Specialist
-
బీజేపీలోకి ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆరు, ఏడు దశల పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఇంతలో యూపీకి సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. నాటి బీఎస్పీ ప్రభుత్వంలో మాజీ సీఎం మాయావతికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన అధికారులలో ఒకరైన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రేమ్ ప్రకాష్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.ప్రేమ్ ప్రకాష్ విధుల నిర్వహిస్తున్న సమయంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరొందారు. కాన్పూర్ జోన్లో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో 67 మంది నిందితులను అరెస్టు చేశారు. 2019లో కాన్పూర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కూడా ప్రేమ్ ప్రకాష్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీని పంజాబ్‌లోని రోపర్ జైలు నుంచి యూపీలోని బండా జైలుకు తీసుకురావాల్సి న బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.ఢిల్లీ నివాసి అయిన ప్రేమ్ ప్రకాష్ 1993 బ్యాచ్ అధికారి. బీటెక్ తర్వాత పోలీస్ మేనేజ్మెంట్లో ఎండీ కోర్సు చేసిన ప్రేమ్ ప్రకాష్ ఆగ్రా, మొరాదాబాద్లలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆయన 2009లో లక్నో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ జీవితంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. -
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
AP: స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతోంది. ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లో ఖాళీగా ఉన్న(319), ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే(126) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్–ఇన్ ఇంటర్వూ్యలు చేపడుతోంది. శాశ్వత, కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఇదే క్రమంలో ఏపీవీవీపీ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు రెండుసార్లు వాక్–ఇన్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి వాక్–ఇన్ ఇంటర్వూ్యలు చేపడుతోంది. విజయవాడలోని పాత జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న డీఎంఈ కార్యాలయంలో ఈ ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. 23వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీకి సంబంధించి, 25వ తేదీన గైనకాలజీ, ఈఎన్టీ, అనస్తీషియా, పాథాలజీకి సంబంధించి, 27న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంత ఆస్పత్రుల్లో రూ.1.30 లక్షల చొప్పున వైద్యులకు వేతనాలు ఇవ్వనున్నారు. గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించే ఉద్దేశంతో ప్రభుత్వం అధిక వేతనాలు ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం www.hmfw.ap.gov.inను సందర్శించాలని, 6301138782 ఫోన్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. -
ఇదో కొత్త శత్రువు.. జాగ్రత్తే మందు!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ మానవాళి పాలిట కొత్త శత్రువు. ఇది మళ్లీ మళ్లీ దాడిచేసే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటూ అది సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. దీని నుంచి రక్షణకు ఎలాంటి వ్యాక్సిన్లు, మందులు సిద్ధంగా లేవు. అందరిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడిది కొంత తగ్గుముఖం పట్టినా, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుని విజృంభించే వైరస్ కాబట్టి మళ్లీ చలికాలంలో పెరిగే అవకాశాలున్నాయి. గతంలో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా కొంతమేర తగ్గి చలికాలంలో విజృంభించిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డైరెక్టర్ ఆఫ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ విశ్వనాథ్ గెల్లా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. జీవనశైలి మారాల్సిందే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎవరిలో ఎలా మారుతుంది? ఏ పరిస్థితుల్లో ఎలా పరివర్తనం చెందుతుంది? మళ్లీ ఏ రూపాన్ని సంతరించుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి కచ్చితమైన శుభ్రతా చర్యలు, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం ద్వారానే ›ప్రస్తుత స్థితిని ఎదుర్కోగలం. ప్రస్తుతం లాక్డౌన్ పటిష్టంగా అమలవుతూ మంచి ఫలితాలే వచ్చాయి. క్లస్టర్ కేసులు పెరగకపోవడం, కమ్యూనిటీ స్ప్రెడ్ లేకపోవడం వంటివి కలిసొచ్చే అంశాలు. మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలుచేస్తే కొత్త కేసుల నియంత్రణతో పాటు వైరస్ విస్తరించకుండా చూడొచ్చు. లాక్డౌన్ ఎత్తేశాక కూడా వ్యక్తిగత శుభ్రత, ముందు జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించాల్సిందే. ముఖ్య ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, ఆఫీసుల్లో సిక్రూమ్ల ఏర్పాటు వంటివి తప్పనిసరి. ప్రజారవాణా వ్యవస్థలో, ప్రజలు ఎక్కువగా తిరిగేచోట్ల ఆరోగ్య చర్యలు అమలు చేయాలి. దగ్గు, జలుబు ఇతర లక్షణాలున్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలి. ఆఫీసులు, స్కూళ్లు, మాల్స్ ఇతర చోట్ల శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలి. డిఫెన్సివ్‌గా ఉండటమే మార్గం శత్రువెవరో తెలిస్తే యుద్ధం చేయడం, ఎదుర్కోవడం సులువవుతుంది. కరోనా వైరస్ మన పాలిట కొత్త శత్రువు. ఎలా వ్యాపిస్తుందో? ఎలా విస్తరిస్తుందో? ఇంకా తెలియదు. కాబట్టి మన ఆరోగ్యానికిది శక్తివంతమైన ప్రత్యర్థి. జాగ్రత్తలు పాటించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటిస్తూ డిఫెన్సివ్‌గా వ్యవహరించడం ఒక్కటే మార్గం. ఆ దేశాల్లో ఎందుకంత ప్రభావం? అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, ఆధునిక సౌకర్యాలున్న చోటే ఎక్కువ పాజిటివ్ కేసులు, అధిక మరణాలు నమోదు అవుతున్నాయి. కొత్త రూపంలో వచ్చిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఎవరికీ లేకపోవడం ఒక కారణం. జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాక్‌డౌన్‌ను సరిగా అమలు చేయకపోవడం, ఏమీ కాదనే నిర్లక్ష్యంతో పార్టీయింగ్, హాలిడేయింగ్ చేయడం ఆ దేశాల్లో వ్యాప్తికి ముఖ్య కారణం. 1918లోనూ లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వందేళ్ల క్రితం ప్రపంచాన్ని స్పానిష్ మహమ్మారి కుదిపేసింది. ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్..ఇలా ఒక్కో రాష్ట్రంపై ఒక్కోలా ప్రభావం చూపింది. అప్పుడు కూడా 20 రోజుల ఆలస్యంగా లాక్డౌన్ ప్రకటించిన సెయింట్ లూయిస్‌లోని ప్రజలపై ఎక్కువ ప్రభావం పడి అధికసంఖ్యలో మరణించారు. ముందుగా లాక్డౌన్ ప్రకటించిన ఫిలడెల్ఫియాలో మంచి ఫలితాలొచ్చాయి. వైరస్‌కు చావు లేదు! కొన్ని కేసుల్లో వైరస్ పూర్తిగా నిర్మూలన అవుతున్న దాఖలాల్లేవు. 14 రోజుల తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నాక, ఆ పేషంట్లలో 30–35 రోజుల తర్వాత మోషన్లో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి శరీరంలో వైరస్ పూర్తిగా నిర్మూలన కాలేదని తేలుతోంది. అందువల్ల ఈ వైరస్ మళ్లీ మరోరూపంలో మ్యుటేట్ కావడం, జంతువుల ద్వారా ఇతరత్రా రూపాల్లో పరిభ్రమిస్తున్నందున మళ్లీ ఎప్పుడో అప్పుడు వెలుగుచూసే అవకాశాలే ఎక్కువ. వైరస్ అనేది వందేళ్లకోసారి కొత్తరూపం తీసుకోవడం, మ్యుటేట్ కావడం జరుగుతోంది. మనకేం కాదనుకోవద్దు! ⇒ కరోనా వైరస్ నుంచి రక్షణకు మందమైన బట్టతో కుట్టిన క్లాత్ మాస్క్‌లు ఉత్తమం. ఒక్కొక్కరు 3–4 కుట్టించుకుని, వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. కొన్నిరోజుల వరకే కాకుండా దీర్ఘకాలం పాటు వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. క్లాథ్ మాస్కులు అందుబాటులో లేకపోతే పెద్ద కర్చీఫ్‌ను 3–4 మడతలు చేసి నోటికి అడ్డంగా కట్టుకోవాలి. ⇒ మద్యపానం, పొగతాగే అలవాటున్న వారు వెంటనే మానేయడం మంచిది. అందుకిదే సరైన సమయం. వీరిపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ⇒ వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. తక్కువలో తక్కువ అరగంట చేయాలి. ఇంట్లోనే నడక, యోగా, ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ఏరోబిక్స్, రెస్పిరేటరీ ఇమ్యూనిటీ వచ్చేవి చేయాలి. వాకింగ్, స్లోజాగింగ్, ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం కావాలి. ⇒ ‘మనకేం కాదు. ఆరోగ్యంగా ఉన్నామ’నే భావన వీడాలి. యువత, మధ్యవయస్కులకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండి వైరస్‌ను తట్టుకున్నా.. వారిళ్లలోని పెద్దలు, ఇతరులకు దీనిని అంటిస్తే, హృద్రోగులు, డయాబెటిస్, ఇతర వ్యాధులున్న వారికి ప్రాణాంతకంగా మారుతుంది. ⇒ డాక్టర్లకే పరిమితం కాకుండా నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది మొదలు అందరికీ కరోనాపై జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి వరకు మరింత అవగాహన కలిగించాలి. -
నాదం సృష్టించే చేతులు
తబల, మృదంగం వంటి చర్మవాద్యాల తయారీ అనాదిగా పురుషుల పని. కాని బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ గత ఆరు దశాబ్దాలుగా ఈ కళలో ఆరితేరారు. నాదాన్ని సృష్టించే చేతులు స్త్రీలవి కూడా కాగలవని నిరూపించారు. భారతీయ సంప్రదాయ సంగీతంలో కొన్ని వందల వాద్య పరికరాలు ఉన్నాయి. అందులో కొన్ని తంత్రీ వాద్యాలైతే, కొన్ని చర్మ వాద్యాలు. వీటిని తయారుచేయటానికి ఎంతో కొంత సంగీత పరిజ్ఞానం ఉండాలి. స్వరస్థానాలను గుర్తించగలిగే శక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక వాద్య పరికరం శృతిపక్వంగా తయారవుతుంది. ముఖ్యంగా తబలా, మృదంగం వంటివి తయారు చేయటం చాలా కష్టం. వాటి తయారీకి కలపతోపాటు జంతు చర్మాలను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని మగవారే తయారుచేస్తారు. కాని పురుషులకు ఏ మాత్రమూ తీసిపోను అంటూ ఇప్పటి వరకు 10 వేల పరికరాలు తయారుచేశారు బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ. ‘‘మా వారు ఆర్ ఎస్ అనంతరామయ్య సంగీతకారులు. ఆయన తబలా, మృదంగ వాద్యాలలో నిపుణులు. నా పదిహేనో ఏట నాకు వివాహమైంది. నేను వంటతోపాటు మావారి దగ్గర వాద్యపరికరాల తయారీ, వాటిని బాగు చేయటం రెండూ నేర్చుకున్నాను.’’ అంటున్న అశ్వత్థమ్మ బెంగళూరు బాలాపేట్ సర్కిల్లోని శాంతా తబలా వర్క్స్‌లో పని చేస్తున్నారు. ‘‘ఈ పరికరాల తయారీకి శారీరక బలం చాలా అవసరం. గట్టి గట్టి దెబ్బలు కొడుతూ వాద్యాలు తయారు చేయడం మగవారికి మాత్రమే అలవాటు. అటువంటిది నా కండ బలంతో ఈ కళలో నైపుణ్యం సాధించాను’’ అంటారు 75 సంవత్సరాల అశ్వత్థమ్మ. సంగీతానికి సంబంధించి ఎటువంటి కోర్సులు చేయలేదు అశ్వత్థమ్మ. స్కూలు చదువులు కూడా లేవు. కాని, వాద్యపరికరాలు తయారుచేసేటప్పుడు అందులో పలికే అపశృతులను గుర్తించగలరు. వాటిలోని మాధుర్యం తెలుసుకోగలరు. బెంగళూరులో ఎవరికి వాద్యపరికరాలు కావాలన్నా శాంతా తబలా వర్క్స్‌కి రావలసిందే. అశ్వత్థమ్మ భర్త అనంతరామయ్య దేవాలయాల్లోను, నాటకాలలోను తబలా, మృదంగం వాయించేవారు. ఆ రోజుల్లో కచేరీలకు పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. అందువల్లే వాద్యపరికరాల తయారీ ప్రారంభించారు. అశ్వత్థమ్మ ఆ పని నేర్చుకున్నారు. భార్యాభర్తలు ఈ పనులు చేస్తున్నందుకు బంధువుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘వాద్యపరికరాలను జంతు చర్మాలతో చేస్తారని అందరికీ తెలిసిందే. మా కుటుంబమంతా దేవాలయాలలో పనిచేసేవారు. మేము జంతుచర్మాలతో పనిచేస్తున్నందుకు, మమ్మల్ని దూరం పెట్టారు. మగవారు చేసే మృదంగం పనులు చేయటం ఎందుకు అంటూ నన్ను ఎగతాళి చేసేవారు. వాస్తవానికి జంతుచర్మాలతో తయారుచేసే పరికరాలకు శక్తి కంటె తెలివి ఉండాలి’’ అంటారు అశ్వత్థమ్మ. తబలాను రిపేర్ చేయడానికి వారం రోజులు, మృదంగమైతే పది రోజుల సమయం పడుతుంది. ఈ వాద్యాలను పనస చెక్క, మామిడి చెక్కలతో పాటు ఇతర చెక్కలతోను తయారు చేస్తారు. ఆవు, గేదె, మేక చర్మాలను పరికరాల తోలుకోసం ఉపయోగిస్తారు. ‘‘నేను సుమారు వంద రకాల వాద్య పరికరాలను తయారు చేస్తాను. ఇప్పటివరకు కొన్ని వందల రిపేర్లు చేశాను’’ అంటారు ఆమె. ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అశ్వత్థమ్మ దగ్గరే బాగు చేయించుకుంటారు. ఈ అరవై సంవత్సరాలలో అశ్వత్థమ్మ చేతి నుంచి 10000 వాద్యపరికరాలు కళాకారుల చేతుల్లోకి వెళ్లాయి. తబలా, మృదంగం, ఢోలక్, ఢోల్కీ, ఢమరుకం, నగారీ, కంజరా వంటివి తయారవుతుంటాయి. ‘మా వారికి కర్ణాటక కళాశ్రీ బహుమతి వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి శ్రీనివాస్ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నాడు’ అంటూ సంతోషంగా చెబుతారు అశ్వత్థమ్మ. – వైజయంతి -
వ్యవసాయ సిద్ధుడు
సేంద్రియ ఎరువులతో ఓ రైతు మామిడి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నీటి వసతి సరిపోనప్పటికీ సొంత పరిజ్ఞానంతో టన్నుల కొద్దీ దిగుబడి సాధిస్తూ ఔరా! అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. మామిడిలో రకరకాలు అంటుకట్టి, అధిక దిగుబడులు సాధించడంలో వ్యవసాయ సిద్ధుడుగా పేరొందాడు. రెండు రకాల మామిడికి అంటుకట్టడం సహజం. ఆయన మాత్రం ఒకే చెట్టుకు 24 రకాల మామిడి కాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తొమ్మిదెకరాల్లో ఈసారి 70–80 టన్నుల దిగుబడి సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. పాకాల మండలం దాసర్లపల్లెకు చెందిన సిద్ధారెడ్డికి వ్యవసాయమంటే అమితమైన ఆసక్తి. 15 ఏళ్ల క్రితం 9 ఎకరాల్లో 750 మామిడి మొక్కలు నాటారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచితంగా ఇచ్చిన తోతాపురి(బెంగళూర), బేనీషా (బంగినపల్లి) రకం మామిడి మొక్కలు నాటారు. వీటితో పాటు తోట చుట్టూ రక్షణగా టేకుచెట్లు నాటారు. మామిడి సాగుకు తగినంత నీటి లభ్యత వ్యవసాయ బావిలో లేకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. రోజంతా ఊరితే వచ్చే 30 బిందెల నీళ్లు సరిపోక, గ్రామంలో బోరు వద్ద వృథా అయ్యే నీటిని బారెల్లో నింపుకుని చెట్లకు పోసేవారు. దూరంలోని నీటికుంట నుంచి కావడి మోసి 50 బిందెల నీటిని తెచ్చేవారు. ఆయన కష్టానికి చెట్లన్నీ బతికాయి. 4 ఏళ్లకు తొలి పంట కళ్లచూశారు. బేనీషా సరైన దిగుబడి రాకపోవడంతో ఆ మొక్కలను తొలగించి బెంగళూర నాటారు. తొలుత వేపాకు ట్రీట్మెంట్ నవంబర్ : తోట చుట్టూ రక్షణ కంచెగా టేకుతోపాటు వేపకాయలతో సహా ఆకులను కత్తిరించి, చెట్ల మొదలుకు చుట్టూ మూరెడు దూరంలో పాదులు తీసి, 3–5 కిలోల చొప్పున వేసి, రొటొవేటర్తో తొక్కించి కప్పెడతారు. నీటి తడులకు, వర్షాలకు ఇది బాగా కుళ్లుతుంది. 50–60 రోజుల తర్వాత దీనిని ట్రాక్టర్లతో తిరగేస్తారు. గోమూత్రం, సీతాఫలం ఆకులతో ద్రావణం తయారీ డిసెంబర్ : నీటి తొట్టెలు, కడవల్లో సీతాఫలం చెట్ల ఆకులను గోమూత్రంలో కలిపి మొత్తం 300 లీటర్ల ద్రావణం తయారు చేస్తారు. పదిలీటర్ల నీటికి లీటరు చొప్పున ద్రావణం కలిపి డిసెంబర్ చివరి, జనవరి తొలివారంలో చెట్లకు పిచికారీ చేస్తారు. ఫలదీకరణకు భలే ఐడియా! ప్రతి 75 చెట్ల వరుసకు ఒకటి చొప్పున ఎక్కువగా మామిడి పూత పూయడానికి మల్గూబ మొక్కలు నాటారు. మల్గూబ రకానికి కాలేపాడు, ఖాదర్, నీలేషా తదితరాలను అంటుకట్టారు. ఈ చెట్లకు పూత విరగకాసి తేనెటీగలు, హమ్మింగ్ బర్ట్స్, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తున్నాయి. ఈ చెట్ల పూతపై వాలి ఇతర మామిడి చెట్లపై తేనెటీగలు, సీతాకోకచిలుకలు వాలుతుండడంతో పరపరాగ సంపర్కానికి ఇవి బాగా దోహదపడుతున్నాయి. ఇదే రసాయన మందులు పిచికారీ చేస్తే రైతుకు మేలు చేసే తేనెటీగలు, సీతాకోకచిలుకల మనుగడకు ప్రతికూలమయ్యేది. సేంద్రియం.. చెట్లకు జవసత్వం జనవరి–ఫిబ్రవరి : 9 ట్రాక్టర్ల పశువుల పేడ, మూడు ట్రాక్టర్ల చొప్పున ఎర్రమట్టి, గొర్రెలు, మేకల పెంటికలు..బాగా కలిపి సేంద్రియ ఎరువు సిద్ధం చేస్తారు. పశువుల పేడ, గొర్రెలు, మేకల పెంటికలు పరిసర గ్రామాల వారి నుంచి కొనుగోలు చేస్తారు. జనవరి, ఫిబ్రవరి నాటికి గోళీగుండు సైజు మామిడి పిందెలతో ఉన్న చెట్లకు ఈ సేంద్రియ ఎరువును చెట్ల సైజును బట్టి 40–60–100 కిలోల చొప్పున చెట్టు చుట్టూ వేస్తారు. అంటుకట్టడంలో దిట్ట మామిడి చెట్లకు అంటుకట్టడంలో సిద్ధారెడ్డి దిట్ట. రెండేసి రకాలు కాసే మామిడి చెట్లు 10 ఉండగా, ఏకంగా 24 రకాల మామిడి కాయలు కాసే చెట్టు కూడా ఉండటం ఈయన తోట ప్రత్యేకత. వాల్మీకి మహర్షి 24 అక్షరాలతో 24వేల శ్లోకాలతో రామాయాణాన్ని రాశారని, అది స్ఫూర్తిగా తీసుకుని తానూ ఒకే చెట్టుకు 24 రకాల కాయలు కాసేలా అంటుకట్టినట్లు చెప్పారు. డ్రిప్‌తో చెట్లకు నీరు వ్యవసాయ బావిలో నీటి లభ్యత అతితక్కువగా ఉండడంతో అందులోనే 1003 అడుగుల లోతుతో బోరు వేశారు. రోజంతా కలిపి వచ్చేది మహా అయితే 50 నుంచి 60 బిందెల నీళ్లే! ఈ తక్కువ నీటిని చాలా పొదుపుగా డ్రిప్ విధానంలో వినియోగించడానికి 750 మామిడి చెట్లను 13 సెక్షన్లుగా విభజించారు. ఒకసారి చెట్టుకు డ్రిప్ పెడితే ఆ చెట్టుకు మళ్లీ వారం తర్వాత నీటి తడి ఇచ్చేలా ఏర్పాటు చేశారు. సొంత ఐడియాతో 1/2 ఇంచీల పైపులను వాడారు. వీటికంటూ పైపులతో ఒక గేట్‌వాల్‌ను తయారు చేశారు. సేంద్రియ పద్ధతులతో లాభాలు టెన్త్ వరకూ చదువుకున్నా. సేంద్రియ పద్ధతుల్లో మామిడి పెంపకం మొదలెట్టాను. పట్టాభిరెడ్డి మామిడి సాగులో మెళకువలు నేర్పారు. మామిడి చెట్లు నాటేటప్పుడే తోట చుట్టూ 450 టేకు చెట్లు నాటా. వేపచెట్లు, తాటిచెట్లూ కొన్ని ఉండాయి. పెనుగాలి వీచినా తగలకుండా ఇవి అడ్డుకుంటూ ఉండటం వలన కాయలు రాల వు. చెట్టును పూర్తిగా పశుపక్ష్యాదులకే వది లేశా. తొలి ఫలసాయం రూ.3,600 మాత్రమే. రెండో సంవత్సరం రూ.4,500, ఆ తర్వాత రూ.10వేల నుంచి లక్షకు పెరిగింది. ఈసారి 70–80 టన్నులతో 5లక్షలకు పైగానే వస్తాది. 24 రకాల కాయలు కాసే చెట్టు ఇంటి అవసరాలకు పెట్టుకున్నా. – సిద్ధారెడ్డి కోతకు సిద్ధం ఇప్పటికే తోతాపురి కాయలు మంచి సైజులో ఉన్నాయి. జూన్ తొలివారం నుంచి కోతలు మొదలెట్టే నాటికి సగటున 500 గ్రాముల నుంచి 700–800 గ్రాముల పైచిలుకు బరువు తూగేలా కనిపిస్తున్నాయి. గత ఏడాది 59 టన్నుల దిగుబడి రాగా, ఈసారి 70–80 టన్నుల వరకూ వస్తుందని అంచనా వేసినట్లు సిద్ధారెడ్డి చెప్పారు. – పోసిమిరెడ్డి శాంసన్ సుధాకర్రెడ్డితిరుపతి డెస్క్ -
ఒక్క నిపుణుడుంటే ఒట్టు
– రెఫరల్ ఆసుపత్రిలో అనర్హుల తిష్ట – రాజకీయ సిఫారసులే అర్హత – పశువులకు అందని వైద్య సేవలు – రూ.5 కోట్లతో అధునాతన భవన నిర్మాణం.. అయినా ఫలితం శూన్యం కర్నూలు(అగ్రికల్చర్) : కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కన బహుళార్ధ పశువైద్యశాల(వెటర్నరీ పాలీక్లీనిక్)కు రెఫరల్ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, తాలూకా ఆసుపత్రుల్లోని సహాయ సంచాలకులకు సాధ్యం కాని కేసులను వెటర్నరీ పాలీ క్లినిక్‌కు రెఫర్ చేస్తుంటారు. ఇది పశువైద్యులు, ఏడీలు, రైతులకు శిక్షణ కేంద్రంగా కూడా ఉంది. బహుళార్ధ పశువైద్యశాలను రూ.5 కోట్లతో అత్యంత అధునాతనంగా నిర్మించారు. వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలగా మార్పు చేయనున్నారు. ఇంతటి ప్రాధాన్యం కల్గిన ఈ బహుళార్ధ పశువైద్యశాలలో రాజకీయ సిఫారసులతో అనర్హులు తిష్ట వేశారు. ఉన్నతాధికారులు కూడా రాజకీయ సిఫారసులకు అనుగుణంగా అనర్హులను నియమిస్తున్నారు. అధిక మొత్తంలో హెచ్ఆర్ఏ పొందడంతో పాటు జిల్లా కేంద్రంలోనే ఉండాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతల రెకమెండేషన్‌తో అనర్హులు వచ్చి తిష్టవేశారు. ఇప్పుడున్నవారిలో ఒక్కరు కూడా స్పెషలిస్టు లేకపోవడం గమనార్హం. ఇందువల్ల పశువులకు సరైన వైద్యసేవలు అందక మత్యువాత పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజుల వ్యవధిలో 5 పశువులు మత్యువాత పడ్డాయి. స్పెషలిస్టులే ఉండాల్సి ఉంది... బహుళార్ధ పశువైద్యశాల రెఫరల్ ఆసుపత్రి కావున విధిగా స్పెషలిస్ట్లుండాలి. సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్లుండాలి. పశువైద్యులు ఇటువంటి వాటిని ఇక్కడకు రెఫర్ చేస్తుంటారు. నిపుణులుంటేనే వాటికి సరైన చికిత్స అందే అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం వరకు స్పెషలిస్ట్‌లే ఉన్నారు. అయితే రాజకీయ పరపతిని ఉపయోగించి నిపుణులను బయటికి పంపి అనర్హులు ఇక్కడ చేరారు. ఇద్దరు ఏడీలుండగా, ఒకరు న్యూట్రీషియన్, మరొకరు పౌల్ట్రీకి చెందినవారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లలో ఒక పెతాలజీ, మరొకరు ఎల్‌పీఎంకు చెందినవారు ఒక్కరు కూడా నిపుణులు లేకపోవడం వల్ల పశువైద్యం కొండెక్కింది. పర్యవేక్షణ గాలికి.. రెపరల్ ఆసుపత్రి.. డీడీ పర్యవేక్షణల నడుస్తోంది. ప్రస్తుత డీడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా వెటర్నరీ పాలీ క్లినిక్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. విధిగా సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ అధికార పార్టీ నేతల సిఫారసులకు తలొగ్గి అనర్హులను నియమిస్తూ వస్తున్నారన్న విమర్శలున్నాయి. నిపుణులు లేకపోగా ఉన్నవారిలో ఇద్దరు మహిళలు కావడం, కొన్ని సమయాల్లో వీరు విధి నిర్వహణలో సమర్థవంతంగా రాణించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రూ.50 వేల విలువ పశువులు మృతి.. ఇటీవల పగిడ్యాల మండలానికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు అనారోగ్యానికి గురవడంతో వెటర్నరీ పాలీక్లినిక్‌కు రెఫర్ చేశారు. ఇక్కడ పశువైద్యులు చికిత్స చేసినా వ్యాధిని గుర్తించకపోవడం వల్ల చికిత్స పని చేయలేదు. దీంతో రూ.50 వేల విలువ చేసే ఎద్దు మతి చెందింది. ఓర్వకల్ పశువైద్యుడు ఒక కోడెను ఇక్కడికి రెఫర్ చేశారు. దాని వ్యా«ధికి తగిన చికిత్స అందకపోవడం వల్ల మతి చెందింది. నగరానికి చెందిన మేలు జాతి కుక్కలు సైతం మతి చెందాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బహుళార్ధ పశువైద్యశాలపై దష్టి పెట్టాల్సి ఉంది. -
సెల్‌ఫోన్ చోరీ స్పెషలిస్ట్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): సులభంగా డబ్బులు సంపాదించేందుకు సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న మరొకరిరి దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ముషీరాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి మహబూబ్ లదాఫ్(32) ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భవానీనగర్ తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ జహీర్ షా (28) అతనిని సెల్ఫోన్ల దొంగతనాలకు పురిగొల్పాడు. దీనికి అంగీకరించిన మహబూబ్ లదాఫ్ సెల్‌ఫోన్ దుకాణాల వద్ద ఒంటరిగా ఉన్న వ్యాపారులను మాటల్లో దించి ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఫోన్లు చోరీ చేసిన వెంటనే ద్విచక్ర వాహనంపై పారిపోతారు. ఎత్తుకొచ్చిన సెల్ఫోన్లను జహీర్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. జహీర్ వాటిని భాగాలుగా విడగొట్టి అవసరమున్న వారికి పెద్ద మొత్తంలో విక్రయించసాగాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఠాకూర్ సుఖదేవ్‌సింగ్, ఎసై ్సలు గౌస్‌ఖాన్, మల్లేష్, వెంకటేశ్వర్లు దాడి చేసి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. -
టేస్ట్ స్పెషలిస్ట్
ఎంతటి నలభీములు వండిన పాకమైనా.. ముందు ఆయన టేస్ట్ చేయాల్సిందే.. ఆ నాలుక మెచ్చి.. ఆహా ఏమి రుచి అంటేనే.. దానికి ఆమోదముద్ర పడుతుంది. స్టార్ హోటళ్లు సైతం ఆయన ఓకే అంటే గానీ కొత్త వంటలను మెనూలో చేర్చుకోవు. రుచి చూడటమే ఆయన అభి‘రుచి’. ఇప్పుడదే ఆయన వృత్తి. నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు ఆయున విశిష్ట అతిథి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఏం చేయకపోయినా.. ఈ టేస్ట్ స్పెషలిస్ట్ బడా చెఫ్లకే రుచుల పాఠాలు చెబుతున్నారు. రుచుల వేటలో ఐటీ ఉద్యోగాన్ని కూరలో కరివేపాకులా తీసిపారే సిన.. టేస్ట్ స్పెషలిస్ట్ సంకల్ప్ సిటీప్లస్‌తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చిన్నప్పటి నుంచి తినడం అలవాటుగా ఉండేది. స్కూల్లో చదివే రోజుల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, వెంగళరావునగర్ ఏరియాలో నేను వెళ్లని హోటల్ లేదు. ఏ హోటల్‌కు వెళ్లినా.. ఏ రెసిపీని ఎలా తయారు చేస్తారో వంటగదిలోకి వెళ్లి చెఫ్‌లను అడిగి మరీ తెలుసుకునేవాడిని. నాకు నచ్చిన వంటకం గురించి ఇంటర్నెట్లో సమీక్షలు రాయడం ప్రారంభించాక గుర్తింపు మొదలైంది. మన నగరంలో వంటకాలపై పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాలనేది నా అభిమతం. ‘జొమాటో’ తొలి వేదిక పరపంచవ్యాప్తంగా విభిన్నమైన వంటకాలు, అవి దొరికే రెస్టారెంట్లపై సమాచారం ఇచ్చే వెబ్సైట్ ‘జొమాటో’ నా తొలి వేదిక. బయట తిన్న ప్రతిసారీ ‘జొమాటో’లో విశ్లేషణలు రాసేవాడిని. కొద్దిరోజులకే ఫాలోవర్స పెరిగారు. నగరంలో దాదాపు 500 పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే వంటకాలపై సమీక్షలు రాశాను. దీంతో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు నన్ను టేస్టింగ్ సెషన్సకు పిలుస్తున్నాయి. నా సూచనల మేరకు రెసిపీని మారుస్తారు. హైదరాబాద్‌లోనే కాదు, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ టేస్టీ సెషన్స్‌కు వెళ్లాను. పలు కుకరీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించాను. త్వరలోనే హోటల్ పెడతా వండటం తెలుసా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. త్వరలోనే ఒక హోటల్ పెడుతున్నా. రకరకాల వంటకాలు రుచి చూస్తున్నా.. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. రోజూ ఉదయం 8 కిలోమీటర్లు పరిగెత్తుతాను. రాత్రి గ్లాసెడు మజ్జిగ తాగుతాను. ఎన్ని రుచులు చూసినా, ఇంట్లో అమ్మచేతి వంటకు సాటిరావు. అమ్మ వండిన టమాటా పప్పు, వంకాయ కూరకు మించిన రుచి మరొకటి ఉండదు. తినిపించడంలోనే ఆనందం తినిపించడంలోనే అసలైన ఆనందం ఉందని నమ్ముతా. హోటళ్లలో మిగిలిపోయిన వంటకాలను అనాథలకు పంచాలనే ఆలోచనను ఆర్గనైజ్డ్గా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే కొన్ని హోటళ్లు కూడా ఇందుకు ముందుకొచ్చాయి.