సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల ఏదో జరిగిపోతోందన్న భయాలు, ఆందోళనల కంటే దాని గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత ముఖ్యమని శ్వాస, అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణుడు డాక్టర్ వి.విష్ణున్‌రావు సూచించారు. భయానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి లంకె ఉంటుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. మనం తీసుకొనే ఆహారం, రోగనిరోధకశక్తి, రోగాల మధ్య సంబంధం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సుగంధ ద్రవ్యాల్లో రోగనిరోధక లక్షణాలు అధికంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపుతోపాటు ఆకుకూరలు, పండ్ల వంటివి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించారు.
పౌష్టికాహారంతోపాటు బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకొని ఆశావహ దృక్పథం, ప్రశాంత చిత్తంతో ఉంటే సమస్యలు ఉత్పన్నం కావన్నారు. స్వీట్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీంలను పూర్తిగా మానేయాలని, వాటి వల్ల గొంతు పట్టేసి వైరస్ త్వరగా లేదా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా మద్యపానం, సిగరెట్లు మానేయాలని, ప్రస్తుత కాలంలో వాటిని మానేయడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదని చెప్పారు. ‘సాక్షి’ ఇంటర్వూ్యలో డాక్టర్ విష్ణున్‌రావు చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
దశలవారీగా...
లాక్‌డౌన్‌ను ఎత్తేశాక ముందుగా ‘యంగ్ జనరేషన్’అంటే 12 నుంచి 50 ఏళ్లలోపు వారిని (ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు) దశలవారీగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్స్‌పోజ్ అయ్యేలా చేయగలిగితే మంచిది. ఆ తర్వాత మూడు వారాలకు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వారిని, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఇతరుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
ఏ వయసు వారనేది ముఖ్యం...
కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన అది మరణంతో సమానం కాదు. ఇది సోకిన వారు ఏ వయసు (ఎలాంటి జబ్బులు లేని వారు) వారన్నది ముఖ్యం. 50 ఏళ్లలోపున్న వారిలో (ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే) మరణాలు చాలా తక్కువ. పరీక్షలు నిర్వహించాక వారికి బీపీ, షుగర్, కిడ్నీ, కేన్సర్ వంటివి ఉన్నాయా? వారు ఏ ఏజ్ గ్రూపుల్లో ఉన్నారన్న దానిపై ప్రత్యేక దృష్టి అవసరం. అలాంటి వారికి ప్రత్యేక చికిత్స అందించాలని ఐసీఎంఆర్ సూచించింది.
లాక్‌డౌన్‌తో ఎంతో మేలు...
లాక్‌డౌన్ వల్ల సానుకూల ఫలితాలొచ్చాయి. ఒక్కసారిగా కేసులు పెరిగిపోయి, పెద్దసంఖ్యలో మరణాలు సంభవించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో వైరస్ గ్రాఫ్ నిలకడగా సాగుతోంది. లాక్‌డౌన్ ఎత్తేశాక పరిస్థితులు మరింత మెరుగవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
పెద్దవారి విషయంలో జాగ్రత్తలు అవసరం...
మన ఇళ్లలో పెద్ద వయసువారు, అనారోగ్య సమస్యలున్న వారిపట్ల ఇతర కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారికి వైరస్ సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. యువత, మధ్యవయస్కులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలి.
వారికే పరీక్షలు చేయాలి...
కరోనా లక్షణాలున్న వారికి, హైరిస్క్ పేషెంట్లకు, వివిధ అనారోగ్య సమస్యలున్న వారికి, 60 ఏళ్లకు పైబడిన వారికే టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిది. ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారం రిస్క్ గ్రూపులో జబ్బులున్న వారికి, అనారోగ్య సమస్యలు, 60 ఏళ్లు పైబడిన వారికే పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. ఎవరికి జ్వరం ఉన్నా వారికి ప్రాధాన్యతనివ్వాలి. రెడ్‌జోన్‌లో ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ పట్టేసినట్టు ఉన్నా, పెదవులు నీలిరంగులో ఉన్నా, జ్వరంతో ఉండి అయోమయ లక్షణాలున్న వారికి టెస్ట్‌లు చేసి ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేసుకోవాలి. అనారోగ్య సమస్యలున్న వారు కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి. చనిపోయినవారి నుంచి, ఈగలు, దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనేది అపోహే. కేవలం మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నిరోధించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment