సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. సీఎంకు తొత్తులుగా ఉన్న అధికారులకు ఈ వేదిక ద్వారా హెచ్చరికలు పంపుతున్నామని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్త ఊరుకోమని అన్నారు. ఒక బీసీ నాయకుడు హత్యకు గురైతే సీఎంకు కనీసం విచారం వ్యక్తం చేసే తీరిక లేకపోవడం దారుణమన్నారు. జిల్లా మంత్రికి ఈ కేసులో భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. హత్య కేసులో ఎందుకు కాల్ డేటా బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ హత్య కేసులో నిందితులను కాపాడే అవసరం ఎవరికి ఉందని, నిందితులకు ఐదురోజుల్లోనే బెయిల్ వచ్చిందని అన్నారు.
స్థానిక పోలీసుల మీద శ్రీనివాస్ కుటుంబానికి ప్రజలకు నమ్మకం లేదని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. ఈ హత్య నేపథ్యంలో బడుగు, బలహీనులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్రపతికి వివరించబోతున్నామని చెప్పారు.
సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అణిచివేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు అహంకారంతో జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్యతో ప్రభుత్వం ప్రతిష్టను దిగజారిందన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ఉన్నారనడానికి శ్రీనివాస్ సంతాప సభ సంకేతమే పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యపై ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment