ఒక్క నిపుణుడుంటే ఒట్టు
Published Mon, Aug 8 2016 12:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
– రెఫరల్ ఆసుపత్రిలో అనర్హుల తిష్ట
– రాజకీయ సిఫారసులే అర్హత
– పశువులకు అందని వైద్య సేవలు
– రూ.5 కోట్లతో అధునాతన భవన నిర్మాణం.. అయినా ఫలితం శూన్యం
కర్నూలు(అగ్రికల్చర్) :
కర్నూలు కొండారెడ్డి బురుజు పక్కన బహుళార్ధ పశువైద్యశాల(వెటర్నరీ పాలీక్లీనిక్)కు రెఫరల్ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, తాలూకా ఆసుపత్రుల్లోని సహాయ సంచాలకులకు సాధ్యం కాని కేసులను వెటర్నరీ పాలీ క్లినిక్‌కు రెఫర్ చేస్తుంటారు. ఇది పశువైద్యులు, ఏడీలు, రైతులకు శిక్షణ కేంద్రంగా కూడా ఉంది. బహుళార్ధ పశువైద్యశాలను రూ.5 కోట్లతో అత్యంత అధునాతనంగా నిర్మించారు. వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలగా మార్పు చేయనున్నారు. ఇంతటి ప్రాధాన్యం కల్గిన ఈ బహుళార్ధ పశువైద్యశాలలో రాజకీయ సిఫారసులతో అనర్హులు తిష్ట వేశారు. ఉన్నతాధికారులు కూడా రాజకీయ సిఫారసులకు అనుగుణంగా అనర్హులను నియమిస్తున్నారు. అధిక మొత్తంలో హెచ్‌ఆర్‌ఏ పొందడంతో పాటు జిల్లా కేంద్రంలోనే ఉండాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతల రెకమెండేషన్‌తో అనర్హులు వచ్చి తిష్టవేశారు. ఇప్పుడున్నవారిలో ఒక్కరు కూడా స్పెషలిస్టు లేకపోవడం గమనార్హం. ఇందువల్ల పశువులకు సరైన వైద్యసేవలు అందక మత్యువాత పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజుల వ్యవధిలో 5 పశువులు మత్యువాత పడ్డాయి.
స్పెషలిస్టులే ఉండాల్సి ఉంది...
బహుళార్ధ పశువైద్యశాల రెఫరల్ ఆసుపత్రి కావున విధిగా స్పెషలిస్ట్‌లుండాలి. సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్‌లుండాలి. పశువైద్యులు ఇటువంటి వాటిని ఇక్కడకు రెఫర్ చేస్తుంటారు. నిపుణులుంటేనే వాటికి సరైన చికిత్స అందే అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం వరకు స్పెషలిస్ట్‌లే ఉన్నారు. అయితే రాజకీయ పరపతిని ఉపయోగించి నిపుణులను బయటికి పంపి అనర్హులు ఇక్కడ చేరారు. ఇద్దరు ఏడీలుండగా, ఒకరు న్యూట్రీషియన్, మరొకరు పౌల్ట్రీకి చెందినవారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లలో ఒక పెతాలజీ, మరొకరు ఎల్‌పీఎంకు చెందినవారు ఒక్కరు కూడా నిపుణులు లేకపోవడం వల్ల పశువైద్యం కొండెక్కింది.
పర్యవేక్షణ గాలికి..
రెపరల్ ఆసుపత్రి.. డీడీ పర్యవేక్షణల నడుస్తోంది. ప్రస్తుత డీడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా వెటర్నరీ పాలీ క్లినిక్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. విధిగా సర్జరీ నిపుణుడు, మెడిసిన్ నిపుణుడు, గైనకాలజిస్ట్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ అధికార పార్టీ నేతల సిఫారసులకు తలొగ్గి అనర్హులను నియమిస్తూ వస్తున్నారన్న విమర్శలున్నాయి. నిపుణులు లేకపోగా ఉన్నవారిలో ఇద్దరు మహిళలు కావడం, కొన్ని సమయాల్లో వీరు విధి నిర్వహణలో సమర్థవంతంగా రాణించలేకపోతున్నట్లు తెలుస్తోంది.
రూ.50 వేల విలువ పశువులు మృతి..
ఇటీవల పగిడ్యాల మండలానికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు అనారోగ్యానికి గురవడంతో వెటర్నరీ పాలీక్లినిక్‌కు రెఫర్ చేశారు. ఇక్కడ పశువైద్యులు చికిత్స చేసినా వ్యాధిని గుర్తించకపోవడం వల్ల చికిత్స పని చేయలేదు. దీంతో రూ.50 వేల విలువ చేసే ఎద్దు మతి చెందింది. ఓర్వకల్ పశువైద్యుడు ఒక కోడెను ఇక్కడికి రెఫర్ చేశారు. దాని వ్యా«ధికి తగిన చికిత్స అందకపోవడం వల్ల మతి చెందింది. నగరానికి చెందిన మేలు జాతి కుక్కలు సైతం మతి చెందాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బహుళార్ధ పశువైద్యశాలపై దష్టి పెట్టాల్సి ఉంది.
Advertisement
Advertisement