కాకి లెక్కలు చెప్పొద్దు
► కచ్చితమైన లెక్కలు ఇవ్వకపోతే క్షమించేది లేదు
► వ్యవసాయశాఖ జేడీపై కలెక్టర్ సీరియస్
చిత్తూరు (కలెక్టరేట్): ‘కాకి లెక్కలు చెప్పకండి, వాస్తవాలు చెబితే ఇరుక్కుంటామని చెప్పడం లేదా? కచ్చితమైన లెక్కలు చూపకపోతే క్షమించేది లేదు’ అంటూ కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, స్థితిగతులు, గత ఏడాది చేపట్టిన, ఈ ఖరీఫ్‌కు చేపట్టాల్సిన పనుల వివరాలపై చర్చించారు.
ఈ విషయాలను జేడీ విజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. అయితే జిల్లాలో మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం, సాధారణ విస్తీర్ణం, ఉద్యానపంటల విస్తీర్ణం, ఇరిగేషన్ పరిధిలోని విస్తీర్ణం తదితరాల లెక్కలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చూపారు. సాధారణ విస్తీర్ణం కింద 2.20 లక్షల హెక్టార్లు చూపుతూ, వేరుశనగకు 1.39 లక్షల హెక్టార్లు, తృణధాన్యాలు కింద 42 వేల హెక్టార్లు చూపి, మిగిలిన పంటలకు సరైన లెక్కలు చూపలేదు. అదేగాక గత ఖరీఫ్‌లో రెయిన్ గన్స్ ద్వారా వేరుశనగకు తడులు ఇచ్చిన విస్తీర్ణం, వరిలో డ్రమ్ సీడర్స్‌కు సంబంధించిన ఖర్చులపై కూడా లెక్కలు పొంతన లేదు.
దీనిపై కలెక్టర్ పదే పదే నిశితంగా పరిశీలిస్తూ లెక్కలు అడగ్గా జేడీ చెప్పలేక నీళ్లు నమిలారు. మీరు చెప్పే లెక్కలు చూస్తే ఉత్పత్తి పెరగాలి, అయినా పెరిగినట్లు చూపడం లేదని, వాస్తవాలు చెబితే ఇరుక్కుంటామని చెప్పడం లేదా అంటూ జేడీతోపాటు ఏపీఎంఐపీ పీడీ ధర్మజను నిలదీశారు. వెంటనే తనకు కచ్చితమైన లెక్కలు ఇవ్వాలి, లేదంటే క్షమించేది లేదంటూ కలెక్టర్ హెచ్చరించారు.
వెనక్కి మళ్లిన నిధులు
వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందించే యాంత్రీకరణ పరికరాల మంజూరులో సరైన లెక్కలు చూపనందున గత ఏడాదికి మంజూరైన రూ.6.50 కోట్ల మేరకు నిధులు వెనక్కి మళ్లినట్టు తెలుస్తోంది. అదేగాక జేడీ వద్ద ప్రత్యేక నిధులు రూ.2.50 కోట్ల మేరకు ఖర్చుపెట్టక నిధులు మురిగినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే వ్యవసాయశాఖ ద్వారా జిల్లాలోని రైతులకు అందుతున్న పథకాల ఫలాలు అంతంత మాత్రమనే చెప్పాలి. దీనికంతటికి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టనష్టాలు తెలుసుకోవాల్సిన వ్యవసాయశాఖ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కావడమే కారణమని పలువురు తెలుపుతున్నారు.