సాక్షి, ఏలూరు :
నీలం తుపాను విలయతాండవానికి పంటలు నీటిపాలై ఏడాది గడిచిపోయింది. అయినా ఇప్పటికీ నష్టపోయిన రైతుల్లో చాలామందికి పరిహారం అందలేదు. గత ఏడాది ఖరీఫ్ పంట కోల్పోయిన అన్నదాతలు రబీలో పరిహారం ఆదుకుంటుందనుకున్నారు. అప్పుడు రాలేదు. ఖరీఫ్‌లో ఆసరా అవుతుందనుకున్నారు. ఎట్టకేలకు ఎన్నికల్లో లబ్ధి కోసం ‘నీలం’ సాయం విడుదల చేసిన ప్రభుత్వం వాటిని రైతులకు చేర్చడంలో విఫలమైంది. కొందరికే సాయం విడుదల కాగా, వారిలో కొందరి ఖాతాలకే జమ అయ్యింది. గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచిపెట్టేసింది.
విపత్తు అనంతరం 3 లక్షల 31వేల 363 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 2.73 లక్షల మంది రైతులు నష్టపోయారని లెక్క తేల్చారు. రూ.557 కోట్లు నష్టంగా నిర్ధారించారు. దానికనుగుణంగా రూ.131.44 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. తొలివిడతగా రూ.122.97 కోట్లు విడుదలయ్యాయి. వీటిని జిల్లాలోని 32 బ్యాంకుల ద్వారా 2 లక్షల 51వేల ముగ్గురు రైతుల ఖాతాలకు జమచేయటం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని సుమారు నాలుగు వేల మంది రైతులకు, ఆన్‌లైన్ సౌకర్యం లేని సహకార సంఘాల్లో ఖాతా కలిగి ఉన్న 18 వేల మంది రైతులకు మొత్తం 22వేల 675 మందికి నష్టపరిహారం విడుదల కాలేదు. రెండో విడతలో వీరికి సాయం అందిస్తామంటున్నారు. తొలి విడతకే ఏడాది సమయం సరిపోలేదు. ఇక రెండో విడతకు ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు అధికారుల వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు(నాటు) పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న పంటకు హెక్టారుకు రూ.8 వేల 333 ఇన్‌పుట్ సబ్సిడీగా నిర్ణయించారు. అపరాల పంటలకు హెక్టారుకు రూ.6వేల 250, ఇసుక, మట్టి మేటలువేస్తే హెక్టారుకు రూ.3వేల 125 చొప్పున పరిహారం అందిస్తారు. ఆ సాయం పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతులు ఆశపడ్డారు. కానీ రబీలో రాలేదు, ఆతరువాత ఖరీఫ్‌లో అందలేదు. ప్రస్తుత రబీకి విత్తనాలు కొంటున్నప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు నారుమళ్లు వేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఇస్తే నాట్లు వేసేటప్పుడు కూలీల ఖర్చులకు, ఎరువుల కొనుగోలుకు ఆ సొమ్ము ఉపయోగపడుతుందని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
ఈ రైతు పేరు బోణం సుబ్బారావు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామం. గత ఖరీఫ్‌లో రెండున్నర ఎకరాల్లో మినుము, అర ఎకరంలో వరి పంట వేయగా చేతికందే సమయానికి నీలం తుపాను ముంచేసింది. అధికారులు నష్టపరిహారం రాస్తున్నారంటే అతనూ వెళ్లి పేరు నమోదు చేయించుకున్నాడు. బ్యాంకులో ఆన్‌లైన్ ఖాతా ఉండాలని అధికారులు అడిగితే దానినీ అందించాడు. కానీ ఏడాదిగా సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. గత రబీలోనూ సాగునీరు అందక పంటను కోల్పోయిన ఈ రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం మాత్రం సన్నగిల్లిపోతోంది.
ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..!
Published Fri, Dec 20 2013 7:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement