సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్‌లోను మార్కెట్‌లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి.
సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్‌లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు.
564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్‌లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్‌లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు.
శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్‌లో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment