కరోనా వ్యక్తులకే కాదు.. పలు సంస్థలకూ సవాలుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీని సవాల్‌గా స్వీకరిస్తే, మరికొన్ని శానిటైజర్లు మొదలుకొని పీపీఈ కిట్లు, చౌక వెంటిలేటర్ల తయారీని చేపట్టాయి. ఇదే సమయంలో భారత్‌లో రసాయన పరిశోధనలకు కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఈ సవాళ్లను ఎలా స్వీకరించింది? కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు ఏ ప్రయత్నాలు చేసింది?.. ఇవే ప్రశ్నలను ‘సాక్షి’ ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా.. ఆయనిచ్చిన సమాధానాలివిగో..
కరోనాను ఎదుర్కొనేందుకు ఐఐసీటీ ఎలాంటి ఆవిష్కరణలు చేసింది?
వ్యాధి చికిత్సకు ఉపయోగపడగల మందులను ఐఐసీటీ మొదట గుర్తించింది. గతంలోనే తయారై పలు కారణాలతో వినియోగంలోకి రాని రెమిడెస్‌విర్, ఫావాపిరవిర్ వంటివి కోవిడ్‌ను అడ్డుకుంటాయని గుర్తించాం. అతితక్కువ వ్యవధిలో వీటిని వాణిజ్యస్థాయిలో తయారుచేయడమే కాక, సిప్లా వంటి ఫార్మా కంపెనీల సాయంతో మార్కెట్లోకి తెచ్చాం. సమర్థమైన శానిటైజర్ల తయారీ టెక్నాలజీని స్టార్టప్ కంపెనీలకు అందజేశాం. తద్వారా శానిటైజర్లు అన్నిచోట్లా చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని సీఎస్‌ఐఆర్ సోదర సంస్థ సాయంతో ‘సెరో సర్వే’ కూడా నిర్వహించాం. తాజాగా కోవిడ్ నుంచి రక్షణ కల్పించే మాస్క్ ‘సాన్స్’ అభివృద్ధితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం లక్ష మాస్కుల పంపిణీకి సిప్లాతో కలిసి పనిచేస్తున్నాం.
కోవిడ్–19 చికిత్సకు సంబంధించిన పరిశోధనలు పూర్తయినట్లేనా?
కానేకాదు. జపాన్‌లో జలుబు కోసం సిద్ధంచేసిన ఫావాపిరవిర్‌ను కోవిడ్‌కూ వాడవచ్చునని ఇప్పటికే గుర్తించిన ఐఐసీటీ ప్రస్తుతం దాని ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలినాళ్లలో ఫావాపిరవిర్ ఒక్కో మాత్ర రూ.100పైబడి ఖరీదుచేస్తే.. సిప్లా ఇటీవలే రూ.68కే అందిస్తామని ప్రకటించింది. సన్‌ఫార్మా మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తేనుంది. ఐఐసీటీ పరిశోధనల ఫలితంగా ధర మరింత దిగి రావచ్చు.
వ్యవసాయ రంగానికి అవసరమైన రసాయనాల విషయంలోనూ ఐఐసీటీ విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ రంగంలో తాజా పరిణామాలు?
ఐఐసీటీ చాలాకాలంగా వ్యవసాయానికి ఉపయోగపడే రసాయనాలను తయారుచేస్తోంది. ఫెర్మాన్ ట్రాప్‌లు వీటిల్లో ఒకటి. పొలాల్లో కీటకాలను ఆకర్షించేందుకు తద్వారా కీటకనాశినుల వాడకాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విస్తృతంగా వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. సీఎస్‌ఐఆర్ నిర్వహించే ‘హరిత్’ కార్యక్రమంలో భాగంగా స్వయంగా సుమారు 20 వేల హెక్టార్లకు సరిపడా ఫెర్మాన్ ట్రాప్స్ ఇవ్వనుంది.
ప్రధాని మోదీ ఇటీవలే ‘ఆత్మ నిర్భర భారత్’ పిలుపునిచ్చారు. రసాయనాల విషయంలో ఇది ఎప్పటికి సాధ్యం?
వ్యవసాయం, ఫార్మా రంగాల్లో కీలకమైన రసాయనాల విషయంలో భారత్ 30 ఏళ్లుగా ఇతర దేశాలపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడుతోంది. రానున్న ఆరేళ్లలో కనీసం 53 రసాయనాల దిగుమతులకు స్వస్తిచెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పెట్రోలియం, బొగ్గు, ఫార్మా రంగాల్లోని కొన్ని వ్యర్థాలు, వాయువుల ద్వారా ప్రాథమిక రసాయనాల తయారీకి ప్రయత్నిస్తున్నాం. ఫార్మా రంగానికి కీలకమైన 53 రసాయనాల్లో 26 రసాయన శాస్త్రం ద్వారా తయారుచేయవచ్చు. మరో 26 రసాయనాలకు ఫెర్మెంటేషన్ ప్రక్రియ అవసరం. రెండో రకం రసాయనాల తయారీకి ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసే వారికి సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎస్‌ఐఆర్ సోదర సంస్థలు కొన్ని ఇప్పటికే ‘మిషన్ అరోమా’ పేరుతో మొక్కల నుంచి కొన్ని రసాయనాల సేకరణకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా చైనా, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
ఐఐసీటీకి కరోనా నేర్పిన పాఠాలేమిటి?
ఒక్కమాటలో చెప్పాలంటే మా సత్తా ఏమిటో తెలియచెప్పింది. తక్కువ వనరులతో సంస్థ శాస్త్రవేత్తల సామర్థ్యాన్నంతా ఒక లక్ష్యంవైపు ఎలా మళ్లించగలమో అర్థ మైంది. కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైంది మొదలు ఐఐసీటీ, మాతృసంస్థ ‘ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్‌ఐఆర్)లోని ఇతర సంస్థలూ తమదైన రీతిలో స్పందించాయి.
Comments
Please login to add a commentAdd a comment