ఐదు ఉమ్మడి జిల్లాల పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇన్‌చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పోస్టింగులు, బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సమర్థులైన అధికారులను ప్రభుత్వమే గుర్తించి అవసరమైనచోట వారి సేవలు ఉపయోగించుకుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా నిఘా యంత్రాంగం దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలని మంత్రులు,ఎమ్మెల్యేలతో అన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని హితవు పలికారు.
ప్రతీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. నిధుల ప్రాథమ్యాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగిస్తామన్నారు. ఇన్‌చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 లోక్‌సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment