కష్టాల నడుమ రబీకి రెడీ | all set for rabi season | Sakshi
Sakshi News home page

కష్టాల నడుమ రబీకి రెడీ

Published Sat, Dec 7 2013 3:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

all set for rabi season

  విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్ :
 జిల్లాలో మూడు ఏళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాల పాలవుతున్న రైతన్న తరతరాలుగా చేస్తున్న సాగును వదులుకోలేక  కష్టాల మధ్య రబీకి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలను చవిచూసిన అన్నదాత ఆశలన్నీ రబీపైనే పెట్టుకొన్నాడు.  కొంత మంది రైతులు ఇప్పుడిప్పుడే సాగుకు సన్నద్ధమవుతుండగా, మరి కొంతమంది రైతులు ఇప్పటి కే సాగు చేపట్టారు. ఖరీప్ సీజన్‌లో వరి పం టను ఎక్కువగా సాగు చేసే రైతులు రబీలో మాత్రం మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలపై దృష్టి సారిస్తున్నారు.
 
 చెరువులే ఆధారం
 ఇటీవల అధికంగా కురిసిన  వర్షాలకు  చెరువుల్లోకి నీరు చేరింది.  జిల్లాలో తొమ్మిది వేల చెరువులున్నాయి.  సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి వరి పంటకు  పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోతుండడంతో   రైతులు చెరువులపైనే అధారపడి రబీలో పంటలను వేస్తున్నారు. జిల్లాలో తాటిపూడి, జంఝావతి, ఆండ్ర రిజర్వాయర్‌లున్నాయి. వీటి ద్వారానే ఖరీప్‌లో వరి, ఇతర పంటలకు నీరు అందిస్తారు. అయితే రబీలో మాత్రం  వరి పంటకు నీరు పూర్తి స్థాయిలో ఇవ్వడంలేదు. వీటి పరిధిలో   200 హెక్టార్లుకు మించి వరి పంటకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో అధిక శాతం చెరువులపైనే అధారపడి రబీలో పంట  వేశారు. మొక్కజొన్న, అపరాలైన మినుము, పెసర వంటి పంటలకు సరిపడా నీటిని మాత్రమే విడుదలచేస్తున్నారు.  రబీకి సంబంధించి వ్యవసాయశాఖ కూడా విత్తనాలును సిద్ధం చేసింది.
 
 అపరాలపైనే ఆసక్తి
 రైతులు ఎక్కువుగా మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రబీసీజన్‌లో వరి పంట సాధరణ విస్తీర్ణం 4,080 హెక్టార్లు కాగా, మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 9,885 హెక్టార్లు, కంది 11,286 హెక్టార్లు, పెసర 15,463 హెక్టార్లు, మినుము 15, 477 హెక్టార్లు.
 
 విత్తన కేటాయింపు వివరాలు
 వరి పంటకు సంబంధించి 1010 రకం 6,400 క్వింటాళ్లు కేటాయించగా 2,500 క్వింటాళు ్లజిల్లాకు వచ్చాయి.  మొక్కజొన్న 1000 క్వింటాళ్లుకు గాను 150 క్వింటాళ్లు,  వేరుశెనగ మూడు వేల క్వింటాళ్లుకుగాను 1450 క్వింటాళ్లు, మినుము 3700 క్వింటాళ్లకు  గాను 673 క్వింటాళ్లు,  పెసర 450 క్వింటాళ్లకుగాను 293 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయి.
 
 రాయితీ వివరాలు:
 1010 రకం 30 కేజీల బస్తా పూర్తి ధర రూ. 690 కాగా రూ.150 రాయితీ పోను రూ.540కి ఇస్తారు. మినుము కేజీ ధర రూ. 58 కాగా, రాయితీ రూ. 29 పోను రూ.29కు,  పెసర కేజీ ధర రూ.72 కాగా, రాయితీ రూ.34 పోను రూ. 38కు. మొక్కజొన్న కేజీ ధర రూ.125కాగా, రాయితీ రూ.25 పోను రూ.100కి చెల్లిస్తారు. శెనగ ధర రూ.49.65కాగా రూ.26.35 రాయితీ పోను23.30 కి చెల్లిస్తారు.
 
 ప్రతీ ఏడాది నష్టాలే
 మూడేళ్లగా నష్టాలు తప్పడంలేదు. ఖరీప్‌లో ప్రతీ ఏడాది వరి పంట వేస్తున్నాం. అయితే   మూడు ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఈఏడాది ఖరీప్‌లో వరి పంట వేశాను వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల పంట ఎండిపోయింది.  రబీలో వరి పంట వేయకూడదని నిర్ణయించుకున్నాను. పెసర పంట వేయాలని నిర్ణయించుకున్నాను.
 - కర్రి అప్పలనాయుడు, రైతు రాకోడు
 వరి  కలిసిరావడం లేదు
 వరి పంట కలిసిరావడం లేదు. ఖరీప్‌లో ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితిలేదు.  నాకు మూడు ఎకరాల పొలం ఉంది. రబీలో ఎకరం పొలంలో తేలిక పాటి వరి  పంట వేయాలని అనుకుంటున్నాను. మిగిలిన రెండు ఎకరాల్లో మినుము పంట వేస్తాను
  - ఎస్.రామునాయుడు,
 రైతు, పినవేమలి
 రబీ పైనే ఆశలన్నీ
 రబీపైనే  ఆశపెట్టుకున్నాను. నాకున్న రెండు ఎకరాలు పొలంలో ఖరీప్ సీజన్‌లో వరి పంట వేశాను. పెద్దగా కలిసిరాలేదు. రబీలోనైనా నష్టాన్ని భర్తీ చేసుకోవాలని పెసర పెంట వేయాలని నిర్ణయించుకున్నాను. ఇటీవల కురిసిన వర్షాలు వల్ల చెరువుల్లో నీరుచేరింది.
 -పి. అప్పారావు,
 రైతు, పెదవేమలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement