24 రకాలు కాసే మామిడి చెట్టులో ఒకే గుత్తిలో కాసిన మల్లిక, నీలం కాయలను చూపుతున్న సిద్ధారెడ్డి
సేంద్రియ ఎరువులతో ఓ రైతు మామిడి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నీటి వసతి సరిపోనప్పటికీ సొంత పరిజ్ఞానంతో టన్నుల కొద్దీ దిగుబడి సాధిస్తూ ఔరా! అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. మామిడిలో రకరకాలు అంటుకట్టి, అధిక దిగుబడులు సాధించడంలో వ్యవసాయ సిద్ధుడుగా పేరొందాడు. రెండు రకాల మామిడికి అంటుకట్టడం సహజం. ఆయన మాత్రం ఒకే చెట్టుకు 24 రకాల మామిడి కాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తొమ్మిదెకరాల్లో ఈసారి 70–80 టన్నుల దిగుబడి సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు.
పాకాల మండలం దాసర్లపల్లెకు చెందిన సిద్ధారెడ్డికి వ్యవసాయమంటే అమితమైన ఆసక్తి. 15 ఏళ్ల క్రితం 9 ఎకరాల్లో 750 మామిడి మొక్కలు నాటారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచితంగా ఇచ్చిన తోతాపురి(బెంగళూర), బేనీషా (బంగినపల్లి) రకం మామిడి మొక్కలు నాటారు. వీటితో పాటు తోట చుట్టూ రక్షణగా టేకుచెట్లు నాటారు. మామిడి సాగుకు తగినంత నీటి లభ్యత వ్యవసాయ బావిలో లేకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. రోజంతా ఊరితే వచ్చే 30 బిందెల నీళ్లు సరిపోక, గ్రామంలో బోరు వద్ద వృథా అయ్యే నీటిని బారెల్‌లో నింపుకుని చెట్లకు పోసేవారు. దూరంలోని నీటికుంట నుంచి కావడి మోసి 50 బిందెల నీటిని తెచ్చేవారు. ఆయన కష్టానికి చెట్లన్నీ బతికాయి. 4 ఏళ్లకు తొలి పంట కళ్లచూశారు. బేనీషా సరైన దిగుబడి రాకపోవడంతో ఆ మొక్కలను తొలగించి బెంగళూర నాటారు.
తొలుత వేపాకు ట్రీట్‌మెంట్
నవంబర్ : తోట చుట్టూ రక్షణ కంచెగా టేకుతోపాటు వేపకాయలతో సహా ఆకులను కత్తిరించి, చెట్ల మొదలుకు చుట్టూ మూరెడు దూరంలో పాదులు తీసి, 3–5 కిలోల చొప్పున వేసి, రొటొవేటర్‌తో తొక్కించి కప్పెడతారు. నీటి తడులకు, వర్షాలకు ఇది బాగా కుళ్లుతుంది. 50–60 రోజుల తర్వాత దీనిని ట్రాక్టర్లతో తిరగేస్తారు.
గోమూత్రం, సీతాఫలం ఆకులతో ద్రావణం తయారీ
డిసెంబర్ : నీటి తొట్టెలు, కడవల్లో సీతాఫలం చెట్ల ఆకులను గోమూత్రంలో కలిపి మొత్తం 300 లీటర్ల ద్రావణం తయారు చేస్తారు. పదిలీటర్ల నీటికి లీటరు చొప్పున ద్రావణం కలిపి డిసెంబర్ చివరి, జనవరి తొలివారంలో చెట్లకు పిచికారీ చేస్తారు.
ఫలదీకరణకు భలే ఐడియా!
ప్రతి 75 చెట్ల వరుసకు ఒకటి చొప్పున ఎక్కువగా మామిడి పూత పూయడానికి మల్‌గూబ మొక్కలు నాటారు. మల్‌గూబ రకానికి కాలేపాడు, ఖాదర్, నీలేషా తదితరాలను అంటుకట్టారు. ఈ చెట్లకు పూత విరగకాసి తేనెటీగలు, హమ్మింగ్ బర్ట్స్, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తున్నాయి. ఈ చెట్ల పూతపై వాలి ఇతర మామిడి చెట్లపై తేనెటీగలు, సీతాకోకచిలుకలు వాలుతుండడంతో పరపరాగ సంపర్కానికి ఇవి బాగా దోహదపడుతున్నాయి. ఇదే రసాయన మందులు పిచికారీ చేస్తే రైతుకు మేలు చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకల మనుగడకు ప్రతికూలమయ్యేది.
సేంద్రియం.. చెట్లకు జవసత్వం
జనవరి–ఫిబ్రవరి : 9 ట్రాక్టర్ల పశువుల పేడ, మూడు ట్రాక్టర్ల చొప్పున ఎర్రమట్టి, గొర్రెలు, మేకల పెంటికలు..బాగా కలిపి సేంద్రియ ఎరువు సిద్ధం చేస్తారు. పశువుల పేడ, గొర్రెలు, మేకల పెంటికలు పరిసర గ్రామాల వారి నుంచి కొనుగోలు చేస్తారు. జనవరి, ఫిబ్రవరి నాటికి గోళీగుండు సైజు మామిడి పిందెలతో ఉన్న చెట్లకు ఈ సేంద్రియ ఎరువును చెట్ల సైజును బట్టి 40–60–100 కిలోల చొప్పున చెట్టు చుట్టూ వేస్తారు.
అంటుకట్టడంలో దిట్ట
మామిడి చెట్లకు అంటుకట్టడంలో సిద్ధారెడ్డి దిట్ట. రెండేసి రకాలు కాసే మామిడి చెట్లు 10 ఉండగా, ఏకంగా 24 రకాల మామిడి కాయలు కాసే చెట్టు కూడా ఉండటం ఈయన తోట ప్రత్యేకత. వాల్మీకి మహర్షి 24 అక్షరాలతో 24వేల శ్లోకాలతో రామాయాణాన్ని రాశారని, అది స్ఫూర్తిగా తీసుకుని తానూ ఒకే చెట్టుకు 24 రకాల కాయలు కాసేలా అంటుకట్టినట్లు చెప్పారు.
డ్రిప్‌తో చెట్లకు నీరు
వ్యవసాయ బావిలో నీటి లభ్యత అతితక్కువగా ఉండడంతో అందులోనే 1003 అడుగుల లోతుతో బోరు వేశారు. రోజంతా కలిపి వచ్చేది మహా అయితే 50 నుంచి 60 బిందెల నీళ్లే! ఈ తక్కువ నీటిని చాలా పొదుపుగా డ్రిప్ విధానంలో వినియోగించడానికి 750 మామిడి చెట్లను 13 సెక్షన్లుగా విభజించారు. ఒకసారి చెట్టుకు డ్రిప్ పెడితే ఆ చెట్టుకు మళ్లీ వారం తర్వాత నీటి తడి ఇచ్చేలా ఏర్పాటు చేశారు. సొంత ఐడియాతో 1/2 ఇంచీల పైపులను వాడారు. వీటికంటూ పైపులతో ఒక గేట్‌వాల్‌ను తయారు చేశారు.
సేంద్రియ పద్ధతులతో లాభాలు
టెన్త్ వరకూ చదువుకున్నా. సేంద్రియ పద్ధతుల్లో మామిడి పెంపకం మొదలెట్టాను. పట్టాభిరెడ్డి మామిడి సాగులో మెళకువలు నేర్పారు. మామిడి చెట్లు నాటేటప్పుడే తోట చుట్టూ 450 టేకు చెట్లు నాటా. వేపచెట్లు, తాటిచెట్లూ కొన్ని ఉండాయి. పెనుగాలి వీచినా తగలకుండా ఇవి అడ్డుకుంటూ ఉండటం వలన కాయలు రాల వు. చెట్టును పూర్తిగా పశుపక్ష్యాదులకే వది లేశా. తొలి ఫలసాయం రూ.3,600 మాత్రమే. రెండో సంవత్సరం రూ.4,500, ఆ తర్వాత రూ.10వేల నుంచి లక్షకు పెరిగింది. ఈసారి 70–80 టన్నులతో 5లక్షలకు పైగానే వస్తాది. 24 రకాల కాయలు కాసే చెట్టు ఇంటి అవసరాలకు పెట్టుకున్నా. – సిద్ధారెడ్డి
కోతకు సిద్ధం
ఇప్పటికే తోతాపురి కాయలు మంచి సైజులో ఉన్నాయి. జూన్ తొలివారం నుంచి కోతలు మొదలెట్టే నాటికి సగటున 500 గ్రాముల నుంచి 700–800 గ్రాముల పైచిలుకు బరువు తూగేలా కనిపిస్తున్నాయి. గత ఏడాది 59 టన్నుల దిగుబడి రాగా, ఈసారి 70–80 టన్నుల వరకూ వస్తుందని అంచనా వేసినట్లు సిద్ధారెడ్డి చెప్పారు.
– పోసిమిరెడ్డి శాంసన్ సుధాకర్‌రెడ్డితిరుపతి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment