మంచిర్యాల బహిరంగ సభకు హాజరైన ప్రజలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న ఉత్తమ్
మంచిర్యాల టౌన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వారిని మోసం చేసారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు, కార్మికుల పిల్లలకు వారసత్వ కొలువులు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటు, కార్మికులకు ఐటీ మినహాయింపు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుంది. గతంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ మేం నెరవేర్చుతాం. ఇప్పటికైనా కేసీఆర్‌ను ఆ పార్టీని సింగరేణి కార్మికులు నమ్మవద్దు. మా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జైపూర్ పవర్‌ప్లాంట్‌ను నిర్మిస్తే.. అది తామే చేసినట్లుగా కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరం. ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించి ఆ పనులన్నింటినీ వారే చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు’’అని ఆరోపించారు.
రైతుబంధుకు వందల కోట్ల ప్రచారమా?
రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఏ మేర లబ్ధి చేకూరుతుందో తెలియదని, కానీ ప్రచారం పేరిట ప్రభుత్వం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కోట్ల రూపాయలతో యాడ్స్‌కు ఖర్చు చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవుగానీ, ప్రచారానికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి డబ్బులు లేవన్న సీఎం మరి వందల కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రైతుబంధు కింద రైతులకు సాయం చేయడానికి తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు.
నాలుగేళ్లలో కనీసం ఒక్క ఏడాది కూడా రైతులను పట్టించుకోకుండా ఎన్నికలు వచ్చే సమయంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేశారు. వరి, జొన్నలు, సజ్జలకు కేంద్రం మద్దతు ధర ఎంత ఇచ్చి నా, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా డబ్బులు కలిపి రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేలు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లక్షకు పైగా ఉద్యోగాలను ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, అక్రెడిటేషన్ల మంజూరు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, జర్నలిస్టులకు సంక్షేమ నిధి వంటివి అధికారంలోకి రాగానే విస్మరించిందని అన్నారు. సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, మల్లు రవి, జిల్లా వ్యవహారాల నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గడ్డం అరవిందరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment