khariff season
-
పత్తి సాగుపై పల్నాడు రైతుల ఆసక్తి
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఖరీఫ్ కోలాహలం నెలకొంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,87,954 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 55,281 హెక్టార్లలో వివిధ పంటల విత్తనాలు వేశారు. గతేడాది ఇదే సమయంలో 19,164 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు సాగుకు ఉత్సాహంగా కదులుతున్నారు. ఈ ఏడాది రైతులు పత్తి సాగుపై అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు మొదలైన పంటల సాగులో పత్తి విస్తీర్ణమే అధికం కావడం గమనార్హం. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. తగ్గనున్న మిర్చి సాగు గత ఏడాది మిర్చి పంటకు విపరీతమైన తెగుళ్లు సోకాయి. ఫలితంగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కన్నా నాలుగు నుంచి ఆరు వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి పంటకు గతేడాది ధర ఎక్కువ పలకడంతో సాధారణ విస్తీర్ణం కంటే 10 నుంచి 15 వేల హెక్టార్లు అధికంగా సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు 1.45 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రబీ అనంతరం రెండునెలల ముందే కొన్నిప్రాంతాల్లో పత్తి, నువ్వులు 5,276 హెక్టార్లలో సాగవడం గమనార్హం. రైతులకు అండగా ప్రభుత్వం కృష్ణానది ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే స్థాయిలో నీరు వస్తే మరో నాలుగైదు రోజుల్లో సాగర్‌కి నీరు పెద్ద మొత్తంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో కాలువలకు సాగర్ నీరు విడుదల చేసే ఆస్కారం ఉండడంతో జిల్లాలోని రైతులు సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తోంది. అన్నివిధాలా అండగా ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ ఏడాది 2,43,492 మంది రైతులకు రూ.134.24 కోట్ల లబ్ధి రైతు భరోసా ద్వారా చేకూరింది. అలాగే పంటల బీమా పరిహారం ద్వారా మరో 54,997 మందికి రూ.49.89 కోట్ల లబ్ధి కలిగింది. పుష్కలంగా ఎరువులు జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. 3,14,635 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేయగా, దీనిలో జూలై నెలకు 40,161 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని తేల్చారు. దీంతో ఇప్పటికే 64,302 మెట్రిక్ టన్నులను సిద్ధం చేశారు. విత్తనాలూ అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 6 వేల కింటాళ్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలను ఇప్పటికే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడం గమనార్హం. విత్తనాలు సరఫరా చేశాం జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరతా లేదు. ఇప్పటికే రైతులకు పత్తి, వరి, మిరప విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేశాం. – ఐ.మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పల్నాడు జిల్లా వ్యవసాయం కలిసి వచ్చింది.. మాకు 7.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో పత్తి, మిర్చి సాగు చేస్తాను. ప్రస్తుతానికి పత్తి పంట బాగా ఉంది. మిరప నారు పోయడానికి సిద్ధపడుతున్నాను. రెండేళ్లుగా వ్యవసాయం బాగా కలసి వచ్చింది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు ఢోకా ఉండదనే నమ్మకంతో ఉన్నాం. రైతు భరోసా డబ్బులు జమ చేయడంతోపాటు ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. – అడపా సుబ్బారెడ్డి, వెల్దుర్తి, మాచర్ల నియోజకవర్గం -
సాగుకు భరోసా
సాక్షి,కదిరి(సత్యసాయిజిల్లా): దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి రైతులంటే ఎంత ఇష్టమో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా అన్నదాతలంటే ప్రాణం. అందుకే వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఏటా రైతు కుటుంబానికి రూ.13,500 నగదు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మునుపే మే నెలలోనే వైఎస్సార్ రైతు భరోసా నగదు అర్హులైన రైతులందరి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారు చనిపోతే ఆ ఇంట్లోనే మరొకరికి.. రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ నగదు అదే ఇంట్లోనే మరొకరికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు కూడా ఈసారి రైతు భరోసాకు అర్హులయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా పొందడం ఎలా? భూమి ఉన్న ప్రతి రైతూ ఈ పథకానికి అర్హులే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే వారందరూ ఈ పథకానికి అర్హులే. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు పాసుపుస్తకం తీసుకొని సమీప రైతుభరోసా కేంద్రంలో సంప్రదిస్తే సరిపోతుంది. లేదంటే వలంటీర్‌ను గానీ, గ్రామ సచివాలయంలో గానీ, వ్యవసాయాధికారిని గానీ సంప్రదించవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం రూ.13,500ను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందులో రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం జమచేయగా, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 జమ చేస్తుంది. రైతులకు నిజంగా భరోసానే జగన్ ప్రభుత్వం రైతులకు ఏటా అందజేసే రైతు భరోసా నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకప్పుడు విత్తనాల కొనుగోలుకు చేతిలో డబ్బు లేక పొలాలు బీళ్లుగా వదిసే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా నగదు పెట్టుబడికి సాయంగా ఉంటోంది. – రైతు జగన్మోహన్రెడ్డి, ఓబుళరెడ్డిపల్లి, తలుపుల మండలం అర్హులెవ్వరూ నష్టపోరాదు వైఎస్సార్ రైతు భరోసాకు సంబంధించి అర్హులైన ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా రైతు భరోసా కేంద్రాల్లో సిద్దంగా ఉంది. రైతులు పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే అక్కడే చెబితే వెంటనే న్యాయం చేస్తాం. – జి.శివనారాయణ, జేడీఏ, శ్రీసత్యసాయి జిల్లా -
రూ. 60 దాటిన ఉల్లి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు కిలోకు రూ. 60 దాటుతుండటంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. రిటైల్ ఉల్లి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో కిలోకు రూ. 50 పైనే పలుకుతుండగా, చెన్నైలో రూ. 45వరకూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ఏకంగా రూ. 60గా ఉంది. అయితే పెరిగిన ధరలు తాత్కాలికమేనని, నెలాఖరుకు ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం పేర్కొంది. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులను అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారని, త్వరలోనే ధరలు దిగివస్తాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ పేర్కొన్నారు. 2017-18లో ఉల్లి దిగుబడులు తక్కువగానే ఉన్నా మొత్తం పంట దేశ అవసరాలకు తగినంతగా ఉందని చెప్పారు. మార్కెట్లోకి త్వరలో ఉల్లి దిగుబడి రానుండటంతో ధరలు తగ్గుతాయని అన్నారు. మరోవైపు ఖరీఫ్ దిగుబడులు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని, నెలాఖరు నాటికి దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో ధరలు దిగివస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. రబీ పంట మార్కెట్లకు వస్తే ఉల్లి ధరలు తగ్గుతాయని చెప్పారు. -
మిల్లర్ల మాయాజాలం!
అన్నదాతలకు వరుస కష్టాలు నాణ్యత లేదని దర తగ్గింపు బ్రోకర్ల ద్వారా కొనుగోళ్లు సుమారు రూ.200 కోట్ల మేర సొమ్ము స్వాహా శ్రీకాకుళం అగ్రికల్చర్, నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్ : వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గటంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు.. తాజాగా మిల్లర్ల మాయాజాలానికి బలవుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సవాలక్ష ఆంక్ష లు విధించటంతోపాటు నాణ్యత లేదన్న సాకుతో మిల్లర్లు ధర తగ్గిం చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పోనీ.. బహిరంగ మార్కెట్లో విక్రయించి అంతో ఇంతో లబ్ధి పొందాలనుకున్నా ఫలితం దక్కటం లేదు. అక్కడ కూడా మిల్లర్ల అండతో దళారులు రాజ్యమేలుతుండటమే దీనికి కారణం. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.05 లక్షల హెక్టార్లల్లో వరి సాగు చేశారు. దాదాపు ఆరు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో పంట దెబ్బతిన డంతో దిగుబడి 4 లక్షల టన్నులకు తగ్గింది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ వీటిద్వారా కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరిగాయి. మరోవైపు 3 లక్షల టన్నుల లెవీ చెల్లించాలని మిల్లర్లకు లక్ష్యం నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు 1.40 లక్షల టన్నుల మేరకే చెల్లించారని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మిల్లర్లు చేస్తున్నది ఇదీ.. లాభార్జనే ధ్యేయంగా మిల్లర్లు ఇటు అన్నదాతలను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు చెల్లించడం లేదు. దళారుల ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొన్న ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. అలాగే లెవీ చెల్లించాలనే సాకుతో ఒడిశా నుంచి ధాన్యాన్ని అడ్డదారుల్లో తీసుకువచ్చి రహస్యంగా గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. కేంద్రప్రభుత్వం సడలించిన నిబంధనల ప్రకారం ధాన్యం లో మట్టి, ఇసుక ఒక శాతం.. తాలు గింజలు వగైరా ఒక శాతం..పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తొలిచిన గింజలు 4 శాతం.. పూర్తిగా పండని, ముడుచుకుపోయిన, నొక్కులు పడిన గింజలు 3 శాతం, తక్కువ రకం గింజల మిశ్రమం గ్రేడ్ ఏ రకంలో 6 శాతం వరకు ఉండవచ్చు. తేమ 17 శాతం వరకూ ఉండొచ్చు. వీటిని మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రైతుల నుంచి తడి సిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేశామని చెప్పి లెవీ చెల్లిస్తున్నారు. ఈ విధంగా ప్రతీ లారీ లోడు వద్ద వేలాది రూపాయలు ప్రయోజనం పొందుతున్నారు. మరోవైపు.. బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకోవాలనే లక్ష్యంతో లెవీ పూర్తి స్థాయిలో చెల్లించలేమని చేతులెత్తేస్తున్నారు. నరసన్నపేట కేంద్రంగా దందా మిల్లర్ల మాయాజాలం అంతా నరసన్నపేట కేంద్రంగానే జరుగుతోందని రైతులు చెబుతున్నారు. ఎక్కువ మంది మిల్లర్లు, మిల్లర్ల సంఘం నేతలు ఆ ప్రాంతం వారే కావటమే ఇందుకు కారణం. జిల్లాలో ధాన్యం అమ్మకాలు గతేడాది డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో గొడౌన్ల సమస్య తీవ్రంగా ఉండడంతో చాలా మంది రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవడం పరి పాటి. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లర్లు మోసాలకు పాల్పడ్డారు. బ్రోకర్లను రంగంలోకి దించి ధాన్యం అమ్మకాలు ప్రారంభమైన మొదట్లో 80 కిలోల బస్తాను రూ.850లకే కొనుగోలు చేయిం చారు. వాస్తవానికి సాధారణ రకం ధాన్యానికి రూ.1048, గ్రేడ్-ఎ రకానికి 1076 రూపాయలు చెల్లించాలి. కానీ రూ.850 నుంచి రూ.950 మధ్య చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1.40 లక్షల టన్నుల లెవీ సేకరించారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు రూ. 200 కోట్లను జేబులో వేసుకున్నారు. -
వేరుశెనగ పంట నష్టం రూ.109 కోట్లు
వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్లో రూ.109 కోట్ల వేరుశెనగ పంట నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. జిల్లాలోని 33 మండలాల్లో వర్షాధారం కింద 1.58 లక్షల మంది రైతులు 1.09 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం నివేదికలు పంపింది. చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్లో రూ.109 కోట్ల వేరుశెనగ పంట నష్టపోయినట్టు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. జిల్లా వ్యాప్తంగా 2013 ఖరీఫ్ సీజన్లో 1.45 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 1.39 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంట నష్టపోయారు. తూర్పు మండలాల్లో నీటి ఆధారిత కింద 30 వేల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట మాత్రమే రైతుల చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు మూడు విడతల్లో జిల్లాలోని 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు నివేదికలు పంపారు. తొలి విడతగా 14, మలి విడతలో 23 మండలాల్లో కరువు ఏర్పడినట్టు తేల్చారు. అయితే నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో తుది విడతగా మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు కలెక్టర్ ప్రభుత్వానికి పంపారు. 33 మండలాల్లోనే కరువు జిల్లా వ్యవసాయ, ప్రణాళిక, రెవెన్యూశాఖలు సంయ్తుంగా నిర్వహించిన వేరుశెనగ పంట నష్టం సర్వేల్లో జిల్లాలోని 52 మండలాల్లో కరువు నెలకొన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కరువు కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించింది. అలాగే రాష్ట్ర స్థాయి బృందం సేకరించిన కరువు పరిస్థితుల వివరాలతో పోల్చి చూసింది. కేవలం 33 మండలాల్లోనే కరువు ఛాయలు నెలకొన్నట్లు నిర్ధారించింది. బి.కొత్తకోట, పెద్దమండ్యం, కలకడ, చౌడేపల్లె, శాంతిపురం, రామకుప్పం, వి.కోట, నిమ్మనపల్లె, కుప్పం, పుంగనూరు, గుడుపల్లె, సోమల, రొంపిచెర్ల, రామసముద్రం, పీటీఎం, కేవీపల్లె, ములకలచెరువు, కలికిరి, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, చిన్నగొట్టిగల్లు, బెరైడ్డిపల్లె, పీలేరు, మదనపల్లె, పులిచెర్ల, కురబలకోట, చిత్తూరు, గుడిపాల, యాదమరి, తవణంపల్లె, ఐరాల, సదుం, పూతలపట్టు మండలాలను కరువు ప్రాంతాలుగా ఈ నెల 3న ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మండలాల్లో వర్షాధారం కింద 1.58 లక్షల మంది రైతులు 1.09 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. బాధిత రైతులకు పంట నష్టం చెల్లింపు, పంట రుణాల రీషెడ్యూల్, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ రాంగోపాల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం నివేదికలు పంపినట్లు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ జె.రవికుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..!
సాక్షి, ఏలూరు : నీలం తుపాను విలయతాండవానికి పంటలు నీటిపాలై ఏడాది గడిచిపోయింది. అయినా ఇప్పటికీ నష్టపోయిన రైతుల్లో చాలామందికి పరిహారం అందలేదు. గత ఏడాది ఖరీఫ్ పంట కోల్పోయిన అన్నదాతలు రబీలో పరిహారం ఆదుకుంటుందనుకున్నారు. అప్పుడు రాలేదు. ఖరీఫ్‌లో ఆసరా అవుతుందనుకున్నారు. ఎట్టకేలకు ఎన్నికల్లో లబ్ధి కోసం ‘నీలం’ సాయం విడుదల చేసిన ప్రభుత్వం వాటిని రైతులకు చేర్చడంలో విఫలమైంది. కొందరికే సాయం విడుదల కాగా, వారిలో కొందరి ఖాతాలకే జమ అయ్యింది. గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచిపెట్టేసింది. విపత్తు అనంతరం 3 లక్షల 31వేల 363 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 2.73 లక్షల మంది రైతులు నష్టపోయారని లెక్క తేల్చారు. రూ.557 కోట్లు నష్టంగా నిర్ధారించారు. దానికనుగుణంగా రూ.131.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. తొలివిడతగా రూ.122.97 కోట్లు విడుదలయ్యాయి. వీటిని జిల్లాలోని 32 బ్యాంకుల ద్వారా 2 లక్షల 51వేల ముగ్గురు రైతుల ఖాతాలకు జమచేయటం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని సుమారు నాలుగు వేల మంది రైతులకు, ఆన్లైన్ సౌకర్యం లేని సహకార సంఘాల్లో ఖాతా కలిగి ఉన్న 18 వేల మంది రైతులకు మొత్తం 22వేల 675 మందికి నష్టపరిహారం విడుదల కాలేదు. రెండో విడతలో వీరికి సాయం అందిస్తామంటున్నారు. తొలి విడతకే ఏడాది సమయం సరిపోలేదు. ఇక రెండో విడతకు ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు అధికారుల వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు(నాటు) పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న పంటకు హెక్టారుకు రూ.8 వేల 333 ఇన్పుట్ సబ్సిడీగా నిర్ణయించారు. అపరాల పంటలకు హెక్టారుకు రూ.6వేల 250, ఇసుక, మట్టి మేటలువేస్తే హెక్టారుకు రూ.3వేల 125 చొప్పున పరిహారం అందిస్తారు. ఆ సాయం పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతులు ఆశపడ్డారు. కానీ రబీలో రాలేదు, ఆతరువాత ఖరీఫ్‌లో అందలేదు. ప్రస్తుత రబీకి విత్తనాలు కొంటున్నప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు నారుమళ్లు వేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఇస్తే నాట్లు వేసేటప్పుడు కూలీల ఖర్చులకు, ఎరువుల కొనుగోలుకు ఆ సొమ్ము ఉపయోగపడుతుందని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ రైతు పేరు బోణం సుబ్బారావు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామం. గత ఖరీఫ్‌లో రెండున్నర ఎకరాల్లో మినుము, అర ఎకరంలో వరి పంట వేయగా చేతికందే సమయానికి నీలం తుపాను ముంచేసింది. అధికారులు నష్టపరిహారం రాస్తున్నారంటే అతనూ వెళ్లి పేరు నమోదు చేయించుకున్నాడు. బ్యాంకులో ఆన్లైన్ ఖాతా ఉండాలని అధికారులు అడిగితే దానినీ అందించాడు. కానీ ఏడాదిగా సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. గత రబీలోనూ సాగునీరు అందక పంటను కోల్పోయిన ఈ రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం మాత్రం సన్నగిల్లిపోతోంది. -
కష్టాల నడుమ రబీకి రెడీ
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్ : జిల్లాలో మూడు ఏళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల పాలవుతున్న రైతన్న తరతరాలుగా చేస్తున్న సాగును వదులుకోలేక కష్టాల మధ్య రబీకి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలను చవిచూసిన అన్నదాత ఆశలన్నీ రబీపైనే పెట్టుకొన్నాడు. కొంత మంది రైతులు ఇప్పుడిప్పుడే సాగుకు సన్నద్ధమవుతుండగా, మరి కొంతమంది రైతులు ఇప్పటి కే సాగు చేపట్టారు. ఖరీప్ సీజన్లో వరి పం టను ఎక్కువగా సాగు చేసే రైతులు రబీలో మాత్రం మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలపై దృష్టి సారిస్తున్నారు. చెరువులే ఆధారం ఇటీవల అధికంగా కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరింది. జిల్లాలో తొమ్మిది వేల చెరువులున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి వరి పంటకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోతుండడంతో రైతులు చెరువులపైనే అధారపడి రబీలో పంటలను వేస్తున్నారు. జిల్లాలో తాటిపూడి, జంఝావతి, ఆండ్ర రిజర్వాయర్లున్నాయి. వీటి ద్వారానే ఖరీప్‌లో వరి, ఇతర పంటలకు నీరు అందిస్తారు. అయితే రబీలో మాత్రం వరి పంటకు నీరు పూర్తి స్థాయిలో ఇవ్వడంలేదు. వీటి పరిధిలో 200 హెక్టార్లుకు మించి వరి పంటకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో అధిక శాతం చెరువులపైనే అధారపడి రబీలో పంట వేశారు. మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలకు సరిపడా నీటిని మాత్రమే విడుదలచేస్తున్నారు. రబీకి సంబంధించి వ్యవసాయశాఖ కూడా విత్తనాలును సిద్ధం చేసింది. అపరాలపైనే ఆసక్తి రైతులు ఎక్కువుగా మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రబీసీజన్‌లో వరి పంట సాధరణ విస్తీర్ణం 4,080 హెక్టార్లు కాగా, మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 9,885 హెక్టార్లు, కంది 11,286 హెక్టార్లు, పెసర 15,463 హెక్టార్లు, మినుము 15, 477 హెక్టార్లు. విత్తన కేటాయింపు వివరాలు వరి పంటకు సంబంధించి 1010 రకం 6,400 క్వింటాళ్లు కేటాయించగా 2,500 క్వింటాళు ్లజిల్లాకు వచ్చాయి. మొక్కజొన్న 1000 క్వింటాళ్లుకు గాను 150 క్వింటాళ్లు, వేరుశెనగ మూడు వేల క్వింటాళ్లుకుగాను 1450 క్వింటాళ్లు, మినుము 3700 క్వింటాళ్లకు గాను 673 క్వింటాళ్లు, పెసర 450 క్వింటాళ్లకుగాను 293 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయి. రాయితీ వివరాలు: 1010 రకం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ. 690 కాగా రూ.150 రాయితీ పోను రూ.540కి ఇస్తారు. మినుము కేజీ ధర రూ. 58 కాగా, రాయితీ రూ. 29 పోను రూ.29కు, పెసర కేజీ ధర రూ.72 కాగా, రాయితీ రూ.34 పోను రూ. 38కు. మొక్కజొన్న కేజీ ధర రూ.125కాగా, రాయితీ రూ.25 పోను రూ.100కి చెల్లిస్తారు. శెనగ ధర రూ.49.65కాగా రూ.26.35 రాయితీ పోను23.30 కి చెల్లిస్తారు. ప్రతీ ఏడాది నష్టాలే మూడేళ్లగా నష్టాలు తప్పడంలేదు. ఖరీప్‌లో ప్రతీ ఏడాది వరి పంట వేస్తున్నాం. అయితే మూడు ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఈఏడాది ఖరీప్‌లో వరి పంట వేశాను వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల పంట ఎండిపోయింది. రబీలో వరి పంట వేయకూడదని నిర్ణయించుకున్నాను. పెసర పంట వేయాలని నిర్ణయించుకున్నాను. - కర్రి అప్పలనాయుడు, రైతు రాకోడు వరి కలిసిరావడం లేదు వరి పంట కలిసిరావడం లేదు. ఖరీప్‌లో ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితిలేదు. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. రబీలో ఎకరం పొలంలో తేలిక పాటి వరి పంట వేయాలని అనుకుంటున్నాను. మిగిలిన రెండు ఎకరాల్లో మినుము పంట వేస్తాను - ఎస్.రామునాయుడు, రైతు, పినవేమలి రబీ పైనే ఆశలన్నీ రబీపైనే ఆశపెట్టుకున్నాను. నాకున్న రెండు ఎకరాలు పొలంలో ఖరీప్ సీజన్లో వరి పంట వేశాను. పెద్దగా కలిసిరాలేదు. రబీలోనైనా నష్టాన్ని భర్తీ చేసుకోవాలని పెసర పెంట వేయాలని నిర్ణయించుకున్నాను. ఇటీవల కురిసిన వర్షాలు వల్ల చెరువుల్లో నీరుచేరింది. -పి. అప్పారావు, రైతు, పెదవేమలి -
ముంపు ముప్పు తప్పిస్తాం : కలెక్టర్ సిద్ధార్థజైన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ భూములను ముంపు ముప్పునుంచి తప్పించడం.. రైతులను నష్టాల నుంచి గట్టెక్కించడమే తన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అందుకే డెల్టా ఆధునికీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా చేయించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించామని, దానిని క్రమపద్ధతిలో అమలు చేస్తామని తెలిపారు. ఏటా ఖరీఫ్ సీజన్లో డెల్టాలో ముంపు సమస్య ఏర్పడుతోందని,డెల్టా ఆధునికీకరణ చేపట్టడమే దీనికి పరిష్కారమని పేర్కొన్నారు. కాలువలతో పాటు డ్రెయిన్ల ఆధునికీకరణ పనులను కూడా ఒకేసారి చేపడతామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ తదితర ఎటువంటి ఇబ్బందులు లేని కీలకమైన కొన్ని పనులను గుర్తించామని వాటిని వెంటనే చేపడతామని చెప్పారు. భీమవరం మండలం లోసరి వద్ద రైతులు త్వరగా పంటను ముగించేందుకు సిద్ధమయ్యారని, సాగు పూర్తవగానే అక్కడ పనులు చేపడతామని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు సమీపంలో ఎర్రకాలువపై ఆక్విడెక్టు వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. డెల్టాలో అన్నిచోట్లా రైతులతో మాట్లాడి వారికి ఇబ్బందిలేని రీతిలో పనులు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రైతులు సహకరిస్తే ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుందని, వారు కొంత వెసులుబాటు ఇస్తే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని అన్నా రు. రైతులు సహకారం అందించినా కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆధునికీకరణ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ కార్యక్రమం లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 65 వేలకుపైగా మరుగుదొడ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడానికి ప్రా ధాన్యత ఇస్తామని చెప్పారు. జిల్లాలో బంగారుతల్లి పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని, తద్వారా రోగులకు వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తన విధి అని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. -
రైతు ఆవేదన పట్టని ప్రభుత్వం
సాక్షి, కొత్తగూడెం : ఏటా వచ్చే తుపాన్లు, అకాల వర్షాలు అన్నదాత బతుకును ఛిద్రం చేస్తున్నాయి. కళ్ల ముందే పంట వర్షార్పణం అవుతుండడం.. సాగుకు చేసిన అప్పులు తీరకపోవడంతో వారి జీవన చిత్రమే మారిపోతోంది. జల్, లైలా, నీలం తుపాన్ల దెబ్బనుంచి కోలుకోక ముందే ఇటీవలి అకాల వర్షానికి పంటఅంతా పోవడంతో రైతు ఆవేదన అంతాఇంతా కాదు. ప్రకృతి పగపట్టినట్లు ప్రతి సీజన్లో ఏదో ఒక విపత్తు వస్తున్నా రైతుపై ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. రైతుకు ఖరీఫ్ కలిసిరావడంలేదు. ఈ సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే తుపాన్లు అన్నదాత కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. చేతికి వచ్చే పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి ఇతర పంటలు వర్షార్పణం అవుతున్నాయి. దీంతో ఏటా రైతులకు కోలుకోలేని దెబ్బ పడుతుండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 2010 అక్టోబర్‌లో జల్ తుపాను సంభ వించింది. ఈ తుపానుతో సుమారు రెండు లక్షల ఎకరాల వరకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఇందులో కేవలం 34,022 ఎకరాలకు మాత్రమే నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపించింది. కాకి లెక్కలు వేసి 39,184 మంది రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 6.45 కోట్లు పరిహారం పంపిణీ చేశారు. ఈ పరిహారం అందించడంలో కూడా అప్పట్లో సంబంధిత శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. జల్ వెంటనే దాడిచేసిన లైలా తుపాను కూడా రైతుకు కన్నీరే మిగిల్చింది. ఇక 2011లో జిల్లా వ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పట్లో వర్షాభావంతో 4 లక్షల పైచిలుకు ఎకరాల్లో దిగుబడి తగ్గడంతో కాక, పత్తి, వరి పంటలు ఎండిపోయాయి. ఇప్పటికీ పరిహారం రైతుల దరిచేరలేదు. బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్లైన్లో తప్పులు ఉన్నాయనే నెపంతో రెండేళ్లయినా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని ఇప్పటికీ రూ. 17కోట్ల పంపిణీ చేయకుండా వదిలేశారు. నీలం పరిహారం గోరంత.. 2012 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురియడంతో పత్తి చేతికి అందకుండా పోయింది. మొత్తం 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ‘నీలం’ తుపానుఅనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలను సందర్శించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, కేంద్ర బృందం పర్యటించి ఇంతనష్టం ఎక్కడా జరుగలేదు.... ‘నీలం’ రైతులను నిండా ముంచిందని ప్రకటించారు. జిల్లాలో అంత నష్టం జరిగినా అంచనావేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా నష్టం కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రి, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా నోరెత్తలేదు. కొండంతం నష్టం జరిగితే గోరంత అంచనాతో సరిపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా.. కేవలం 27,247 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు చూపించారు. విపత్తు సంభవించి ఏడాది కావస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిహారం కింద రూ. 9.35 కోట్లు మంజూరు చేసింది. అయినా నేటికీ ప్రభుత్వం చూపిన లెక్కల ప్రకారం అర్హులైన రైతుల ఖాతాలో కూడా ఆ పరిహారం పడలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.. ఈనెలలో ఆరురోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లాలో అపారనష్టం జరిగింది. ప్రధానంగా పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బతగిలింది. జిల్లా వ్యాప్తంగా 3.37 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం సుమారు రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. వర్షంతో ఎక్కువగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. పంటను కోల్పోయామన్న వేదనతో జిల్లాలో ఇద్దరు రైతులు గుండె పోటుతో మరణిస్తే.. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి జిల్లాలో నష్టపోయిన రైతుల గోస పట్టదు. దీనికి తోడు 50 శాతం పైగా నష్టపోయిన పంటలనే పరిగణలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో రైతు గుండె బరువెక్కిపోతోంది. గుండె పగిలింది.. సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన ఈరైతు పేరు గడ్డికొప్పుల రామయ్య. ఇతనికి 3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మొక్కజొన్న సాగు చేయగా దీనికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ ఐదెకరాల్లో 3 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఐదెకరాలకు కౌలు రూ. 40వేలు కుదుర్చుకున్నాడు. రూ . లక్షా 20 వేలు అప్పు తెచ్చి ఈ పంటలను సాగు చేశాడు. అకాల వర్షంతో చేతికందిన పత్తి చేలోనే ముద్దయింది.. మొక్కజొన్న గింజలకు మొలకలొచ్చాయి.. పొట్టకొచ్చిన వరి నేలవాలింది. అంతే... రామయ్య గుండె చెదిరింది. గత ఏడాది అప్పుతో మొత్తంగా రూ. 2లక్షల రుణభారం ఒకవైపు, కుటుంబాన్ని ఎలా పోషించాలనే వేదన మరోవైపు అతనిని క్రుంగదీశాయి. ఈనెల 26వ తేదీ రాత్రి దిగాలుతో నిద్రకు ఉపక్రమించిన రామయ్య 27న పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. ఆరుబయట పోసిన మొక్కజొన్న పూర్తిగా మొలకలు రావటం చూశాడు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మొక్కజొన్న రాశిపైనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో విగత జీవిగా మారి మృత్యుఒడిలోకి జారుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోవటంతో భార్య రామనర్సమ్మ, కుమారులు ఉపేందర్, శ్రీహరి, వృద్ధతల్లి శాంతమ్మ శోకసంద్రంలో మునిగిపోయారు. -
వరికి మద్దతు ధర రూ.1310
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1310, గ్రేడ్-ఏకు రూ.1345గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సంస్థలతో 592 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రాథమిక గిరిజన పరపతి సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చే స్తున్నారు. నిర్ధారించిన కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల అనంతరం ఆ ధాన్యాన్ని సంబంధిత రైస్‌మిల్లులకు కస్టమ్‌మిల్లింగ్ చే సి అప్పగించేందుకు జిల్లాలో మిల్లులను గుర్తించారు. జిల్లాలో 257 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 51 రా రైస్‌మిల్లులను కస్టమ్ మిల్లింగ్ కోసం గుర్తించినట్లు ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రతి రైస్‌మిల్లరు తనకు జారీ చేయబడిన ఆకుపచ్చ రంగు కలిగిన రిలీజ్ ఆర్డర్, అందులో కేటాయించిన కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే సూచించిన పరిణామంలో వరిధాన్యం తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైస్‌మిల్లుల వారీగా కేటాయించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, అనుమతించిబడిన ధాన్యం పరిణామం తదతర వివరాలు కరీంనగర్ జిల్లా వెబ్సైట్ ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీలో చూసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల్లోని సీజన్లలో వరి ధాన్యం తీసుకొని కస్టమ్ మిల్లింగ్ చేయని రైస్‌మిల్లర్లకు, ప్రజా పంపిణీ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారనే అభియోగాలపై కేసు నమోదయిన మిల్లర్లకు ఈ సీజన్‌కు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. -
పై-లీన్ ఆందోళన
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పంటపై పై-లీన్ తుపాను ప్రభావం పడింది. వాతావరణంలో మార్పులతో తెగుళ్లు షురూ అయ్యాయి. దోమపోటు, మొగితెగులు, ఆకుముడత తెగులు సోకాయి. దీంతో రైతులు వేలాది రూపాయలు మందుల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దోమపోటు ముదిరితే పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టులో రెండేళ్లుగా సాగునీరు లేక పంటలు పండక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాగునీటిని విడుదల చేయగా పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న తరుణంలో తుపాను ప్రభావం రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వాప్తంగా ఖరీఫ్‌లో 1,43,917 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రానుంది. 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ దోమపోటు కారణంగా బీపీటీ(సాంబమసూరి) వరి దెబ్బతిని పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పురుగు మందులకు అదనపు డబ్బులు వెచ్చిస్తున్న రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. పెరిగిన ఖర్చులు.. ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతాంగానికి ఖర్చులు భారీగా పెరిగాయి. పై-లీన్ తుపానుకు ముందే రైతులు ఎకరానికి 6 కిలోల చొప్పున 240 రూపాయలు వెచ్చించి గుళికలు చల్లారు. ఆ తర్వాత కూడా తెగుళ్లకు ఎకరానికి 500 రూపాయల నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రైతు మూడు పర్యాయాలు మందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినందుకు ఎకరానికి మరో 300 అదనంగా ఖర్చు చేస్తున్నారు. సుమారుగా ఎకరానికి ఒకసారి మందు పిచికారి చేస్తేనే రెండు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వరికి సోకుతున్న తెగుళ్లు ఇవే.. ప్రస్తుతం వరికి ఆకుముడత, మొగితెగులు (కాండం తొలిచే పురుగు), పాముపొడ, దోమపోటు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను కారణంగా దోమపోటు షురూ అయ్యింది. దోమపోటు ఎక్కువైతే పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పు వల్లే తెగుళ్లు : శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ మిర్యాలగూడ పై-లీన్ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో వరికి దోమపోటు పెరిగే అవకాశం ఉంది. దోమపోటు పెరిగితే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా మందులు పిచికారీ చేసుకుంటే తెగుళ్లు నివారించుకోవచ్చు. ఆకుముడత తెగులు నివారణకు క్లోరైఫైరీపాస్ గానీ, కినాల్పాస్ గానీ ఎకరానికి 400 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. మొగితెగులు నివారణకు ఎకరానికి పాస్పామిడాన్ 400 మిల్లీ లీటర్లు గానీ, కార్పాస్హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేస్తే తగ్గిపోతుంది. దోమపోటు నివారణకు ఎస్సీఫ్యాక్ట్ 300 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా బుప్రోఫాజిన్ 300 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి. -
ఖరీఫ్‌లో రూ.520కోట్ల వ్యవసాయ రుణాలు
మధిర, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్లో రూ. 520 కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక డీసీసీ బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రైతులకు రూ. 420 కోట్ల రుణాలు ఇచ్చామని, మరో వందకోట్లు కలిపి ఈ ఖరీఫ్‌లో లక్షా 42వేల మంది రైతులకు రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ. 400 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చామని, మరో రూ. 120 కోట్లు ఇవాల్సి ఉందన్నారు. ఈ ఏడాది రూ. 100 కోట్ల వాణిజ్య రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, రూ. 6లక్షల రుణం మంజూరుచేస్తామన్నారు. పొలానికి సంబంధించి టైటిల్ డీడ్, పాస్‌బుక్ విధిగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో రూ. 56 లక్షలతో రైతు సంక్షేమ నిధిని ఏర్పాటుచేశామన్నారు. విపత్తులు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఈ సంక్షేమ నిధి నుంచి రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 33 సహకారం సంఘాల భవనాలను ఆధునికీకరణ చేస్తున్నామని, అందులో భాగంగా మధిర భ్యాంకకు రూ. 10 లక్షలు కేటాయించామన్నారు. రైతులకు జీఓ బ్యాలెన్స్ అకౌండ్తో ఖాతాలు తెరచి, ఆరునెలల్లో ఏటీఎం కారుడలు అందజేస్తామన్నారు. అనంతరం ఖమ్మంపాడు సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ బోజెడ్ల అప్పారావు, మధిర, దెందుకూరు సొసైటీ చైర్మన్లు బిక్కి కృష్ణప్రసాద్, మాదాల శరత్, ఖమ్మంపాడు చిలుకూరు, ఇల్లూరు గ్రామాల సర్పంచ్‌లు మువ్వా వెంకయ్యబాబు, నిడమానూరు జయమ్మ, కోట సుధారాణి, బ్యాంకు మేనేజర్ దిరిశాల ఆనందరావు, సూపర్వైజర్ మేదరమెట్ల నాగేశ్వరరావు, సీఈఓలు దొండపాటి వీరభద్రరావు, రామలింగేశ్వరరావు, విప్పా శ్రీనివాసరావు, ఎన్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.