సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ మానవాళి పాలిట కొత్త శత్రువు. ఇది మళ్లీ మళ్లీ దాడిచేసే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటూ అది సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. దీని నుంచి రక్షణకు ఎలాంటి వ్యాక్సిన్లు, మందులు సిద్ధంగా లేవు. అందరిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడిది కొంత తగ్గుముఖం పట్టినా, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుని విజృంభించే వైరస్ కాబట్టి మళ్లీ చలికాలంలో పెరిగే అవకాశాలున్నాయి. గతంలో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా కొంతమేర తగ్గి చలికాలంలో విజృంభించిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డైరెక్టర్ ఆఫ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ విశ్వనాథ్ గెల్లా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
జీవనశైలి మారాల్సిందే..
కరోనా వైరస్ వ్యాప్తి ఎవరిలో ఎలా మారుతుంది? ఏ పరిస్థితుల్లో ఎలా పరివర్తనం చెందుతుంది? మళ్లీ ఏ రూపాన్ని సంతరించుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి కచ్చితమైన శుభ్రతా చర్యలు, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం ద్వారానే ›ప్రస్తుత స్థితిని ఎదుర్కోగలం. ప్రస్తుతం లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతూ మంచి ఫలితాలే వచ్చాయి. క్లస్టర్ కేసులు పెరగకపోవడం, కమ్యూనిటీ స్ప్రెడ్ లేకపోవడం వంటివి కలిసొచ్చే అంశాలు.
మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలుచేస్తే కొత్త కేసుల నియంత్రణతో పాటు వైరస్ విస్తరించకుండా చూడొచ్చు. లాక్‌డౌన్ ఎత్తేశాక కూడా వ్యక్తిగత శుభ్రత, ముందు జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించాల్సిందే. ముఖ్య ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, ఆఫీసుల్లో సిక్‌రూమ్‌ల ఏర్పాటు వంటివి తప్పనిసరి. ప్రజారవాణా వ్యవస్థలో, ప్రజలు ఎక్కువగా తిరిగేచోట్ల ఆరోగ్య చర్యలు అమలు చేయాలి. దగ్గు, జలుబు ఇతర లక్షణాలున్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలి. ఆఫీసులు, స్కూళ్లు, మాల్స్ ఇతర చోట్ల శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలి.
డిఫెన్సివ్‌గా ఉండటమే మార్గం
శత్రువెవరో తెలిస్తే యుద్ధం చేయడం, ఎదుర్కోవడం సులువవుతుంది. కరోనా వైరస్ మన పాలిట కొత్త శత్రువు. ఎలా వ్యాపిస్తుందో? ఎలా విస్తరిస్తుందో? ఇంకా తెలియదు. కాబట్టి మన ఆరోగ్యానికిది శక్తివంతమైన ప్రత్యర్థి. జాగ్రత్తలు పాటించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటిస్తూ డిఫెన్సివ్‌గా వ్యవహరించడం ఒక్కటే మార్గం.
ఆ దేశాల్లో ఎందుకంత ప్రభావం?
అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, ఆధునిక సౌకర్యాలున్న చోటే ఎక్కువ పాజిటివ్ కేసులు, అధిక మరణాలు నమోదు అవుతున్నాయి. కొత్త రూపంలో వచ్చిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఎవరికీ లేకపోవడం ఒక కారణం. జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాక్‌డౌన్‌ను సరిగా అమలు చేయకపోవడం, ఏమీ కాదనే నిర్లక్ష్యంతో పార్టీయింగ్, హాలిడేయింగ్ చేయడం ఆ దేశాల్లో వ్యాప్తికి ముఖ్య కారణం.
1918లోనూ లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు
వందేళ్ల క్రితం ప్రపంచాన్ని స్పానిష్ మహమ్మారి కుదిపేసింది. ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్..ఇలా ఒక్కో రాష్ట్రంపై ఒక్కోలా ప్రభావం చూపింది. అప్పుడు కూడా 20 రోజుల ఆలస్యంగా లాక్‌డౌన్ ప్రకటించిన సెయింట్ లూయిస్‌లోని ప్రజలపై ఎక్కువ ప్రభావం పడి అధికసంఖ్యలో మరణించారు. ముందుగా లాక్‌డౌన్ ప్రకటించిన ఫిలడెల్ఫియాలో మంచి ఫలితాలొచ్చాయి.
వైరస్‌కు చావు లేదు!
కొన్ని కేసుల్లో వైరస్ పూర్తిగా నిర్మూలన అవుతున్న దాఖలాల్లేవు. 14 రోజుల తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నాక, ఆ పేషంట్లలో 30–35 రోజుల తర్వాత మోషన్‌లో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి శరీరంలో వైరస్ పూర్తిగా నిర్మూలన కాలేదని తేలుతోంది. అందువల్ల ఈ వైరస్ మళ్లీ మరోరూపంలో మ్యుటేట్ కావడం, జంతువుల ద్వారా ఇతరత్రా రూపాల్లో పరిభ్రమిస్తున్నందున మళ్లీ ఎప్పుడో అప్పుడు వెలుగుచూసే అవకాశాలే ఎక్కువ. వైరస్ అనేది వందేళ్లకోసారి కొత్తరూపం తీసుకోవడం, మ్యుటేట్ కావడం జరుగుతోంది.
మనకేం కాదనుకోవద్దు!
⇒ కరోనా వైరస్ నుంచి రక్షణకు మందమైన బట్టతో కుట్టిన క్లాత్ మాస్క్‌లు ఉత్తమం. ఒక్కొక్కరు 3–4 కుట్టించుకుని, వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. కొన్నిరోజుల వరకే కాకుండా దీర్ఘకాలం పాటు వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. క్లాథ్ మాస్కులు అందుబాటులో లేకపోతే పెద్ద కర్చీఫ్‌ను 3–4 మడతలు చేసి నోటికి అడ్డంగా కట్టుకోవాలి.
⇒ మద్యపానం, పొగతాగే అలవాటున్న వారు వెంటనే మానేయడం మంచిది. అందుకిదే సరైన సమయం. వీరిపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలెక్కువ.
⇒ వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. తక్కువలో తక్కువ అరగంట చేయాలి. ఇంట్లోనే నడక, యోగా, ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు, ఏరోబిక్స్, రెస్పిరేటరీ ఇమ్యూనిటీ వచ్చేవి చేయాలి. వాకింగ్, స్లోజాగింగ్, ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం కావాలి.
⇒ ‘మనకేం కాదు. ఆరోగ్యంగా ఉన్నామ’నే భావన వీడాలి. యువత, మధ్యవయస్కులకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండి వైరస్‌ను తట్టుకున్నా.. వారిళ్లలోని పెద్దలు, ఇతరులకు దీనిని అంటిస్తే, హృద్రోగులు, డయాబెటిస్, ఇతర వ్యాధులున్న వారికి ప్రాణాంతకంగా మారుతుంది.
⇒ డాక్టర్లకే పరిమితం కాకుండా నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది మొదలు అందరికీ కరోనాపై జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి వరకు మరింత అవగాహన కలిగించాలి.
Comments
Please login to add a commentAdd a comment