రైతు ఆవేదన పట్టని ప్రభుత్వం | government fails to help flood victims | Sakshi
Sakshi News home page

రైతు ఆవేదన పట్టని ప్రభుత్వం

Published Wed, Oct 30 2013 4:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

government fails to help flood victims

సాక్షి, కొత్తగూడెం : ఏటా వచ్చే తుపాన్లు, అకాల వర్షాలు అన్నదాత బతుకును ఛిద్రం చేస్తున్నాయి. కళ్ల ముందే పంట వర్షార్పణం అవుతుండడం..  సాగుకు చేసిన అప్పులు తీరకపోవడంతో వారి జీవన చిత్రమే మారిపోతోంది. జల్, లైలా, నీలం తుపాన్ల దెబ్బనుంచి కోలుకోక ముందే ఇటీవలి అకాల వర్షానికి పంటఅంతా పోవడంతో రైతు ఆవేదన అంతాఇంతా కాదు. ప్రకృతి పగపట్టినట్లు ప్రతి సీజన్‌లో ఏదో ఒక విపత్తు వస్తున్నా రైతుపై  ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు.
 
 రైతుకు ఖరీఫ్ కలిసిరావడంలేదు. ఈ సీజన్‌లో   అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే తుపాన్లు అన్నదాత కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి.  చేతికి వచ్చే పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి ఇతర పంటలు వర్షార్పణం అవుతున్నాయి. దీంతో ఏటా రైతులకు కోలుకోలేని దెబ్బ పడుతుండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 2010 అక్టోబర్‌లో జల్ తుపాను సంభ వించింది. ఈ తుపానుతో సుమారు రెండు లక్షల ఎకరాల వరకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఇందులో కేవలం 34,022 ఎకరాలకు మాత్రమే నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపించింది. కాకి లెక్కలు వేసి 39,184 మంది రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 6.45 కోట్లు  పరిహారం పంపిణీ చేశారు.
 
 ఈ పరిహారం అందించడంలో కూడా అప్పట్లో సంబంధిత శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే  ఆరోపణలున్నాయి. జల్ వెంటనే దాడిచేసిన లైలా తుపాను కూడా రైతుకు కన్నీరే మిగిల్చింది.  ఇక 2011లో జిల్లా వ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పట్లో వర్షాభావంతో 4 లక్షల పైచిలుకు ఎకరాల్లో దిగుబడి తగ్గడంతో కాక, పత్తి, వరి పంటలు ఎండిపోయాయి. ఇప్పటికీ పరిహారం రైతుల దరిచేరలేదు. బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్‌లైన్‌లో తప్పులు ఉన్నాయనే నెపంతో రెండేళ్లయినా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని ఇప్పటికీ రూ. 17కోట్ల పంపిణీ చేయకుండా వదిలేశారు.
   
 నీలం పరిహారం గోరంత..
 2012 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురియడంతో పత్తి చేతికి అందకుండా పోయింది. మొత్తం 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ‘నీలం’ తుపానుఅనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలను సందర్శించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, కేంద్ర బృందం పర్యటించి ఇంతనష్టం ఎక్కడా జరుగలేదు.... ‘నీలం’ రైతులను నిండా ముంచిందని ప్రకటించారు. జిల్లాలో అంత నష్టం జరిగినా అంచనావేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
 
 అయినా నష్టం కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రి, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా నోరెత్తలేదు. కొండంతం నష్టం జరిగితే గోరంత అంచనాతో సరిపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా.. కేవలం 27,247 ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు చూపించారు. విపత్తు సంభవించి ఏడాది కావస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిహారం కింద రూ. 9.35 కోట్లు మంజూరు చేసింది. అయినా నేటికీ  ప్రభుత్వం చూపిన లెక్కల ప్రకారం అర్హులైన రైతుల ఖాతాలో కూడా ఆ పరిహారం పడలేదు.
 
 ఇప్పుడూ అదే పరిస్థితి..
 ఈనెలలో ఆరురోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లాలో అపారనష్టం జరిగింది. ప్రధానంగా పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బతగిలింది. జిల్లా వ్యాప్తంగా 3.37 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం సుమారు రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. వర్షంతో ఎక్కువగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. పంటను కోల్పోయామన్న వేదనతో జిల్లాలో ఇద్దరు రైతులు గుండె పోటుతో మరణిస్తే.. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి జిల్లాలో నష్టపోయిన రైతుల గోస పట్టదు. దీనికి తోడు 50 శాతం పైగా నష్టపోయిన పంటలనే పరిగణలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో రైతు గుండె బరువెక్కిపోతోంది.
 
 గుండె పగిలింది..
 సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన ఈరైతు పేరు గడ్డికొప్పుల రామయ్య. ఇతనికి 3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో  మొక్కజొన్న సాగు చేయగా దీనికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ ఐదెకరాల్లో 3 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఐదెకరాలకు కౌలు రూ. 40వేలు కుదుర్చుకున్నాడు. రూ . లక్షా 20 వేలు అప్పు తెచ్చి ఈ పంటలను సాగు చేశాడు. అకాల వర్షంతో చేతికందిన పత్తి చేలోనే ముద్దయింది.. మొక్కజొన్న గింజలకు మొలకలొచ్చాయి.. పొట్టకొచ్చిన వరి నేలవాలింది. అంతే... రామయ్య గుండె చెదిరింది.  గత ఏడాది అప్పుతో మొత్తంగా రూ. 2లక్షల రుణభారం ఒకవైపు, కుటుంబాన్ని ఎలా పోషించాలనే వేదన మరోవైపు అతనిని క్రుంగదీశాయి. ఈనెల 26వ తేదీ రాత్రి దిగాలుతో నిద్రకు ఉపక్రమించిన రామయ్య 27న పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. ఆరుబయట పోసిన మొక్కజొన్న పూర్తిగా మొలకలు రావటం చూశాడు.  తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మొక్కజొన్న రాశిపైనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో విగత జీవిగా మారి మృత్యుఒడిలోకి జారుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోవటంతో భార్య రామనర్సమ్మ, కుమారులు ఉపేందర్, శ్రీహరి, వృద్ధతల్లి శాంతమ్మ శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement