
శాలిగౌరారం (నకిరేకల్): రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి సంతాప సభకు ఉత్తమ్ హాజరై మాట్లాడారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కష్టాల్లో ఉన్న కర్షకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్‌ఎస్ సర్కార్ కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఏ కష్టం రాకుండా వారి కళ్లలో సంతోషాన్ని చూడటమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment