
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం..
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.
ప్రభుత్వం- పార్టీ మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంతో పీఏసీ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికలపై, నామినేటెడ్ పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై పీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే.. బోయినపల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పచెప్పే ప్రకటనలు పీఏసీలోనే చేస్తారని తెలుస్తోంది. మరోవైపు..
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు(19న) ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరణ