neelam cyclone
-
ఏజెన్సీ రైతులకు ‘నీలం’ చెక్కులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు గిరిజన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించింది. 2011 నాటి నీలం తుపానుకు పరిహారంగా మూడో దశలో రూ.4.61 కోట్లు విడుదల చేసింది. ఏజెన్సీ11 మండలాల్లోని 28,103 మంది రైతులకు చెక్కుల రూపంలో వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ నిధులు ఖజానా శాఖకు చేరాయి. ఒకటి రెండు రోజుల్లో మండలాలవారీ రెవెన్యూ,వ్యవసాయశాఖ అధికారుల జాయింట్ అకౌంట్లలోకి జమకానున్నాయి. నెల రోజుల్లో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధి హామీ చెల్లింపుల్లో మాదిరి విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. రెండేళ్ల తరువాత పరిహారం 2011 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల ఆహార పంటలు నీట మునిగి 1,45,487 మంది రైతులు నష్టపోయారు. ఆహార, ఉద్యానవన పంటలకు రూ.97.8 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడి రాయితీ కోసం కేవలం రూ.30.24 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మొదటి దశలో 13,724.95 హెక్టార్లలో జరిగిన పంట నష్టానికి 57,080 మంది రైతులకు రూ.13.34 కోట్లు, చాలా కాలం తరువాత రెండో దశలో 10,862 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు 49,101 మంది రైతులకు రూ.10.6 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యానవన పంటలకు రూ.4.12 కోట్లకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.67 లక్షలు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఏజెన్సీలో పంట నష్టపోయిన 28,013 మంది రైతులకు ఒక్క పైసా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ముందు మాన్యువల్‌గా ఈ పరిహారాన్ని చెల్లించినా.. ఆ తరువాత రైతుల బ్యాంకు అకౌంట్లలోనే నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకు సేవలు లేకపోవడంతో రైతులకు రూ.4.61 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. చెక్కుల ద్వారా వీరికి పరిహారాన్ని పంపిణీకి అనుమతించాలని అధికారులు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పటికి కనికరించి చెక్కుల ద్వారా పంపిణీకి రూ.4.61కోట్లు విడుదల చేసింది. కమిటీ ఏర్పాటు పరిహారం అందజేతకు ‘గ్రామ చెక్కుల పంపిణీ కమిటీ’ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఐటీడీఏ పీవోతో చర్చించారు. సర్పంచ్ , వీఆర్వో, ఏఈవోతో పాటు స్థానిక రైతులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కమిటీలు లబ్ధిదారుల జాబితా అనుగుణంగా చెక్కుల పంపిణీ చేస్తారు. ఇందులో వారసత్వ లబ్ధిదారుల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాత, తండ్రి పేరున ఉన్న భూములను కుటుంబ సభ్యులు తమపేరున మార్చుకోకుండా వాటిలో సాగు చేసుకుంటున్నారు. అటువంటి లబ్ధిదారులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు వారసత్వ ధ్రువీకరణ పత్రం(లీగల్హేర్) తీసుకోవాల్సి ఉంటుంది. కమిటీలో వీఆర్వో కూడా ఉండడంతో ఈ ప్రక్రియ కొంత వరకు సులభతరం కానుంది. -
ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..!
సాక్షి, ఏలూరు : నీలం తుపాను విలయతాండవానికి పంటలు నీటిపాలై ఏడాది గడిచిపోయింది. అయినా ఇప్పటికీ నష్టపోయిన రైతుల్లో చాలామందికి పరిహారం అందలేదు. గత ఏడాది ఖరీఫ్ పంట కోల్పోయిన అన్నదాతలు రబీలో పరిహారం ఆదుకుంటుందనుకున్నారు. అప్పుడు రాలేదు. ఖరీఫ్‌లో ఆసరా అవుతుందనుకున్నారు. ఎట్టకేలకు ఎన్నికల్లో లబ్ధి కోసం ‘నీలం’ సాయం విడుదల చేసిన ప్రభుత్వం వాటిని రైతులకు చేర్చడంలో విఫలమైంది. కొందరికే సాయం విడుదల కాగా, వారిలో కొందరి ఖాతాలకే జమ అయ్యింది. గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచిపెట్టేసింది. విపత్తు అనంతరం 3 లక్షల 31వేల 363 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 2.73 లక్షల మంది రైతులు నష్టపోయారని లెక్క తేల్చారు. రూ.557 కోట్లు నష్టంగా నిర్ధారించారు. దానికనుగుణంగా రూ.131.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. తొలివిడతగా రూ.122.97 కోట్లు విడుదలయ్యాయి. వీటిని జిల్లాలోని 32 బ్యాంకుల ద్వారా 2 లక్షల 51వేల ముగ్గురు రైతుల ఖాతాలకు జమచేయటం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని సుమారు నాలుగు వేల మంది రైతులకు, ఆన్లైన్ సౌకర్యం లేని సహకార సంఘాల్లో ఖాతా కలిగి ఉన్న 18 వేల మంది రైతులకు మొత్తం 22వేల 675 మందికి నష్టపరిహారం విడుదల కాలేదు. రెండో విడతలో వీరికి సాయం అందిస్తామంటున్నారు. తొలి విడతకే ఏడాది సమయం సరిపోలేదు. ఇక రెండో విడతకు ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు అధికారుల వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు(నాటు) పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్న పంటకు హెక్టారుకు రూ.8 వేల 333 ఇన్పుట్ సబ్సిడీగా నిర్ణయించారు. అపరాల పంటలకు హెక్టారుకు రూ.6వేల 250, ఇసుక, మట్టి మేటలువేస్తే హెక్టారుకు రూ.3వేల 125 చొప్పున పరిహారం అందిస్తారు. ఆ సాయం పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతులు ఆశపడ్డారు. కానీ రబీలో రాలేదు, ఆతరువాత ఖరీఫ్‌లో అందలేదు. ప్రస్తుత రబీకి విత్తనాలు కొంటున్నప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు నారుమళ్లు వేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఇస్తే నాట్లు వేసేటప్పుడు కూలీల ఖర్చులకు, ఎరువుల కొనుగోలుకు ఆ సొమ్ము ఉపయోగపడుతుందని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ రైతు పేరు బోణం సుబ్బారావు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామం. గత ఖరీఫ్‌లో రెండున్నర ఎకరాల్లో మినుము, అర ఎకరంలో వరి పంట వేయగా చేతికందే సమయానికి నీలం తుపాను ముంచేసింది. అధికారులు నష్టపరిహారం రాస్తున్నారంటే అతనూ వెళ్లి పేరు నమోదు చేయించుకున్నాడు. బ్యాంకులో ఆన్లైన్ ఖాతా ఉండాలని అధికారులు అడిగితే దానినీ అందించాడు. కానీ ఏడాదిగా సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. గత రబీలోనూ సాగునీరు అందక పంటను కోల్పోయిన ఈ రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం మాత్రం సన్నగిల్లిపోతోంది. -
'త్వరలో నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి విడుదల'
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు. డిసెంబర్ 10లోగా హెలెన్, లెహర్ తుఫాన్ నష్ట తీవ్రతపై అంచనా నివేదికలను పంపాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను రఘువీరా రెడ్డి ఆదేశించారు. నీలం తుఫాన్ ఇన్పుట్ సబ్సిడి రూ. 437 కోట్లు పెండింగ్‌లో ఉందని, రెండు రోజుల్లో ఆ సబ్సిడిని విడుదల చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు.