హోటల్, రెస్టారెంట్ వంటకాలు ఎక్కువగా ఆనియన్తో ముడిపడి ఉంటాయి. ఆహార ప్రియులు ఎక్కువగా ఆనియన్ తెప్పించుకుని మరీ తమకిష్టమైన వంటకాలతో కలిపి భుజించడం షరామామూలు. ఇక బిర్యానీకి ఆనియన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వాటి వాడకాన్ని తగ్గించేశారు. ఇక అంతగా వినియోగదారులను పోగొట్టుకోవడం ఇష్టం లేక అంతగా అవసరమైతే కొసరి కొసరి అందిస్తున్నారు. అది కూడా ఆనియన్ దోశ అయితేనే. బిర్యానీ, చపాతి, పరోటా ఇలా తదితర వంటకాల్లో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌కు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అయితే ఉల్లి ప్రసక్తే లేకుండాపోయింది. మలక్‌పేట మార్కెట్‌కు 18 వేల సంచులు చాదర్‌ఘాట్: కొండెక్కిన ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని మార్కెట్ శాఖ అడిషనల్ డైరెక్టర్ పి.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన మలక్‌పేట మార్కెట్లో ఉల్లి ధరలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్నూలు, కర్ణాటక, మహబూబ్‌నగర్‌ల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు సోమవారం 18 వేల బ్యాగులు వచ్చాయన్నారు. క్వింటాకు రూ.4వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతున్నట్లు చెప్పారు. కిలో ఉల్లి రూ.60 నుంచి 80 వరకు మార్కెట్లో లభ్యమవుతోందన్నారు. ఈజిప్ట్ నుంచి ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రానికి వెయ్యి క్వింటాళ్ల ఉల్లి దిగుమతి కానున్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రేడ్ 3 సెక్రటరీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్మా దోశకు డిమాండ్.. పెరిగిన ఆనియన్ ధరలు ఉప్మా దోశకు డిమాండ్‌ను పెంచాయి. దోశలో ఏదో ఒకటి మిక్స్ చేసి తింటే గానీ మజా ఉండదని ఆహారప్రియులు చెప్పేమాట. ఈ క్రమంలో ఉల్లికి బదులుగా ఉప్మాను జత చేసి హోటల్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉప్మా దోశ సాధారణమే అయినప్పటికీ ఉల్లి పెరుగుదలతో ఎక్కువ మంది మెనూలో ఉప్మా దోశ చేరిపోయింది. కీర, క్యారెట్‌తో సరి.. ఒకప్పుడు ఉల్లి కంటే కీర, క్యారెట్ల ధర ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. క్యారెట్, కీరల కంటే ఉల్లి డబుల్, త్రిపుల్ స్థాయిలో పెరగడంతో బిర్యానీ హోటళ్లు ఇప్పుడు ఆనియన్‌ను పక్కనపెట్టేశాయి. దీని స్థానంలో కీరను అందిస్తుండగా.. మరికొన్ని హోటళ్లు దానికి క్యారెట్ కూడా జతచేసి అందిస్తున్నాయి. చిన్న చిన్న హోటళ్ల దగ్గర నుంచి బడా రెస్టారెంట్ల వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద మొత్తంలోఆనియన్ తెచ్చి ఉచితంగా అందించే పరిస్థితి లేదని, ఒకప్పుడు సిల్వర్‌గా భావించే ఉల్లి ఇప్పుడు బంగారం సరసన చేరిపోయిందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆచితూచి కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆనియన్ దోశ ఆపేశాం.. గతంలో బిర్యానీ, చపాతీ, పరోటా తదితర వంటకాలతో పాటు ఆనియన్ కూడా ఇచ్చేవాళ్లం. ధరలు పెరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఆనియన్‌ను ఆపేశాం. ఈ పరిస్థితిని కస్టమర్లు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక ఆనియన్ దోశ అడిగినప్పుడు ఉప్మా దోశ గానీ లేక ప్లేన్ దోశ గానీ తీసుకోమని చెబుతున్నాం. కస్టమర్ పట్టుబడితే తప్ప ఆనియన్ దోశకు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. – శ్రీనివాస్, అభి టిఫిన్స్, వివేకానందనగర్ రూ.4వేల భారం.. మొన్నటివరకు హోల్‌సేల్‌గా క్వింటాల్ ఉల్లిపాయలను వెయ్యి రూపాయలకు తీసుకునేవాణ్ణి. ప్రస్తుతం పెరిగిన ధరతో అదే క్వింటాల్ ఉల్లిపాయలను రూ.10 వేలకు తీసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రస్తుతం కస్టమర్లను పోగోట్టుకోవడం ఇష్టం లేక 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నాను. అయినా నాలుగు వేల రూపాయలకుపైగా భారం పడుతోంది. ధరలు పెంచితే వినియోగదారులు ఎక్కడ దూరం అవుతారోనని ఆ ఊసే ఎత్తడం లేదు. – వీరేశప్ప, ఉడిపి గ్రాండ్ హోటల్, కూకట్పల్లి వినియోగదారులు అర్థం చేసుకోవాలి.. మార్కెట్‌క వెళితే కిలో రూ.140 ఉండడంతో వెనక్కి తిరిగివచ్చేశాం. కొన్ని రోజులు ఆనియన్ దోశను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు ప్లేన్ దోశ, ఉప్మా దోశను మాత్రమే అందిస్తున్నాం. వినియోగదారులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఉల్లి దోశ జోలికి వెళ్లడం లేదు. ప్రజలు కూడా ఉల్లి వాడకాన్ని కొద్ది రోజులు నిలిపి చేస్తే ధరలు దిగి దిగి వస్తాయనే విశ్వసిస్తున్నాం. – భవాని, ఇడ్లీ ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్ కాసిన్ని తక్కువ ఇస్తున్నాం.. మార్కెట్లో ఉల్లి ధరలు చూస్తుంటే మతిపోతోంది. కానీ కస్టమర్లకు ఇవ్వక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చినన్ని కాకపోయినా ఇప్పుడు కాస్త తక్కువ చేసి ఇస్తున్నాం. కొంత మంది కస్టమర్లు మళ్లీ కావాలని అడుగుతున్నారు. ధరలు తగ్గితే బాగుంటుంది. ఇవే ధరలు కొనసాగితే ఉల్లి లేకుండానే వంటలు చేయాల్సి వస్తుంది. – కుసుమ, చంద్రహవేలిహోటల్ నిర్వాహకురాలు, జూబ్లీహిల్స్ క్యాబేజీ తురుము.. క్యారెట్ ముక్కలు బంజారాహిల్స్: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిగడ్డ పకోడీలో ఉల్లికి బదులు క్యాబేజీ, కాలిఫ్లవర్ వాడుతున్నారు. కట్‌మిర్చికి ఉల్లిపాయలు ఇవ్వడం మానేశారు. బిర్యానీ పక్కన కీర, నిమ్మకాయ ముక్కలు పెడుతున్నారు. ఇక కొన్ని హోటళ్లలో తమవద్ద ఉల్లిపాయలు లభించవని బోర్డులు ఏర్పాటు చేశారు. బిర్యానీ ముద్ద దిగడం లేదు బిర్యానీలోకి ఆనియన్ అడిగితే క్యాబేజీ తురుముతో పాటు కీరదోస ముక్కలు ఇస్తున్నారు. ఆనియన్ లేకపోతే బిర్యానీ తినడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో బిర్యానీ తినలేక రోటీ తిని పోవాల్సి వస్తోంది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఇస్తామని చెబుతున్నా ఆనియన్ సలాడ్ మాత్రం ఇవ్వడం లేదు. – సాయి, కృష్ణానగర్ ఓ హోటల్లో ఆనియన్ సలాడ్‌కు రూ.25 చెల్లించాలని పెట్టిన బోర్డు తక్కువ ఇస్తున్నారు.. రెస్టారెంట్లలో ఏది ఆర్డర్ చేసినా సలాడ్‌లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా ఇస్తున్నారు. మళ్లీ కావాలని అడిగినా స్పందించడం లేదు. చాలీచాలని ఉల్లిపాయలతో కాస్త అసంతృప్తిగానే కడుపు నింపుకోవాల్సివస్తోంది. బయట మార్కెట్లో ఉల్లి ధరల ప్రభావం ఇంట్లో ఉండేవారితో పాటు మాలాగే రెస్టారెంట్లకు వచ్చేవారికి కూడా కనిపిస్తోంది. – శ్రీశైలం, జూబ్లీహిల్స్ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాం.. ఆనియన్ లేదని కస్టమర్లకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాం.. బోర్డులు కూడా పెట్టేశాం. బిర్యానీలో ఉల్లిపాయలకు బదులుగా కీరదోస ముక్కలను అందిస్తున్నాం. గత 15 రోజుల నుంచే ఇదే తరహాలో మా కస్టమర్లను బుజ్జగించాల్సి వస్తోంది. కొంత మంది ఆనియన్ లేదంటే బిర్యానీ తినకుండానే వెళ్లిపోతున్నారు.. – వాజిద్, గ్రీన్ బావర్చి హోటల్ యజమాని, కృష్ణానగర్ -
లోక్‌సభనూ తాకిన ఉల్లి ఘాటు
న్యూఢిల్లీ: ఉల్లి కొయ్యకుండానే కంట కన్నీరు తెప్పిస్తోంది. నిరుపేదలకు ఏమున్నా లేకపోయినా గంజన్నం, ఉల్లిపాయ ముక్క ఉంటే చాలు. అదే పంచభక్ష్య పరమాన్నాలతో సమానం. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో ఏకంగా రూ.150 కి చేరుకుంది. దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ జీరో అవర్‌లో ఉల్లిపాయ ధరల అంశాన్ని లేవనెత్తారు. అక్రమ నిల్వల కారణంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, అ«దీర్ చౌదరి, గౌరవ్ గొగోయ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉల్లి ధరలపై నిరసనకు దిగారు. నిరుపేదలు నిత్యం ఆహారంలో వాడే ఉల్లి ధరల్ని తగ్గించడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. నేను ఉల్లిపాయలు ఎక్కువగా తినను: నిర్మలా సీతారామన్ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి ధరల్ని ప్రస్తావిస్తూ ఒక ఎంపీ మీరు ఉల్లిపాయలు తింటారా అన్న ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ‘నేను ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినను. అందుకే ఎవరూ పెద్దగా విచారించాల్సిన పని లేదు’ అని అన్నారు. దీంతో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆమె తనను తాను సరిదిద్దుకొని ఉల్లి ధరలకు కేంద్రం పలు చర్యలు తీసుకుందని, ఎగుమతులకు అడ్డుకట్టవేసి దిగుమతుల్ని పెంచుతోందని వెల్లడించారు. టర్కీ, ఈజిప్టుల నుంచి కేంద్రం ఉల్లిపాయల్ని దిగుమతి చేస్తోందని తెలిపారు. సీతారామన్‌పై సెటైర్లు సీతారామన్ ఉల్లిపాయలకు బదులుగా అవకాడోలు తింటారా అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నిస్తే అటు సామాజిక మాధ్యమాల్లోనూ సెటైర్లు హోరెత్తిపోతున్నాయి. ట్విట్టర్లో ఉల్లి ధరలు 9,793 ట్వీట్లతో ట్రెండింగ్‌లో ఉంటే, అందులో నిర్మలా సీతారామన్ హ్యాష్‌ట్యాగ్‌తో 7,990 ట్వీట్లు ఉన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అని అంటే , నేను గాలి అంతగా పీల్చను అని మీరు సమాధానమిస్తారా అంటూ కేంద్ర మంత్రిపై నెటిజన్లు వ్యంగ్యా్రస్తాలు విసురుతున్నారు. మార్కెట్లో అమెరికా డాలర్ కంటే శక్తిమంతమైనది భారత్‌లో ఉల్లిపాయే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తిపోతున్నాయి. పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీలు కట్! పార్లమెంటు క్యాంటీన్లలో రాయితీలతో కూడిన ఆహార పదార్థాలకు మంగళం పాడేయనున్నారు. భారీ సబ్సిడీలతో క్యాంటీన్లను నడపడం సరికాదన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచనకు దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారు అంగీకరించడంతో సబ్సిడీ ఆహారానికి త్వరలో తెరపడనుంది. ఫలితంగా ఏడాదికి సుమారు రూ. 17 కోట్లు ఆదాకానుందని అధికారులు తెలిపారు. సబ్సిడీల ఎత్తివేత నిర్ణయం అమల్లోకి వస్తే చాలా వరకూ ఆహార పదార్థాల ధరలు ఇప్పుడున్న దానికి రెట్టింపు కావచ్చు. -
అందులో ఏపీ ఫస్ట్: మోపిదేవి
సాక్షి, కాకినాడ: ఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్యంగా పెరిగిన ధరల భారం నుంచి సామాన్యుడిని కాపాడేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. సబ్సిడీతో తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ‘ఈ నెల 14,15 తేదీల్లో టర్కీ, ఈజిప్టు నుండి కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. మన రాష్ట్రానికి 22,147 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు అవసరం. మనం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారునికి ఇస్తున్న రాష్ట్రాలలో మనదే మొదటిది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందజేస్తున్నాం. తెలంగాణలో ఉల్లి కిలో రూ.40-45కి మార్కెటింగ్ శాఖ ద్వారా విక్రయిస్తున్నారు. రోజుకు 200 మెట్రిక్ టన్నులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. అక్కడక్కడ కొంత మంది వ్యాపారులు ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి వెంకటరమణ వివరించారు. -
ఉల్లి లొల్లి ఎందుకంటే..!
సాక్షి సిటీబ్యూరో: ఉల్లిగడ్డ ప్రజల్ని మరోసారి కంగుతినిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో రూ.100 దాటడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఉల్లిపైనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఉల్లిగడ్డ ధరలు ఇంతగా ఎందుకు పెరిగాయనే దానిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి కొందరు వ్యాపారులు ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం దిగుమతి తగ్గడంతో ఇక్కడి వ్యాపారులు ఉల్లి గేమ్ ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నెల సాఫీగా సాగిన ఉల్లిగడ్డ సరఫరాకు కొందరు వ్యాపారులు అడ్డంకులు సృíష్టించారని తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాపారులతో కుమ్మక్కైన ఇక్కడి వ్యాపారులు సరఫరాను తగ్గించేస్తున్నారు. తద్వారా ఉల్లిగడ్డకు కొరత సృష్టించడంతోనే ధరలు భారీ స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు గత నెల రోజుల క్రితం మార్కెట్‌కు 70–80 లారీల ఉల్లి దిగుమతి అయింది. ఈ నెల ప్రారంభం నుంచి 40–30 లారీలు మాత్రమే దిగుమతి అవుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో 60–70 లారీల ఉల్లి దిగుమతి అయిందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉల్లి కిలో రూ.20 నుంచి 30 వరకు విక్రయించారు. ఈ ఏడాది గత ఏడాది కంటే 50 శాతం తక్కువగా ఉల్లి దిగుమతి అవుంతుంది. ధరలు ఐదు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా..వారి గోదాముల్లో నిల్వచేసుకుంటున్నారని తెలిసింది. మార్కెట్‌కు కాకుండా గోదాములకు సరఫరా చేసినందుకు మహారాష్ట్ర వ్యాపారులకు కొంత మొత్తం ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ కొరత కారణంగా ధరలు పెరుగుతుండడంతో...ఆ సమయంలోనే గోదాముల్లోని సరుకును బయటకు తీస్తున్నారని తెలిసింది. తద్వారా వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. గత నెలలో నగరానికి రోజుకు 80 లారీల ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి అయుంది. ప్రస్తుతం 30 నుంచి 40 లారీలు కూడా రావడం లేదని కొందరు వ్యాపారులు తెలిపారు. దీంతో వారం పది రోజుల్లోనే క్వింటాల్ రూ.2 వేల వరకు ఉన్న ధరలు రూ.10 వేలకు పెంచారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఇలాంటి అక్రమాలకు తెర తీస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొరతను సృష్టించే అక్రమ వ్యాపారులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. -
ఉల్లి.. దిగిరావే తల్లీ!
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కొండెక్కి కూర్చొని దిగిరానంటోంది. దీని ధర రోజురోజుకు పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్లో సెంచరీ కొట్టేసింది. ఫలితంగా నగరవాసికి కూరలో ఉల్లిగడ్డ కరువైంది. నగరానికి డిమాండ్‌కుసరిపడా దిగుమతి లేకపోవడంతో ధర అమాంతం పెరిగింది. కొంతఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీపై కిలో రూ.40కి విక్రయిస్తోంది. అయితే ఆయా కౌంటర్లకూ డిమాండ్‌కు సరిపడా దిగుమతి లేదు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడమేఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. సాక్షి,సిటీబ్యూరో/చాదర్‌ఘాట్: కూరల్లో వాడే ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది.కొందామంటే కొండెక్కి కూర్చొంది. బంగారం ధర తరహాలో ఉల్లి ధర పరుగులు తీస్తోంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో ధర వంద రూపాయలకు చేరువైంది. ఉల్లి నాణ్యతను బట్టి ధర మరింత ఎగబాగుతోంది. సోమవారం మార్కెట్లో హోల్‌సేల్ కొత్త ఉల్లి ధర కిలో రూ. 85 పలికింది. మార్కెటింగ్ శాఖ రైతు బజార్ల ద్వారా ఒక్కొక్కరికి కిలో చొప్పున సబ్సిడీపై కిలో రూ.40 చొప్పున పంపిణీ చేస్తోంది. దీనికోసం కనీసం మూడు గంటలకు పైగా లైన్లో నించోవాల్సి వస్తోంది. అప్పుడైనా దొరుకుతుందా? అంటే అనుమానమే. అది కూడా నాసిరకం ఉండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఉల్లి ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కానరావడం లేవు. తగ్గిన సాగు విస్తీర్ణం సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఈ ప్రభావం తీవ్రంగా పడింది. వాస్తవంగా ఈపాటికి హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్ ఉల్లి పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కానీ,గత మూడేళ్లుగా ఉల్లి ధరకు డిమాండ్ లేని కారణంగా సాగు విస్తీర్ణం 60 శాతానికి తగ్గు ముఖం పట్టింది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు సగం పంట దెబ్బతింది. దీంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి పాత ఉల్లిగడ్డ మాత్రమే మార్కెట్‌కు తరలి వస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజారత్‌లో ఉల్లి పంట రెండో దశలో ఉంది. చేతికి వచ్చేనాటికి సంక్రాంతి కావచ్చు. ఆ తర్వాత ఉల్లి లభ్యత మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉల్లి తిప్పలు తప్పనట్లు తెలుస్తోంది. నిత్యం పదివేల క్వింటాళ్ల పైనే.. హైదరాబాద్ మహానగరానికి ప్రతి నిత్యం పదివేల క్వింటాళ్ల ఉల్లి డిమాండ్ ఉంటుంది. మొన్నటి వరకు డిమాండ్‌కు తగ్గ ఉల్లి చాదర్‌ఘాట్ మార్కెట్‌కు వచ్చినప్పటికి సోమవారం ఒకేసారి తగ్గుముఖం పట్టింది. కేవలం 7416 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరుకు రాకపోవడంతో ఉల్లి ధర మరింత పెరిగినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై రూ.40 చొప్పున విక్రయిస్తోంది. నగరంలోని 12 రైతు బజార్లకు కలిపి 8 నుంచి 10 టన్నుల వరకు సరఫరా చేయడం ఏమూలకూ సరిపోవడం లేదు. మరోవైపు రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి దొరకడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా ఉన్న ఉల్లిగడ్డలనే సబ్సిడీపై విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి బహిరంగ మార్కెట్లో భాగనే ధర పలుకుతోంది. హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్లో సోమవారం గ్రేడ్ వన్ నాణ్యమైన ఎండిన పెద్ద ఉల్లి గడ్డ కిలోధర రూ.103 పలిగింది. బహిరంగ మార్కెట్లో రూ.110 నుంచి రూ.115 వరకు పలుకుతుండగా, ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో కిలో రూ. 119 నుంచి రూ. 130 వరకు విక్రయిస్తున్నారు. గ్రేడ్–2 పచ్చి ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్లో రూ. 90 నుంచి 100ల వరకు పలుకుతుంది. కొందరు వ్యాపారులు నాసిరకం ఉల్లిగడ్డకు కూడా ఇదే ధర వర్తింపజేస్తున్నారు. హోటళ్లలో తగ్గిన వినియోగం.. ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో హోటళ్లలో ఉల్లి వినియోగం తగ్గింది. హోటళ్లలో ఉల్లిదోశలో పూర్తిగా ఉల్లి తగ్గుముఖం పట్టింది. కొన్ని హోటల్స్‌లో ఉల్లిదోశకు ఆర్డర్ ఇచ్చినా ఠక్కున లేదనే సమాధానం వస్తోంది. ధర మండుతుండటంతో వ్యాపారులు ఉల్లి కొనుగోలు తగ్గించేశారు. ఇక పూరీకి అయితే ఉల్లి కూరకు బదులు క్యాబేజీ వండుతున్నారు. బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఉల్లిముక్కలు తగ్గించారు. పానీపూరి వ్యాపారుల పరిస్థితి వర్ణనాతీతం. ఉల్లి లేకుండా పానీపూరి తినడం కష్టం. ఉల్లిగడ్డలు లేని కారణంగా చాలామంది తినకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు. 500 మెట్రిక్ టన్నులురావొచ్చు ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధర పెరిగింది. భారత ప్రభుత్వం ఉల్లి కొరత అధిగమించేందుకు ఈజిప్టు నుంచి తెప్పించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి 500 మెట్రిక్ టన్నుల ఉల్లి రావచ్చు.వాటిని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జీ. లక్ష్మిబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ, మేడిపల్లిలో : మేడిపల్లిలోని రైతు బజార్లో మూడు రోజుల క్రితం ఉల్లి సబ్సిడీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. రూ.40 కు కిలో చొప్పన ఒక్కొక్కరికి ఒక్క కిలో మాత్రమే అందచేస్తున్నారు. వచ్చిన గంటల్లోన్లే ఉల్లిగడ్డ అయిపోతుంది. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సబ్సిడీకౌంటర్లలో..గగ్గోలు మీర్‌పేట: మీర్‌పేట రైతుబజార్లో గత శుక్రవారం ఉల్లి విక్రయ సబ్సిడీ కౌంటర్‌ను ప్రారంభించినా.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్సిడీ కౌంటర్లో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో వెలవెలబోయింది. సబ్సిడీ ద్వారా తక్కువ ధరకు ఉల్లిని విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న బడంగ్‌పేట, మీర్‌పేట పరిసర ప్రాంతాల వాసులు రైతుబజార్‌కు రాగా ఉల్లి అందుబాటులో లేదని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. అధికారులు 5 గంటల తరువాత ఉల్లిని తీసుకొచ్చినప్పటికీ నాసిరకంగా ఉండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి ఇలా.. ♦ తెలంగాణలో 14,273 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, ఈసారి 5417 ఎకరాల విస్తీర్ణంలోనే సాగైంది. ♦ మలక్‌పేట మార్కెట్‌కు గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 19,56,000 క్వింటాళ్ల ఉల్లి రాగా, ఈసారి 18,66,000 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చింది. దీని బట్టి 90 వేల క్వింటాళ్ల ఉల్లి తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ♦ కేవలం నవంబర్ మాసం పరిశీలిస్తే గతేడాది మూడు లక్షల ఏడువేల క్వింటాళ్లు రాగా, ఈసారి మాత్రం మూడు లక్షల 34 వేల క్వింటాళ్లు వచ్చింది. దీంతో గత నెల 27వేల క్వింటాళ్లు అధింగానే వచ్చినట్లయింది. ధర మాత్రం బాగానే పెరిగింది. ♦ తాజాగా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో వ్యాపారులంతా ఉల్లిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఉల్లిగడ్డకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ♦ రోజుకు 120 లారీలకుపై గా వచ్చే ఉల్లి.. ఇప్పుడు కేవలం 80 లారీలకే పరిమితమైంది. ♦ ఇదీ ఉల్లి లెక్క (సగటున) 10వేల క్వింటాళ్లు ♦ నగరంలో ప్రతిరోజు డిమాండ్ 8వేల క్వింటాళ్లు ♦ రోజూ దిగుమతి 810 టన్నులు ♦ నగరంలోనిరైతుబజార్లు 12 కేంద్రానికి ఫుల్ డిమాండ్ చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైతుబజార్లో ఏర్పాటు చేసిన సబ్సిడీ ఉల్లి కేంద్రానికి వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ నెలకొంది. గత నెల 28న రైతుబజార్లో ఈ సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విక్రయ కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ.100ల వరకు పలుకుతుండడంతో రైతుబజార్లో సబ్సిడీ కింద కిలో రూ.40లకు విక్రయిస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ రైతుబజార్లో రోజుకు 4 క్వింటాళ్ల వరకు విక్రయం సాగుతున్నట్లు ఎస్టేట్ అధికారి ముజీబుద్దీన్ ఖాన్ తెలిపారు. కాగా ఏదేనీ గుర్తింపు కార్డు తెచ్చిన వారికి ఒక్కొక్కరికి కిలో మాత్రమే అందజేస్తున్నారు. -
ఆ ఊళ్లో ఉల్లి ధర ఎంతైనా ఓకే..
పట్నా : ఉల్లిగడ్డ ధర వందకు చేరువై గృహిణులకు కన్నీరు తెప్పిస్తుంటే ఆ ఊర్లో మాత్రం ఉల్లి ధర ఎంతైనా మాకు బాధలేదు అంటున్నారు. అసలు ఉల్లి ధర ఎంతో కూడా తమకు తెలియదని చెబుతున్నారు. బిహార్‌లోని జెహనాబాద్ జిల్లా త్రిలోకి బిఘా గ్రామ ప్రజలకు ఉల్లి వాసనే పడదు. రాష్ట్ర రాజధాని పట్నాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో దాదాపు 350 మంది జనాభా. ఈ గ్రామంలోని 30 కుటుంబాల్లో ఏ ఒక్కరూ ఉల్లిగడ్డ ముట్టరు. గ్రామంలో ఎవరూ ఉల్లి తినకపోవడంతో ధర ఎంతైనా తమకు బాధ లేదని వారు చెబుతున్నారు. తమ గ్రామంలో అందరూ శాకాహారులేనని, ఉల్లితో పాటు అల్లం కూడా తినమని ఎవరూ మద్యం ముట్టరని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. శతాబ్ధాల నుంచి తమ గ్రామంలో ఇదే పద్ధతి పాటిస్తున్నామని గ్రామ పెద్దలు చెప్పడం గమనార్హం. తమ గ్రామంలో విష్ణు దేవాలయం ఉన్నందున శతాబ్ధాలుగా ఉల్లి తినడం నిలిపివేశామని, ఇప్పటికీ తమ పెద్దలు పాటించిన పద్ధతిని కొనసాగిస్తున్నామని గ్రామ పెద్ద రాంపర్వేష్ యాదవ్ అన్నారు. తనకు కనీసం ఉల్లి ధర ఎంతో కూడా తెలియదని చెప్పారు. గతంలో ఉల్లిగడ్డను తిన్నకొందరు గ్రామస్తులు ప్రమాదాల్లో మృత్యువాతన పడటంతో ఇక ఎన్నడూ ఉల్లి జోలికి పోకూడాదని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పద్ధతికి గ్రామస్తులు కట్టుబడిఉన్నారని, గ్రామం విడిచి వెళ్లిన సందర్భాల్లో ఉల్లి, అల్లం వాడకుండా తయారుచేసిన ఆహార పదార్ధాలు వండిన చోటే గ్రామస్తులు తినేవారని తెలిపారు. -
వంటింట్లో ఉల్లి మంట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి మళ్లీ ఘాటెక్కింది. పొరుగు రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, ధరలపై నియంత్రణ లేకపోవడంతో వంటింట్లో ఉల్లి మంటెక్కిస్తోంది. వారం రోజుల కిందటి వరకు మేలురకం కిలో ఉల్లి ధర రూ.50 పలుకగా అది ప్రస్తుతం ఏకంగా రూ.100కి చేరింది. సాధారణ రకం ఉల్లి ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గడం, మరో ఇరవై రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ధరల కళ్లేనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. పొరుగు నుంచి తగ్గిన సరఫరా రాష్ట్రంలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 13వేల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది అది 5వేల హెక్టార్లకే పరిమితమైంది.ఆలంపూర్, నారాయణఖేడ్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది పంట చాలా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహారాష్ట్రలోని పూణే, ఔరంగాబాద్, కర్ణాటకలోని బగల్‌కోఠ్, కొల్హాపూర్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్‌లో క్వింటాలు ధర కనిష్టంగా రూ.310, గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండగా అవి సెప్టెంబర్ నుంచి పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4,070కు చేరింది. ప్రస్తుతం క్వింటాల్‌ను రూ.4,650 వరకూ విక్రయిస్తున్నారు. నియంత్రణ ఉందా? ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపారుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఈ పరిమితులపై నిఘా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎక్కడా నిల్వలపై విజిలెన్స్ దాడులు జరిగిన దాఖలాలు లేవు. -
ఉల్లిపాయలు వేయొద్దన్నా.. అసలు ఎందుకిలా..
న్యూఢిల్లీ : ఉల్లి ఎగుమతులపై భారత్ నిషేధం ఎందుకు విధించిందో అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. భారత్ నిర్ణయంతో తనకు, తమ దేశానికి పెద్ద సమస్య పడి వచ్చిందని సరాదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా- బంగ్లాదేశ్ బిజినెస్ సదస్సుకు శుక్రవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ..‘ ఉల్లిగడ్డలు పొందడం ప్రస్తుతం మాకు పెద్ద సమస్యగా పరిణమించింది. అసలు మీరెందుకు ఉల్లి సరఫరాను నిలిపివేశారో అర్థం కావడం లేదు. కొరత ఉన్న కారణంగా ఉల్లిపాయలు లేకుండా లేకుండానే వంట చేయాలని పనిమనిషికి చెప్పాను అని పేర్కొన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. కాగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో.. ఉల్లి ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబరు 29న ప్రకటన చేసిన కేంద్రం.. తక్షణమే నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రపంచ కూరగాయల మార్కెట్లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారత్ నిర్ణయంతో బంగ్లాదేశ్‌కు పెద్ద దెబ్బ పడింది. ఆ దేశంలో క్వింటాళ్ ఉల్లి ధర పది వేల రూపాయల(బంగ్లా కరెన్సీలో)కు చేరుకుంది. #WATCH Bangladesh Prime Minister Sheikh Hasina in Delhi: Pyaaz mein thoda dikkat ho gya hamare liye. Mujhe maloom nahi kyun aapne pyaaz bandh kar diya? Maine cook ko bol diya ab se khana mein pyaaz bandh kardo. (Indian Govt had banned export of Onions on September 29) pic.twitter.com/NYt4ds9Jt2 — ANI (@ANI) October 4, 2019 -
ఉల్లికి కళ్లెం..కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటింట్లో మంటరేపుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపా రుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్ వ్యాపారులు 500క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలి పింది. దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఉల్లి దిగుబడులు తగ్గడం, డిమాండ్ అనూహ్యంగా పెరగడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టి స్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అక్రమ నిల్వలను అరికట్టేం దుకు, ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంక లకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతు న్నాయి. సాధారణంగా ఉల్లి నిల్వలపై పరిమి తులు విధించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తుండగా ఈసారి మాత్రం ఏకంగా కేంద్రమే నేరుగా రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల్లో ఉల్లి నిల్వలపై పరిమితి విధించడం గమనార్హం. మరోవైపు ఉల్లి ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల బహిరంగ మార్కెట్లలో ఉల్లి ధర కిలోకు రూ. 60 నుంచి రూ. 80 మధ్య పలుకుతోంది. పక్షం రోజులుగా ధర పైపైకి... రాష్ట్రంలో ఇప్పటికే ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురిసన వర్షాలతో పంట దెబ్బతినడం, దీంతో దిగుమతులు తగ్గడం, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి మేలురకం ఉల్లి రాకపోవడంతో గత 15 రోజులుగా ఉల్లి ధర కిలోకు ఏకంగా రూ. 50 నుంచి రూ. 60 మధ్య పలుకుతోంది. ఢిల్లీ, హరియాణ, రాజస్తాన్, ముంబైలలో మరింత ఎగబాకి రూ. 80 దాకా చేరింది. చాలా చోట్ల ఉల్లికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు అక్రమంగా ఉల్లిని నిల్వ చేస్తూ కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ధరలు దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి నిల్వలపై పరిమితులు విధించింది. గతంలో ఉల్లి ధరలు పెరిగిన సందర్భాల్లో లైసెన్స్ కలిగిన డీలర్లు కేటగిరి–ఏలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో 75 క్వింటాళ్లు, కేటగిరి–బీలో అన్ని పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, కేటగిరి–సీలో గ్రామీణ ప్రాంతాల్లో 30 క్వింటాళ్ల వరకు ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుతించింది. అంతకుమించి నిల్వ ఉంచే వారిపై నిత్యావసరాల ధరల నియంత్రణ చట్టం కింద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టనుంది. రాష్ట్రానికి పెరిగిన దిగుమతులు.. గడిచిన వారం రోజులుగా హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్లకు ఉల్లి దిగుమతులు పెరిగాయి. ఈ నెల 21 వరకు మార్కెట్లో మేలు రకం ఉల్లి దిగుమతులు 3 వేల క్వింటాళ్ల నుంచి 5 వేల క్వింటాళ్ల మధ్య ఉండగా ఆ తర్వాత వారం నుంచి దిగుమతులు 6 వేల క్వింటాళ్ల నుంచి 8,500 క్వింటాళ్ల వరకు పెరిగాయి. ఇక రెండో రకం ఉల్లి సరఫరా సైతం 9 వేల క్వింటాళ్ల నుంచి 12 వేల క్వింటాళ్లకు పెరిగింది. దీంతో హోల్‌సేల్ ఉల్లి ధర రూ. 35 నుంచి రూ. 40 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్లో మాత్రం రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. అయితే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఉత్తరాదిలో ఉల్లి వాడకం తగ్గుతుందని, ఫలితంగా రాష్ట్రానికి మరింత సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
రూ. 60 దాటిన ఉల్లి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు కిలోకు రూ. 60 దాటుతుండటంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. రిటైల్ ఉల్లి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో కిలోకు రూ. 50 పైనే పలుకుతుండగా, చెన్నైలో రూ. 45వరకూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ఏకంగా రూ. 60గా ఉంది. అయితే పెరిగిన ధరలు తాత్కాలికమేనని, నెలాఖరుకు ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం పేర్కొంది. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులను అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారని, త్వరలోనే ధరలు దిగివస్తాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ పేర్కొన్నారు. 2017-18లో ఉల్లి దిగుబడులు తక్కువగానే ఉన్నా మొత్తం పంట దేశ అవసరాలకు తగినంతగా ఉందని చెప్పారు. మార్కెట్లోకి త్వరలో ఉల్లి దిగుబడి రానుండటంతో ధరలు తగ్గుతాయని అన్నారు. మరోవైపు ఖరీఫ్ దిగుబడులు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని, నెలాఖరు నాటికి దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో ధరలు దిగివస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. రబీ పంట మార్కెట్లకు వస్తే ఉల్లి ధరలు తగ్గుతాయని చెప్పారు. -
సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ఉల్లి
సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి రిటైల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు గృహిణులకు భారమవుతుంటే తాజాగా దేశ రాజధానిలో కిల్లో ఉల్లి రూ 80కి ఎగబాకింది. ఇతర మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ 50 నుంచి రూ 70 పలుకుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆజాద్‌పూర్ మండీలో మంగళవారం కిలో ఉల్లి రూ 80కి చేరిందని వ్యాపారులు చెప్పారు. ఉల్లి సాగు అధికంగా ఉండే మహారాష్ర్ట, కర్ణాటక,మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి సరఫరాలు తగ్గడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరొందిన మహారాష్ర్టలోని లాసాల్గావ్ మండీకి ఉల్లి సరఫరాలు 12,000 క్వింటాళ్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే రోజు మార్కెట్‌కు ఏకంగా 22,933 క్వింటాళ్ల సరుకు వచ్చింది. ఇదే మార్కెట్లో గత సంవత్సరం కేవలం రూ 7.50గా ఉన్న కిలో ఉల్లి ప్రస్తుతం రూ 33కు ఎగబాకింది. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి లొల్లి
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి ధర బెదరగొడుతోంది. విని యోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. దీనికంతటికీ కారణంతగ్గిన దిగుబడులు కొంతయితే.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత తోడయింది. రెండు నెలల క్రితం పరిగి మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.800 నుంచి రూ.1000 పలికితే ప్రస్తుతం ఈ ధర రూ.ఐదు వేలకు చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒక్కో రైతు క్వింటాలుకు రూ.నాలుగు వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో రైతు నుంచి కొనుగోలు చేసి రెండు నెలలు నిల్వచేసిన దళారులు క్వింటాలుకు రూ.నాలుగు వేలు లాభపడుతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన రైతుకు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు రాగా అదే రెండు నెలలు నిల్వచేసిన దళారులు 25 నుంచి 30 క్వింటాళ్లకు రూ.లక్ష వరకు లాభపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. తగ్గిన సాగు విస్తీర్ణం.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. ఏటా తగ్గుతున్న ఉల్లిసాగు విస్తీర్ణం.. పెరుగుతున్న వినియోగం కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడానికి కారణాలుగా చెప్పవచ్చు. పరిగి మండల పరిధిలో ఐదారేళ్లుగా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో సీజన్లో రైతుల నుంచి ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్న దళారులు అక్రమంగా నిల్వచేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో 312 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 241 హెక్టార్లలో పంట సాగవుతుందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో సాగును ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవటమే మరిచారు. జిల్లాలో యేటా మర్పల్లి మండలం పంచలింగాల, పట్లూర్, సిరిపురం, వీర్లపల్లి, ఘనాపూర్, మర్పల్లి, కొత్లాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో రబీలో 500 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేసేవారు. రెండేళ్లుగా ఉల్లికి సరైన ధర పలకపోవటం.. కరెంటు కోతలు, వాతావరణం అనుకూలించక పంట దిగుబడు లు తగ్గి రైతులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూశారు. ఈ సీజ న్లో రోజుకూ 800 క్వింటాళ్ల ఉల్లిగడ్డ శంకర్పల్లి మార్కెట్ వస్తుండగా... ఇప్పుడు మాత్రం కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే బీట్ అవుతున్నాయి. 2011-12లో ఉల్లి పంట సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం డబ్బులు అందకపోవటంతో పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగుపై దృష్టి సారించారు. దీంతో ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. నిలిచిపోయిన దిగుమతులు.. హైదరాబాద్ నగరానికి చుట్టు ప్రక్కల జిల్లా ఉండటంతో ఉల్లిగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిత్యం సుమారు 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల మేర ఉల్లిగడ్డలు అవసరం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో దిగుబడులు లేకపోవటంతో ఉల్లికి ధరలు పెరగడం మరో కారణంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రతి యేటా అహ్మదాబాద్, పుణేలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పెద్ద మొత్తంలో దిగుబడులు దిగుమతి జరిగేవి. కానీ అక్కడ కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినటం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజులుగా కర్నూలు నుంచి దిగుమతి చేసుకొనే ఉల్లిగడ్డకు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా స్తంభించింది. దీంతో దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది. ధరల అదుపులో విఫలమైన ప్రభుత్వం పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నామంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేయలేకపోతోంది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలను అదుపు చేయడంలోనూ విఫలమవుతోంది. -
కూరగాయలకూ.. ఉద్యమ సెగ
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి, ఉల్లి దిగుమతి నిలిచిపోయింది. బెంగళూరు నుంచి బీన్స్, క్యారెట్, క్యాబేజి సరఫరా ఆగిపోయింది. దీంతో నగరంలో కూరగాయలకు కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.40-80ల వరకు ధర పలుకుతున్నాయి. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చిమిర్చి, ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో ఆకాశానికి ఎగబాకాయి. బుధవారం ఉదయం గుడిమల్కాపూర్‌లోని రిటైల్ మార్కెట్లో కేజీ రూ.100లు వసూలు చేశారు. కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోవడంతో ఉల్లి ధరల్లో కూడా అనూహ్యంగా మార్పు కన్పిస్తోంది. సాధారణంగా ఇళ్లలో వినియోగించే గ్రేడ్-2 రకం ఉల్లిని సైతం కేజీ రూ.40-50ల ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్లో రూ.500లు వెచ్చిస్తే కూడా కనీసం చేసంచి నిండని పరిస్థితి ఏర్పడింది. రైతుబజార్లలో సైతం కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్య, పేద వర్గాల వారు విలవిల్లాడిపోతున్నారు. నగరంలోని 10 రైతుబజార్లకు నిత్యం 8వేల క్వింటాళ్లకు పైగా వచ్చే కూరగాయలు బుధవారం కేవలం 4వేల క్వింటాళ్లే వచ్చాయి. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ హోల్‌సేల్ మార్కెట్లకు అన్నిరకాల కూరగాయల దిగుమతి తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం హోల్‌సేల్ మార్కెట్లకు 20వేల క్వింటాళ్లకు మించి సరుకు రాలేదని తెలిపారు. ఈ కొరత ప్రభావం క్రమేపీ ధరలపైపడుతూ ఐదు రోజులుగా కూరగాయల రేట్లు పెరగడం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో కొన్ని రకాల కూరగాయలు కేజీ రూ.100లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ ధరలు బోర్డులకే పరిమితం.. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలు రైతు బజార్లలో బోర్డులకే పరిమితమవుతున్నాయి. సమీప హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధరలను బట్టి వ్యాపారులకు కొంత లాభం వచ్చేలా మార్కెటింగ్ శాఖ రైతు బజార్లలో ధరలను నిర్ణయిస్తుంది. రైతు బజారులో అదే ధరకు కూరగాయలను రైతులు (వ్యాపారులు) విక్రయించాలి. అయితే ఇక్కడ బోర్డుల్లో ఉన్న ధర కంటే కిలోకు అయిదు నుంచి పది రూపాయల ఎక్కువ ధరలకు రైతు బజార్లలో వ్యాపారులు కూరగాయలను అమ్ముతున్నారు. ఎస్టేట్ ఆఫీసరుకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు చెప్పినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు... ఇతర ప్రాంతాల నుంచి సరుకు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే నగరమంతా అదే పరిస్థితి ఉండాలి. కానీ నగరంలో ఒక ప్రాంతానికీ, మరో ప్రాంతానికి మధ్య కూరగాయల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ‘‘నిజంగా బయట నుంచి సరుకులు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే రైతు బజార్లలోనూ భారీగా ధరలు పెరగాలి. అయితే రైతు బజార్లలో కొంత మేరకే ధరలు పెరిగి బయట మార్కెట్లో ఎక్కువ పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడమే కారణం. ఈ వ్యవహారాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణం’’ అని అధికారులే అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతు బజార్లలో సరసమైన ధరలకు కూరగాయలను సరఫరా చేసేది. మార్కెటింగ్ శాఖకు ఇందుకోసం నిధులు కేటాయించేది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రులు సచివాలయానికే రావడంలేదని, అధికార యంత్రాంగం నిద్రపోతోందని, దీంతో కూరగాయల వ్యాపారులకు కళ్లెం వేసేవారే లేరన్న విమర్శలు ఉన్నాయి. ‘‘అన్ని ధరలూ ఇలా పెరిగిపోతే జనం ఏమి తిని బతకాలి. రూ. 300 తీసుకొస్తే వారానికి సరిపడా కూరగాయలు రావడంలేదు. ఇలాగైతే జనం బతికేదెలా? ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడంలేదు. మంత్రులు వారి సంపాదన గురించి తప్ప జనం ఇబ్బందులను పరిష్కరిద్దామని ఆలోచించడంలేదు’’ అని విజయనగర్ కాలనీకి చెందిన విమల ఆగ్రహం వ్యక్తం చేశారు.