వెల్దుర్తి మండలంలో సాగు చేసిన పత్తి పంట
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఖరీఫ్ కోలాహలం నెలకొంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,87,954 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 55,281 హెక్టార్లలో వివిధ పంటల విత్తనాలు వేశారు. గతేడాది ఇదే సమయంలో 19,164 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు సాగుకు ఉత్సాహంగా కదులుతున్నారు. ఈ ఏడాది రైతులు పత్తి సాగుపై అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు మొదలైన పంటల సాగులో పత్తి విస్తీర్ణమే అధికం కావడం గమనార్హం. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు
పోస్తున్నారు.
తగ్గనున్న మిర్చి సాగు
గత ఏడాది మిర్చి పంటకు విపరీతమైన తెగుళ్లు సోకాయి. ఫలితంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కన్నా నాలుగు నుంచి ఆరు వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటకు గతేడాది ధర ఎక్కువ పలకడంతో సాధారణ విస్తీర్ణం కంటే 10 నుంచి 15 వేల హెక్టార్లు అధికంగా సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు 1.45 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రబీ అనంతరం రెండునెలల ముందే కొన్నిప్రాంతాల్లో పత్తి, నువ్వులు 5,276 హెక్టార్లలో సాగవడం గమనార్హం.
రైతులకు అండగా ప్రభుత్వం
కృష్ణానది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే స్థాయిలో నీరు వస్తే మరో నాలుగైదు రోజుల్లో సాగర్‌కి నీరు పెద్ద మొత్తంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో కాలువలకు సాగర్ నీరు విడుదల చేసే ఆస్కారం ఉండడంతో జిల్లాలోని రైతులు సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తోంది. అన్నివిధాలా అండగా ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ ఏడాది 2,43,492 మంది రైతులకు రూ.134.24 కోట్ల లబ్ధి రైతు భరోసా ద్వారా చేకూరింది. అలాగే పంటల బీమా పరిహారం ద్వారా మరో 54,997 మందికి రూ.49.89 కోట్ల లబ్ధి కలిగింది.
పుష్కలంగా ఎరువులు
జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. 3,14,635 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేయగా, దీనిలో జూలై నెలకు 40,161 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని తేల్చారు. దీంతో ఇప్పటికే 64,302 మెట్రిక్ టన్నులను సిద్ధం చేశారు. విత్తనాలూ అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 6 వేల కింటాళ్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలను ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా పంపిణీ చేయడం గమనార్హం.
విత్తనాలు సరఫరా చేశాం
జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరతా లేదు. ఇప్పటికే రైతులకు పత్తి, వరి, మిరప విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేశాం.
– ఐ.మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పల్నాడు జిల్లా
వ్యవసాయం కలిసి వచ్చింది..
మాకు 7.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో పత్తి, మిర్చి సాగు చేస్తాను. ప్రస్తుతానికి పత్తి పంట బాగా ఉంది. మిరప నారు పోయడానికి సిద్ధపడుతున్నాను. రెండేళ్లుగా వ్యవసాయం బాగా కలసి వచ్చింది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు ఢోకా ఉండదనే నమ్మకంతో ఉన్నాం. రైతు భరోసా డబ్బులు జమ చేయడంతోపాటు ఆర్‌బీకేలలో విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.
– అడపా సుబ్బారెడ్డి, వెల్దుర్తి, మాచర్ల నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment