వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్‌లో రూ.109 కోట్ల వేరుశెనగ పంట నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. జిల్లాలోని 33 మండలాల్లో వర్షాధారం కింద 1.58 లక్షల మంది రైతులు 1.09 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం నివేదికలు పంపింది.
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్‌లో రూ.109 కోట్ల వేరుశెనగ పంట నష్టపోయినట్టు జిల్లా వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. జిల్లా వ్యాప్తంగా 2013 ఖరీఫ్ సీజన్‌లో 1.45 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 1.39 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంట నష్టపోయారు. తూర్పు మండలాల్లో నీటి ఆధారిత కింద 30 వేల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట మాత్రమే రైతుల చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు మూడు విడతల్లో జిల్లాలోని 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు నివేదికలు పంపారు. తొలి విడతగా 14, మలి విడతలో 23 మండలాల్లో కరువు ఏర్పడినట్టు తేల్చారు. అయితే నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో తుది విడతగా మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు కలెక్టర్ ప్రభుత్వానికి పంపారు.
33 మండలాల్లోనే కరువు
జిల్లా వ్యవసాయ, ప్రణాళిక, రెవెన్యూశాఖలు సంయ్తుంగా నిర్వహించిన వేరుశెనగ పంట నష్టం సర్వేల్లో జిల్లాలోని 52 మండలాల్లో కరువు నెలకొన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కరువు కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించింది. అలాగే రాష్ట్ర స్థాయి బృందం సేకరించిన కరువు పరిస్థితుల వివరాలతో పోల్చి చూసింది. కేవలం 33 మండలాల్లోనే కరువు ఛాయలు నెలకొన్నట్లు నిర్ధారించింది. బి.కొత్తకోట, పెద్దమండ్యం, కలకడ, చౌడేపల్లె, శాంతిపురం, రామకుప్పం, వి.కోట, నిమ్మనపల్లె, కుప్పం, పుంగనూరు, గుడుపల్లె, సోమల, రొంపిచెర్ల, రామసముద్రం, పీటీఎం, కేవీపల్లె, ములకలచెరువు, కలికిరి, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, చిన్నగొట్టిగల్లు, బెరైడ్డిపల్లె, పీలేరు, మదనపల్లె, పులిచెర్ల, కురబలకోట, చిత్తూరు, గుడిపాల, యాదమరి, తవణంపల్లె, ఐరాల, సదుం, పూతలపట్టు మండలాలను కరువు ప్రాంతాలుగా ఈ నెల 3న ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మండలాల్లో వర్షాధారం కింద 1.58 లక్షల మంది రైతులు 1.09 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. బాధిత రైతులకు పంట నష్టం చెల్లింపు, పంట రుణాల రీషెడ్యూల్, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ రాంగోపాల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం నివేదికలు పంపినట్లు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ జె.రవికుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
వేరుశెనగ పంట నష్టం రూ.109 కోట్లు
Published Mon, Jan 20 2014 2:57 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement