విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు గిరిజన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించింది. 2011 నాటి నీలం తుపానుకు పరిహారంగా మూడో దశలో రూ.4.61 కోట్లు విడుదల చేసింది. ఏజెన్సీ11 మండలాల్లోని 28,103 మంది రైతులకు చెక్కుల రూపంలో వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ నిధులు ఖజానా శాఖకు చేరాయి. ఒకటి రెండు రోజుల్లో మండలాలవారీ రెవెన్యూ,వ్యవసాయశాఖ అధికారుల జాయింట్ అకౌంట్లలోకి జమకానున్నాయి. నెల రోజుల్లో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధి హామీ చెల్లింపుల్లో మాదిరి విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
రెండేళ్ల తరువాత పరిహారం
2011 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల ఆహార పంటలు నీట మునిగి 1,45,487 మంది రైతులు నష్టపోయారు.
ఆహార, ఉద్యానవన పంటలకు రూ.97.8 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడి రాయితీ కోసం కేవలం రూ.30.24 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
మొదటి దశలో 13,724.95 హెక్టార్లలో జరిగిన పంట నష్టానికి 57,080 మంది రైతులకు రూ.13.34 కోట్లు, చాలా కాలం తరువాత రెండో దశలో 10,862 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు 49,101 మంది రైతులకు రూ.10.6 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
ఉద్యానవన పంటలకు రూ.4.12 కోట్లకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.67 లక్షలు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది.
ఏజెన్సీలో పంట నష్టపోయిన 28,013 మంది రైతులకు ఒక్క పైసా ఇప్పటి వరకు విడుదల చేయలేదు.
ముందు మాన్యువల్‌గా ఈ పరిహారాన్ని చెల్లించినా.. ఆ తరువాత రైతుల బ్యాంకు అకౌంట్లలోనే నేరుగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గిరిజన ప్రాంతాల్లో బ్యాంకు సేవలు లేకపోవడంతో రైతులకు రూ.4.61 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు.
చెక్కుల ద్వారా వీరికి పరిహారాన్ని పంపిణీకి అనుమతించాలని అధికారులు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పటికి కనికరించి చెక్కుల ద్వారా పంపిణీకి రూ.4.61కోట్లు విడుదల చేసింది.
కమిటీ ఏర్పాటు
పరిహారం అందజేతకు ‘గ్రామ చెక్కుల పంపిణీ కమిటీ’ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఐటీడీఏ పీవోతో చర్చించారు.
సర్పంచ్ , వీఆర్వో, ఏఈవోతో పాటు స్థానిక రైతులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కమిటీలు లబ్ధిదారుల జాబితా అనుగుణంగా చెక్కుల పంపిణీ చేస్తారు.
ఇందులో వారసత్వ లబ్ధిదారుల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాత, తండ్రి పేరున ఉన్న భూములను కుటుంబ సభ్యులు తమపేరున మార్చుకోకుండా వాటిలో సాగు చేసుకుంటున్నారు. అటువంటి లబ్ధిదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులకు వారసత్వ ధ్రువీకరణ పత్రం(లీగల్‌హేర్) తీసుకోవాల్సి ఉంటుంది. కమిటీలో వీఆర్వో కూడా ఉండడంతో ఈ ప్రక్రియ కొంత వరకు సులభతరం కానుంది.
ఏజెన్సీ రైతులకు ‘నీలం’ చెక్కులు
Published Wed, Jan 22 2014 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement