IICT Director Srivari Chandrasekhar
-
మా సత్తా ఏంటో తెలిసింది!
కరోనా వ్యక్తులకే కాదు.. పలు సంస్థలకూ సవాలుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీని సవాల్‌గా స్వీకరిస్తే, మరికొన్ని శానిటైజర్లు మొదలుకొని పీపీఈ కిట్లు, చౌక వెంటిలేటర్ల తయారీని చేపట్టాయి. ఇదే సమయంలో భారత్‌లో రసాయన పరిశోధనలకు కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఈ సవాళ్లను ఎలా స్వీకరించింది? కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు ఏ ప్రయత్నాలు చేసింది?.. ఇవే ప్రశ్నలను ‘సాక్షి’ ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా.. ఆయనిచ్చిన సమాధానాలివిగో.. కరోనాను ఎదుర్కొనేందుకు ఐఐసీటీ ఎలాంటి ఆవిష్కరణలు చేసింది? వ్యాధి చికిత్సకు ఉపయోగపడగల మందులను ఐఐసీటీ మొదట గుర్తించింది. గతంలోనే తయారై పలు కారణాలతో వినియోగంలోకి రాని రెమిడెస్విర్, ఫావాపిరవిర్ వంటివి కోవిడ్‌ను అడ్డుకుంటాయని గుర్తించాం. అతితక్కువ వ్యవధిలో వీటిని వాణిజ్యస్థాయిలో తయారుచేయడమే కాక, సిప్లా వంటి ఫార్మా కంపెనీల సాయంతో మార్కెట్లోకి తెచ్చాం. సమర్థమైన శానిటైజర్ల తయారీ టెక్నాలజీని స్టార్టప్ కంపెనీలకు అందజేశాం. తద్వారా శానిటైజర్లు అన్నిచోట్లా చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలోని సీఎస్ఐఆర్ సోదర సంస్థ సాయంతో ‘సెరో సర్వే’ కూడా నిర్వహించాం. తాజాగా కోవిడ్ నుంచి రక్షణ కల్పించే మాస్క్ ‘సాన్స్’ అభివృద్ధితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం లక్ష మాస్కుల పంపిణీకి సిప్లాతో కలిసి పనిచేస్తున్నాం. కోవిడ్–19 చికిత్సకు సంబంధించిన పరిశోధనలు పూర్తయినట్లేనా? కానేకాదు. జపాన్‌లో జలుబు కోసం సిద్ధంచేసిన ఫావాపిరవిర్ను కోవిడ్‌కూ వాడవచ్చునని ఇప్పటికే గుర్తించిన ఐఐసీటీ ప్రస్తుతం దాని ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలినాళ్లలో ఫావాపిరవిర్ ఒక్కో మాత్ర రూ.100పైబడి ఖరీదుచేస్తే.. సిప్లా ఇటీవలే రూ.68కే అందిస్తామని ప్రకటించింది. సన్‌ఫార్మా మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తేనుంది. ఐఐసీటీ పరిశోధనల ఫలితంగా ధర మరింత దిగి రావచ్చు. వ్యవసాయ రంగానికి అవసరమైన రసాయనాల విషయంలోనూ ఐఐసీటీ విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ రంగంలో తాజా పరిణామాలు? ఐఐసీటీ చాలాకాలంగా వ్యవసాయానికి ఉపయోగపడే రసాయనాలను తయారుచేస్తోంది. ఫెర్మాన్ ట్రాప్‌లు వీటిల్లో ఒకటి. పొలాల్లో కీటకాలను ఆకర్షించేందుకు తద్వారా కీటకనాశినుల వాడకాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని విస్తృతంగా వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. సీఎస్ఐఆర్ నిర్వహించే ‘హరిత్’ కార్యక్రమంలో భాగంగా స్వయంగా సుమారు 20 వేల హెక్టార్లకు సరిపడా ఫెర్మాన్ ట్రాప్స్ ఇవ్వనుంది. ప్రధాని మోదీ ఇటీవలే ‘ఆత్మ నిర్భర భారత్’ పిలుపునిచ్చారు. రసాయనాల విషయంలో ఇది ఎప్పటికి సాధ్యం? వ్యవసాయం, ఫార్మా రంగాల్లో కీలకమైన రసాయనాల విషయంలో భారత్ 30 ఏళ్లుగా ఇతర దేశాలపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడుతోంది. రానున్న ఆరేళ్లలో కనీసం 53 రసాయనాల దిగుమతులకు స్వస్తిచెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పెట్రోలియం, బొగ్గు, ఫార్మా రంగాల్లోని కొన్ని వ్యర్థాలు, వాయువుల ద్వారా ప్రాథమిక రసాయనాల తయారీకి ప్రయత్నిస్తున్నాం. ఫార్మా రంగానికి కీలకమైన 53 రసాయనాల్లో 26 రసాయన శాస్త్రం ద్వారా తయారుచేయవచ్చు. మరో 26 రసాయనాలకు ఫెర్మెంటేషన్ ప్రక్రియ అవసరం. రెండో రకం రసాయనాల తయారీకి ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసే వారికి సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎస్ఐఆర్ సోదర సంస్థలు కొన్ని ఇప్పటికే ‘మిషన్ అరోమా’ పేరుతో మొక్కల నుంచి కొన్ని రసాయనాల సేకరణకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా చైనా, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఐఐసీటీకి కరోనా నేర్పిన పాఠాలేమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే మా సత్తా ఏమిటో తెలియచెప్పింది. తక్కువ వనరులతో సంస్థ శాస్త్రవేత్తల సామర్థ్యాన్నంతా ఒక లక్ష్యంవైపు ఎలా మళ్లించగలమో అర్థ మైంది. కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైంది మొదలు ఐఐసీటీ, మాతృసంస్థ ‘ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ (సీఎస్ఐఆర్)లోని ఇతర సంస్థలూ తమదైన రీతిలో స్పందించాయి. -
కరోనా వ్యాప్తి తగ్గుముఖం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి దేశంలో గణనీయంగా తగ్గిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. గతేడాది డిసెంబర్ మూడు, నాలుగో వారంలో చైనాలోని వూహాన్లో తొలిసారి కరోనాను గుర్తించగా జనవరి ఆఖరుకు భారత్‌లో ప్రవేశించిందని, అప్పట్లో వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్ నాట్ ప్రతి వంద మందికి 180–190 వరకు ఉండేదని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నిర్ధారించిందని శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. వంద మంది కరోనా వైరస్ బారిన పడితే.. వారి నుంచి ఇంకో 180–190 మందికి వైరస్ సోకుతుందని దీని అర్థం. దేశంలో లాక్డౌన్ నిబంధనలు విధించిన తర్వాత, వైరస్, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ప్రస్తుతం ఆర్–నాట్ 118కి చేరుకున్నట్లు ఆ సంస్థ చెబుతోందని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులకు ధరించడం ద్వారా ఆర్ నాట్‌ను వంద కంటే తక్కువ స్థాయికి తీసుకురావొచ్చని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం కూడా స్పష్టం చేసిందని తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే భారత్‌లో కరోనా వైరస్ పీడ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నియంత్రణలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎస్ఐఆర్ ఐఐసీటీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో తొలి నుంచి ముందంజలో ఉందని, సంస్థలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు అహర్నిశలు చేసిన కృషి ఫలితంగా కోవిడ్–19 చికిత్సకు ఉపయోగపడే 3 రసాయన మూలకాలను గుర్తించామని తెలిపారు. విద్యార్థుల కోసం వెబినార్.. దేశ యువతను శాస్త్ర రంగాల వైపు మళ్లించే లక్ష్యంతో ఐఐసీటీ శుక్రవారం కరోనాకు సంబంధించిన వేర్వేరు అంశాలపై వెబినార్ నిర్వహించింది. కరోనా వైరస్ తీరు తెన్నులు, దాన్ని ఎదుర్కొనేందుకు ఐఐసీటీ చేపట్టిన కార్యకలాపాలను ఐఐసీటీ డైరెక్టర్ వివరించారు. వ్యాధులకు మందులు ఎలా తయారు చేస్తారన్న విషయాన్ని.. వ్యాక్సిన్ తయారీ వాటి పరీక్షలకు సంబంధించిన స మాచారాన్ని సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లు డాక్టర్ ప్రథమ ఎస్ మైన్‌కర్, సీహెచ్ రాజిరెడ్డి, డాక్టర్ ఆంథొనీ అడ్లగట్ట వివరించారు. శానిటైజర్ల వాడకం, ఇళ్లల్లో వాటి తయారీపై సీనియర్ శాస్త్రవేత్త రతి రంజన్ వివరించారు. తిరిగి వా డగల మాస్కులను అభివృద్ధి చేసిన సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్ వాటి అవసరానికి సంబంధించిన సమాచారాన్ని వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం వివరాలు డాక్టర్ రామానుజ్ నారాయణ్ తెలిపారు. -
గాలి నుంచి నీటిని తెచ్చారు..
సాక్షి, హైదరాబాద్ : ప్రజలందరికీ స్వచ్ఛమైన, కాలుష్యరహిత తాగునీరు అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. గాల్లోని తేమను నీటిగా ఒడిసిపట్టడంతో పాటు, నీటిలో లవణాలు చేర్చేందుకు ఓ యంత్రాన్ని తయారు చేశారు. ఇలాంటి యంత్రాలు విదేశాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ తాము తయారు చేసిన మేఘ్‌దూత్ యంత్రం చౌక అని, సౌరశక్తితో పనిచేస్తుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్.శ్రీధర్ తెలిపారు. మైత్రీ ఆక్వాటెక్ అనే సంస్థతో తాము ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ యంత్రాలను ఈ ఆగస్ట్ నుంచి తయారు చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 9 యూనిట్ల విద్యుత్ ద్వారా ఈ యంత్రం రోజులో వెయ్యి లీటర్ల తాగునీరు అందిస్తుందన్నారు. గాలిలోని 45 శాతం తేమ ఉన్నా సరే ఇది నీటిని ఒడిసిపడుతుందని, తేమశాతం ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో రోజుకు 1,400 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు. కలాం స్టెంట్ స్థాయి ఆవిష్కరణ ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి తాము అభివృద్ధి చేసిన చౌక స్టెంట్‌తో సరిపోలగల ఆవిష్కరణ మేఘ్‌దూత్ అని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన అరుణ్ తివారీ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుబాటులో ఉంటే, రోగాల భారం గణనీయంగా తగ్గుతుందని ఈ లక్ష్యంతోనే తాము మేఘ్‌దూత్‌ను అభివృద్ధి చేశామని ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ చెప్పారు. -
జాతీయ ప్రాజెక్టులకు సాంకేతిక సాయం
ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలను కనుక్కునేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) మరింత నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్‌తోపాటు, స్వాస్థ్య భారత్, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ డిజిటల్ ఇండియా, నమామి గంగా వంటి ప్రాజెక్టుల సత్వర అమలుకు అవసరమైన సాంకేతికతను సీఎస్ఐఆర్కు చెందిన 37 పరిశోధన సంస్థలు అభివృద్ధి చేస్తాయని గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. ఇటీవల డెహ్రాడూన్‌లో ముగిసిన సీఎస్ఐఆర్ డెరైక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయమంత్రి వై.ఎస్.సుజనా చౌదరిలు పాల్గొన్న ఈ సమావేశంలో ‘డెహ్రాడూన్ డిక్లరేషన్’ పేరుతో ఓ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశామని వివరించారు. పరిశోధన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కంపెనీలు స్థాపించేలా చర్యలు తీసుకోవడం, ఏడాదికి కనీసం 12 టెక్నాలజీలను జనబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం, పేదల జీవన ప్రమాణాలను పెంచే టెక్నాలజీలకు ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలను ప్రణాళికలో పొందుపరిచినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు. చౌక మందులపై దృష్టి: డెహ్రాడూన్ డిక్లరేషన్‌లో భాగంగా తాము పారసిటమాల్, ఐబూబ్రూఫిన్ వంటి అత్యవసర మందుల తయారీకి అవసరమైన రసాయనాలను చౌకగా ఉత్పత్తి చేయడంపై దృష్టిపెట్టామని ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. గంగా నది శుద్ధికి సంబంధించిన నమామి గంగ ప్రాజెక్టులోనూ ఐఐసీటీ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. నల్లగొండలో మరిన్ని నీటి శుద్ధి కేంద్రాలు: నీటిలోని ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు ఐఐసీటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని నల్లగొండ జిల్లాలో మరింత విసృ్తతంగా వాడాలని నిర్ణయించామని చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆ జిల్లాలో మూడు డీ ఫ్లోరినేషన్ ప్లాంట్లు నడుస్తున్నాయని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.