
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు కిలోకు రూ. 60 దాటుతుండటంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. రిటైల్ ఉల్లి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో కిలోకు రూ. 50 పైనే పలుకుతుండగా, చెన్నైలో రూ. 45వరకూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ఏకంగా రూ. 60గా ఉంది. అయితే పెరిగిన ధరలు తాత్కాలికమేనని, నెలాఖరుకు ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులను అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారని, త్వరలోనే ధరలు దిగివస్తాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్ పేర్కొన్నారు. 2017-18లో ఉల్లి దిగుబడులు తక్కువగానే ఉన్నా మొత్తం పంట దేశ అవసరాలకు తగినంతగా ఉందని చెప్పారు. మార్కెట్‌లోకి త్వరలో ఉల్లి దిగుబడి రానుండటంతో ధరలు తగ్గుతాయని అన్నారు.
మరోవైపు ఖరీఫ్ దిగుబడులు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని, నెలాఖరు నాటికి దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో ధరలు దిగివస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. రబీ పంట మార్కెట్లకు వస్తే ఉల్లి ధరలు తగ్గుతాయని చెప్పారు.