
రైతు రాజ్యానాయక్
కేసముద్రం (మహబూబాబాద్): మార్కెట్‌లో 10 రోజులుగా పడిగాపులు పడుతున్న ఓ మక్క రైతు ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు రాజ్యానాయక్ తను పండించిన 170 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకొచ్చాడు. 10 రోజులు గడుస్తున్నా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం బలరాం నాయక్, జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం మార్కెట్‌ను సందర్శించింది.
యార్డులో రాశులను పరిశీలిస్తూ రైతు రాజ్యానాయక్ వద్దకు రాగా, అతడు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యాడు. తనకు చావే గతి అంటూ కండువాను మెడకు బిగించుకోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా స్పృహతప్పి మక్కలరాశిపైనే పడిపోయాడు. కంగుతిన్న కాంగ్రెస్ నేతలు, సిబ్బంది అతడి మెడకున్న కండువాను తొలగించి.. నీళ్లు చల్లి లేపారు. ఆ తర్వాత సీఈవో మల్లారెడ్డిని పిలిపించి ప్రశ్నించడంతో, ఆ మక్కలను ఎంపిక చేసి చిట్టీ ఇచ్చాడు.